వలసవాదుల ముందు చులకనౌతున్నాం!

`బిజేపిలో పెరుగుతున్న అంతర్గత పోరు…ఆధిపత్యాల తీరు

`రాజకీయ పునరావాసం గందరగోళం!

`పరాకాష్ఠకు చేరిన పంచాయతి?

`వలసవాదుల ఆధిపత్యంపై అసలు నాయకుల విసుగు?

`అవకాశాలు తన్నుకుపోతున్నారని ఆందోళన.

`ఇంతకాలం పార్టీ చేసిన ఊడిగం ఉత్తదేనా?

`కొత్తగా వచ్చిన వారి పెత్తనంలో పని చేయాలా?

`వారి అనుచరులకున్న ప్రాధాన్యత మాకు లేదా?

`ఎవరిబలమెంత? 

`నాయకులతో చేరిన కార్యకర్తలెంత మంది?

` బిజేపి మీద అభిమానం ఎంతమందికి వుంది?

`పదవుల కోసం వచ్చిన వాళ్లే కాని, సిద్ధాంతాలు నచ్చి వచ్చిన వారెంత మంది?

`పాతవారికి పదవులిస్తే కొత్తవారితో తంటా!

`కొత్త వారికి ప్రాధాన్యత పెరిగితే పాతవారు కలవరంట!

`సఖ్యత లేని సంసారం…

`సర్థి చెప్పలేని నాయకత్వం…

హైదరాబాద్‌,నేటిధాత్రి:

 ఇది అసలైన బిజేపి నేతలు పడుతున్న ఇబ్బంది. పార్టీ బలోపేతమౌతోందని సంతోష పడాలో, తమ ప్రాధాన్యత తగ్గుతున్నందుకు మధనపడాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా పార్టీని పట్టుకొని, ఇంత దూరం వచ్చారు. ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి పని చేశారు. పదవులకు ఆశపడలేదు. ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా దేశం కోసం, ధర్మం కోసమంటూ పార్టీకి అండగా నిలబడ్డారు. కొత్త నీరు వచ్చినా, పాత నీరు పోయినా బిజేపి సిద్దాంత పరమైన పార్టీ అన్నది అందరూ చెప్పుకునే మాట. అలాంటి బిజేపి దక్షణాన ప్రాభవం కోసం పాకులాడుతోంది. ఎనిమిదేళ్ళుగా ఉత్తర భారతంలో అప్రతిహతంగా వెలుగుతున్నా, దక్షణానదిలో గుడ్డి దీపమైపోయింది. ఎన్ని జాకీలు పెట్టి లేపినా లేచే పరిస్థితి లేదు. కానీ దక్షిణాన ఎలాగైనా పాగా వేయాలి. బాలం పెంచుకోవాలి. బలపడాలి. గెలవాలి. ఇదంతా ఇప్పట్లో అయ్యే పని కాదు…ఎదురు చూసుకుంటూ పోతే ఇంకా ఎన్నేళ్లైనా బిజేపి తెలుగు రాష్ట్రాలలో అధికారంలోకి రావడం కలే….అందుకే ఎలాగైనా అధికారంలోకి రావాలి. ఎలా వచ్చామన్నది కాదు…వచ్చామా లేదా? అన్నది ముఖ్యం. సహజంగా ఏ పార్టీ అయినా ప్రజల్లో నమ్మకం పెంచుకొని, విశ్వాసం కలిగించి ఎన్నికలలో గెలవాలని చూస్తుంది. కానీ బిజేపి ఇటువల కాలంలో వేస్తున్న అడుగులపై ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని లెక్క చేయడం లేదు. అధికారం లోకి వచ్చామా? లేదా! అన్నదే ముఖ్యమైతోంది. ఇదే బిజేపి బలపడడానికి మార్గం అనుకుంటోంది. అందుకే ఇతర పార్టీలలోని నేతలు ఎవరు వచ్చినా బిజేపి రెడ్‌ కార్పెట్‌ వేస్తోంది. ఇది అసలైన బిజేపి నేతలకు కొంత కంటగింపుగా కూడా మారుతోంది. వారి ఆవేధనలో కూడా న్యాయముంది. ఇంత కాలం పార్టీలో అంతో ఇంతో సీనియర్లుగా చెలామణి అవుతున్న నాయకులు, వలస నేతల ముందు, వారి అనుచరుల ముందు తమ వాదనలు చెల్లుబాటు కావడం లేదు. వలస నేతలలో ఆయా ప్రాంతాలలో వారికి వున్న ఇమేజ్‌ దృష్ట్యా మీడియా కూడా వారికే ప్రాధాన్యతనిస్తోంది. అటు పార్టీలోనూ సరైన ప్రాధాన్యం లభించక, ఇటు మీడియాలోనా వారి ప్రస్తావన అంతగా లేకపోవడంతో చాలా మంది నేతలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడక్కడ మీడియా ముందు తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. కొన్ని సార్లు పార్టీ పరమైన విషయాలలో కూడా సరైన సమాచారం వుండడం లేదని వాపోతున్నారు. కొత్తగా చేరిన నేతలు కొంత అంగ బలం, అర్థ బలం వుండడం కూడా వారికి అదనపు గౌరవం అందుతోంది. సీనియర్లు మాత్రం ఉత్సవ విగ్రహాలుగా నిలబడి చూడాల్సి వస్తుందంటున్నారు. 

బిజేపిలో పెరుగుతున్న అంతర్గత పోరు…ఆధిపత్యాల తీరు. 

పార్టీ యంత్రాంగంలో రోజు రోజుకు అంతర్గత పోరు, ఆధిపత్య సమస్యగా రూపాంతరం చెందుతోంది. వలస నేతలు ఏది చేసినా వివాదాల మయమౌతోంది. అందుకు ఆది నుంచి పార్టీలో వున్న నేతలు రాజకీయ పునరావాసం పొందిన నేతల మధ్య పొసగడం లేదు. ఇది చాలా కాలం నుంచి వినిపిస్తోంది. నిజం చెప్పాలంటే రాష్ట్ర స్థాయిలో వున్న చాలా మంది నేతల్లో వలస నేతలే ఎక్కువ వున్నారు. అంతో ఇంతో ఛరిష్మా వున్న వాళ్లు…అవసరమైతే పార్టీకి రూపాయి ఖర్చు చేయడానికి సిద్ధపడుతున్నారు. అలాంటప్పుడు పార్టీ కూడా వారికి కొంత ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. దాంతో అసలు నేతలు దూరం జరగాల్సి వస్తోంది. ఇంటి కోడి పప్పుతో సమానమని పెద్దలు చెప్పినట్లు, అసలు బిజేపి నేతలు ఎటూ వెళ్లరు. పార్టీలోనే వుంటారు. కానీ వలస నేతలు ఏ మాత్రం అసంతృప్తికి లోనైనా ఎగిరిపోవచ్చు…దాంతో కరవ మంటే కప్పకు కోపం…విడవమంటే పాముకు కోపం… అన్న చందంగా బిజేపి అధిష్టానం పరిస్థితి తయారైంది. అందుకే వలస నేతలను ఎలాగైనా కాపాడుకోవాలన్న ఆలోచన అధిష్టానం చేస్తోంది. ఇది అసలుకే మోసం వస్తుందని బిజేపి అసలు సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. 

రాజకీయ పునరావాసం గందరగోళం! 

అసలు ఈ పంచాయతీకి అసలైన కారణం… బిజేపి దర్వాజాలు బార్లా తెరిచి ఆహ్వానించడమే అని కూడా అంటున్నారు. ఎవరు ఖాళీగా వున్నారు….ఎవరు బిజేపి వైపు చూస్తున్నారు…అనేదానికి ప్రాధాన్యతనివ్వడంతో ఏదో ఒక వేధిక కావాలనుకునే వారికి బిజేపి కనిపిస్తోంది. వలస వాదులు, ఆ కోవకు చెందిన వారికే సహజంగా మద్దతు ప్రకటిస్తారు. అలాంటి వారే అందరూ అక్కడ ఏకమై వున్నారు. బిజేపిలో ఇప్పుడు కొంత క్రియాశీలకంగా వున్న ఓ మాజీ మంత్రి తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఎన్నికల ఖర్చంతా నాదే? అన్నారట…ఆమె ఒక్కరే కాదు…అలా బిజేపికే ఆఫర్లు ఇస్తున్న నేతలు మరి కొందరు కూడా వున్నారట. వాళ్ల వైపు ఒక వేళ అధిష్టానం మొగ్గితే అసలైన నేతలు పదవుల మీద పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందే…ఒక్క మాటలో చెప్పాలంటే ఒకప్పుడు కాంగ్రెస్‌ లో అందరూ సిఎం. అభ్యర్థులే అని ప్రచారం చేసుకున్నట్లే ఇప్పుడు బిజేపి లో కనిపిస్తోంది. దాంతో పంచాయతి పరాకాష్ఠకు చేరుకున్నట్లే కనిపిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు బిజేపిలో కూడా సిఎం జాబితా పెరిగిపోతోంది. పైకి అబ్బే అలాంటిదేమీ లేదంటూనే ఎవరికి వారు, తమ తమ ఆలోచనల్లోనే వున్నారు. ముఖ్యంగా ఓ నలుగురైదుగురు పేర్లు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. అందులో ఇద్దరు మాత్రమే పాత నేతలు. మిగతా వాళ్లంతా కొత్త నేతలే…పాత వారిలో ఇప్పుడు కేంద్ర మంత్రిగా వున్న కిషన్‌ రెడ్డి ఒకవేళ అధికారంలోకి వస్తే…అనే అంశంలో గంపెడాశ పెట్టుకున్నట్లే చెప్పుకుంటున్నారు…ఎందుకంటే ఆయనే ఇప్పుడు సీనియర్‌…కానీ ఇంత కాలం లేని ఊపు తెచ్చిన బండి సంజయ్‌ కు మరింత ప్రాధాన్యతనిస్తారా? అన్నది అర్థం కాక అందరూ తలలుపట్టుకుంటున్నారు. తాము ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో తప్పెవరిదీ కాదు. ఏ రాజకీయ నాయకుడైనా కనే కలే…ప్రాంతీయ పార్టీలలో మంత్రులు కావాలన్న కోరిక వరకే పరిమితమౌతారు. కానీ జాతీయ పార్టీలలో ముఖ్యంగా బిజేపి లాంటి పార్టీలలో ఎంత దూరమైనా కలగనొచ్చు. నెరవేరొచ్చు కూడా….అందుకే అందరూ ఆశలు పెంచుకుంటున్నారు…ఎవరి కోటరీ వాళ్లు నడుపుకుంటున్నారు…గ్రూపులుగా విడిపోతున్నారు. పైకి మాత్రమే అంతా ఒకటే అని చెబుతున్నారు. ఇక వలస నేతల విషయంలో రఘునందన్‌ రావు కూడా అసలైన బిజేపి నేత కాదనే మాటలు వింటున్నవే….దుబ్బాక నుంచి ఆయన ఎమ్మెల్యే గా గెలిచినప్పటికీ అది బిజేపి గెలుపు కాదనేది అందరూ చెప్పే మాటే…అయితే బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ను తొలగించి కొత్త అధ్యక్షుడి నియామకం సమయంలో రఘునందన్‌ పేరు కూడా బలంగా వినిపించింది. కానీ ఆయన కాలేదు. బండి సంజయ్‌ ని అధ్యక్షుడిని చేస్తారని ఎవరూ ఊహించలేదు. అనుకోకుండా వచ్చిన అదృష్టమో…వరమో కానీ బండి సంజయ్‌ అధ్యక్షుడు అయ్యారు. ఆయన వల్ల పార్టీ బలపడిరదని చెప్పలేం కానీ, ఒక కదలిక మాత్రం వచ్చిందని అందరూ అంగీకరిస్తున్నారు. పార్టీకి ఇంత ఊపు తెచ్చిన బండి సంజయ్‌ కూడా రేసులో వుండడం సహజం. కాకపోతే ఆయనకు ఎంత మంది సపోర్ట్‌ గా నిలుస్తారనేది మాత్రం చెప్పలేం…ఇక అందరి దృష్టి వున్న నేత ఈటెల రాజేందర్‌. ఆయన వ్యక్తిగత ఇమేజ్‌ అందరికీ తెలిసిందే… ఆయన గెలుపు అందరి నోట్లో నానిందే…చేరికల కమిటీ అనే దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటెలకు సమయం వచ్చినప్పుడు ఎంత మంది అండగా వుంటారనేది కూడా ఇప్పుడే చెప్పలేం…అంత క్లారిటీ కూడా వుందనుకోలేం…అందరూ ఆకాశంలో మబ్బులను చూసి నీళ్లు ఒలకబోసుకునే వారే…అందుకే అసలైన నేతలెవరనేది తేలితే తప్ప ఓ కొలిక్కి రాదు…అంతేకాదు బిజేపిలో ఏదైనా సాధ్యమే…కావాలనుకుంటే నెత్తిన పెట్టుకుంటారు…వద్దనుకుంటే పక్కన పెట్టేస్తారు…లాల్‌ కృష్ణ అద్వానీ కే తప్ప లేదు…వెంకయ్య నాయుడు పరిస్థితి చూస్తున్నదే…ఎవరికి వారు యమునా తీరే…అయినా మొదటి నుంచి పార్టీలో వున్న వారికి వున్నంత నోరు కొత్త వాళ్లకు బిజేపిలో వుండదు…అదే వలస నేతలకు వచ్చిన అసలైన చిక్కు…ఇప్పుడు తాత్కాలికంగా వారి మాట చెల్లుబాటు అయనట్లే కనిపించొచ్చు…దీర్ఘకాలంలో వారిని దూరం పెట్టొచ్చు. పైగా వచ్చే ఎన్నికలలో బిజేపి బలపడకపోతే వలస నేతలందరు ఎవరిదారి వాళ్లు చూసుకోవచ్చు…

 వలసవాదుల ఆధిపత్యంపై అసలు నాయకుల విసుగు చెందుతున్నారు. 

  అవకాశాలు తన్నుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం పార్టీ చేసిన ఊడిగం ఉత్తదేనా? అని కూడా ఒకరికొకరు చర్చించుకుంటున్నారు. కొత్తగా వచ్చిన వారి పెత్తనంలో పని చేయాలా? అని కూడా ప్రశ్నిస్తున్నారు. వారి అనుచరులకున్న ప్రాధాన్యత మాకు లేదా? అని కూడా అక్కడక్కడా నిలదీస్తున్నారు. ఎవరిబలమెంతో? చూసుకుందామని కూడా సవాలు విసురుకుంటున్నట్లు సమాచారం. వలస నాయకులతో చేరిన నాయకులే ఎక్కువ. కార్యకర్తలు తక్కవ. దాంతో ఇంత కాలం బిజేపి తామే నాయకులుగా చెలామణి అయిన వాళ్లు కార్యకర్తల స్థాయిని దాటలేకపోతున్నారు. ఒకవేళ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చినా వలస నేతలే పదవులు తన్నుకుపోతారని చర్చించుకుంటున్నారట.అందుకే పార్టీలో చేరిన వారిలో బిజేపి మీద అభిమానం ఎంతమందికి వుంది? అనేదానిని వెలుగులోకి తేవాలని చూస్తున్నారట. తాము సైలెంట్‌ గా వుంటే తమ రాజకీయ జీవితాలు గుమ్మం దాటవని అనుకుంటున్నారట. వచ్చిన వాళ్లలో పదవుల కోసం వచ్చిన వాళ్లే కాని, సిద్ధాంతాలు నచ్చి వచ్చిన వారెంత మంది? అనేది కూడా పార్టీ కచ్చితంగా బేరీజు వేసుకోవాలని అసలైన సీనియర్లు సూచిస్తున్నారట. 

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి దగ్గర ప్రస్తావిస్తున్నారట…ఆయన అన్ని విషయాలు వినడం తప్ప, స్పందన లేదట…దాంతో జరుగుతున్న ప్రచారంలో తన భవిష్యత్తు ఏమిటో ఆయనకు కూడా అర్థం కావడం లేదనే తెలుస్తోందనుకుంటున్నారట. అయితే కొత్తగా పార్టీలోకి వలసలు వస్తున్న నేపథ్యంలో పాతవారికి పదవులిస్తే కొత్తవారితో తంటా! వచ్చిపడేలా వుంది. అందుకే ఎన్నికలు దగ్గరపడుతున్నా పార్టీ బలపడాలని చెబుతున్నారే తప్ప పదవులు పంచడం లేదు.కొత్త వారికి ప్రాధాన్యత పెరిగితే పాతవారు కలవరంట! అనే ప్రచారం కూడా మొదలైంది. గతి లేని సంసారమైనా చేయొచ్చు కానీ శృతి లేని సంసారం చేయలేరంటు…బిజేపి సఖ్యత లేని సంసారం…కూడా అలాగే వుంది. ఇదంతా చూస్తున్నా సర్థి చెప్పలేని నాయకత్వం…ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అని ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.