లబ్ధి దారులకున్న నీతి నాయకులకు లేకపాయే!

`జనానికి పంచమంటే మీరే పంచుకుతింటిరి!

`చిత్తశుద్ధి లేని నాయకుల బండారమిది.

`పంపకాలలో చేతి వాటం చూపించితిరి.

`లక్షలు దాచేసుకునిరి

`పంచమంటే నొక్కేశిరి?

`ఓటు వేసి వచ్చాక ఇస్తామనిరి…టోకరా ఇచ్చిరి?

`బిజేపి ఇచ్చిన దానికంటే తక్కువ ఇచ్చి ఓట్లు పడకుండా చేస్తిరి?

`పక్క వాళ్లకు ఎక్కువ, మాకెందుకు తక్కువ… అని లొల్లి తయారు చేపిస్తిరి?

`ప్రజలను గందరగోళంలో పడేస్తిరి.

`ప్రచారం తక్కువ, పైసలు నొక్కుడు ఎక్కువ చేస్తిరి!

`పార్టీని తిట్టిపిస్తిరి!

`జరిగిన లోపాలపై నేటిధాత్రి లోతైన సర్వే…

`ఏ గ్రామాలలో ఎంత నొక్కారన్నదానిపై నేటిధాత్రి ఆరా…

`లెక్కలు పక్కగా వెలికితీత…

`నేటిధాత్రి అందిస్తున్న సంచలన నిజాలు.

`ఇంకా మునుగోడులోనే నేటిధాత్రి బృందాలు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

మునుగోడు ఉప ఎన్నిక సాక్షిగా తెలంగాణ రాష్ట్ర సమితి చెందిన కొందరు నాయకుల కక్కుర్తి బైటపడిరది. ఉప ఎన్నికల ప్రచారమే అదునుగా అందిన కాడికి నొక్కేశారు. ఓట్ల కోసం ప్రజలకు అందాల్సిన సంతర్పణలు నాయకార్పణం చేశారు. ఎక్కడిక్కడ నొక్కేశారు. ఓటర్లకు అందించాల్సిన సొమ్ము దారి మళ్లించారు. మాయం చేశారు. చేతులెత్తేశారు. ఎంతో నమ్మకంతో పార్టీ వారికి పెత్తనం అప్పగిస్తే, నమ్మితేనే కదా! మోసం చేయొచ్చన్నది అక్షరాల నిజం చేశారు. గ్రామాలలో ప్రజలకు టోకరా ఇచ్చారు. పార్టీని మోసం చేశారు. మొత్తంగా మునుగోడు సాక్షిగా పార్టీని ముంచేదాకా తెచ్చారు. అసలు పార్టీ గెలవదనుకున్నారా? లేక? ఇవ్వకపోయినా లెక్కలడిగేవారు ఎవరు వుంటారనుకున్నారా? మేం ఒక్కరం ఇవ్వకపోతే… జనం ఓట్లేయరా? అనుకున్నారో ఏమో గాని చాలా గ్రామాల్లో నేతలు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వలేదు. రాజుగారి పుట్టిన రోజుకు ఊరంతా తెచ్చి పాలు పోయాలంటే, అందరూ తెచ్చి నీళ్లతో గంగాలం నింపినట్లు, ప్రజలకు పంచమని పైసలిస్తే, నేనొక్కడినే అనుకుంటూ అందరూ కలిసి నొక్కెశారు. జనానికి చెందకుండా చేశారు. కొన్ని ఓట్లు పడకుండా చేశారు. ప్రజలు ఓట్లేయలేదని అనొచ్చని పనికిరాని తెలివి చూపించారు…దీనిపై నేటిధాత్రికి అందిన వివరాలు, నేతలే స్వయంగా చెప్పిన మాటలు, గ్రామాల ప్రజల ఆక్రోశానికి చెందిన నిజాలు మీ ముందు వుంచుతున్నాం. ఇదీ కొందరు టిఆర్‌ఎస్‌ నాయకుల నీతి లేని తీరు…పని చేయకుండా తప్పించుకోవడమే కాకుండా, పంచాల్సి సొమ్ము నొక్కేసి చల్లగా జారుకున్నారు..దిగాజారిపోవడంలో మేమేం తక్కువ కాదని నిరూపించుకున్నారు.

 రాను రాను ఎన్నికలంటే పూర్తిగా డబ్బు మూటలతో ముడిపోతోంది.

 గతంలో ఎక్కడో డబ్బులు పంచారట అన్న పదం వినేవారు. రాను రాను అన్ని నియోజకవర్గాలలో పంపకాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ, ఆ పార్టీ నాయకుడైనా సరే ఎంతో కొంత ముట్ట జెప్పకపోతే జనానికి కూడా సంతృప్తి లేకుండాపోతోంది. ఇది ప్రజల తప్పు కాదు. ప్రజలకు ఆ అలవాటు చేసి, వారి నోరు మూయించాలని చూసి నాయకులది. గత రెండు దశాబ్ధాలుగా దేశంలో ఎక్కడైనా ఎన్నికలంటే డబ్బుల మూట లేకుండా కష్టమన్నది తేలిపోయింది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే కూడా ఎంత ఖర్చు చేయాలన్నదానిపై కూడా పక్కా లెక్కలున్నాయి. గెలుపు గుర్రాల జాబితాలో చేరాలంటే ఎన్ని కోట్లు ఖర్చు చేయగలరో ముందే చెప్పగలగాలి. అంత దూరం వెళ్లింది రాజకీయం. అయితే ఉప ఎన్నికలు అంటే మరీ ఖరీదైపోయాయి. ఇదంతా భహిరంగ రహస్యమే…ఉప ఎన్నిక వస్తుందని తెలిస్తే చాలు…ఆ రోజు నుంచే ఇక ఊళ్లల్లో జాతరలు మొదలు కావాల్సిందే. పుసుక్కున పోటీ చేయాలనుకుంటున్న అనే మాట ఏ నాయకుడిని నోటి నుంచి వినపడినా సరే…ఆ మాట మూటను ముందు పెట్టుకొని చెప్పాలిందే..లేకుంటే చిక్కులే. ముఖ్యంగా హుజూరాబాద్‌ ఉప ఎన్నికతో ఈ రకమైన దోరణి మరీ ఎక్కువైంది. హుజూరాబాద్‌లో ఓటుకు ఇంత అని కవర్లలో పెట్టి మరీ అందరూ పంచారు. మునుగోడులో కూడా అదే చేశారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు అందరూ చేసిందే..అందులో ఏ ఒక్కరూ అతీతులు కాదు. కాకపోతే పార్టీలు ఇక్కడ న్యాయంగా జనానికి అందించాలన్న ఆలోచనతో పంపిన డబ్బులు మధ్యలో నాయకులు మాయం చేయడమే పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

ఎన్నికల రోజునే మీడియాలో అనేక కథనాలు వచ్చాయి.

 లైవ్‌ లో కూడా కొన్ని గ్రామాలలో మాకు డబ్బులు అందలేదని ప్రజలు చెప్పిన విషయాలు కూడా విన్నాం. అంతే కాకుండా ఆయా గ్రామాలకు చెందిన నేతలకు డబ్బులు చేరినా, మాకు పంచడం లేదని ప్రజలు చెప్పడం జరిగింది. మునుగోడులో టిఆర్‌ఎస్‌ పార్టీ, బిజేపిలు పోటీ పడి మరీ డబ్బులు పంచాయన్నదానిలో ఎలాంటి వివాదం లేదు. కాకపోతే ఎన్నికలకు రెండు రోజుల ముందు ఓటుకు మూడు వేలు, ఇచ్చి రేపు పోలింగ్‌ అనగా మరో రెండు వేలు టిఆర్‌ఎస్‌ పంపించిందనేది ఓ లెక్క. మొత్తంగా ఓటుకు ఐదు వేల రూపాయలు చేరాలి. కాని ముందు ఇచ్చిన మూడు వేలు గ్రామాలల్లో నాయకులు, ప్రచారానికి వెళ్లిన నాయకులు పంచారు. అయితే ఇక్కడ కూడా కొందరికి పంచలేదన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇక తర్వాత పంచాల్సిన రెండు వేలు పంచకపోవడంతో, పక్కాగా నాలుగు వేలు పంచిన బిజేపికి పెద్దఎత్తున ఓటు పడిరదని తెలుస్తోంది. బిజేపి నేతలు ఎక్కడా ఇలా డబ్బులు మాయం చేశారన్న అపవాదు ఒక్కటి కూడా లేదు. కాని టిఆర్‌ఎస్‌లోనే ఎందుకు వస్తుంది? అంటే నాయకులకు పార్టీ గెలుపుపై నమ్మకం లేక చేశారా? లేక ఎలాగైనా గెలుస్తామన్న అతి విశ్వాసంతో చేశారా? మేజర్‌ గ్రామాల్లో కొంత వరకు పంచినా, మారు మూల గ్రామాలలో పంచాల్సిన డబ్బులన్నీ నేతలే నొక్కేశారు. 

బిజేపికి ఎక్కువ ఓట్లు పోలైన గ్రామాలన్నింటిలోనూ ఇదే వాదన వినిపిస్తోంది.నేటిధాత్రి బృందం మునుగోడులో రెండు నెలల పాటు గ్రామస్ధాయి నుంచి సర్వే చేయడం మొదలు పెట్టింది. బృందాలుగా అన్ని గ్రామాల ప్రజల ఆలోచనలు సేకరించింది. పార్టీల బలాబలాపై ఖచ్చితమైన లెక్కలు వేసింది. కాని ఆఖరు రోజున పంచాల్సిన సొమ్ములు జేబుల్లో నుంచి తీయక నేతలు చేసిన తప్పుల వల్ల మునుగోడులో రావాల్సింత మెజార్టీ టిఆర్‌ఎస్‌కు రాలేదు. ఎందుకంటే బిజేపికి మునుగోడులో చోటు లేదు. ఆపార్టీకి క్యాడర్‌లేదు. కాని ఓటు పెద్దఎత్తున నమోదైంది. కారణం కేవలం టిఆర్‌ఎస్‌ నేతలు చేసిన ఇలాంటి పని మూలంగానే ఓటు రాజగోపాల్‌కు పడిరదనేది వెల్లడౌతున్న పచ్చి నిజాలు. ఎక్కడైతే రాజగోపాల్‌ రెడ్డి కంటే ఎక్కువ డబ్బులు అందాయో అక్కడ టిఆర్‌ఎస్‌కు ఓటు పడిరది. బిజేపికన్నా, టిఆర్‌ఎస్‌ డబ్బులు తక్కువయ్యాయో! అక్కడ బిజేపికి ఓటు పెరిగింది. ఇదిలా వుంటే హైదరాబాద్‌లోని ఓ కార్పోరేటర్‌ భర్త, టిఆర్‌ఎస్‌ క్రియాశీల నాయకుడి స్వగ్రామం మునుగోడు నియోజకవర్గంలో వుంటుంది. ఆ గ్రామంలో డబ్బులు అందలేదని ఆ నాయకుడికి ప్రజలు ఫోన్‌ చేసి అక్కడ జరుగుతున్న తంతు వివరించారట. చివరికి ఆయన చెప్పినా నాయకులు ప్రజలకు డబ్బులు పంచలేదని ఆ నాయకుడు విచారం వ్యక్తం చేశాడు. అంతే కాకుండా మునుగోడు నియోజవకర్గ ఓటర్లు చాలా మంది హైదరాబాద్‌లో బతుకుతెరువ కోసం వుంటారు. వారిలో తమ గ్రామానికి చెందిన వారిని సదరు నాయకుడు పోలింగ్‌ రోజు ఆ గ్రామానికి పంపించారు. కాని పోలింగ్‌ రోజు వెళ్లిన వారికి కూడా గ్రామాల్లో నాయకులు డబ్బులు ఇవ్వలేదని, తాను ఫోన్‌ చేసి చెప్పినా పట్టించుకోలేదని ఆ నాయకుడు వాపోయాడు. అంటే ఓటర్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తప్పు చేసినా, సంక్షేమ పధకాల లబ్దిదారులైన ఓటర్లు మాత్రం ఓట్లేశారు. టిఆర్‌ఎస్‌ను గెలిపించారు. 

ఇలాంటి నాయకులతో ఎప్పటికైనా ఇబ్బందే…

డబ్బులు నొక్కేశారన్న అపవాదులు ఎదుర్కొంటున్న వారిలో ఎమ్మెల్యేలు కూడా వుండడం గమనార్హం. వీటిపై నేటిధాత్రి వద్ద కూడా లేక్కలున్నాయి. ముఖ్యమంత్రి కేసిఆర్‌ దృష్టికి కూడా ఈ సమచారం వెళ్లింది. అందుకే ఆయన అసలేం జరిగింది. మెజార్టీ ఎలా తగ్గిందనేదానిపై పార్టీ పరిశీలన బృందాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన ఇన్‌చార్జిగా వున్న గ్రామాలలో రెండో దఫా అందలేదన్న ఆరోపణలు ఎక్కువ వినిపిస్తున్నాయి. అంతేకుండా కొందరు ఎంపిలు, ఎమ్మెల్యేలు కూడా ఇదే దారిలో నడిచారని తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే సదరు నాయకులకు అందజేసినా, వాళ్లు పంచలేదన్నది కూడా కొంత తెలుస్తోంది. ఇలా సరైన పర్యవేక్షణ లేక, చిత్త శుద్ది, అంకితభావం లేని నాయకుల మూలంగా మునుగోడులో మునిగిపోయే పరిస్ధితి తెచ్చారు. కాకపోతే సంక్షేమ పథకాలపై ప్రజల్లో వున్న నమ్మకం, ముఖ్యమంత్రి కేసిఆర్‌పై కృతజ్ఞతే టిఆర్‌ఎస్‌ను గట్టెక్కించిందని చెప్పక తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *