నిన్ను నమ్మం బాబు! 

`పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

`నిన్న తెలంగాణలో నాకేం పని అన్నావ్‌!

`ఇప్పుడెందుకు వస్తున్నావ్‌?

`స్వార్థానికి నిలువెత్తు సాక్ష్యం చంద్రబాబు.

`కుటిల నీతికి సోదరుడు చంద్రబాబు. 

`తెలంగాణ అంటేనే ఓర్వలేని వ్యక్తి చంద్రబాబు.

`కపటనాటకాలకు పెట్టింది పేరు చంద్రబాబు.

`తెలంగాణ ఎప్పుడూ నిన్ను నమ్మడానికి సిద్ధంగా లేదు!

`తెలంగాణ లో చెల్లని కాసువే నువ్వు!

`ఆంధ్రలో ఏడుపులు, వేడుకోలు!

`తెలంగాణలో కోతల మీద కోతలు…బడాయి మాటలు.

`మళ్ళీ తెలంగాణలో అధికారంపై పగటి కలలు.

`పేరు తెలంగాణ నేతలది…పెత్తనం చంద్రబాబుది.

`ఎన్నటికైనా చంద్రబాబుది మోసపు రాజకీయమే!

`ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను వెనక్కి తెచ్చే దమ్ముందా?

`జై తెలంగాణ అనేందుకు నోరొస్తుందా?

`తెలంగాణ రైతులకు ఏనాడైనా మేలు చేశావా?

`తెలంగాణ ను ఎండబెట్టింది నువ్వు కాదా?

`సీలేరులో తెలంగాణకు వాటా లేకుండా చేసింది నిజం కాదా!

`రాష్ట్రం వచ్చాక తెలంగాణ ను అస్థిర పర్చాలని చూసిందే నువ్వు కదా!

`తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసింది ప్రజలు అప్పుడే మర్చిపోయారనుకుంటున్నారా!

`తెలంగాణ రాకుంటే ప్రాజెక్టులు వచ్చేవా?

`తెలంగాణ సస్యశ్యామలమయ్యేదా!

`రేవంత్‌ రెడ్డి అన్నట్లు తెలంగాణ రాజకీయాలు తెలంగాణ నాయకులు చూసుకుంటారు.

`షర్మిలకు తెలంగాణలో ఏం పని అడిగిన రేవంత్‌ చంద్రబాబును అపగలడా?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఇక తెలంగాణలో నాకేం పని. తెలంగాణ రాజకీయాలతో నాకేం అవసరం. అంటూ ఒకనాడు తెలంగాణ తెలుగుదేశం పార్టీని వదిలేసి, తన స్వార్థం చూసున్న చంద్రబాబుకు ఇప్పుడు తెలంగాణ తో ఏం పని…తెలంగాణ ప్రాంత ఏడు మండలాలను ప్రధాని నరేంద్ర మోడి మొదటి క్యాబినెట్‌ మీటింగ్‌ లోనే ఆంద్రలో కలిపేసుకొని ఇప్పుడు ఖమ్మం మీద ప్రేమ ఒలకబోస్తే నమ్ముతారా? పోలవరం డిజైన్‌ మార్చి భద్రాచలం మునిగిపోవడానికి కారణమైంది మీరు కాదా? తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పర్చే కుట్ర చేసి, ఎన్నికైన తెలంగాణ తెలుగు దేశం ఎమ్మెల్యేలను గాలికి వదిలేసింది నిజం కాదా? తెలంగాణలో వున్న ఆంద్రా ప్రజలకు అన్యాయం అంటూ అనుక్షణం అసత్యాలు, అర్థ సత్యాలు ప్రచారం చేసి, ప్రజల మధ్య దూరం పెంచాలని చంద్రబాబు చూశాడు. కాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌, అధికారంలోకి రాగానే ఆంద్రా ప్రజలను కడుపులో పెట్టుకొని చూస్తానని మాటిచ్చాడు. వారి కాళ్లలో ముళ్లు దిగినా పంటితో తీస్తానన్నాడు. అలా వారి యోగ క్షేమాలు చూసుకుంటున్నాడు. అదీ రాజనీజ్ఞుడైన నాయకుడికి వుండాల్సిన లక్షణం. చంద్రబాబు అందుకు పూర్తి విరుద్ధం. చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతన వుండదు. ఆయనకు ఎవరి మీద నమ్మకం వుండదు. ఆయనపై ఎవరికీ నమ్మకం లేకుండా చేసుకుంటాడు. ఇప్పుడు ఆంద్రప్రదేశ్‌ లో రాజకీయాలలో భవిష్యత్తు అంధకారం కావడంతో మళ్లీ తెలంగాణ లో చిచ్చుపెట్టే రాజకీయాల కోసం వస్తున్నాడు? అంటూ చంద్రబాబు ను తూర్పార పడుతున్న పరకాల టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో మనసులో మాట…నిన్ను నమ్మం బాబు! అని ఆంద్రప్రదేశ్‌ ప్రజలు గత ఎన్నికలలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తెలుగు దేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడిరచారు.

ఇక అక్కడ ఏమీ మిగల లేదు. రాజకీయం చేసే అవకాశం కనిపించడం లేదు. ఎక్కడికెళ్లినా చీత్కారాలే ఎదురౌతున్నాయి. మొహం మీదే ప్రజలు నీ అవసరం మాకు లేదు బాబు…అంటున్నారు. అక్కడి ప్రభుత్వాన్ని నిలదీయలేక, ఎండగట్టలేక, తెలుగు దేశం పార్టీ స్థానమేమిటో అర్థం కాక, వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు తెలంగాణ ప్రజల కన్నీళ్లు తుడుస్తాడట. తన కష్టాన్నే గట్టిక్కించుకోలేక, కన్నీళ్లు పెట్టుకొని, ముదిమి వయసులో ప్రదర్శించాల్సిన గాంభీర్యం వదిలేసిన చంద్రబాబుకు రాజకీయాలు అవసరమా? ఆంద్రప్రదేశ్‌ కు ఏం వెలగబెట్టావని తెలంగాణకు రావాలనుకుంటున్నాడో చంద్రబాబు కే క్లారిటీ లేదు. ఒక నాడు రెండు కళ్ల సిద్దాంతం ముసుగులో తెలంగాణ చేసిన అన్యాయం ప్రజలు అప్పుడే మర్చిపోయారని అనుకుంటున్నారా?అయినా నిజమైన పోరాట యోధుడు ఎక్కడ ఓడిపోయాడో అక్కడ మళ్లీ గెలిచి నిలబడాలి. పారిపోయి వచ్చి, తలదాచుకునే చోట తొడగొడితే చెండాలంగా వుంటుంది. ప్రజలు చీదరించుకునే దాకా వస్తుంది. తెలంగాణ ఎప్పుడూ నమ్మడానికి సిద్ధంగా లేదు!తెలంగాణ లో చెల్లని కాసువే నువ్వు! ఆంధ్రలో ఏడుపులు, వేడుకోలు!తెలంగాణలో కోతల మీద కోతలు…బడాయి మాటలు. మళ్ళీ తెలంగాణలో అధికారంపై పగటి కలలు. పేరు తెలంగాణ నేతలది…పెత్తనం చంద్రబాబుది. ఎన్నటికైనా చంద్రబాబుది మోసపు రాజకీయమే! ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను వెనక్కి తెచ్చే దమ్ముందా? ఆంద్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా సాధించలేని అసమర్థ నేతవు. అని ప్రజలు ఏనాడో చీకొట్టారు. తెలంగాణకు అన్యాయం చేశావని దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు తిట్టుకుంటున్నారు. అయినా నీతిమాలిన తనం వదులు కోవా? వాస్తవంలో బతకలేవా??

జై తెలంగాణ అనేందుకు నోరొస్తుందా? సరే ఖమ్మంలో తెలుగు దేశం పార్టీ సభ పెట్టారు. మరి జై తెలంగాణ అన్నారా? కనీసం అనాలన్న మనసన్నా వచ్చిందా? ఆ సంకుచిత మనస్తత్వమే చంద్రబాబు జాతీయ నాయకుడు కాకుండా చేసింది. ఏది చేసినా కేసిఆర్‌ లాగా ధైర్యంగా చెప్పగలగాలి. ఓసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ మంత్రి రోజా ఇంటిలో ఆతిధ్యం తీసుకున్న సందర్భంలో ఆంద్ర ప్రదేశ్‌ రైతులు కూడా సంతోషంగా వుండాలని కోరుకున్నారు. కృష్ణా నది మిగులు జలాలు రాయలసీమ రైతులకు అందాలన్న సూచన కూడా చేశాడు. నాయకుడు అంటే అలా బ్రాడ్‌ మైండెడ్‌ గా వుండాలి. తెలంగాణ సాధన వరకే కేసిఆర్‌ పంతం సాగింది. ప్రజల ప్రయోజనాల విషయంలో అందరూ ఒక్కటే అంటారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుండడంతో కేసిఆర్‌ ఉద్యమం చేశారు. ఆంద్ర ప్రదేశ్‌ ప్రజలకు వ్యతిరేకంగా కాదు. ఈ మాత్రం పరిజ్ఞానం లేని చంద్రబాబు అన్ని ప్రాంతాల ప్రజలను ప్రేమించలేకపోయారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, ప్రాంత అభివృద్ధిని చంద్రబాబు కాంక్షించలేకపోయాడు. తెలంగాణ అభివృద్ధి చేసింది నేనే అంటాడు. తెలంగాణ రాక ముందు తెలంగాణ ఐటిలో తెలంగాణ యువత భాగస్వామ్యం ఎంత? అన్నది ఒక్క తెలంగాణ సమాజానికే తెలుసు. అందుకే చంద్రబాబు అంటే తెలంగాణ లోని అన్ని వర్గాల ప్రజలు చీకొడతారు. పరిపాలనలో సిఈఓ అని పేరు తెచ్చుకున్నాడే గాని, ప్రజల బాగోగులు చూసిన సంక్షేమ నాయకుడు అన్న పేరు మాత్రం లేకుండా చేసుకున్నాడు. 2004 లో ఉమ్మడి రాష్ట్రంలో అధికారం కోల్పోయి, మీ కోసం అంటూ బస్సు యాత్ర చేశాడు. కానీ ప్రజలు ఆదరించలేదు. ఇక చివరికి పాదయాత్ర చేశాడు. పదేళ్ల పాటు ప్రజలు దూరం పెట్టిన చంద్రబాబు ను మళ్లీ రాష్ట్రం విడిపోయాక 2014 నమ్మారు. అయినా ఆయన మారలేదు. ఆంద్రప్రదేశ్‌ భవిష్యత్తు ఆగమ్యగోచరం చేశాడు. గ్రాఫిక్స్‌ చూపించి ప్రజలను బురిడీ కొట్టించాడు. నిధులు నీళ్లలా ఖర్చు చేశాడు. కట్టిన నిర్మాణాలు తాత్కాలికం అన్నాడు. ప్రజలు కూడా తనని తాత్కాలిక అవసరాల కోసమే ఎన్నుకున్నారని తెలుసుకోలేకపోయాయి. ప్రతిపక్ష పాత్రకు కూడా చంద్రబాబు పనికి రాడని విసిరేశారు. ఇప్పుడు తగుదునమ్మా అని తెలంగాణ ముందు మోకరిల్లుతున్నాడు. ఆంద్రప్రదేశ్‌ లో ఆఖరి అవకాశం అని ఎంత మొత్తుకుంటున్నా జనం చంద్రబాబు మొహం చూడడం లేదు. కనీసం తెలంగాణ ప్రజలైనా కనికరిస్తారేమో…అన్న ఆశతో అడుగుపెట్టాడు. కానీ తెలంగాణ ప్రజలకు కూడా చంద్రబాబు అంటే ఏమిటో బాగా తెలుసు. తెలంగాణ రైతులకు ఏనాడైనా మేలు చేశావా? తెలంగాణ ను ఎండబెట్టింది నువ్వు కాదా?సీలేరులో తెలంగాణకు వాటా లేకుండా చేసింది నిజం కాదా!రాష్ట్రం వచ్చాక తెలంగాణ ను అస్థిర పర్చాలని చూసిందే కదా! తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసింది ప్రజలు అప్పుడే మర్చిపోయారనుకుంటున్నారా! తెలంగాణ అరవై ఏళ్ల ప్రజల కల. ఆ కల నెరవేరి తెలంగాణ అస్తిత్వం అప్పుడే స్థిరపడుతుంటే, తెలంగాణ ఏర్పాటు విఫలయత్నం అని నిరూపించే కుటిల యత్నం చేసింది చంద్రబాబు కాదా! 

ఉమ్మడి రాష్ట్రం ఇంకా కొనసాగి వుంటే తెలంగాణ సస్యశ్యామలమయ్యేదా! తెలంగాణలో చెరువులు నిండేవా? కాలువలు వచ్చేవా? వాగులు మళ్ళీ పారేవా? ప్రాజెక్టులు కట్టేవారా? కాళేశ్వరం అన్నది వుండేదా? తెలంగాణ24 గంటల కరంటు వుండేదా? రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందేదా? రైతు బంధు వచ్చేదా? రైతు భీమా వుండేదా? కళ్యాణ లక్ష్మి అనేది కలగందుమా? చెరువులు నిండి మత్స్య పరిశ్రమకు తెలంగాణ కేరాఫ్‌ అడ్రస్‌ అయ్యేదా? దళిత బంధు వచ్చునా? గిరిజన బంధుకు ఆస్కారం వుండునా? జిల్లా కో మెడికల్‌ కాలేజీ వచ్చేదా? జిల్లా కో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరిగేదా? తెలంగాణ లో హార్టికల్చర్‌ యూనివర్సిటీ ఏర్పాటయ్యేదా? ఫారెస్ట్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసేవారా? పరిశ్రమలకు నిరంతర విద్యుత్‌ సరఫరా అయ్యేదా? అంతదాకా ఎందుకు రైతులకు అవసరమైన ఎరువుల క్యూలు లేకుండా చేసేవారా? ఆసరా ఫింఛన్లు రూ. 2 వేలు. వచ్చేవా? తెలంగాణ రాకపోతే ఈ పథకాలు లేకపోతే తెలంగాణ ఎలా వుండేదో ఊహించడానికే వీలు లేకుండా వుంటుంది. రేవంత్‌ రెడ్డి అన్నట్లు తెలంగాణ రాజకీయాలు తెలంగాణ నాయకులు చూసుకుంటారు. షర్మిల తెలంగాణ రాజకీయాలలోకి రాగానే వ్యతిరేకించిన నాయకుడు రేవంత్‌ రెడ్డి. మాకు మేం చూసుకుంటాం…నువ్వెందుకు తెలంగాణ రాజకీయాలలో దూరుతున్నావన్నాడు. మరి ఇప్పుడు చంద్రబాబు ను కూడా తెలంగాణ లో నీకేం పని అనాల్సిన అవసరం రేవంత్‌ రెడ్డి కి లేదా? తెలంగాణ కు చంద్రబాబు ఒక్క మంచి పని చేసిన దాఖలాలు లేవు. కరువు జిల్లా పాలమూరును దత్తత తీసుకుంటానని చెప్పి మోసం చేసిన నాయకుడు చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు పేరు చెప్పి, ప్రపంచ బ్యాంకు అప్పు కుప్పలు తెప్పలుగా తెచ్చాడు. పాలమూరు కరువును ఒక్క శాతం కూడా తీర్చలేదు. ఆ నిధులన్నీ అంద్రకు తరలించాడు. పాలమూరు ప్రాజెక్టులకు పైసా ఇవ్వలేదు. అప్పటికే పెండిరగ్‌ ప్రాజెక్టులైన వాటిని ముందట పడనీయలేదు. వాటిని పూర్తి చేయలేదు. పాలమూరు కు నీళ్లియ్యలేదు. కనీసం మంచినీటి కొరత తీర్చలేదు. మరి అంతగా మోసం చేసిన చంద్రబాబు పల్లకి మోసిన వారిలో రేవంత్‌ ముందు వరుస వ్యక్తి. మరి ఇప్పుడు ఆ పార్టీలో లేడు. చంద్రబాబు ను తెలంగాణ లో అడుగు పెట్టకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత రేవంత్‌ రెడ్డి ది. అంతే కాదు అటు జాతీయ స్థాయిలో, ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో బిజేపి తో చంద్రబాబు చేతులు కలుపుతున్నాడు. బిజేపికి మేలు చేసే పనిలో వున్నాడు. తన పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అంటే కాంగ్రెస్‌ కు ప్రత్యక్షంగా నష్టం చేకూర్చుతున్నట్లే కదా! కనీసం శిష్యుడు రేవంత్‌ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం ఎలాంటి త్యాగం చేయలేని, చంద్రబాబు విషయంలో రేవంత్‌ ఎందుకు సైలెంట్‌ గా వున్నట్లు? లోగుట్టు ఏముంది! షర్మిలకు తెలంగాణలో ఏం పని అడిగిన రేవంత్‌ చంద్రబాబును అపగలడా? సాధ్యమయ్యే పనేనా! పైగా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌. ఆ పార్టీకి రేవంత్‌ రెడ్డి అధ్యక్షుడుగా వున్నాడు. కాలం కలిసిరావాలని తాపత్రయ పడుతున్నాడు. కాంగ్రెస్‌ లో ఎంత కష్టమైనా ఓర్చుకుంటున్నాడు. సీనియర్ల వేధింపులు భరిస్తున్నాడు. అడుగడుగునా అడ్డుకుంటున్న సీనియర్లను చూసి బెంబెలెత్తిపోవడం లేదు. తాజాగా కూడా సీనియర్లు రేవంత్‌ రెడ్డి అనుచర వర్గాన్ని టార్గెట్‌ చేసింది. వలస వాదులకే పదవులని సీనియర్లు కారడ్డమాడారు. వారిని మానసికంగా ఇబ్బంది పెట్టారు. పదవుల వదులుకునేలా చేశారు. అయినా రేవంత్‌ రెడ్డి తట్డుకొనే నిలబడుతున్నాడు. జనవరి లో పాదయాత్ర అంటున్నాడు. ఈ సమయంలో చంద్రబాబు తెలంగాణ రాజకీయాలలో వేలుపెడుతున్నాడు. అంతిమంగా చంద్రబాబు రాజకీయం కూడా రేవంత్‌ కు నష్టం చేకూర్చేదే…కాంగ్రెస్‌ లో సీనియర్‌ వర్గం రేవంత్‌ కు సపోర్ట్‌ చేయదు. వలస వాదులన్న ముద్ర వేయించుకున్న వాళ్లు టిడిపి వైపు చూస్తే అసలు గండం రేవంత్‌ రెడ్డి కే…మరి ఇది ఆలోచించాడా? లేదా! ఇప్పటికైనా రేవంత్‌ రెడ్డి తేరుకొని టిడిపి రాజకీయాలను అడ్డుకోకపోతే అసలైన కోవర్టు అనే ముద్ర వేసుకోవాల్సిందే. లేకపోతే కాంగ్రెస్‌ ను వీడలేక, టిడిపి లో చేరలేక, కొత్త కుంపటి పెట్టుకోలేక ఎన్నికల ముందు అవస్థలే కాదు, రాజకీయ జీవితానికి బైబై చెప్పుకోవాల్సిన అవసరం కూడా రావొచ్చు. లేకుంటే మళ్ళీ ఎన్నికల నాటికి నా అదృష్టం అనుకుంటూ ఎక్కడో అక్కడ కొనసాగాల్సిందే…చంద్రబాబు ను మళ్ళీ నమ్మితే తెలంగాణ వంద సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. అయినా ప్రాంతం మీద ప్రేమ మన వాళ్లకుంటుంది. మన నాయకులకు వుంటుంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ కు వుంటుంది. బిఆర్‌ఎస్‌ పార్టీకి వుంటుంది. పరాయి నాయకులకు దోచుకోవాలని వుంటుంది. మళ్ళీ తెలంగాణను అతలాకుతలం చేయాలన్న దుర్మార్గం గూడుకట్టుకొని వుంటుంది. అందుకే తెలంగాణ ఎవరమూ చంద్రబాబు ను నమ్మం…చంద్రబాబు చరిత్ర గతం…ఆయన రాజకీయ జీవితం మిద్య…అనవసర ప్రయాస తప్ప మిగిలేదేమీ వుండదు. టూరిస్ట్‌ జీవితం గడపక తప్పదు. ప్రాంతేతర నాయకులను నమ్మి అరవై ఏళ్లు మోసపోయి, గోస పడ్డ గడ్డ తెలంగాణ. అలాంటి గడ్డ మీద గద్దల్లా వాలేందుకు వచ్చేవారిని నమ్మం…! చంద్రబాబు ను తెలంగాణ ప్రజలు అసలే నమ్మరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!