ద్వైతాద్వైతవిశిష్టాః

` ఆత్మలో లీనమైన పరమాత్మే అసలైన లోకం


` ప్రకృతిని తనలో నిక్షిప్తం చేసుకున్న దేవుడే ఈ ప్రపంచం
` నిజమే జీవిత సత్యం…
` నిజంలోనే మనిషి బతకాలి.
` నిజమే జీవితమై బతకాలి.
` నిజాన్ని నమ్మిన వాస్తవ ప్రపంచం మనం కావాలి.
`నిజాన్ని రక్షించే బాధ్యత ప్రతిఒక్కరూ తీసుకోవాలి.
` నవ్వు నిజాన్ని రక్షిస్తే, అది నీకు రక్షణగా నిలుస్తుంది.
` ముచ్చింతల్‌లో శ్రీరామ నగరం అందంగా ముస్తాబు
` అంగరంగ వైభవంగా నేటి నుంచి వేడుకలు
` పది రోజుల పాటు ఆధ్యాత్మిక శోభతో అలరాడనున్న ప్రాంగణాలు
` ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోడీ హజరు, విగ్రహావిష్కరణ
` 12న రాష్ట్రపతి రామ్‌నాధ్‌కోవింద్‌ సందర్శన. ముగింపు ఉత్సవాలు.
` రామానుజాచార్యుల సహాస్త్రాబ్ది ఉత్సవాలు నేడే ప్రారంభం.
తర్కం చాలా విచిత్రంగా వుంటుంది. గందగోళంగానే వుంటుంది. అర్ధమైనట్లే అనిపిస్తుంది. ఆ క్షణం గడిస్తే ఏం అర్ధం కానట్లేననిస్తుంది. ఎంత విడమర్చి చెప్పినా ఏదో సందేహం వ్యక్తమౌతుంది. అదే శాస్త్రం. అందుకే తర్కాన్ని ఎప్పుడూ నేరుగా చెప్పొద్దంటారు. వెయ్యేళ్లు గడుస్తున్నా ఇంకా కొన్ని తర్కాలు జనంలో నానుతూనే వున్నాయి. ఆచార వ్యవహారాలుగా అనుసరింపబడుతున్నాయి. వాటి వెనకున్న దైవాలను కొలుస్తున్నాయి. అవి వాటి గొప్పదనమే కాదు, అందించిన మహానుభావులు నిర్ధేశించిన జీవితం సత్యం కూడా…ఎంతో గొప్పది. అందుకే వాటిని మరో వెయ్యేళ్లు ప్రజలు ఆచరిస్తూ, అసతోమా సర్గమయా, తమసోమాజ్యోతిర్గమయా…అంటూ విరాజిల్లాలి. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నేడు సమతామూర్తి రామానుజాచార్యుల సహస్త్రాబ్ధి ఉత్సవాలు మొదలుకానున్నాయి.శ్రీశ్రీశ్రీ తిండండి చినజీయర్‌స్వామి నేతృత్వంలో శ్రీరామ నగరం రూపుదిద్దుకున్నది. అక్కడ ఏర్పాటు చేసిన 261 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహం వెయ్యేళ్లైనా చెక్కుచెదరని విధంగా తయారు చేయబడిరది. ముచ్చింతల్‌ లోని శ్రీరామనగరం శోభాయమానంగా రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అంకరణలు జరుపుకున్నది. ఎటు చూసినా భక్తి పారవశ్యం నింపే ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. అయితే అసలు వెయ్యేళ్ల తర్వాత కూడా రామానుజాచార్యుల బోధనలు ఏమిటన్నది ఓసారి మననం చేసుకుందాం…
మన కళ్లకు కనిపించేందంతా వాస్తవం. ప్రతీది నిజం. మనం నిజంలో బతకాలి. నిజంలోనే జీవించాలి. నిజమే జీవితం చేసుకోవాలి. నిజాన్ని ఎల్లప్పుడూ రక్షించాలి. నిజాన్ని మనం రక్షిస్తే మనల్ని నిజం రక్షిస్తుంది. ఇది తెలియాలంటే అంతకు ముందు సమాజానికి మధ్వాచార్యులు చెప్పిన ద్వైతం తెలియాలి. ద్వైతం అంటే రెండు. ఆత్మ, పరమాత్మ అనేవి రెండు. జీవుడు, జీవాత్మ అన్నవి రెండు. ప్రకృతి, దేవుడు రెండు. ఇలా ప్రపంచంలో ఏదేని వస్తువైనా రెండు రకాలుగా కనిపించొచ్చు. ఆకాశంలో ఒకరికి మేఘాలు ఐరావతంలా కనిపించొచ్చు. మరొకరికి మరో రూపంలో కనిపించొచ్చు. అంటే జీవాత్మ, పరమాత్మ అన్నవి రెండూ వున్నాయని అందరూ నమ్మాలి. అదే ఆచరించాలని మధ్వాచార్యులు చెప్పారు. ఆత్మ అన్నది నిత్యమని, సత్యమనిదానికి మరణం లేదని, దేవుడిలో లీనమైనా, అదెప్పుడూ సజీవమే అన్నది మధ్వాచార్యులు చెప్పిన సందేశం. నీవు దైవం. నేను జీవం. దేవుడు గురువు. మనిషి శిష్యుడు. జీవాత్మ, పరమాత్మ అన్నది వేర్వేరు తెలుసుకోవాలి. కంటికి కనిపించేదైనా, కనిపించనిదైనా వాసుదేవుడి మీద ఆధారపడి వుంటుందనేది చెప్పేదే ద్యైతం.
ఇక అద్యైతం. బాషా పరంగా ద్వైతం కానిది. రెండు కానిది. అంటే ఒక్కటి. సృష్టింతా ఒక్కటే. జీవుడైనా, దేవుడైనా ఒక్కటే. జీవితం…జీవాత్మ, పరమాత్మలు వేరు వేరు కాదు. రెండూ సమ్మిళితమే. రెండూ ఒక్కటే. అందుకే దేహోదేవాలయోస్రోప్తో జీవో సనాతనహాః…అన్నది శంకరాచార్యుల అద్యైతం. అంటే దేవుడు. జీవుడు ఒక్కడే. జీవాత్మనే…పరమాత్మ. పరమాత్మలేని జీవుడు లేడు. జీవుడు లేని పరమాత్మ కూడ లేడు. బ్రహ్మ ఒక్కడే దేవుడు. బ్రహ్మ జ్ఞానమే మనిషి రూపం అన్నది శంకారాచ్యులు చెప్పిన సందేశం. కాని అది అందరూ నమ్మలేదు. సమాజంలో హెచ్చుతగ్గులు తగ్గలేదు. మరింత పెరిగాయి. చెప్పుకోవడానికి బాగానే వున్నా, అసమానతలు అంతర్లీనంగా వున్నాయి. అహం బ్రహ్మాస్మి…అని శంకరుడు అన్నట్లు అందరిలోనూ అహం పెరిగితే, నేనే గొప్ప అన్నది ఉద్భవిస్తుంది. అసమానతలు పెరిగిపెద్దవౌతాయి. మరెలా అనుకున్నప్పుడే విశిష్టాద్వైతం అన్నది ప్రచారంలోకి వచ్చింది.
ఇక విశిష్టాద్వైతం. దేవుడు వేరు. జీవి వేరు. ప్రకృతి వేరు. పంచ భూతాలు వేరు. అన్ని ఒకదానితో ఒకటి లీనమై, విలీనమై, ఏకమై ఒక్కటై విశ్వమంతాటా వ్యాప్తి చెంది వున్నాయన్నది దీని అర్ధం. జీవుడు. ప్రకృతి. ఈశ్వరుడు అన్నీ సత్యాలే అన్నది రామానుజుడు చెప్పిన సిద్దాంతం. మన శరీరంలో జీవుడున్నట్లే, శ్రీమన్నారయునుడు కూడా వున్నాడని చెబుతుంది. జీవుడు వేరు. బ్రహ్మ వేరు. జీవుడు మిథ్య కాదు. ఈ ప్రకృతిలో జీవ భిన్నత్వమే తప్ప, జీవ బేధం లేదు. విశిష్టాద్వైతం ప్రకారం దేవుడు ఒక్కడే. అతను నారాయణుడే. జీవి, ప్రకృతి ఒకే కొమ్మకు పూచినవి. పరమాత్మనుంచి ఆత్మ జన్మిస్తుంది. జీవాత్మ చివరకు పరమాత్మ సన్నిధి చేరడంతో మోక్షం సిద్ధిస్తుంది. ఆ మోక్షానికి అచంచలమైన విష్ణు భక్తే ముక్తి మార్గమని అందరూ నమ్మాలి. భగవంతుని శరణాగతి ప్రతి జీవికి అవసరం. మానవులంతా సమానులు. మోక్షానికి అందరూ అర్హులు. మోక్షంలోనే ఏ వివక్ష లేదు. కుల, లింగ వివక్షలు వుండవు. ఒక్కసారి జీవాత్మ, పరమాత్మ చెంతకు చేరితే దానికి ఎలాంటి మాలిన్యం వుండదు. కొత్తగా అంటదు. అటువంటుప్పుడు జీవుల్లో ఎందుకు ఈ వ్యత్యాసం. ఎందకీ వైరుద్యం. ఎందుకీ విపరీతం. అన్నది ప్రచారం చేయడమే విశిష్టాద్యైత మూల సూత్రం. దైవారాధనకు అందరూ అర్హులే. దైవం ముందు అందరూ సమానులే. ఈ లోకంలో అందరూ ఒక్కటే. ఎవరూ ఎక్కువ కాదు. ఎవరూ తక్కువ కాదు. నారాయణుడే సృష్టి స్ధితి లయకారకుడు. జీవుడు చిత్తు. అచిత్తు ప్రకృతి. రెండూ నారాయణ స్వరూపాలే. అభిగమనము. ఉపాదానము. ఇజ్యము. స్వాధ్యాయము. యోగాలకు అందరూ అర్హులే. ఇదే విశిష్టాద్యైతానికి మూలం. ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన. సందర్భం చెప్పుకోవాలి. సహజంగా ఏ ఉపాసకుడైనా, ఏ యోగి అయినా, ఏ బోగి అయినా, ఏ స్వామి అయినా సరే గురూపదేశం బైటకు చెప్పరు. కాని రామానుజాచార్యులు చెప్పారు. ఇదే ఆయన విశిష్టాద్వైతాన్ని ఇంకా ప్రజల్లో వెలుగొందేందుకు కారణమైంది. మనుషులంతా ఒక్కటే అన్నాడు. సమాజమంతా ఏకం కావాలన్నాడు. అందరూ ఒక్కటైనే ప్రపంచం అన్నారు. ఆయన గురువైన యమునాచార్యులు తనకిచ్చిన ఉపదేశాన్ని అప్పటికప్పుడు ప్రజలకు చెప్పాడు. నిజానికి గురూపదేశాలు చెప్పరని తెలుసు. కాని ఆ మంత్రమేమిటో ఆలయ గోపురమెక్కి అందరికీ వినిపించేలా చెప్పాడు. జగత్‌ప్రసిద్దంచేశారు. గురువు చెప్పిన మంత్రం నమో…నారాయణాయః అని అందరూ పటించాలని, పాటించాలని కోరాడు. అంటే అంటే జనులందరికీ దేవుడు మోక్షం ప్రసాదించాలని, నమో నారాయణాయః మంత్రం పటించి మోక్షసిద్ది పొందాలన్నది ఆయన అభిమతం. ఇటు జీవిగా, అటు ఆత్మగా దేవుని దృష్టిలో అందరూ సమానమైనప్పుడు, సమాజంలో హెచ్చుతగ్గులు వుండకూడదన్నది రామానుజాచార్యుల ఉపదేశం. వెయ్యేళ్ల క్రితమే మనుషులంతా ఒక్కటే అని చెప్పిన రామానుజాచార్యుల మాటలు ఇంకా ఈ సమాజంలో అనుసరించడం లేదు. అది పోవాలి. హెచ్చుతగ్గులు రూపు మాపిపోవాలి. అందరం ఒక్కటే అన్న భావన అందరిలోనూ కలగాలి. మనమంతా ఒక్కటే అన్న భావన అందరిలోనూ ఉదయించాలి. అదే అనుసరించాలి. ఇదే రామానుజాచార్యులు చెప్పింది. శ్రీశ్రీశ్రీ తిండడి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి ప్రచారం చేస్తోంది. అనుసరించి, ఆచరించి సమసమాజం నిర్మిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *