బడుగులను బలిచేసే బిజేపి అరాజకీయం!?

`బడుగులు బాడుగ పనులే చేయాలా?

`వ్యాపారాలు చేయొద్దా? 

`బడుగులు ఎదిగితే ఓర్చుకోలేరా?

`రాజకీయాలలో రాణించొద్దా?

`బడుగులను లను అణచివేసే కుట్ర?

`తెలంగాణలో గ్రానైట్‌ వ్యాపారాలపై ఈడీ దాడులు

`మంత్రి గంగుల, ఎంపి. రవిచంద్ర టార్గెట్‌..

`కరీంనగర్‌ జిల్లాలో గంగుల బలమైన నాయకుడు.

`జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగలడు.

`రవిచంద్ర మూడు జిల్లాల్లో పట్టున్న నాయకుడు.

`మున్నూరు కాపు రాష్ట్ర నాయకుడు.

`కష్టపడి పైకొచ్చారు…వ్యాపారం సాగించారు.

`పెద్ద ఎత్తున పేద వర్గాలకు అండగా నిలిచారు.

`పేదవారి కష్టాలు తెలిసిన నాయకులుగా సాయం కోసం వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపరు.

`అలాంటి బహుజన నాయకులు ఎదగడం బిజేపికి ఇష్టం లేదా?

 `రేపటి రోజు బిజేపిలో వున్న వారికీ అదే పరిస్థితి రానుందా?

`బిసి నాయకుల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడంపై బిసి సంఘాల మండిపాటు.

`పేరుకే బిజేపి బిసిలకు అనుకూలమా?

`బిజేపి నుంచి బయటకు వస్తున్న నేతలు కూడా బడుగులే…

`బలమైన బడుగు నేతలను భయపెట్టే రాజకీయం సరైంది కాదు!

`ఎంతో కష్టపడి ఎదిగిన బిసిలను అణచివేసి వేయడాన్ని తప్పు పడుతున్న బహుజన సంఘాలు.

`అణగారిన వర్గాలు ఉన్నత స్థాయికి చేరుకోవొద్దా?

`రేపటి రోజున ఆర్‌.ప్రవీణ్‌ కుమార్‌ లాంటి వాళ్లకు ఎదురుకావచ్చు?

`బహుజన సంఘాలు మేల్కొనాల్సిన తరుణం!

`బిసిలు ఎదిగి వ్యాపారాలు వేయడమే నేరమా?

`రూపాయి, రూపాయి కూడబెట్టి వ్యాపారం చేసి బాగుపడితే టార్గెట్‌ చేస్తారా?

`చెరపుకురా చెడేవు అన్న సామెత నిజం చేసుకోనుందా బిజేపి?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాజకీయం దారి తప్పుతోంది. దుర్మార్గం రాజ్యమేలుతోంది. దౌర్జన్యం వెంట పడుతోంది. ధనరాజకీయాలు ప్రజా సేవను కలుషితం చేస్తున్నాయి. పెత్తనాలు పెద్దవారి వైపు చూడకుండా, ఎదిగిన బడుగు నేతలను వారిని టార్గెట్‌ చేస్తున్నాయి. ఒక్కసారి సమాజాన్ని చూడండి. ఏ కాలం చూసినా, గత ఓ ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్లినా ఎక్కడా ఎదిగిన బడుగుల నాయకులు కనిపించరు. రాజకీయంగా రిజర్వేషన్ల పరంగా నాయకులైనా, వారు ఆర్ధికంగా ఎదిగింది లేదు. పెత్తందారులతో సమానంగా నిలబడిరది లేదు. ఇప్పుడు ఎదిగిన ఏ బడుగుల నేతైనా సరే ఎంతో కష్టపడి, జీవితాన్ని రంగరించుకొని విజయం సాదించిన వారే…తమ తెలివితేటలతో ధైర్యంగా తన ఆలోచనలకు పదునుపెట్టి ఒక్కొరూపాయి కూడబెట్టుకొని ఎదిగిన వాళ్లే కనిపిస్తారు. ఇప్పుడు సమాజంలో కొంత మార్పు కనిపిస్తున్నా, గతంలో బడుగులకు భూమలులేవు. ఎకరాలకు ఎకరాలు సాగు లేదు. కూలీలుగానే జీవనం. కౌలు రైతు జీవితం. కూలీ పనితో వెల్లబుచ్చుకున్న కాలం. కడుపు నిండా తిన్న రోజు లేదు. ఆ కసితో కష్టపడి ఎదిగిన వారు ఈ రోజు కొంత బలంగా కనిపిస్తున్నారు. వారు ఎదగడం ఉన్నత వర్గాలకు ఇష్టం లేదు. వుండదు కూడా…రాజకీయ పార్టీలను శాసించే ఉన్నత వర్గాలకు బడగులు ఎదిగితే చూడలేదు. ఓర్చుకోలేరు. అది రాజకీయాలకు ముడిపెట్టి, వారిని భయపెట్టి, వారి ఆర్ధిక మూలాలు దెబ్బతీసే కుట్ర చేయడం దుర్మార్గం. వారిని మానసికాందోళనకు గురిచేసి, అనారోగ్యాలు పాలు చేసి, ఆర్ధికంగా వారిని దెబ్బతీసి, ఆ కుటుంబాలలో కల్లోలం రేపడం తప్ప సాధించేదేమీ వుండదు. అయినా ఒత్తిడి చేయాలి. వారిని అణచి వేయాలన్న దోరణి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. బడుగులు బలమైన సామాజిక వర్గాలతో సమానంగా ఎదిగితే ఏం లాభం? వారి నిచ్చెన నుంచి లాగేయడం అన్యాయం కాదా? అది అక్రమం కాదా? బలమైన బడుగుల నేతలు బిజేపిలో కాకుండా ఇతర పార్టీలలో వుంటే నేరమా? వ్యవస్ధలను వాడుకుంటూ బిజేపి సాగిస్తున్న అరాచక కాండకు నిదర్శనం కాదా? ఇలాంటి అన్యాయాలు గతంలో ఎన్నడైనా చూశామా? 

ధర్మం నాలుగు పాదాల మీద నడవాలని నీతులు చెప్పిన వాళ్లే అధర్మం ఆచరిస్తున్నారు.

 రాజకీయ అవసరాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. రాజకీయాలలో పెడధోరణలు సృష్టిస్తున్నారు. వ్యవస్ధలను భ్రష్టుపట్టిస్తున్నారు. నీతికి, న్యాయానికి పట్టుగొమ్మలు కావాల్సిన ఈడీ. ఐడిలను స్వార్ధం కోసం వాడుకుంటున్నారు. బిజేపికి అననుకూలల రాజకీయ నాయకులను టార్గెట్‌ చేస్తున్నారు. వారిని భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు. వారి ఆర్ధిక మూలాలపై దెబ్బకొడుతున్నారు. వారి రాజకీయ జీవితాలను చిదిమేయాలని చూస్తున్నారు. రాజకీయాలకు వారిని దూరం చేయాలని చూస్తున్నారు. లేకుంటే లోబర్చుకొని బిజేపిలో చేరేలా చేస్తున్నారు. లేకుంటే వేధింపులకు గురిచేసేందుకు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు. ఇది బిజేపికి ఎంత మాత్రం మంచిది కాదు. పార్టీలపై నమ్మకంతో ఆయా పార్టీలలో నాయకులు చేరాలే గాని, భయంతో కాదు. పెత్తనం చేసిన రాజకీయం ఎప్పుడూ అరాజకీయమే అవుతుంది. కీచకమే తాండవిస్తుంది. ధర్మం వల్లె వేసిన నోటతోనే బిజేపి ధర్మం చెరబడుతున్నారన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. చేజేతులా మునిగిపోతామని తెలిసి కూడా నావకు చిల్లు పెట్టుకుంటున్నారు. రాష్ట్రాలలో కయ్యాలు పెట్టుకుంటున్నారు. చికాకులు సృష్టిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలనులో లోబర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా పార్టీలలో వున్న నాయకులను బిజేపిలో చేర్చుకునే కుట్రలు చేస్తున్నారు. 

తెలంగాణలో ఇప్పుడిప్పుడే బడుగులు కొందరు ఎదుగుతున్నారు.

 అలా ఎదిగేవారు రాజకీయాల్లో కీలకమౌతున్నారు. రాజకీయాలలో వారికంటూ ఓ స్ధానాన్ని, స్ధాయిని సృష్టించుకుంటున్నారు. రేపటి తరం బడుగులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కాని వారు టిఆర్‌ఎస్‌లో వుండడమే నేరమైపోయిందా? బిజేపిలో చేరకపోడమే తప్పైపోయిందా? బడుగు నేతలు రాజకీయాలు చేయొద్దా? స్వేచ్చాపూరితమైన నిర్ణయాలు చేయొద్దా? వారికి ఇష్టమైన పార్టీలను ఎంచుకొని సేవ చేయొద్దా? వుంటే బిజేపిలోనే వుండాలి? లేకుంటే రాజకీయాలలో వుండొద్దా? ఇదెక్కడి రాజకీయమో బిజేపి నేతలే చెప్పాలి. బడుగులు ఎప్పుడూ బాగుడ పనులు చేసుకుంటూనే బతకాలా? వారికి ఉన్నతమైన ఆలోచనలు రావొద్దా? వారు కూడా ఎదిగి వ్యాపారాలను శాసించొద్దా? రాజకీయాలలో క్రియాశీలకం కావొద్దా? దేశంలో 80శాతం వున్న బడుగులలో ఎంత మంది బలమైన నేతలున్నారు. ఎంత మంది వ్యాపారాలలో చెప్పుకునే స్ధాయిలో వున్నారు. కనీసం ఓ ఐదు శాతం కూడా కనిపించరు. అదే ఉన్నత వర్గాలు దేశంలో ఐదు శాతం వుంటే అందులో మొత్తం ఏదో ఒక రంగంలో కీలకమైనవారే కనిపిస్తారు. మొత్తం వ్యాపారాల్లో వారి పేరే వినిపిస్తుంది. తెలంగాణలో కూడా బిసిలలో వ్యాపారాలు చేసి, రాజకీయంగా ఎదిగిన వాళ్లను వేళ్లమీద లెక్కబెట్టొచ్చు. అంతే అంతకన్నా ఎక్కువ కూడా లేరు. అలాంటి బడుగుల నేతలు బాగు పడడం చూడలేరా? వారి రాజకీయ ప్రస్ధానాన్ని తుంచేస్తారా? బడుగులను కేంద్రంలో వున్న బిజేపి అణచివేసే కుట్ర కాదా? తెలంగాణలో బిసిలలో సామాజికంగా చైతన్యం వున్న వారు మున్నూరు కాపు. ఆ సామాజికవర్గంలో ప్రజల్లో వినిపించే పేర్లలలో మంత్రి గంగుల కమలాకర్‌, ఎం.పి వద్దిరాజు రవిచంద్ర వున్నారు. రాజకీయాల్లో వారికి ఎంత పేరుందో..సామాజిక సేవలోనూ వారికి అంతే పేరుంది. పేదిరికం వారికి తెలుసు. పేదల కష్టాలు తెలుసు , కన్నీళ్లు తెలుసు. వారి వేదన తెలుసు. జీవితాలు ఎంత అరణ్య రోధన అనుభవిస్తాయో తెలుసు. ఎంత ఎదిగినా, వారు ఆర్జించినదానిలో ఎంతో మంది పేదలను ఆదుకునే మనస్తత్వం ఇద్దరిదీ…అలాంటి నేతలు టిఆర్‌ఎస్‌లోవుండడం నేరమా? బిజేపిలో అలా పేదలకు అండగా నిలచే నాయకులు ఒక్కరైనా వున్నారో చూపించండి? ఒక్కరు కూడా కనిపించరు. బిజేపి నేతలు సేవ చేయలేరు. చేసే వారిని చూసి ఓర్వలేరు. ఇంత దౌర్భాగ్యమైన రాజకీయలు చేసిన పార్టీ ప్రపంచంలోనే ఎక్కడా కనిపించదేమో!

 గంగుల కమలాకర్‌ కరీంనగర్‌ రాజకీయాల్లో కీలకమైన నేత.

 ఏ పార్టీలో వున్నా తనదైన రాజకీయం చేసిన నాయకుడు. వ్యాపార పరంగా కూడా ప్రత్యేకతను సంతరించుకున్న నాయకుడు. అలాంటి నాయకుడు ఉత్తర తెలంగాణలోని కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల రాజకీయాలను ప్రభావితం చేయగల సమర్ధవంతమైన నాయకుడు. ముఖ్యంగా కరీంనగర్‌ రాజకీయాల్లో ఆయనది పై చేయి. అలాంటి నేతను ఇబ్బందులకు గురిచేస్తే, టిఆర్‌ఎస్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వీక్‌ చేయొచ్చు. అయితే రాజకీయాలను పక్కన పెడితే ఓ బడుగు నేతను ఇబ్బందిపెడుతున్నామన్న సంగతి బిజేపి తెలుసుకోకపోతే ఎలా? అలాగే ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ జిల్లాల రాజకీయాలను నిర్ధేశించే స్ధాయిలో వున్న ఎంపి. వద్దిరాజు రవిచంద్రను కూడా ఇబ్బందులకు గురిచేయడం అన్నది బిసి సంఘాలు, బహుజన సంఘాలు కూడా తప్పుపడుతున్నాయి. ఈ మధ్య జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు క్రియాశీలకంగా పనిచేశారు. మునుగోడులో బిజేపిని దెబ్బతీయడంలో ఈ ఇద్దరు కృతకృత్తులయ్యారు. ఇది బిజేపి తెలుసుకున్న నిజం. దాంతో ఎలాగైనా ఈ ఇద్దరు నేతల ఆర్ధిక మూలాలపై దెబ్బకొడితే టిఆర్‌ఎస్‌ను ఇబ్బందులకు గురిచేయొచ్చని బిజేపి నీచ రాజకీయానికి దిగిందనేది చాలా మంది వాదన. పేరుకే బిజేపి బిసిలకు అనుకూలంగా వుందన్న వాదన శుద్ద అబద్దమని తేలిపోయింది. ఆ మధ్య బిజేపిలో చేరి, ఇటీవల బిజేపి నుంచి బైటకు వచ్చిన నేతలు కూడా బడుగులే కావడం విశేషం. తెలంగాణ తొలి మండలి చైర్మన్‌గా పనిచేసినటువంటి స్వామీ గౌడ్‌కు బిజేపిలో ఎలాంటి గౌరవం, గుర్తింపు లేకుండాపోయింది. ఆయనను కనీసం నాయకుడిగా కూడా పార్టీ చూడలేదన్నది తేలిపొయింది. అందుకే ఆయన బైటకు వచ్చాడు. అలాగే ప్రజా గొంతుకగా ఉద్యమ కాలం నుంచి గుర్తింపు పొందిన దాసోజు శ్రవణ్‌ లాంటి నాయకుడిని కూడా ఆ పార్టీలో నిలబడనీయలేదు. ఇదే ఒకవడి కొనసాగితే రాష్ట్రంలో బహుజన సమాజ్‌పార్టీకి కన్వీనర్‌గా వున్న ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ లాంటి వారికి కూడా భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవేమో! కొన్ని కారణాల వల్ల బిజేపిలో చేరిన ఈటెలరాజేందర్‌, మాజీఎంపి వివేక్‌ లాంటివారు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చే రోజులు కూడా రొవొచ్చేమో! అందుకు బడుగులుకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే సమాజం ముందుండాలి. బడుగులంతా ఏకం కావాలి. ఎదుగుతున్న బడుగు నేతలను వ్యాపారాల పేరుతో ఇబ్బందులకు గురిచేసినా ఎదుర్కొనేందుకు అందరూ ఏకం కావాలి. బడుగులంతా ఒక్కటే అని నిరూపించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *