దెబ్బకు దిగివచ్చిన మద్యం ధరలు

 

కనీస విచారణ చేపట్టనీ అధికారులు.

వెల్గటూర్ (నేటిధాత్రి):

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రముతో పాటు మండలంలోని అన్ని వైన్స్ షాపులలో మద్యం ధరలు దిగివచ్చాయ్. బుధవారం నుండి తెరుచుకున్న వైన్స్ షాపులు ప్రభుత్వ రేట్లను అధిగమించి వైన్స్ లోనే ఏకంగా బ్లాక్ దందాను మొదలు పెట్టి ప్రభుత్వం నియమించిన రేటు కంటే ఒక్కో మద్యం క్వార్టర్ సీసాపై 20 నుండి 30 రూపాయల వరకు అధికంగా వసూలు చేస్తూ మద్యం ప్రియులను నిలువు దోపిడీ చేశాయి. దీనిపై నేటిధాత్రితో సహా పలు దిన పత్రికలలో జోరుగా శీర్షికలు వచ్చాయి. దీనితో చేసేదేమీ లేక ప్రస్తుతం వైన్స్ యాజమాన్యాలు మద్యంను ప్రభుత్వ ధరలకే విక్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా బుధవారం వైన్స్ షాపులలో సామాన్యునికి జరిగిన నిలువు దోపిడిపై అన్ని పత్రికల్లో కథనాలు ప్రచురితమైనప్పటికి సంబంధిత అధికారులు ఇప్పటివరకు కనీస విచారణ చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికంగా వసూలు చేసిన డబ్బులు ఎవరి జేబుల్లో జమయ్యాయి? అధికారుల జేబుల్లోనా లేక వైన్స్ యాజమాన్యం ఖాతాలోనా అనే అంశాలు బయట మెండుగా విన్పిస్తున్నాయి. వెల్గటూర్ వైన్స్ యజమానుల్లో ఒకరు నూతనంగా ఎన్నుకోబడిన స్థానిక ప్రజాప్రతినిధి అవ్వడముతోనే అధికారుల అండదండలతో యథేచ్ఛగా వైన్స్ లోనే బ్లాక్ దందా నడిపించారనీ పలువురు ఆరోపిస్తున్నారు. కొందరు ప్రజా ప్రతినిధులు లాక్ డౌన్లో కూడా సామాన్యులను ఆదుకోకపోవడం విషయం సంగతి అటు ఉంచితే ఇలా సొంత వ్యాపారాల్లో సామాన్యులపై నిలువు దోపిడీ ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజా ప్రతినిధులను ఎన్నుకున్నది ఇలా నిలువు దోపిడీ చేసేందుకేనా అనే నినాదం ప్రజల్లో గట్టిగా విన్పిస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు విచారణ జరిపి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *