దళిత క్రిస్టియన్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

కరీంనగర్ జిల్లా,జమ్మికుంట, నేటిధాత్రి :

దళిత క్రిస్టియన్లుగా ఉన్నటువంటి వారి సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జమ్మికుంట పురపాలక సంఘం పరిధిలోని హనుమాండ్లపల్లిలో బుధవారం నూతనంగా నిర్మించిన బాప్టిస్ట్ చర్చిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని కులాలు, మతాల వారిని సమ దృష్టితో చూస్తున్నారన్నారు. కెసిఆర్ నాయకత్వంలో సెక్యులర్ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. అందరి స్థితిగతులను మరింత మెరుగుపర్చేందుకు దేశంలో మరెక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చర్చిలు, ఆలయాలు, మసీదుల నిర్మాణాలు, వాటి మరమ్మత్తులు, అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు ఇస్తున్నదన్నారు. దళిత క్రిస్టియన్ల డిమాండ్లు, బంధు పథకాన్ని వర్తింపజేయాలనే కోరిక గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తమని చెప్పారు. క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తున్నదన్నారు. పేద వారికి దుస్తులు అందజేస్తున్నం, హైదరాబాద్ లో రెండు ఎకరాలలో 10 కోట్లతో క్రిస్టియన్ భవన్ నిర్మాణం జరుపుతున్నం అన్నారు. క్రిస్టియన్ల శ్మశాన వాటికల కోసం హైదరాబాద్ పరిసరాలలో 65 ఎకరాలు కేటాయించినం, పనులు కూడా కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మునిసిపల్ ఛైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, బాప్టిస్ట్ చర్చి అధ్యక్షుడు డేవిడ్ శాంతరాజు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు టంగుటూరి రాజ్ కుమార్, కౌన్సిలర్లు పోనగంటి మల్లయ్య, పోనగంటి విజయలక్ష్మీ, టిఆర్ఎస్ నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి, తాళ్లపల్లి సరళ, పాస్టర్లు తాల్లపల్లి జాషువా, జయకర్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *