నాయకుల స్వార్థం… కార్యకర్తలకు శాపం!

https://epaper.netidhatri.com/

`ప్రజల కోసం అంటూ పార్టీ మారిన వాళ్లు చేసిన అభివృద్ధి ఎంత?

`కార్యకర్తల అభీష్టం మేరకు అని చెప్పి వారికి ఉపయోగపడిరదెంత?

`పేరు కార్యకర్తలది పెత్తనం నేతలది?

`నేతి బీరకాయలో నెయ్యి వుండదు…నాయకుడి మాటలో నిజముండదు?

`పార్టీ మార్పుపై కార్యకర్తల పేరు చెప్పే అభిప్రాయం డొల్ల?

`కార్యకర్తల ముందు కొత్త పార్టీ షరతులు ఎందుకు మాట్లాడరు?

`బేషరతుగా అనే అబద్దాలు ఎందుకు చెబుతారు?

`పార్టీ మారే నాయకులు నాతో పాటు తన అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతారా?

`భవిష్యత్తులో ఇంత మంది తన అనుచరులకు పదవులివ్వాలని షరతు పెడతారా?

`మీ ముందు ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎదగనిస్తారా?

`అలా ఎదిగితే సహిస్తారా? అంతా హంబక్‌!

`కార్యకర్తల మీద ప్రేమా లేదు…అనుచరుల మీద అభిమానం వుండదు?

`తన పదవి కోసం తప్ప పక్క వారి గురించి ఆలోచనే చేయరు?

`కార్యకర్తలు ముందు ఈ విషయం తెలుసుకోవాలి?

`అన్ని పార్టీలు ఆ తాను ముక్కలే!

`కార్యకర్తలకు విలువ అన్నది మైసూరు బోండాలో కనిపించని మైసూరే!

`అంతా మసిబూసి మారేడు కాయ చేయడమే?

హైదరబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికలకు ముందే గత ఎన్నికల సమయంలో అభ్యర్ధులు ప్రకటన చేసినట్లే, ఈసారి కూడా బిఆర్‌ఎస్‌ అభ్యర్ధుల ప్రకటన చేయడంతో ఒక్కసాగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎవరు ఏ పార్టీలో వున్నారో..వుంటున్నారో..వుంటారో కూడా అర్ధంకాని అయోమయ పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఒక్క బిఆర్‌ఎస్‌ ఎంతో ధైర్యంగా అభ్యర్థుల ప్రకటన చేసినప్పటికీ బిజేపి, కాంగ్రెస్‌లు ఇంకా మల్ల గుల్లాలు పడుతున్నాయి. ఎన్నికలకు ఆరు నెలల మందే అభ్యర్ధులను ప్రకటిస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ ఇంకా వడపోత కార్యక్రమంలోనే వుంది. ఇంకా బిజేపి నుంచి ఎవరొస్తారా? అని ఎదురుచూస్తోంది. బిఆర్‌ఎస్‌ నుంచి ఎవరైనా రాకపోతారా? అనుకొని ఆగుతోంది. ఓ వైపు సీనియర్లు అభ్యర్ధుల ప్రకటన కాలయాపనపై గుర్రుగా వున్నారు. రేవంత్‌ రెడ్డి మొత్తం తన వర్గానికి సీట్లు ఇచ్చుకునే ఎత్తుగడలో వున్నాడు. దాంతో పాత తెలుగుదేశం నాయకులను ఇప్పటికే నింపేసిన రేవంత్‌రెడ్డి, ఇంకా ఎవరైనా వస్తే కూడ వాటిని కూడ తన ఖాతాలో వేసుకొని కాలం కలిసొస్తే భవిష్యత్తు పునాదులు బలంగా వేసుకోవాలని చూస్తున్నారు. ఇక బిజేపిలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్ధం కాకుండాపోయింది. అంతా అయోమయం జగన్నాధం అన్నట్లు సాగుతోంది. కర్నాకట ఎన్నికల ముందు ఎంతో బలంగా వున్నట్లు కనిపించిన బిజేపి, ఒక్కసారిగా కమలానికి వున్న రెక్కలు విడిపోతున్నాయి. ఎంతో కొంత బండి సంజయ్‌ వున్నంత కాలం పార్టీ బలంగానే వున్నట్లు కనిపించింది. కర్నాకట ఎన్నికల ఫలితాలతో డీలా పడిరది. కిషన్‌ రెడ్డి పార్టీ అధ్యక్షుడు కావడంతో కమలం వాడిపోయినంత పనౌతోంది. ఎన్నికల దాకా అసలు బిజేపిలో వుండేవారు ఎంత మంది, వెళ్లే వారు ఎంత మంది అన్నదానిపై ఎవరికీ అంతుపట్టకుండాపోతోంది. ఒక దశలో పోలోమని కాంగ్రెస్‌ ను వీడి బిజేపిలోకి వచ్చిన నాయకులంతా మళ్లీ యూటర్న్‌ తీసుకుంటున్నారు. అందులో ఎంతో అనుభవం వున్న నాయకులు కూడా వున్నారు. అసలు దేశంలో కాంగ్రెస్‌కు ఇక రోజులు లేవు అని చెప్పి బిజేపిలో చేరిన వారు కూడా తిరగి యూటర్న్‌ తీసుకుంటున్నారు. బిజేపికి కాలం లేదని ప్రకటిస్తున్నారు. ప్రజల్లో ఆదరణ లేదని ముందే తేల్చేస్తున్నారు. ప్రజల్లో బలం లేదు. పలుకుబడి లేదు. ప్రజల్లో బిజేపి అంటే విశ్వాసం లేదని ఆ పార్టీలో వుంటూనే కొందరు మాట్లాడుతున్నారు. ఇదిలా వుంటే నివురు గప్పిన నిప్పులా అసంతృప్తి, అసమ్మతి బాగానే పెరుగుతూ వుంది. ఇది ఎటు దారి తీసినా పార్టీ వీడి భవష్యత్తు రాజకీయం కోసం నాయకులు వెతుకులాట మొదలుపెడుతున్నారు. అయితే ఇక్కడ పార్టీల పరిస్ధితి చెప్పాల్సి వస్తే అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్ధితి వుంది. అభ్యర్ధుల ప్రకటన తర్వాత బిఆర్‌ఎస్‌లో కూడా అమస్మతి తక్కువేం లేదు. కాంగ్రెస్‌లో లుకలుకలకు కొదువ లేదు. బిజేపిలో ఆధిపత్య పోరు తక్కువేం కాదు.
నాయకులు తమ స్వార్ధంకోసం పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.
ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కాకపోవచ్చన్న ఆలోచన ఈసారి చాల మంది నేతల్లో వుంది. అందుకే ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యే కావాలని చాలా మంది నాయకులు కోరుకుంటున్నారు. ఈసారి ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలన్నది కొందరి కోరిక. నిన్నటి దాకా ఎమ్మెల్యేగా వుండి కూడా ప్రజల్లో వ్యతిరేక ఎదురైన వాళ్లు కూడా మళ్లీ నాకే టిక్కెట్‌ కావాలంటున్నారు. ఇలా నాయకులు ఎవరు టికెట్‌ ఇస్తే వాళ్లపార్టీకి మారేందుకు కూడా సిద్దంగా వుంటున్నారు. ఇలాంటి రాజకీయాలు గతంలో లేవు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి వుండేవారు. జీవితాంతం ఒకే పార్టీలో వుండేవారు. కార్యకర్తలను, నాయకులకు తగిన గుర్తింపునిచ్చేవారు. ఇప్పుడు ఆ కాలం పోయింది. కార్యకర్తలు అనేవారు కార్యకర్తలుగానే మిగిలిపోవాలి. నాయకులుగా ఎదిగినా అది మండల స్ధాయి దాకా కూడా రాకుండా చూసుకోవాలి. ఒకే చోట నలుగురు నాయకుల మధ్య అగాధం పెంచాలి. విభజించి పాలించే సూత్రం అనుసరించాలి. ఇలా కింది స్దాయి నుంచి అనుసరిస్తున్న నీతినే పై స్దాయిలో కూడా అనుసరిస్తున్నారు. మొత్తంగా రాజకీయాలను తమ గుప్పిట్లో పెట్టుకొని ఏలుతున్నారు. తమకు అన్యాయం జరిగితే కార్యకర్తలకు అన్యాయం జరిగిందన్నంతగా ప్రచారం సాగిస్తున్నారు. కార్యకర్తలను ముందు పెడుతున్నారు. సీట్ల రాజకీయాలు సాగిస్తున్నారు.
ఒక్కసారి బాగా ఆలోచిస్తే ప్రజల కోసం పార్టీ మారాల్సి వచ్చిందన్న మాట చెప్పిన నాయకులు ఆ ప్రజల కోసం ఎంత పని చేశారన్నది కూడా ఒకసారి బేరీజు వేసుకోవాలి.
లేకుంటే ఇదే ఆనవాయితీని నాయకులు ఎప్పుడూ అనుసరించే ప్రమాదం వుంది. ఓ పార్టీలో గెలవడం మరోపార్టీలోకి వెళ్లడం. ఎన్నిక లు సమీస్తున్న తరుణంలో తాను వున్న పార్టీ బలంగా లేదంటే మరో పార్టీకి మారడం. ఇదే ఇప్పుడు అసలైన రాజకీయంగా మారిపోయింది. ఇక మరి కొందరు నాయకులు కార్యకర్తల నిర్ణయం మేరకు పార్టీ మారుతున్నానంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. కార్యకర్తల ఆలోచనల మేరకు పార్టీలు మారుతున్నామంటూ చెబుతున్న నేతలు ఎంత మంది కార్యకర్తల జీవితాలు నిలబెట్టారన్నది కూడా తెలియాల్సిన అవసరం వుంది. గతంలో ఒక పార్టీలో కార్యకర్తగా చేరిన వ్యక్తి కొంత కాలానికి నాయకుడిగానో, లేదా కాంట్రాక్టర్‌గానో మారేందుకు నాయకులు సహకరించేవారు. కాని ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. గతంలో సైకిల్‌పై తిరిగిన కార్యకర్తలు స్కూటర్ల మీద తిరుగుతున్నారన్న మాటలు వినిపించేవి. మరి ఇప్పుడు సామాన్య కార్యకర్తలు ఎంత మంది కార్లలో తిరుగుతున్నారన్నది కూడా ఓసారి మననం చేసుకోవాలి. కార్యకర్తలు ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలి. పార్టీ కోసం కష్టపడాలి. నాయకులను అందలమెక్కించాలి. లేకుంటే కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేయాలి. కార్యకర్త అనే వాడికి నోరు లేకుండాచేస్తున్నారు. మనోభావాలు లేవని గుర్తించేలా చేస్తున్నారు. పదవులు మీద ఆశలు లేకుండాచేస్తున్నారు. బతికినంత కాలం కార్యకర్తగా నాయకుల కుటుంబాల నుంచి వచ్చే రేపటి తరానికి కూడా ఊడిగం చేసే కూలీలుగా మార్చుతున్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో సంబధించినది కాదు. అన్ని పార్టీలు ఇలాగే వున్నాయి. గత యాభై ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్న కుటుంబాలే ఇప్పుడూ పెత్తనం చేస్తున్నాయి. తర్వాత తరమైనా అదే కుటుంబం నుంచి పల్లకి ఎక్కుతున్నారు. ఊరేగుతున్నారు. బోయిలు మాత్రం పల్లకి మోయడంతోనే జీవితం చాలిస్తున్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత అబద్దమో నాయకులు చెప్పే కార్యకర్తల అభీష్టం మేరకే అనే పదమే శుద్ద అబద్దం. ఇది తెలుసుకోనంత కాలం రాజకీయాల్లో పెను మార్పులు కష్టం. కొత్త తరం రాజకీయాలు రావడం దుర్లభం. ముందు ద్వీతీయ శ్రేణి నాయకుల్లో మార్పు రావాలి. కార్యకర్తల్లో చైతన్యం నిండాలి. ఒక నాయకుడు ఒకసారి, లేకుంటే రెండు సార్లు మాత్రమే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. తర్వాత మరొకరి అవకాశం ఇవ్వాలి. ఇలాంటి సంప్రదాయ రాజకీయాలు వస్తే తప్ప, సమాజంలో నూతన రాజకీయ చైతన్యం చూడలేం. భవిష్యత్తు ప్రజా రాజకీయం కనలేం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *