మూడు నామాల దోస్తీ!

మూడు నామాల దోస్తీ!

`దండుగా టిఆర్‌ఎస్‌ తో కుస్తీ!!

`మళ్ళీ ఆ ముగ్గురు కలుస్తున్నారు!

`తెలుగు రాజకీయాలను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు.

`అధికారం లోకి రావాలని కలలుగంటున్నారు.

`ఐటి, ఈడీలను రంగంలోకి దించారు?

`ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్నారు?

` టిఆర్‌ఎస్‌లో వున్న టిడిపి నేతలు బిజేపిలోకి చేరేలా ప్లాన్‌ చేశారు?

` ఈడీ, ఐటి సోదాలతో దారిలోకి తెచ్చుకునే రాజకీయం ఆడుతున్నారు.

` తెలంగాణలో మళ్ళీ బిజేపి, టిడిపి, జనసేన ఏకతాటి పైకి వచ్చారు.

` తెలంగాణలో బిజేపిని అధికారంలోకి తేవాలని చూస్తున్నారు.

` ఇదే త్రయ జోడి ఆంద్రప్రదేశ్‌ లో కలిసి పోటీ మళ్ళీ పొత్తు చిగురింపజేసుకున్నారు.

` అక్కడ టిడిపికి అధికారం అప్పగించాలని నిర్ణయానికొచ్చారు?

` ఇప్పటికే ప్రధాని మోడీతో పవన్‌ భేటీ అయ్యారు.

` చంద్రబాబు దూతగా పవన్‌ రాయబారం నడిపారు.

`తెలంగాణలో టిడిపి కి పునరుజ్జీవనం చేస్తున్నారు.

`అది బిజేపి అధికారానికి సహకారం అందిస్తున్నారు.

`జనసేన తోడుతో గట్టెక్కాలనుకుంటున్నారు.

` 2014 త్రినామత్రయం ఆంధ్రాలో సక్సెస్‌ అయ్యారు.

` ఇప్పుడు తెలంగాణలో కలిసేందుకు మీటింగ్‌ పెట్టుకున్నారు.

`ఎవరు ఒంటరిగా వెళ్లినా టిఆర్‌ఎస్‌ ను టచ్‌ చేయడం కష్టమని తెలుసుకున్నారు.

` టిఆర్‌ఎస్‌ ను ఓడిరచాలంటే మూడు పార్టీలు కలిస్తేనే సాధ్యమవుతుందని లెక్కలేసుకున్నారు?

`టిడిపి ఆంద్రప్రదేశ్‌ లో నిలబడాలంటే ముందు తెలంగాణలో బిజేపిని అధికారంలోకి తేవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు?

`అది బూచిగా చూపి, ఆంధ్ర ప్రదేశ్‌ లో ఓట్లు అడుక్కోవాలని చూస్తున్నారు!

  హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఎక్కడ పోగొట్టుకున్నామో! అక్కడే వెతుక్కొమన్నారన్న సామెత గుర్తొచ్చినట్లుంది. విడిగా వుంటే వీకౌతున్నామని గమనించారు. విడిపోయి తప్పు చేశామని మధనపడిపోతున్నారు. లోలోన కుమిలిపోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ను తక్కువ అంచనా వేసి, తాము బలవంతులమనుకున్నారు. కేసిఆర్‌ వేసే ఎత్తులు తట్టుకోలేక, ఒకరినొకరు మళ్లీ ఓదార్చుకొని పాత రోజులు గుర్తు చేసుకున్నారు. చేదు రోజులు మర్చిపోదామని చర్చించుకున్నారు. మళ్లీ ఒక్కటౌదామని అంగీకారానికి వచ్చారు. ఇంతకీ ఎవరనుకుంటున్నారా? ప్రధాని నరేంద్ర మోడీ…చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌. ప్రధాని నరేంద్ర మోడీకి కూడా వీళ్ల అవసరం భవిష్యత్తులో అవసరం కానున్నది. దేశంలో ఇప్పుడు అనుకున్నంత బలంగా బిజేపి లేదని తేలిపోయింది. తెలిసిపోయింది. త్వరలో జరగనున్న గుజరాత్‌లో కష్టమే అన్నది కళ్లముందు కనిపిస్తోంది. అక్కడ బిజేపి ఓడిపోతే ఇక దేశంలో కూడా ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. బిజేపికి మళ్లీ పాత రోజులే దిక్కని అర్ధమైపోయింది. అందుకే పాత స్నేహాలు మళ్లీ చిగురింప జేకుంటే, ఉభయకుశలోపరి స్వామి కార్యం, స్వకారం అందరికీ ఏక కాలంలో తీరిపోతుంది. అందుకే మళ్లీ ముచ్చటగా ముగ్గురు కలిసేందుకు ముహూర్తం చూసుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో తెలంగాణలో బిజేపికి అవసరం. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేనకు అవసరం. అందుకే ఒక్కటౌదామని నిర్ణయానికి వచ్చారు. ఇరు పార్టీలు రాజకీయ దూతగా పవన్‌ను ఎంచుకున్నారు. ఇక్కడి విషయాలు అక్కడికి, అక్కడి విషయాలు ఇక్కడికి ఇప్పుడు చేరవేసే పని పవన్‌ పెట్టుకున్నాడు. డిసెంబర్‌ 4న చంద్రబాబుతో కూడా మంతనాలు మొదలుపెట్టేందుకు మోడీ సంకేతాలిచ్చారు. ఎందుకంటే పుల్లలుగా వుంటే కేసిఆర్‌ లాంటి నాయకులు విరిచేస్తున్నారు. ముక్కలు చేసేస్తున్నారు. బిజేపిని లెక్కలోకి తీసుకోవడం లేదు. అందుకే ఈ ముగ్గురు కట్టెల మోపుగా మారి బలపడాలనుకుంటున్నారు. గత ఫలితాలు మరోసారి పునరావృతం చేయాలనుకుంటున్నారు. ముందుగా తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్నారు. ఏడాది ముందు వచ్చే తెలంగాణలో బిజేపిని గద్దెనెక్కించే పనిని పంచుకునేందుకు సిద్దమౌతున్నారు. పనిలో పనిని తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పునరుజ్జీవం పోసే పని పెట్టుకున్నారు. కాసాని జ్ఞానేశ్వర్‌ను ముందు పెట్టి రాజకీయం నడిపేందుకు సిద్ధమౌతున్నారు. జిల్లా కమిటీలు కూడా చకచకా వేసుకుంటున్నారు. ఎన్నికల వేడి సెగ తగిలేలోపు అన్ని సిద్ధం చేసుకోవాలని చూస్తున్నారు. తాము బలపడి బిజేపిని అధికారంలోకి తెచ్చేందుకు బిజేపికి సహకరించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. 

 కేంద్రంలో పరిస్దితి ఈసారి ఎలా వుంటుందో అన్నదానిపై బిజేపిలో కూడా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.

 గత రెండు ఎన్నికలంత సులువు కాదని తేలిపోయింది. దేశంలో పరిస్ధితి చూస్తుంటే బిజేపికి కొంత ఇబ్బందికరమైన పరిస్ధితులే కళ్లముందున్నాయి. అందులోనూ దక్షిణాదిలో ఇప్పుడు పాగా వేయలేకపోతే భవిష్యత్తులో బిజేపికి ఇక స్ధానం ఎప్పుడూ వుండదు. అందుకే శత్రువు, శత్రువు మిత్రుడైనట్లు, వాళ్లు వాళ్లు శత్రువులైనా కేసిఆర్‌ లాంటి బలమైన నాయకుడిని డీ కొట్టాలంటే కలిపిపోవాలని నిర్ణయించుకున్నారు. మొదట్లో 2014 ఎన్నికల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా బిజేపికి అనుకూలంగానే వుంటూ వచ్చారు. కాని బిజేపి గత ఎన్నికల తర్వాత కేసిఆర్‌ను తక్కువగా అంచనా వేసుకొని ఆయనతో గొక్కునే ప్రయత్నం చేస్తూ వచ్చింది. దానికి కేసిఆర్‌ తన ఉగ్రరూపాని చూపిస్తూ వస్తున్నారు. బిజేపికి ఊపిరాడకుండా చేస్తూ వస్తున్నారు. బిజేపి మీద ఆయన వీలు చిక్కినప్పుడల్లా దుమ్మెత్తిపోస్తున్నాడు. చెడుగుడు ఆడుకుంటున్నారు. దేశంలో ప్రధాని మోడీ పాలనను కడిగేస్తున్నారు. ప్రజల ముందు కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడుతున్నాడు. ఇక తట్టుకోలేని బిజేపి పాత దోస్తులైన చంద్రబాబు, పవన్‌ కలుపుకుపోతే తప్ప మనుగడ లేదని తెలుసుకొని కలిసిపోయారు. టిఆర్‌ఎస్‌ మీద పోరు ప్రకటించేందుకు సిద్ధమౌతున్నారు. 

  ఏకమై 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేసినట్లే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా పోటీ చేయాలని సంకల్పిస్తున్నాయి.

 అసలు 2014లో ఏర్పడిన ఈ త్రయ మైత్రి మూడేళ్లలోనే ఇచ్చుకపోయింది. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ల కలిసి సంయుక్తంగా తిరుపతి సభలో మేము ముగ్గురం…వెంకన్న స్వామి నామాలకు రూపాలం అని చెప్పుకున్నారు. మేం ముగ్గురం ఒక్కటే అన్నారు. ఎన్నికల ముందు అనుకున్నదొక్కటి. ఆ తర్వాత జరిగిందొక్కటి. ఎన్నికల సమయంలో ఆంధ్ర ప్రదేశ్‌ విడిపోవడంపై ఎంతో బాధను వ్యక్తం చేసిన నరేంద్ర మోడీ ప్రధాని అయితే ఇక ఆంధ్రప్రదేశ్‌కు తిరుగులేదని చంద్రబాబు కలలుగన్నాడు. అమరావతి రాజధాని శంకుస్ధాపను ఒట్టి చేతులతో పోతే ఏం బాగుంటుందనుకున్నాడో ఎమో కాని ప్రధాని డిల్లీ పార్లమెంటు ప్రాంగణ మన్ను, యమునా నది నీళ్లు తెచ్చి షాక్‌ ఇచ్చారు. అయినా అదే మహా ప్రసాదమని చంద్రబాబు భావించారు. ఆ తర్వాత గాని మోడీ అసలు రూపం తెలియలేదు. దానికి చంద్రబాబుకు మండిరది. అది కూడా ఆఖరు నిమిషంలో జరిగింది. అయినా వేచి చూసే ధోరణే అవలంభించిన చంద్రబాబు ఇక కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదని తెలియడంతో యూటర్న్‌ తీసుకున్నాడు. బిజేపికి రాంరాం చెప్పాడు. అయితే మొదట మోడీని నమ్మడమే చంద్రబాబు చేసిన పెద్ద తప్పిదం. మళ్లీ అదే తప్పు ఇప్పుడు చేసి నిండా మునిగేందుకు రెడీ అవుతున్నాడు. ఒంటరిగా ఎలాగూ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చక్రం తిప్పలేదు. ఒంటరి పోరు ఎప్పుడూ చంద్రబాబుకు సాధ్యం కాదు. తోడుగా జనసేన కావాలి. అయినా బలం సరిపోదు. అందుకు బిజేపికి సహాకారం తీసుకోవాలి. ఇస్తినమ్మ వాయినం…పుచ్చుకుంటినమ్మ వాయినం…అన్నట్లు తెలంగాణలో బిజేపిని అధికారంలోకి తెచ్చేందుకు టిడిపి సహకరిస్తుంది? ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి, జనసేన సంయుక్త ప్రభుత్వానికి బిజేపి తోడుగా నిలుస్తుంది. ఇదీ డీల్‌…

  తెలంగాణలో ముందు ఆపరేషన్‌ మొదలైంది. 

ప్రస్తుతం క్రియాశీలకంగా వున్న పూర్వపు టిడిపి నాయకుల మీద ముందు వల వేస్తున్నారు. వారిని ఈడి, ఐటిల పేరుతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఒక్కసారి గమనిస్తే ఈడి, ఐటిరైడ్స్‌ సోదాలకోసం ఎంచుకున్న నేతల్లో టిడిపి నుంచి వెళ్లిన నేతలే కనిపిస్తున్నారు. ఆఖరుకు పిపిసి ప్రెసిడెంటు రేవంత్‌రెడ్డి కూడా వున్నారు. అంటే బిజేపి ఒక పధకం ప్రకారం ముందుకు వెళ్తుందనేది స్పష్టమౌతోంది. ఉద్యమ కారుల జోలికి వెళ్లడం లేదు. ఎందుకంటే వాళ్లంతా టిఆర్‌ఎస్‌ హార్డ్‌ కోర్‌ నాయకులు. గతంలోనే ఓసారి చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే విషయంలో దొరికిపోయాడు. ఇప్పుడు బిజేపి దొరికిపోయింది. కేసిఆర్‌తో పెట్టుకొని చంద్రబాబు తెలంగాణలో బిచాణా ఎత్తేశాడు. ఇక ఏమి లేకున్నా, ఎంతో వున్నట్లు ఊహించుకుంటున్న బిజేపికి అవన్నీ కలలని తెలిసిపోయే రోజులు కేసిఆర్‌ చూపించడం ఖాయం. ఎలాగూ అక్రమ మార్గంలో టిఆర్‌ఎస్‌ను ఎలాగూ కట్టడి చేయలేకపోతున్నామని గమనించి, కనీసం టిడిపి పాత బ్యాచ్‌ను టిఆర్‌ఎస్‌ దూరం చేసి, వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఎలా వుంటుందన్నదానిపై కసరత్తు సాగుతోంది. రాజకీయ నూకలు మాకు ఇంకా మిగిలే వున్నాయన్న ఆశ వారిని ఏకం చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *