Headlines

పట్టుబడినా పనిష్మెంట్‌ లేదా!?


` దొరికినా వాళ్లింకా నిజాయితీ పరులేనా?
` రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖలో సస్పెండైన వారిపై చర్యలు తీసుకోరా..?
` ఎక్కడ మా మేడకు చుట్టుకుంటుందో నని ఎలాంటి దర్యాప్తు లేకుండానే వదిలేస్తారా?
` కావాలనే కాలయాపన చేస్తూ అక్రమార్కులకు ప్రోత్సాహమా..?


` కమీషనర్‌ గారు ఒక్కసారి ఇటువైపు చూడండి
` పూర్తి లెక్కలు తీయించండి?
` సస్పెండ్‌ అయినవారి సంగతి తెల్చాలనే డిమాండ్‌
` తిరిగి విధుల్లో చేరేందుకు ప్రయత్నాలు.. మరిచిన జిల్లా పెద్దలు..?
` ఆరోపణలు ఎదుర్కొంటూ కూడా పద్దతి మార్చుకోని వారిపై ఓ కన్నేయండి?
హైదరాబాద్‌ , నేటిధాత్రి :
ఆస్ధి…ఈ మాట వినగానే ఎవరికైనా ఒక ధైర్యం. ఒక భరోసా…అది నివాసమైనా, సాగు భూమైనా జీవితానికి సంబంధించినది. ఆకలి తీర్చుతుంది. ఆపదలో ఆదుకుంటుంది. అందుకే అలాంటి ఆస్ధులలో స్ధిరాస్ధులు అన్నవి ఎంతో కీలకం. అలాంటి వాటిని తమ సొంతం చేసుకోవడానికి, వాటిపై యాజమాన్య హక్కులు సాధించుకోవడం అవసరం. అందుకోసం ప్రభుత్వానికి అవసరమైన చెల్పింపులు చెల్లించి, రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే తమదైపోతుంది. తమ ఆస్దిగా స్ధిరపడిపోతుంది. ఇక్కడే దళారులకు, రిజిస్ట్రేషన్‌ అధికారులకు పండగ. సహజంగా క్రయ విక్రయ ప్రక్రియలు సమాజంలో సహజం. పైగా రియలెస్టేట్‌ వ్యాపారం విపరీతంగా పెరగడంతో రిజిస్ట్రేషన్ల శాఖకు తాకిడిపెరిగింది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులలో రిజిస్ట్రేషన్ల శాఖ అంత్యంత కీలకమైంది. రాజుల కాలం నుంచైనా సరే భూమి శిస్తు అన్నది అత్యంత ప్రధానం. ఇప్పుడు అదే కొనసాగుతోంది. ఎవరి స్ధిరాస్ధి వారిదే అన్నది రుజువుకు ఇదే ఆధారం. అందులో మార్పులు, చేర్చులు, చేతులు మారడాలు అన్నది జరిగిన ప్రతీసారి రిజిస్ట్రేషన్‌ తప్పని సరి.
ఇదే ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేది. దాంతో ప్రతి వ్యక్తి రిజిస్ట్రేషన్‌ కార్యాయలం గుమ్మం తొక్కాల్సిందే. ముడుపులు చెల్లించాల్సిందే. కాగితాలు ఎంత పక్కాగా వున్నా సరే…అక్కడ ఆమ్యామ్యాలు చెల్లించకపోతే ఫైలు కదిలే సమమస్యే లేదు. ఏదో ఒక తిరకాసు సృష్టించాల్సిందే ముక్కు పిండి వసూలు చేయాల్సిందే. స్టాంపు వెండర్‌ దగ్గర నుంచి మొదలు, డాక్యుమెంటు రైటర్‌, సబ్‌ రిజిస్ధ్రార్‌ దాక. మధ్యవర్తులు, సబ్‌ రిజిస్ట్రార్‌లు ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు సైన్యాలు ఇంత మందిని సంతృప్తి పరిస్తే తప్ప, డాక్యుమెంటు మీద సంతకం పడదు. నీ చేతికి రాదు. ఇదీ జనం అవస్ధలు. ఈ అవస్ధలు అందరికీ తెలిసినే…అయితే అప్పుడప్పుడు మేం వున్నామంటూ ఓసారి ఏసిబి దాడులు. ఇంత వరకు బాగానే వుంది. సస్పెండ్‌ చేసినట్లు ఓ ముక్క చెప్పడం…వదిలేయడం రిజిస్రేషన్ల శాఖలో పరిపాటిగా మారింది. వారి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా తక్కువేం లేదు.
` వరంగల్‌లో సస్పెండైన వారిపై కానరాని చర్యలు
వరంగల్‌లోనే సంపత్‌ కుమార్‌, రాంచంద్రయ్య, శ్రీనివాస్‌, సురేంద్రబాబు నలుగురు సస్పెండ్‌ అయ్యారు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా అనేక మంది రిజిస్ట్రార్‌లు పట్టుబడ్డారు. అందులో ఏదో చిన్న చిన్న మొత్తంతో కాదు, ఏకంగా లక్షల రూపాయలుతో కూడా పట్టుబడిన వారున్నారు. వారిలో రాజేంద్రనగర్‌కు చెందిన సబ్‌ రిజిస్ట్రార్‌ అర్షద్‌ అలీ ఏకంగా రూ.50 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. ఆయనకు సహకరించిన డాక్యుమెంటు రైటర్‌ వాసును కూడా ఏసిబి వాళ్లు పట్టుకున్నారు. కాని ఏమైంది. దర్యాప్తు ఎంత వరకు వచ్చింది. అన్నది ఎప్పుడో మర్చిపోయారు. దాని మూలాలు వెతకడం వదిలేశారు. గత ఏడాది సెప్టెంబర్‌ 7న బాలానగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ నిజాముద్దీన్‌ ఏసిబికి పట్టుబడ్డారు. రూ.75వేలు తీసుకుంటుంటగా ఏబిసి వల వేసి పట్టుకున్నది. కాని ఏమైంది. ఏం కాలేదు. ఆ తర్వాత ఫైలు ముందుకు కదల్లేదు. ఆయనపై విచారణ పెద్దగా సాగింది లేదు.
ఇటీవల కాలంలో యాదాద్రి లోనూ సబ్‌ రిజిస్ట్రార్‌ కాలం కలిసొచ్చిందనుకున్నాడో ఏమో! ఇక అడ్డగోలు సంపాదనకు ఎగబడ్డాడు. పరిసర ప్రాంతాల్లో భూములకు పెద్దఎత్తున డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. నగరానికి దగ్గర కావడంతోపాటు, యాదాద్రి పేరుతో నూతన ఆలయ నిర్మాణం జరగడంతో అక్కడ ప్రాంతాలకు ఒక్కసారిగా రియలెస్టేట్‌ భూమ్‌ వచ్చేసింది. సహజంగా యాదాద్రి చుట్టుపక్కల భూముల ధరలు రాత్రికి రాత్రి విపరీతంగా పెరిగాయి. హెచ్‌ఎండీఏ పరిధిలోకి ఆ ప్రాంతాన్ని చేర్చాక మరీ రియలెస్టేట్‌ వ్యాపారం విపరీతంగా పెరిగింది. ఎక్కడ చూసినా వెంచర్లు ఏర్పాటు చేశారు. ప్లాట్ల విక్రయాలు నిత్యం జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక ప్రాంతం అభివృద్ధి చెందుతుండడంతో, అక్కడ భూములు కొనేసుకునేందుకు ఎంతో మంది పెట్టుబడులు పెడుతున్నారు. ఇది రిజిస్రేషన్ల శాఖకు వరమైంది. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది.
` యాదాద్రి సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌
ఇదే సమయంలో యాదాద్రి సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌ ఏకంగా దుకాణమే తెరిచినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. రైతులు, వ్యాపారులు, సామాన్యుల నుంచి పెద్దఎత్తున రిజిస్ట్రేషన్‌ పేరిట వసూలు చేస్తున్నారని ఏసిబికి ఉప్పందింది. దాంతో వాళ్లు రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనే సోదాలు చేసి దేవానంద్‌ను పట్టుకున్నారు. రియల్టర్‌ను బెదిరించి మరీ వసూలు పేరుతో డాక్యుమెంటు రైటర్‌ వసూలు చేయడాన్ని ఏసిబి రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌ను సస్పెండ్‌ చేశారు. పైగా అదే సబ్‌ రిజిస్ట్రార్‌ ఇంట్లోకూడా పెద్దఎత్తున సోదాలు నిర్వహించి భారీగా నగదు కూడా, డాక్యుమెంటు, ఆస్ధులు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. భువనగిరి ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వర్లుపై కూడా వేటు పడిరది. ఈయన పరిస్థితి మరీ విచిత్రం. ఆయన ఏకంగా అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్ల చేయడం. రాత్రిళ్లు కూడా కార్యాలయంలోనే వుంటుండడం… పెద్దఎత్తున చీకటి సమయంలో అక్రమ రిజిస్రేషన్లు చేస్తున్నట్లు తెలిసి, ఏబిసి రైడ్‌ చేసి మరీ పట్టుకున్నది. అక్కడ అక్రమంగా ఏకంగా 400పైగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు వెల్లడైంది.
` మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ అప్పారావు
వీళ్లే కాదు మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ అప్పారావు ఆ మధ్యే సస్పెండ్‌ అయ్యారు. లక్సెట్టిపేట ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ రతన్‌ ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఇక ఆదిలాబాద్‌ జిల్లాలోనూ నలుగురు రిజిస్ట్రార్‌లతోపాటు, ఇతర సిబ్బంది సస్పెండ్‌ అయివున్నారు. కాని వారిపై చర్యలు మాత్రం తీసుకున్నది లేదు. ఇలా ఇంత మంది సబ్‌ రిజిస్ట్రార్‌లు పట్టుబడినా వారిపై శాఖాపరమైన చర్యలు లేవు. వారికి శిక్షలు లేవు. సస్పెండ్‌ పేరుతో ఉద్యోగానికి కొంత కాలం మాత్రమే దూరం చేస్తున్నారు. అంటే తర్వాత ఎప్పుడో అదును చూసి వారికి తిరిగి విధులు అప్పగించడానికే అన్నది ఇక్కడ స్పష్టమౌతోంది. పైగా కాలం గడిస్తే, ఆయనది తప్పేం లేదన్నట్లు కూడా రికార్డులు సృష్టించే అవకాశాలు లేకపోలేదు. అంతా పై అధికారుల చేతుల్లో పని. వారు కూడా కనికరిస్తే చాలు మళ్లీ ఉద్యోగంలో చేరడం పెద్ద పని కాదు. సాక్ష్యాత్తు వారు ఏసిబి వలలో చిక్కినా వారికి ఎప్పుడైనా మళ్లీ పోస్టింగులు రావొచ్చన్న మాటే డిపార్టుమెంట్లో చెబుతున్నారే గాని, వారికి శిక్ష పడుతుందన్న మాట ఎవరి నుంచి రావడంలేదు. వారి మీద ఎలాంటి శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించినా పై వారి లీలలు కూడా బైట పెట్టేందేకు సస్పెండ్‌ అయిన ఉద్యోగులు వారి గుట్టు బైట పెట్టేందుకు సిద్దపడుతున్నట్లు కూడా సమాచారం అందుతోంది. అందుకే సస్పెండ్‌ అయిన వారి పట్ల ఉదాసీతన కనబర్చుతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. మొండికిపోయి వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు ధైర్యం చేయలేకపోతున్నారంటే వారి పాత్ర ఎంత వుందనేది కూడా ఇక్కడే స్పష్టమౌతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాలం గడిస్తే అంతా సర్ధుకుంటుంది. లేకుంటే మన మెడకు చుట్టుకుంటుంది. ఎందుకు తొందరపడడం అన్న ఆలోచనలతో చాలా మంది పై అధికారులు కాలయాపనపైనే మొగ్గు చూపుతున్నారని సమాచారం. అందుకే పూర్తి స్ధాయి ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వం కూడా తాజాగా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నది. సంబంధిత శాఖ కమీషన్‌ శేషాద్రి అధ్యక్షతన ఉన్నత స్ధాయి కమిటీ కూడా ఏర్పాటైంది. దాంతో సస్పెండ్‌ అయిన స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖలో వారి పరిస్థితి కథ కంచి చేరొచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇక విపరీతమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై కూడా పెద్దఎత్తున చర్యలు తీసుకునేందుకు కూడా కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఎందుకైనా మంచిది కమీషనర్‌ ముందు తన శాఖనుంచే ప్రక్షాళన మొదలు పెడితే మరింత రసవత్తరంగా వుంటుంది. అవినీతి పరుల ఆట కట్టినట్లైతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *