పాలిత రాష్ట్రాల్లోనే బిజేపి గెలిచింది…మిగతా చోట్ల ఓడింది!

దేశ వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలలో బిజేపికి షాక్ తగిలింది. బిజేపి పాలిత రాష్ట్రాలలో తప్ప, ప్రాంతీయ పార్టీలను తట్టుకొని మిగతా చోట్ల చతికిలపడింది. గెలుపు అందుకోలేకపోయింది. ఆయా రాష్ట్రాలలో గెలుపు అంత సులువు కాదని తేలిపోయింది. గెలుపు కోసం బిజేపి సర్వ శక్తులు ఒడ్డినా గెలవలేకపోయింది. ఇవి బిజేపికి ఈ నెల 3న జరిగిన ఉప ఎన్నికలతో 6న వెలువడిన ఫలితాల గుణపాఠం. బిజేపి పాలిత రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలలో మాత్రమే గెలిచింది. కానీ తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలలో ఓటమి పాలైంది. అంటే బిజేపి అధికారంలో వున్న రాష్ట్రాలలో గెలవడం అన్నదానిపై కూడా రకరకాల విశ్లేషణలున్నాయి. అయితే ఈ ఉప ఎన్నికలు బిజేపికి రాజకీయంగా ఆశనిపాతమనే చెప్పాలి. మహారాష్ట్ర లోని అంథేరీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో ఉద్దవ్ ఠాక్రేకు చెందిన శివసేన ఘన విజయం సాధించింది. మహారాష్ట్ర గత ఎన్నికలలో ప్రజలు తీర్పును అనుసరించి అక్కడ శివసేన, ఎన్సీపిల ప్రభుత్వం ఏర్పాటైంది. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆ ప్రభుత్వాన్ని బిజేపి కూలదోసింది. శవసేనను చీల్చింది. ఏక్ నాధ్ షిండేను సిఎం చేసింది. డమ్మీ ముఖ్యమంత్రి అయిన షిండేను ముందు పెట్టుకొని బిజేపి పెత్తనం చేస్తోంది. పాలన బిజేపి కనుసన్నల్లో సాగుతోంది. గతంలో కూడా ఇలాగే చేసింది. 2014 ఎన్నికలలో గెలిచి శివసేన పొత్తుతో బిజేపి అధికారంలోకి వచ్చింది. శివసేనను నిండా ముంచింది. నిజానికి శివసేన నీడలో బిజేపి ఎదిగింది. పెరిగింది. హిందుత్వ వాదానికి, ఆకాంక్షలకు శివసేన ప్రతీక. అయినా ఆ పార్టీ నీడలో చిగురించి, శివసేననే మింగేయాలని చూస్తోంది. కానీ ప్రజలు బిజేపి నిర్ణయాన్ని ఈ ఉప ఎన్నికతో తిప్పికొట్టారు. శివసేన ను గెలిపించి బిజేపి కి బుద్ధి చెప్పారు. ఇక తెలంగాణలోనూ టిఆర్ఎస్ ను ఖతం చేయాలని సంకల్పించారు. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, కర్ణాటక తరహాలో తెలంగాణ రాజకీయాలను‌ అస్థిర పర్చాలనుకున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వాన్ని దెబ్బ తీయాలనుకున్నారు. ఆ మధ్య ఏకంగా ‌ఎమ్మెల్యేల కొనుగోలుకు బరితెగించారు. అడ్డంగా దొరికిపోయింది.‌ అంతే కాకుండా ఈడీ పేరుతో దాడులకు ప్రయత్నం జరిగింది. లిక్కర్ స్కాం అంటూ టిఆర్ఎస్ పార్టీని‌ ఇబ్బంది పెట్టాలని చూసింది. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆత్మవిశ్వాసం దెబ్బ తీయాలని చూసింది. కాని‌ నేను గోకితే ఎలా వుంటుందో చూపిస్తా, అని ముఖ్యమంత్రి కేసిఆర్ బిజేపికి మునుగోడు ద్వారా చుక్కలు చూపించాడు. మునుగోడులో ఉప ఎన్నిక తెచ్చి టిఆర్ఎస్ ను ఖళీ చేయాలని చూసిన బిజేపి తెలంగాణలో స్థానం‌ లేదని తెలుసుకున్నది. అద్దె నాయకుల బలం మీద ఆధారపడి రాజకీయం చేస్తే వున్న పరువు గంగపాలౌతుందని తెలుసుకున్నది. కేసిఆర్ ను ఎదుర్కోవడం అంటే అంత ఆషామాషీ కాదని తెలుసుకున్నది. ముఖ్యమంత్రి కేసిఆర్ ను జాతీయ రాజకీయాల దరిదాపుల్లోకి రాకుండా చేయాలని చూసి బిజేపి బొక్కబోర్లా పడింది. మునుగోడు గెలుపుతో దేశ రాజకీయాలలో బిఆర్ఎస్ రూపంలో టిఆర్ఎస్ రాజకీయాలకు నాంది జరిగింది. ఇక కేసిఆర్ నాయకత్వానికి తెలంగాణలో ఎదురేలేదని తేలిపోయింది. మరో సారి బిజేపి కవ్వింపులకు తెలంగాణలో పప్పులుడకవని తెలుసుకున్నది. ఒక రకంగా చెరపకురా చెడేవు…అన్నట్లు టిఆర్ఎస్ ను ఆగం చేద్దామని చూసి, బిజేపి గందరగోళంలో పడింది. తెలంగాణ రాజకీయ సుడిగుండం ఈదడం డిల్లీ రాజకీయాలు నెరిపినంత ఈజీ కాదని తెలుసుకున్నది. ఇక బీహార్ లోని మొకామా నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి నీలం దేవి గెలుపొందింది. గతంలో ఆర్జేడితో కలిసి ఎన్నికల పోరును దాటి, ఆఖరుకు ఆర్జేడి ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూసింది. ‌బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చాణక్యం ముందు బిజేపి ఆటలు చెల్లలేదు. ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికలో బిజేపి గెలవలేదు. బిజేపి ఎక్కడైనా ఓడి గెలవాలనుకుంటుంది. తెలంగాణలో బలం లేకున్నా బలగం పెంచుకోవాలని చూసింది. ముఖ్యమంత్రి కేసిఆర్ అప్రమత్తతతో బిజేపి బిత్తరపోయింది. తెలంగాణ రాజకీయాల జోలికి వెళ్లాలంటే మన బలం సరిపోదని ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని‌ తెలంగాణ వాదులంటున్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు హితవు పలుకుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *