దళిత బంధు ట్రాక్టర్లు ఆంధ్రాలో..! హర్యానా నుంచి తెచ్చిన బర్రెలు స్వర్గంలో!!

`ఇదీ దళిత బంధు అమలు అధికారుల నిర్వాకం.

`ఏసి. గదుల్లో కూర్చొని అధికారులు చేసిన అమలు తీరుకు నిదర్శనం.

`దళిత బంధు వాహనాలు అమ్మినా, కొన్నా నేరమే!

`అయినా ఎలా కొన్నారు? అమ్మకాన్ని అధికారులు ఎలా ప్రోత్సహించారు?

`దళిత బంధు ట్రాక్టర్లలో 60 శాతం ఆంద్రాకు చెందిన వ్యక్తులు ఎలా కొనుగోలు చేశారు?

`ట్రాక్టర్లు తరలుతుంటే అధికారులు ఏం చేశారు?

` రెండు జిల్లాల కలెక్టర్లు ఏం పర్యవేక్షిస్తున్నారు?

`ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు నిర్వాకం ఎందుకు కనపడలేదు?

`అగ్రికల్చర్‌ ఏడి. ట్రాక్టరు షోరూం యజమానిని కమీషన్‌ కోసం బెదిరింపులేమిటి?

`ఇన్ని ట్రాక్టర్ల అమ్మకానికి అవకాశం కల్పిస్తే కమీషన్‌ ఇవ్వవా? గద్దించడమేమిటి?

`వాహనాల మీద సిఎం. స్టిక్కర్‌, దళిత బంధు అని ఎందుకు రాయలేదు?

`లబ్ధి దారులు బర్రెలు మేమే కొనుక్కుంటామంటే ఎందుకు అధికారులు సహకరించలేదు?

`కరీంనగర్‌ డైరీ వాళ్లు ఎందుకు ఒప్పుకోలేదు?

`గతంలో ఉత్తర భారత్‌ నుంచి గొర్రెల కొనుగోలు అనుభవాలున్నాయి.

`అయినా బర్రెల విషయంలో అదే ఎందుకు అనుసరించారు?

`గేదెల మరణానికి కారకులెవరు?

`వాతావరణ మార్పులు పడక బర్రెలు చనిపోయాయి.

` ఇప్పటికైనా మేం చెప్పినట్లు వినండి…అని దళిత రైతులు కోరుతున్నారు.

`బర్రెలు ఇవ్వడం కుదరదు…మరో ఇతర యూనిట్లు పెట్డుకోమని కొత్తగా అధికారుల ఒత్తిళ్లు?

`ఇప్పుడు గైడ్‌ లైన్స్‌ అడ్డం రావడం లేదా?

`పాలు పితకడం, వ్యవసాయ సాగు తప్ప మాకేం పనిరాదన్నా అధికారులు వినడం లేదు?

`లబ్ధి దారుల మాటకు విలువలేదు?

`దళిత బంధు ఆగమౌతున్నా అధికారులకు పట్టింపు లేదు?

`లబ్ధి దారులు చెప్పినట్లు చేస్తే అధికారులకు కమీషన్లు రావు?

`ఏజెన్సీలకు డైరెక్ట్‌ గానే ఫోన్లు చేసి అధికారులు కమీషన్లు వసూలు చేసుకున్నారు?

`కాల్‌ రికార్డులౌతాయన్న భయం కూడా లేదు?

`దళిత బంధు తో కోట్లు దండుకున్నారు?

`లబ్ధి దారులను ఆగం చేశారు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

సహజంగా పాలకులు మోచేతికి బెల్లం పెట్టి నాకిస్తారని గతంలో చెప్పుకోవడం విన్నాం. ఎదో ఒక సంక్షేమ పధకం ప్రవేశపెట్టి గొప్పలు చెప్పుకోవడం చూశాం…ప్రజల జీవితాలు వెలిగిపోతున్నాయని చెప్పుకున్న సందర్భాలు అనేకం. కాని తెలంగాణ సాధించి, ప్రజల ఆదరణతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రకటించి, అమలు చేస్తున్న పధకాలు అన్నీ ఇన్నీ కావు. అందులో ఎంతో ప్రాముఖ్యమైన, ప్రత్యేకమైన, ప్రధానమైన పధకం దళిత బంధు. మొదటి సారి తెలంగాణలో అట్టడుగు వర్గాలకు న్యాయం చూస్తున్నాం. అనేక పధకాల అమలు అనుభవిస్తున్నారు. ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా అనేక సదుపాయలు అందుకుంటున్నారు. ప్రతి వ్యక్తి ఏదో ఒక రూపంలో ప్రభుత్వ చేయూతనందుకుంటున్నారు. అలాగే దళితుల జీవితాల్లో సంపూర్ణంగా వెలుగులు నిండాలని ఆశించిన ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్‌. అందుకు అవసరమైన గొప్ప పధకానికి రూపకల్పన చేసి, ప్రకటించి అమలు చేస్తున్నారు. దళితులకు కొత్త జీవితాలు ప్రసాదిస్తున్నారు. గతంలో దళితులకు ఎంతో కొంత రుణాలు ఇవ్వడమే గొప్పగా చెప్పుకునేవారు. కాని ఇప్పుడు పైసా కూడా ప్రభుత్వానికి తిరిగి కట్టకుండా, పూర్తి సబ్సిడీతో దళిత బంధు పధకంలో రూ.10లక్షల వరకు అందజేస్తున్నారు. లబ్ధిదారుల కోరిక మేరకు, వారి సూచనలను అనుసరించి ప్రభుత్వం వారి ప్రావీణ్యాన్ని బట్టి యూనిట్లను అందజేస్తున్నారు. వారికి ఉపాధి మార్గం చూపిస్తున్నారు. వాటిలో అనేకం వున్నాయి. రైతులుగా పాడిని కావాలనుకుంటున్నవారికి గేదెలు అందజేస్తున్నారు. వ్యవసాయ పనిముట్టుగా పనిచేసే హార్వెస్టర్లు ఇస్తున్నారు. ట్రాక్టర్లు అందజేస్తున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ వున్నవారికి కార్లు ఇస్తున్నారు. కిరణా షాపు నిర్వహిస్తామనుకునేవారికి ఆ సదుపాయం కల్పిస్తున్నారు. సెల్‌ఫోన్‌ షాపులు, ఫర్నిచర్‌ షాపులు, సెంట్రింగ్‌ వర్కులు, టెంట్‌ హౌస్‌లు ఇలా అనేక రూపాల్లో ఉపాది చూపిస్తున్నారు. కాని కొందరు అధికారులు ఈ పధకాన్ని పక్కదోవ పట్టించారు. ఆ పధకం అమలులో చీకట్లు నింపారు. సహజంగా ఎస్సీ కార్పోరేషన్‌ అధికారరులు అమయాకులైన దళితుల్లో మరింత చైతన్యం నింపాలి. వారి జీవితాలకు ఒక మార్గదర్శకంగా నిలవాలి. కాని కొందరు అధికారులు, ముఖ్యంగా ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు చేసిన నిర్వాకం మూలంగా దళిత బంధు వరంగా కాకుంగా, శాపంగా పరిణమించేలా చేస్తున్నారు. వారికి అందాల్సిన సొమ్మును కాజేస్తున్నారు. ఎంతో బాధ్యతగా దళిత బంధును అమలు చేయాల్సిన అధికారుల తీరు బాధాకరం. అత్యంత దురదృష్టకరం. ఇంకా చెప్పాలంటే దుర్మార్గం. పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కొందరు అధికారుల తీరు మారడం లేదు. అవినీతి ఆపడం లేదు. అక్రమ సంపాదన మానుకోవడం లేదు. పథకాన్ని నిర్వీర్యం చేసే పన్నాగం పన్నుతున్నారు. ప్రజల పన్నులతో వచ్చే జీతాలు తీసుకుంటూ, ప్రజలకే సున్నం పెడుతున్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారు. 

ఇక్కడు ముఖ్యంగా రెండు విషయాలు చర్చించుకోవాల్సిన అసవరం వుంది.

ప్రభుత్వం పేద దళితుల్లో సాగుతోపాటు, పాడిని చూసుకునేవారి కోరిక మేరకు 8 గేదెలు అందజేయాలని నిర్ణయించింది. అందులో హుజూరాబాద్‌ నియోజక వర్గంలో వేలాది మందిరైతులకు గెదెలు సరఫరా చేశారు. మొదటి విడతగా ముందు 4 గేదెలను అందజేశారు. ఇంత వరకు బాగానే వుంది. కాని అసలు తిరకాసు ఇక్కడే వుంది. ప్రభుత్వం అనుకున్నది ఒకటి. కాని అధికారులు ఆచరించింది మరొకటి. లబ్ధిదారులు మొదటగా గేదెల కోసం షెడ్‌ ఏర్పాటు చేసుకోవాలి. అందుకు అవసరమైన సొమ్మును లబ్ధిదారులు బ్యాంకునుంచి డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. షెడ్డు నిర్మాణానికి సంబంధించిన ఫోటోలు తీసుకొని, లబ్ధిదారులు కరీంనగర్‌ డైరీకి అందజేశారు. కరీంనగర్‌ డైరీ అధికారులు రైతులను విడతల వారీగా హర్యానా తీసుకెళ్లి, గెదెలు ఇప్పించారు. కాని ఆ గేదెలు మన వాతావరణంలో మనుగడ సాగిస్తాయా?లేదా? అన్నది ఆలోచించలేదు. ఉత్తర బారత ప్రాంతానికి, మన ప్రాంతానికి వాతావరణంలో ఎంతో వ్యత్యాసం వుంటుంది. అందుకే లబ్ధిదారులైన రైతులు తాము ఇక్కడే గేదెలను కొనుగోలు చేసుకుంటామని చెప్పారు. అయినా అధికారులు వినలేదు. ఏ గేదె ఎక్కువ పాలు ఇస్తుందో… ఎంత ఆరోగ్యంగా వుందో…ఎంత వయసు వుందో…ఇలాంటి విషయాలు క్షుణ్ణంగా తెలుసుకొని ఇక్కడే కొనుగోలు చేసుకుంటామని ఎంత మొత్తుకున్నా అధికారులు వినలేదు. గతంలో కురుమలు, యాదవులకు గొర్రెల యూనిట్లు ప్రభుత్వం అందజేసింది. అప్పుడు కూడా అధికారుల అత్యుత్సాహంతో ఇలాంటి పరిస్దితే ఎదురైంది. రైతులను తీసుకెళ్లి ఉత్తర ప్రదేశ్‌ లాంటి ప్రాంతాల నుంచి గొర్రెలు కొనుగోలు చేసి తెచ్చారు. వాటిలో చాలా వరకు గొర్రెలు మరణించాయి. గొర్రెలకు ఇన్యూరెన్సు వుండడం మూలంగా వారికి పెద్దగా నష్టం జరగలేదు. కాని గేదెలకు అలాంటి అవకాశం కల్పించబడలేదు. దాంతో లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. గేదెలను హర్యానా నుంచి కొనుగోలు చేసిన సందర్భంలో లబ్ధిదారులు ఇక్కడే కొనుగోలు చేస్తామంటూ రూల్స్‌, రెగ్యులేషన్లు అంటూ కొత్త కొత్త బాష్యాలు చెప్పిన అధికారులు, ఇప్పుడు కూడా వారి మాటలు వినడం లేదు. కాని గేదల స్దానంలో మరో రకమైన యూనిట్‌ ఎంపిక చేసుకొమ్మని కొత్త సలహాలు ఇస్తున్నారట…అంటే ఇప్పుడు రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్లు అతిక్రమించొచ్చా? అందుకు అధికారులకు ప్రభుత్వమేమైనా మార్గదర్శకాలు జారీ చేసిందా? అదే నిజమైతే గేదెలను ఇక్కడే కొనుగోలు చేసేలా కొత్త గైడ్‌ లైన్స్‌ ఇస్తుందే గాని, ఇతర యూనిట్లను ఎంపిక చేసుకొమ్మని చెబుతుందా? ఇలా ప్రభుత్వాన్ని అబాసు పాలు చేసేంందుకు, కమీషన్లలో కొత్త దారులు వెతుక్కునేందుకే అధికారులు ప్రయత్నిస్తున్నారు తప్ప, లబ్ధిదారులకు మేలు చేయాలన్న సోయి మాత్రం ఒక్క శాతం కూడా లేదన్న సంగతి తేలిపోయింది. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటే తప్ప, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగవు. ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పడవు. 

ఇక ట్రాక్టర్ల మాయాజాలం మరో రకమైంది. 

హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో కొన్ని వందల ట్రాక్టర్లు దళిత బంధు కింద అందజేయడం జరిగింది. మరి ఆ టాక్టర్లు ఇప్పుడు లబ్ధిదారుల వద్ద వున్నాయా? లేదా అన్న వాటిని చూసుకునే తీరిక అధికారులకు లేదు. అంతే కాదు ఏ లబ్ధిదారుడికైనా అందిన ప్రతి యూనిట్‌ విషయంలోనూ వారికి ఉపాధి ఎంత లభిస్తోంది. ఒక వేళ లేకపోతే, వారికి ఎలా ఉపాధి కల్పించాలన్నది కూడా ప్రభుత్వ ఉద్యోగులే చొరవ తీసుకోవాలన్నది రూలు. కాని ఎస్పీ కార్పోరేషన్‌ ఉద్యోగులు ట్రాక్టర్లు ఇచేసి చేతులెత్తేశారు. వాటిని అమ్ముకోమ్మని చెప్పి, చేతులు దులుపుకుంటున్నారు. అసలు ఇక్కడ ఎంతో ముఖ్యమైన విషయాలను అధికారులు గాలికి వదిలేశారు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి యూనిట్‌ మీద దళిత బంధు స్కీమ్‌ పేరు ఖచ్చితంగా రాయించాలి. పైగా ముఖ్యమంత్రి ఫోటో స్టిక్కర్‌ ఖచ్చితంగా వుండాలి. అది కారైనా, ట్రాక్టరైనా,హార్వెస్టరైనా మరేదైనా సరే, దళిత బంధు స్కీమ్‌ కనిపించేలా వుండాలి. కాని అధికారులు తూతూ మంత్రంగా మాత్రమే వాటిని చూసుకున్నారు. మిగతావాటికి వదిలేశారు. దళిత బంధు స్కీమ్‌ కింద లబ్ధిదారులకు అందజేసిన ఏ వాహనమైనా, మరే ఇతర యూనిట్‌ అయినా సరే అమ్ముకోవడానికి వీలులేదు. ఎవరూ కొనుగోలు చేయకూడదు. అదే జరిగితే ఇద్దరిదీ నేరమే అవుతుంది. ఈ విషయం అమాయకులైన లబ్ధిదారులకు చెప్పకుండా అధికారులు మభ్యపెట్టారు. ఈ విషయం తెలియక ట్రాక్టర్లు చాలా మంది లబ్ధిదారులు అమ్ముకున్నారు. సుమారు 60శాతానికి పైగా ట్రాక్టర్లు ఇప్పుడు లబ్ధిదారుల వద్దలేవు. ఈ విషయంలో లబ్ధిదారులను మాయ చేసి, వారి చేత అమ్మకాలకు పురిగొల్పింది కూడా అధికారులే కావడం గమనార్హం. ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు ఇలా లబ్ధిదారుల సొమ్ముకు కన్నం పెడితే, అగ్రికర్చర్‌ అధికారులు తామేం తక్కువా అనుకున్నారో ఏమో! ట్రాక్టర్లు సరఫరా చేసిన ఎజెన్సీల వద్దకు వెళ్లి, ఇన్ని ట్రాక్టర్లు అమ్మకానికి అవకాశం కల్పించామని, తమకు కమీషన్‌ ఇవ్వాలని వారిని వేధించి వసూలు చేసినట్లు కూడా తెలుస్తోంది. అగ్రికర్చర్‌ డిపార్లుమెంటుకు చెందిన ఓ ఉన్నతాధికారి ఏకంగా ఆ ఎజెన్సీ యజమానికి బెదిరించినట్లు కూడా సమాచారం. ఇలా ఎవరికి వారు కమీషన్ల పేరుతో వాటాలు పంచుకొని, దళిత బంధు సొమ్ము కాజేశారు…లబ్ధిదారుల వద్ద ట్రాక్టర్లు లేకుండా చేశారు. ఇప్పుడు ఆ ట్రాక్టర్లనీ ఆంధ్రాప్రాంతానికి చెందిన కొంత మంది వ్యక్తులకు దగ్గరుండి మధ్యవర్తుల చేత అధికారులు కధలు నడిపించారు. మొత్తంగా పథకానికి సున్నా చుట్టేశారు.

Leave a Reply

Your email address will not be published.