మునుగోడు మంట ..మూడు పార్టీలకు తంట!

మునుగోడు మంట ..మూడు పార్టీలకు తంట!

పట్టుతప్పితే ఖేల్‌ ఖతం…. 

గెలిచే పార్టీదే రాష్ట్ర భవిష్యత్తు!

అందరి ఆసక్తి మును‘గోడు’వినాలనే

చావో రేవో మునుగోడులో తేల్చుకోవాల్సిందే!

సర్వశక్తులు అందరూ ఒడ్డేందుకు సిద్దం?

మూలిగే నక్క మీద తాటిపండు కధ కాంగ్రెస్‌ ది?

వాపో, బలుపో బిజెపికి తేలిపోతుంది?

కారు ప్రయాణమెంత పదిలమో తెలిసిపోతుంది?

టిఆర్‌ఎస్‌ గెలిస్తే ఇక తిరుగుండదు?

బిజెపి గెలిస్తే గోడమీద నాయకులు ఆగరు?

ఉమ్మడి నల్గొండలో బిజెపి పాగా అడ్డుకోలేరు?

కాంగ్రెస్‌ గెలిస్తే రెవంత్‌కు తిరుగుండదు?

ముందు చరిత్ర ఓసారి: నిన్న నీదికానిరోజు ,నేడు నీది కావొచ్చు…మళ్ళీ రేపు నీది కాకపోచ్చు…ప్రతి రోజూ నాదే కావాలను కోవడం తప్పు కాకపోవచ్చు..కాని అది అత్యాశే అవుతుంది.. అనర్థం తెచ్చిపెడుతుంది..రాజగోపాల్‌ రెడ్డి రాజకీయంలా వుంటుంది. ప్రజాస్వామ్యాన్ని ఎవరూ అపహాస్యం చేయొద్దు… తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు వాడుకోవద్దు…రాజకీయ నాయకులకు వ్యాపారాలు వుండొద్దని పెద్దలు ఎందుకు చెప్పారో…మునుగోడుతో తేలిపోయినట్లే? రాజకీయం అన్నది ప్రజా సేవ చేయడానికి, ఆస్తుల సంపాదనకు, వాటి రక్షణకో, వ్యాపార విస్తరణలకోసం చేసేవి కావు…అందుకే మన రాజకీయాలు ఇలా తగలబడుతున్నాయి…ఉన్నత విద్యావంతులు, రాజకీయ నాయకుల వారసులు, వ్యాపార వేత్తలు ప్రజా సేవ ముసుగేసుకొని వస్తే ఇలాగే వుంటుంది…

 అయ్యే …మునుగోడు!: 

మునుగోడు ప్రజలు ఏరి కోరి రాజగోపాల్‌ రెడ్డిని ఎంచుకొని గెలిపించుకున్నారు. అందుకు పశ్చాత్తాపడండి అనేలా చేస్తున్నాడా! అనే అనుమానం రాకమాదు. ఒకసారి ఎంపిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యే గా నల్గొండ జిల్లా ప్రజలు కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి రాజకీయంగా మద్దతిస్తూనే వున్నారు. దాంతో ఆయన ఇంత దూరం రాగలిగాడు. కోమటి రెడ్డి వెంకటరెడ్డి సోదరుడు అనే ఒకే ఒక్క అర్హత మరేదీ ఎంపి కాకముందు లేదు. మొదటి సారే కాంగ్రెస్‌ పార్టీ ఎంపిగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది. గెలిచాక పదవిలో వుంటూ కాంట్రాక్టులు చేసుకోవడానికి అనుమతులు కల్పించారు. పులిచింతల ప్రాజెక్టు కోమటి రెడ్డి బ్రదర్స్‌ చేపట్టారు. ఆ అవకాశం కల్పించారు. నేషనల్‌ హైవే పనుల కాంట్రాక్టులు పొందారు. ఇలా పార్టీ అనేక అవకాశాలు కల్పించింది. కానీ అవన్నీ రాజగోపాల్‌ రెడ్డి మర్చిపోయారు. ఇప్పుడేంటి…నా కేంటి…అనే దారిని చూసుకుంటున్నాడు. తాను ఎంపిగా,ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా గెలిచినా తన సొంత బలంతోనే అన్నంత దాకా వెళ్లాడు…రాజకీయంగా తన ఎదుగుదలలో పార్టీ ప్రమేయమే లేదన్నంతగా మాట్లాడుతున్నాడు. తమది బ్రాండ్‌ అంటున్నాడు….2018 ఎన్నికలలో గెలిచాక సిఎల్పీ పదవి ఆశించాడు. పార్టీ అంగీకరించలేదు. పార్లమెంటు ఎన్నికలలో వెంకటరెడ్డి భువనగిరిను గెలిచారు. ఆ తర్వాత అన్నకు పిసిసి కావాలనుకున్నాడు. అదీ దక్కలేదు. ప్రస్టేషన్‌ పీక్‌ స్థాయికి చేరింది… అప్పటి నుంచి రాజగోపాల్‌ రెడ్డి సొంత పార్టీ మీద రాజకీయం మొదలుపెట్టారు…అదును దొరికినప్పుడల్లా బిజెపిని పొగడ్తలతో ముంచెత్తడం మొదలుపెట్టారు. ఇక అప్పటినుంచి కోమటి రెడ్డి బ్రదర్స్‌ ఎప్పటికైనా జంపే అన్న సంకేతాలు ఎప్పుడూ పంపుతూనే వున్నారు. అదంతా ఒట్టి ప్రచారం మేమంటే గిట్టని వారు చేస్తున్న దుష్ప్రచారం అని ఖండిస్తూ వస్తున్నారు…ఎప్పడైతే రేవంత్‌ రెడ్డి పిసిసి అధ్యక్షుడయ్యారో అప్పటి నుంచి అదును కోసం, అవకాశం కోసం కోమటి రెడ్డి బ్రదర్స్‌ ఎదురుచూస్తున్నారనేది నిత్యం నలుగుతున్న మాటే…తమ్ముడికేం తెలియదు…ఆవేశం అనుకుంటే అన్న చేస్తున్నదేముంది…రేవంత్‌ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అధ్యక్షుడు కాగానే ఇక గాంధీ భవన్‌ మెట్లు ఎక్కను అన్నాడు…పార్టీ పరమైన కార్యక్రమాలకు దూరంగా వుంటూ వస్తున్నాడు…ఇప్పటికీ అంటీ ముట్టనట్లు వుంటున్నాడు…సమిష్టిగా పోరాటం చేద్దాం… పార్టీని అధికారంలోకి తెద్దామన్న ప్రకటన చేసింది లేదు…నిత్యం కయ్యమే…సొంత పార్టీలో జగడమే…ఎంత కాలం కోమటి రెడ్డి బ్రదర్స్‌ తలనొప్పి అనుకునే దాకా చెచ్చుకుంటున్నారు. 

ఇప్పుడేం జరగబోతోంది:

నాన్నా పులి కథ అందరికీ తెలిసిందే… అయినా అదే ఆచరిస్తాం…తర్వాత తెల్ల మొహం వేస్తాం…ఇది అహంలో ఒక భాగం… తన గోతి తాను తీసుకోవడం…గోడమీద పిల్లి వాటం ఎల్ల కాలం సాగదు..ఎప్పుడో ఒకసారి ఎటువైపో దూకక తప్పదు…ఎప్పుడూ గోడ మీదనే వుంటానంటే ఆఖరుకు ఎవరూ పట్టించుకోరు.. రాజగోపాల్‌ ఒక నిర్ణయానికి వచ్చింది ఇక్కడే…తాజాగా రాజగోపాల్‌ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను కలవడంతో కథ క్లైమాక్స్‌ కు చేరింది. డిల్లీ లో లీకులిస్తారు…తెలంగాణకు వచ్చి రచ్చ చేస్తారు..ఇది రాజకీయ నాయకులకు పరిపాటే…ఒక మాజీ ఎంపి, ప్రస్తుత ఎమ్మెల్యే అనూహ్యంగా పార్లమెంటులో కేంద్ర హోం మంత్రిని కలవడం అన్నదానికి ప్రత్యేకత వుండదా? సరే కలిసిన తర్వాత ఇంత పెద్ద వార్తల వంటకాలెలా వచ్చాయి? రాజగోపాల్‌ రెడ్డి ఏ మాత్రం లీకులివ్వకుండానే అంతా జరిగిపోయిందా? పైగా రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేస్తే అది చారిత్రక నేపధ్యమౌతుందన్నంతగా ప్రచారం చేసుకోవడం మరో వింత? రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేస్తే కేవలం ఉప ఎన్నిక మాత్రమే వస్తుంది?

అన్నదమ్ములు రాజకీయాలు:

రాజకీయాలలో అన్నదమ్ములు చరిత్రలు కోకొల్లలు. కానీ కోమటి రెడ్డి బ్రదర్స్‌ రాజకీయం సెపరేటు…ఉమ్మడి కుటుంబం… ఒకే పార్టీ రాజకీయం… అయినా వింతవింత ప్రకటనలు.. గతంలో ఆనం కుటుంబం ఇలాగే కుటుంబం రాజకీయం.. కాకపోతే ఇద్దరు ఇద్దరే అన్నట్లు వుండేవారు. ఇద్దరూ ఒకే బాటలో నడిచేవాళ్లు. ఇప్పటికీ అన్నదమ్ములు రాజకీయాలలో వున్నవారిలో ఎర్రబెల్లి సోదరులు. ఇప్పటికీ అన్న గీసిన గిరి దాటకుండా తమ్ముడు రాజకీయం చేస్తున్నాడు. పార్టీలు ప్రతిష్టాత్మకానికి పోయి: క్రీడా కారులకు క్రీడలలో గ్యాప్‌ వస్తే ఎలా వుంటుంది… అలా ప్రతి రాజకీయ పార్టీ ఎప్పటికప్పుడు తమ పార్టీ క్షేత్ర స్థాయిలో ఎలా వుందనేది అంచనా వేసుకునే పనిలో నిమగ్నమై వుంటుంది. గతంలో కన్నా ఈ మధ్య కొద్దిగా రాజకీయాల జోక్యం మరింత పెరిగిపోయింది. ఎవరు నలుగురు కలిసినా రాజకీయమే మొదలౌతోంది. మునుగోడు చర్చనే జరుగుతోంది…

తహతహలాడుతున్నాయా! కసిమీద వున్నాయా?: 

మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక రావాలని తహతహలాడుతున్న పార్టీలు టిఆర్‌ఎస్‌, బిజెపి… ఆటలో అరటిపండౌతామో అన్న భయంలో కాంగ్రెస్‌ వుంది. నమ్మి పార్టీ అనేక అవకాశాలు ఇచ్చిన ఉత్త పుణ్యానికి ఉప ఎన్నిక తెచ్చి కాంగ్రెస్‌ పార్టీకి మరింత సమ్మెట పోట్లు వేయాలని చూస్తున్నట్లే వుంది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు కానుంది. ఇప్పటికే వరుస ఉప ఎన్నికలతో కోలుకోలేని దెబ్బలు తింటూ ఇప్పుడు ఊపు మీదున్నామని చెప్పుకుంటే వున్న గాలి తీసే ప్రయత్నం రాజగోపాల్‌ రెడ్డి చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్‌ కు ఎంత ప్రతిష్టాత్మకమో, రేవంత్‌ రెడ్డి కి సవాలుగా మారే ప్రమాదముంది. హుజూరాబాద్‌ సమయంలో ఇప్పుడే వచ్చాను…ఇళ్లన్నా సర్థుకోలేదు…యుద్ధం చేయమంటే ఎట్లా? అని ఈటెల గెలుపు చేసిన పని రేవంత్‌ మెడకు చుట్టుకోకమానదు…నల్గొండ ఎలా వస్తావ్‌? మా ఇలాఖాలో ఎలా అడుగుపెడతావ్‌? అని నిలదీసిన కోమటి రెడ్డి వెంకట రెడ్డి కి చెక్‌ పెట్టాలంటే మునుగోడులో కాంగ్రెస్‌ గెలవాలి? అది సాధ్యమేనా? అన్న ప్రశ్న కాంగ్రెస్‌ శ్రేణులను తొలుస్తోంది. రేవంత్‌ రెడ్డి ని రాజగోపాల్‌ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఆశామాషీ వ్యవహారం కాదు..అందుకోసమైనా రేవంత్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని కసిగా ఓడిరచాలి. 

రాజగోపాల్‌ ను లాక్కుంటే బిజెపి కి ఏం లాభం?: 

రాజగోపాల్‌ రెడ్డి రాజకీయంతో ఆడుకోవడం తప్ప మరేం లేదు… ఉమ్మడి నల్గొండ జిల్లాలో బిజెపికి పట్టు లేదు…ఉన్న ఫలంగా బలంగా వున్నాం…ప్రత్యామ్నాయం మేమే అనిపించుకోవాలి. బిజెపి వైపు ఆశగా చూస్తున్న రాజగోపాల్‌ రెడ్డి రాజకీయం అడ్డం పెట్టుకోవాలి. సక్సెస్‌ అయ్యిందనుకో బిజెపికి లాభం… ఫెయిలైతే ఒక ప్రయోగం విఫలమని సరిపెట్టుకోవాలి. తెలంగాణలో కాన్సంట్రేషన్‌ చేయాలో వద్దే తేల్చేసుకోవాలి. 

ఎలాగైనా కారుకు లాభమే! కాకపోతే పరీక్షే?:

గతంలో తిరుగులేదు, ఎదురులేదు, ఎన్నికలేవైనా గెలపు మాదే..గెలిచేది మేమే.. అనుకునే టిఆర్‌ఎస్‌ కు రెండు ఉప ఎన్నికలలో బ్రేకులు పడ్డాయి. ఏ రకంగా చూసినా అవి ఇబ్బంది టిఆర్‌ఎస్‌ ను ఆత్మ పరిశీలనలో పడేలా చేశాయి. పోయిన రెండు ఉప ఎన్నికలలో పరువును సమతూకం చేసి, టిఆర్‌ఎస్‌ తగ్గలేదని నిరూపించుకోవాలి. ఇది అందివచ్చిన అవకాశంగా కచ్చితంగా మల్చుకోవాలి…కారు పార్టీ నుంచి సై అంటే సై అనేందుకు ఆరుగురు రెడీగా వున్నారు…పోటీలో కూడా సంఖ్య పెద్దదే చూపిస్తున్నారు…ఇక్కడ కూడా బలం మాదే అంటున్నారు.

మూడు పార్టీలకు చావో రేవో:

పైకి ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న మునుగోడు ఎన్నిక మూడు పార్టీ ముచ్చెమటలు కక్కాల్సిందే…మూడు చెరువుల నీళ్లుతాగాల్సిందే…గంట గంట గడగడమని ఒనుక్కుంటూ రోజులు గడపాల్సిందే…నరాలు తెగే ఉత్కంఠను అనుభవించాల్సిందే…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *