త్యాగాల గడ్డమీద తమాషా చేయకు!?

`ఇది పోరాటాల పురిటిగడ్డ…

`అరవై ఏళ్లు ఆగమైన గడ్డ…

`నాడు నైజాం ను తరిమికొట్టింది.

`తర్వాత పరాయి పాలనను అంతం చేసింది. 

`స్వరాష్టమై ఆత్మ గౌరవానికి కీర్తి కిరీటమైంది.

`చిల్లర మల్లర రాజకీయాలు తెలంగాణలో చెల్లవు.

`తెలంగాణను పీల్చుకుతిన్నది వైఎస్‌.

`2004 తెరాస పొత్తుతో గెలిచి, మోసం చేసింది వైఎస్‌.

`రాజన్న రాజ్యమే తెలంగాణకు పీడకల.

`మళ్ళీ తెలంగాణలో కలతలు రేపాలని చూస్తే ఎవరూ ఊరుకోరు.

`చీరి చింతకు కడ్తరు!

`అతి చేసి గొప్ప అనుకోకు…

`తెలంగాణ ప్రజలెవ్వరూ నమ్మరు…

`బయ్యారం బాగోతం అందరికీ తెలుసు.

`ఓ హీరో విషయంలో నిందితులను శిక్షించింది తెలంగాణ ప్రభుత్వం.

`అది మర్చిపోయి సోయిలేని తనం, నీతి లేని గుణం చూపించకు.

`2004 ఎన్నికల ముందు ఇల్లు అమ్ముకునేదాకా రాలేదా?

`ఆ తర్వాత అంత సంపాదన వైఎస్‌ కు ఎలా పోగైంది?

`నీతులు చెప్పే ముందు నీతి మాలిన గతం గుర్తు చేసుకోవాలి.

`అడ్డగోలు రాజకీయాలు తెలంగాణలో చెల్లవు.

`పొలిమేరదాకా తరిమినా చూరు పట్టకొని కారుకూతలు మాట్లాడితే మెచ్చరు.

`బతుకమ్మ పేర్చడం రాదు…

`బోనం ఎత్తుకోవడం తెలియదు…

`తెలంగాణ మీద మమకారం ఎంత నటించినా నమ్మరు.

`పెత్తనం కోసం పడే ఆరాటం అందరూ చూస్తున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఎవరూ మెచ్చనమ్మ ఎచ్చులకు పోతే, ఎగబడి, ఎగబడి తరిమిన్రట. అచ్చు తెలంగాణలో వైఎస్‌ఆర్టీటిపీ నాయకురాలు షర్మిలకు జరిగింది. రాజకీయాలు చేస్తున్నాం కదా! అని ఏది పడితే అది మాట్లాడొచ్చు అనుకుంటుందేమో? మంచి, మర్యాద అన్నవి నేర్చుకుంటే అలాంటి మాటలు రావు. మాట్లాడే హక్కు రాజ్యాంగం కల్పించింది కదా? అని రాజకీయాల్లో ఎలాగైనా మాట్లాడొచ్చన్న అవగాహన రాహిత్యం బాగా వున్నట్లు వుంది. మహిళగా ఆమె చేసే రాజకీయాలు ఆదర్శవంతంగా వుండాలే గాని, మహిళా సమాజం కూడా చీదరించుకునేలా వుండకూడదు. తెలంగాణలో ఇప్పటి వరకు కుహానా రాజకీయాలు లేవు. కుత్సిత రాజకీయాలు లేవు. ఎత్తిపొడుపులు లేవు. హేవంగింపులు లేవు. హద్దులు మీరి మాట్లాడే మాటలు అసలే లేవు. కాని వాటిని తెలంగాణ రాజకీయాల్లో చొప్పించి, ఇక్కడి రాజకీయాలను కలుషితం చేయాలనుకుంటున్నట్లున్నది. తెలంగాణ ఒక గంభీరమైన గడ్డ. ఇక్కడ త్యాగాలకు తప్ప, తాబేదార్లకు తావులేదు. ప్రేమే తప్ప పెత్తనాలుండవు. మంచి తనం తప్ప, మాయ చేయడం వుండదు. అలాంటి స్వచ్ఛమైన గడ్డమీద కడప రాజకీయాలు చేయాలని చూస్తే ప్రజలు చీదరించుకుంటారు. చీ కొడతారు. అసందర్భ ప్రేళాపనలు చేస్తే అసలే సహించరు. తాను తెచ్చుకున్న కిరాషి మనుషులు చప్పట్టు కొడుతున్నారు కదా! అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ను, మంత్రి కేటిఆర్‌ను, టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఎటు పడితే అటు మాట్లాడితే ఊరుకుంటారా? మీరేంటో మీ తత్వం ఏమిటో చెప్పడానికి ఒక్క కొండాసురేఖ చాలు. తెలంగాణ వారి త్యాగాలను కూడా అవకాశవాదం కోసం వాడుకొని, నమ్మిన నాయకులను నిండా ముంచిన ఘనత షర్మిల కుటుంబానిది. నిజంగా తెలంగాణలో రాజకీయాలు చేయాలనుకుంటే సమస్యలు మాట్లాడు! చెప్పడానికి ఏమీ లేనప్పుడు చెంపలేసుకొని వెళ్లు. అంతే గాని రెచ్చగొట్టి ఏదో సాధిస్తామనుకుంటే చెల్లదు. నోరుంది కదా! అని నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకుంటారా? అసలే ఇది తెలంగాణ. తెలంగాణకు ఆత్మగౌరవం ఎక్కువ. ఒకనాడు తెలంగాణకు వెళ్లాలంటే వీసా తీసుకోవాలా? అంటూ మాట్లాడి తెలంగాణ మనోభావాలు దెబ్బతీసిన వైఎస్‌ కుటుంబానికి ఇక్కడ మాట్లాడే నైతిక హక్కేలేదు. అంతే కాదు తెలంగాణలో ఎన్నికలు అయ్యేదాకా ఒక మాట, అయిపోగానే కర్నూలులో మరో మాట చెప్పి సీమాంధ్ర ఓట్లకోసం పచ్చి అబద్దాలాడిన నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి. పచ్చి అవకాశవాది వైఎస్‌. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఒక రాజనీతీజ్ఞడు. అపర చాణక్యుడు. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజల దృష్టిలో యుగపురుషుడు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన దీరోధాత్తుడు. 

   ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ చేసినట్లు దుష్ట రాజకీయాలు చేసి కేసిఆర్‌ పదవులు పొందలేదు. రాజకీయంగా అందిన పదవులను కూడా తెలంగాణ కోసం తృణ ప్రాయంగా వదిలేసిన నాయకుడు కేసిఆర్‌. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఉద్యమ త్యాగాల రాజకీయాలు చేసిన నాయకుడు కేసిఆర్‌. ప్రజల కోసం, తెలంగాణ సాధన కోసం జీవితం త్యాగం చేసిన నాయకుడు కేసిఆర్‌. ప్రాణ త్యాగానికి సైతం సిద్ద పడ్డ నాయకుడు కేసిఆర్‌. అలాంటి కేసిఆర్‌ను తూలనాడితే తెలంగాణ సమాజం హర్షిస్తుందా? ఉతికి ఆరేస్తుంది! చీరి చింతకు కట్టేస్తుంది!! ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. రాజకీయాలు చేసుకుంటే ఎవరూ వద్దనడం లేదు. కాని హద్దులు దాటి, పరిమితులు మర్చిపోతే పర్యవసనాలు కూడా పరిపాటే అన్నది తెలుసుకోవాల్సివస్తుంది. ఇప్పటికే కొంత షర్మిలకు అర్ధమయ్యే వుంటుంది. అయినా మారకపోతే ప్రజలే సరైన గుణపాఠం చెబుతారు. 

  త్యాగాల గడ్డమీద తమాషా రాజకీయాలు చెల్లవు.

 ఇక్కడి ప్రజలను పాలించిన నైజాం రాజుకే ఘోరి కట్టిన చరిత్ర తెలంగాణది. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయకపోతే భరతం పట్టేదాక వదిలిపెట్టరు. తప్పు చేసిన వారిని తమ, తర అనే భేధం చూపని గడ్డ. మనవాడు తప్పు చేస్తే ఇక్కడే పాతిపెట్టు, పొరుగోడు తప్పు చేస్తే పొలిమేరదాకా తరిమికొట్టు అని చెప్పిన కాళోజీ వారసులు తెలంగాణ ప్రజలు. తెలంగాణకు వచ్చి తెలంగాణనే అపహాస్యం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? తెలంగాణ అంటే ముందు గుర్తుకు వచ్చేది కేసిఆర్‌. ఆయన గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా తెలంగాణ సమాజమే సహించదు. షర్మిల ఆ విషయం ముందు తెలుసుకుంటే ఎంతో మంచిది. అరవై ఏళ్ల పాటు సీమాంధ్ర నాయకులతో పోరాడిన చరిత్ర తెలంగాణది. అందులో షర్మిల తండ్రి వైఎస్‌ కూడా వున్నారు. 2004 ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలవకుంటే ఇక జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేకుండాపోతుందని ఆలోచించి, తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకొని రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాడు. సహకరించిన తెలంగాణ వాదాన్నే మట్టు పెట్టాలని చూశాడు. ఆఖరుకు ఒక దశలో ఉద్యమ నాయకుడు కేసిఆర్‌ను కూడా లేకుండా చేద్దామని చూశారు. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఏనాడు అవి మనసులో పెట్టుకోలేదు. 

కేసిఆర్‌ అంటే ఒక వ్యక్తికాదు. ఒక యుక్తి. ఒక మహోన్నతమైన శక్తి. తెలంగాణకు స్వేచ్ఛను తెచ్చిన నాయకుడు. 

అరవై ఏళ్ల పోరాటానికి అంతిమ విజయం అందించిన నాయకుడు. త్యాగధనుడు. అలాంటి నాయకుడిని నోటికొచ్చినట్లు మాట్లాడేంత అహంభావం షర్మిలకు పనికిరాదు. తెలంగాణలో రాజశేఖరరెడ్డి పాలనే ఓ పీడ కల. తన స్వార్ధం కోసం తెలంగాణతో పొత్తుపెట్టుకొని, అడుగడుగునా తెలంగాణకు అడ్డుపడి, నేను నిలువూ కాదు, అడ్డం కాదు అంటూ కారడ్డమాడిన నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి. తెలంగాణకు అడుగుడునా అడ్డుపని వ్యక్తి రాజశేఖరరెడ్డి. కేసిఆర్‌ నాయకత్వాన్ని అణిచివేయాలని చూసిన నాయకుడు వైఎస్‌. రాజశేఖరరెడ్డి. అలాంటి రాజశేఖరెడ్డి పాలనను ఆయన కుటుంబ సభ్యులుగా రాజన్న రాజ్యం అంటూ కీర్తించుకునేది వుంటే ఆంధ్రప్రదేశ్‌లో చిడతల భజన చేసుకోవచ్చు. ఎవరికీ అభ్యంతరం లేదు. కాని తెలంగాణ పచ్చి వ్యతిరేకి వైఎస్‌ పాలన మళ్లీ తెలంగాణలో కావాలని ఏ మూర్ఖుడు కోరుకోడం లేదు. అయినా రాజన్న రాజ్యం అని చెప్పుకుంటున్న షర్మిల తెలంగాణకు వైఎస్‌ చేసిన ఒక్క మంచి పని ఏమిటో చెబితే బాగుంటుంది. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టైనా నిర్మాణం చేశాడా? కనీసం పెండిరగ్‌ ప్రాజెక్టులైనా పూర్తి చేశాడా? తన హయాంలో పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టుకొని 40 వేల క్యూసెక్కులను 80 వేల క్యూసెక్కులకు పెంచుకొని, నీటిని దోచుకెళ్లాడు. పులిచింతల నిర్మాణం మొదలు పెట్టి, తెలంగాణను ముంచాడు. అంతే కాని తెలంగాణకు ఏం చేశాడని చెబుతారు? ఇక రైతులకు ఉచిత విద్యుత్‌ అన్నది అప్పటి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు ఇచ్చారు. తెలంగాణకు ఉపయోగపడిరది ఎంత? రైతులకు ఉచిత విద్యుత్‌ పేరుతో తెలంగాణ ప్రాంతాన్ని చీకట్ల మయం చేశారు. కరంటు మీద ఆధారపడి చిన్న చిన్న పనులు చేసుకునేవారికి కరంటు లేకుండా చేశాడు. వారి జీవితాల్లో చీకట్లు నింపారు. తెలంగాణ పల్లెలు రోజులో గంట కూడా కరంటు చూడని దుస్తితి తెచ్చారు. పట్టణాలను ఆగం చేశారు. ఇదా రాజన్న గురించి షర్మిల చెప్పుకునే రాజ్యం….అదే ఇప్పుడు పల్లె, పట్నం అన్న తేడాలేకుండా ఇరవై నాలుగు గంటల నిరంతర, నాణ్యమైన కరంటు అందుతోంది. రైతులకు ఉచితంగా 24 గంటల కరంటు వస్తోంది. కరంటు మీద ఆధారపడి చేసుకునే పనులు లక్షణంగా సాగుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో చీకట్లు పోయి, వెలుగులు నిండాయి. కాని ఒకనాడు తెలంగాణకు ఎండబెట్టి సీమాంధ్రకు కరంటు ఎత్తుకుపోయిన వాళ్లు ఇప్పుడు చీకట్లలో మగ్గుతున్నారు. కరంటు కోతలు అనుభవిస్తున్నారు. ముందు మీ అన్న జగన్‌ను కోతలు లేని కరంటు సరఫరా చేయమని చెప్పు. అక్కడ ఎలగబెట్టిందేమీ లేకున్నా, పచ్చగున్న కాడ పందిరేసుకుంట, ఎచ్చగున్న కాడ కునుకు తీస్తా…అనే పరాన్న భుక్కులుగా బతికే బతుకును షర్మిల మార్చుకుంటే బాగుంటుంది. పచ్చని తెలంగాణలో రాజకీయ చిచ్చులతో కల్లోలం రేపే రాజకీయాలు కాకుండా, అన్న చేసే తప్పులు సరిదిద్దే రాజకీయాలు ఆంధ్రలో చేసుకుంటే మంచిది. అంతే కాని అయ్యేదో పంచించినట్లు అన్న ఆంధ్రలో , చెల్లె తెలంగాణలో పెత్తనం చేస్తానంటే ఎక్కడైనా నడుస్తుందేమో కాని తెలంగాణలో నడవదు..! అంతే…ఈ నేలకున్న ఆత్మగౌరం అదంతే!!

Leave a Reply

Your email address will not be published.