Headlines

కేసిఆరే తెలంగాణ పిత : గడల శ్రీనివాసరావు.

`ఆరు దశాబ్దాల పోరాటంలో కేసిఆర్‌ సాగించిన ఉద్యమమే కీలకం.

`తెలంగాణ ఉద్యమానికి చరిత్రలో స్థానం కల్పించిన నాయకుడు.

`తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసిఆర్‌.

`నా చిన్నప్పటి తెలంగాణ, ఇప్పటి తెలంగాణ చూశాక కేసిఆర్‌ కు ఒక్కసారి కాదు, వందల సార్లు మొక్కేందుకు వెనుకాడను.

`భద్రాద్రి-కొత్త గూడెం జిల్లాకు మెడికల్‌ కాలేజీ మొదటి ఫేజ్‌ లో ఇచ్చినందుకు కృతజ్ఞతతో కాళ్లు మొక్కడం జరిగింది.

`తెలంగాణ చరిత్ర మలుపు తిప్పిన నాయకుడు కేసిఆర్‌.

`తెలంగాణ తల రాత మార్చిన నాయకుడు కేసిఆర్‌.

`గోస పడ్డ తెలంగాణలో ఆనందం నింపిన నాయకుడు కేసిఆర్‌.

`కోట్లాది మంది స్వాతంత్య్ర పోరాటం చేసినా గాందీజీనే జాతిపిత అంటున్నాం.

`ప్రపంచంలో ఇంత తక్కువ కాలంలో ప్రగతి సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.

`వందకుపైగా పథకాలు అమలు ఒక్క తెలంగాణలోనే…

`ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత కేసిఆరే దే.

`ఒకప్పుడు వైద్య విద్య ఎంతో గగనం.

`ఇప్పుడు జిల్లాకో వైద్య కళాశాల వస్తోంది. 

`కరోనా సమయంలో నేను చేసిన సేవ ప్రత్యక్షంగా చూసిన వాళ్లకు తెలుసు.

` వ్యక్తిగా భవిష్యత్తులో ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వస్తాను.

`ప్రజాసేవ మా కుటుంబానికి కొత్తకాదు.

`తెలంగాణ సాయుధ పోరాటం నా కుటుంబం సాగించింది.

`నేను ఒక ఉద్యోగిగా విధులే కాదు, సామాజిక సేవలో నిమగ్నమైవున్నాను.

`ప్రజల కోసమే నా జీవితం…వారికి సేవ చేయడంలోనే సంతోషం. 

`కరోనా సమయంలో ప్రాణాలొడ్డి సేవ చేశాను…

`నా త్యాగానికి అదే గీటురాయి.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

సామాజిక సృహ అందరిలో వుండేది కాదు. సామాజిక బాధ్యతను అందరూ నెరవేర్చలేరు. ప్రజలంటే ప్రేమ, అభిమానం వున్న వాళ్లు మాత్రమే సామాజిక జిజ్ఞాసను కనబర్చుతుంటారు. తమ కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తిస్తుంటారు. తమ మనసులో ఏది వుందో అదే చెబుతారు. తాము ఏం చేయదల్చుకున్నామో మెహమాటం లేకుండా చేస్తుంటారు. అలాంటి వారిలో గడల శ్రీనివాస్‌రావు ఒకరు. ఆయనకు మంచి అనిపిస్తే అది చెప్పేస్తారు. ఏది న్యాయం అనిపిస్తే అది చేస్తారు. ప్రజల సేవ కోసం ఎంతకైనా ఒదిగిపోతాడు. ఈ మధ్య ముఖ్యమంత్రి కేసిఆర్‌ కాళ్లు మొక్కాడన్న దానిపై వివాదం ఎదుర్కొంటున్నారు. కాని తాను చేసింది నూటికి నూరుపాళ్లు రైట్‌. అది నా ఇష్టం. స్వేచ్ఛ. తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ అంటే తెలంగాణ పిత. ఇందులో ఎలాంటి మొహామాటం లేదు. దేశ స్వాతంత్య్ర పోరాటం రెండు వందల సంవత్సరాల పాటు సాగింది. కాని ఆఖరుకు గాంధీ శకంలోనే స్వాతంత్య్రం సిద్దించింది. అందుకే ఆయనను జాతి పిత అంటారు. అలాగే తెలంగాణ ఉద్యమం ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైన 1956 నుంచే సాగుతోంది. 1969లో కూడా ఉవ్వెత్తున సాగింది. కాని తెలంగాణ రాలేదు. అందుకు కారణాలల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. కాని మలి దశ తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసిఆర్‌. ఆయన తెలంగాణ వచ్చేదాకా ఎత్తిన పిడికిలి దించలేదు. జెండా, ఎజెండా ఎక్కడా మారలేదు. అలసిపోలేదు. మడమ తిప్పలేదు. తెలంగాణ సాధించేవరకు వెనుతిరిగి చూడలేదు. ఎన్ని అవరోధాలెదురైనా, మోసాలు చేసినా, ఎంత మంది ఉద్యమాన్ని పలుచన చేయాలని చూసినా వెరవలేదు. పట్టిన పట్టు సడలకుండా పద్నాలుగేళ్లపాట నిర్విరామ ఉద్యమం చేసిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. కేసిఆర్‌తో అడుగులు వేసిన వారిలో కూడా చాలా మంది వెనుకడుగు వేశారు. ఉద్యమం నుంచి నిష్క్రమించారు. పారిపోయారు. తెలంగాణ వచ్చేదాకా నిలిచింది. గెలిచింది. కేసిఆరే…ఆయన నేతృత్వంలోనే తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్నది. ఆయనే తెలంగాణ సాధించింది. మరి అలాంటప్పుడు ఆయనను తెలంగాణ పిత అనడంలో ఎలాంటి సందేహం లేదని కరాఖండిగా చెబుతున్న శ్రీనివాస్‌ మనసులో మాట కట్టా రాఘవేంద్రరావుతో…

  నాకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ అంటే ఎంతో ఇష్టం. 

ఎంతో గౌరవం. పూజ్యనీయులు. పితృసమానులు. ఆయన కాళ్లు మొక్కడం తప్పని రాజకీయ పార్టీలు ప్రశ్నించడంలో అర్ధం లేదు. నేను ఎవరిని గౌరవించాలో, ఎవరిని ఆరాధించాలో కూడా ఎవరు పడితే వారు చెబుతారా? నా వ్యక్తిగత స్వేచ్ఛకు తావులేదా? నేను ఓ ఉద్యోగిని అనేది నా కర్తవ్యం వరకే…నా డ్యూటీ నేను ఎంత సమర్ధవంతంగా నిర్వహిస్తున్నానన్నది రాజకీయ పార్టీలకు , ప్రజలకు కూడా తెలుసు. ఒక్కసారి కరోనా సమయంలోకి వెళ్లి చూడండి. నేను పడిన శ్రమ, వేదన ఎంత వుందో అర్ధమౌతోంది. అందరిని ఇంట్లో సేఫ్‌గా వుండమని చెప్పిన నేను, కర్తవ్య నిర్వహణ కోసం కార్యాలయంలో వున్నాను. ప్రజలకు భరోసా నింపాను. ఆసుపత్రుల సందర్శించాను. అందుతున్న వైద్యం పర్యవేక్షించాను. ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి డ్యూటీ నిర్వహించాను. కాదని పారిపోలేదు. అంతే కాదు అలాంటి సమయంలో ప్రజల ప్రాణాలను చూసుకోవాల్సిన బాధ్యతలో వుంటూ, నా కన్న తండ్రిని కూడా చూసుకోలేకపోయాను. అలా సమాజానికి నేను చేస్తున్న సేవను కూడా స్వయంగా నా కన్న తండ్రి కూడా మెచ్చుకున్న సందర్భం వుంది.. అంతే కాని ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్లు మాట్లాడడం, ఇతరుల మనోభావాలు దెబ్బతీయడం ఒక ఫ్యాషన్‌ అయిపోయింది. నాకు గురుతుల్యులైనటువంటి ముఖ్యమంత్రి కేసిఆర్‌ అంటేనే స్వతాహగా నాకు ఎంతో ఇష్టం. ఆరాధ్య భావం. అలాంటిది మా భద్రాద్రి`కొత్తగూడెం జిల్లాకు మొదటి విడతలోనే మెడికల్‌కాలేజీ మంజూరు చేయాలని ప్రత్యేకంగా విన్నవించుకున్నాను. 

ముఖ్యమంత్రి కేసిఆర్‌ను ఒప్పించి, మా జిల్లాకు మెడికల్‌ కాలేజీ సాధించాను.

 అది ప్రారంభమైంది. ఆ సంతోషంలో నేను ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కృతజ్ఞతగా కాళ్లు మొక్కడం జరిగింది. అయినా ఎంబిబిఎస్‌ చదవు అంటే ఎంత గగనమో అనుభవించిన నా లాంటి వాళ్లకు తెలుసు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ మారు మూల గ్రామం నుంచి హైదరాబాద్‌ వెళ్లి ఎంబిబిఎస్‌ చదవడం అంటే ఆ రోజుల్లో ఎంత కష్టపడాల్సివచ్చిందో అనుభవపూర్వకంగా నాకు తెలుసు. అప్పుడు డాక్టర్లు సీట్లుతక్కువ. ఉమ్మడి రాష్ట్రంలో వందల్లో వుండేవి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త మెడికల్‌కాలేజీ ఇవ్వలేదు. కాని తెలంగాణ రాగానే కొత్త జిల్లాలు. ఆ జిల్లాలన్నింటిలో కొత్తగా మెడికల్‌ కాలేజీలు. దాంతో విద్యార్ధులకు వైద్య ఎంతో అందుబాటులోకి రానున్నది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మరింత అందడానికి వీలు కల్పించబడుతున్నది. ఇది తెలంగాణ ప్రజలకు గొప్ప అవకాశం. అంతే కాకుండా తెలంగాణలో వైద్య విప్లవం కొనసాగుతోంది. కరోనా సమయంలో కూడ పొరుగు రాష్ట్రాలనుంచి మన రాష్ట్రానికి వచ్చి వైద్య సేవలు పొందని వాళ్లు కొన్ని వేలల్లో వున్నారు. డిల్లీ లాంటి ప్రాంతాల్లోకూడా సిలిండర్లురోడ్ల మీద పెట్టుకొని వైద్యం చేయించుకున్న వాళ్లున్నారు. కాని తెలంగాణలో ఒక్క రోజు కూడా అలాంటి పరిస్ధితి ఎదురుకాలేదు. ప్రపంచాన్నే గడగడలాడిరచిన కరోనా ప్రభావం తెలంగాణలో ఎంతో కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ చూపిన చొరవ నాకు తెలుసు. 

అటు తెలంగాణ ఉద్యమం…ఇటు సంక్షేమ పాలన అంటే కేసిఆర్‌దే…

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఏ ముఖ్యమంత్రి ఇంత తక్కువ సమయంలో ఇంత అభివృద్ధి కళ్ల ముందు ఆవిష్కరించలేదు. ఇన్ని రకాల ప్రభుత్వ పధకాలు అమలు చేయలేదు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కానన్ని అనేక సంక్షేమ పథకాలు తెలంగాణలో మాత్రమే అమలౌతున్నాయి. అలాంటి ఫథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్‌ను ప్రజల్లో ఒకడిగా కృతజ్ఞతలు తెలపడం నా బాధ్యత అనుకున్నాను. నా దృష్టిలో ఆయన ఒక గొప్ప దార్శనికుడు. అందరికన్నా గొప్ప నాయకుడు. రాజకీయాల్లో అపర చాణక్యుడు. సంక్షేమంలో ఆయనను మించిన సామాజిక వేత్త లేడు. మరి అలాంటి నాయకుడి కోసం నాలాంటి వారు చెప్పాల్సిన అవసరం వుంది. రేపటి తరానికి కేసిఆర్‌ గొప్పదనం తెలియాల్సివుంది. 

 ఇక రాజకీయాలంటారా? 

అది నా వ్యక్తిగతం. మా కుటుంబ నేపధ్యమే ఉద్యమ పోరాటం. తెలంగాణ సాయుధపోరాటంలో మా కుటుంబం పాల్గొన్నది. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన నాకు సామాజిక సృహ వుంది. ప్రజలకు మరింత సేవ చేయాలని వుంది. మనం అనుకున్నవన్ని జరక్కపోవచ్చు. కాని ప్రయత్నంలో తప్పులేదు. గత ముప్నై ఏళ్లుగా ప్రజల సేవలో ప్రత్యక్షంగా వున్నాను. వారి ఆరోగ్య పరిరక్షణ కోసం పనిచేశాను. ఉద్యోగ విరమణ తర్వాత కూడా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. రాజకీయాలను ఎంచుకోవడంతో తప్పులేదు. ప్రజలకు మరింత సేవ చేయడానికి సిద్దంగా వున్నాను. అది నా వ్యక్తిగత బాధ్యత అనుకుంటున్నాను. నాకు ప్రజా సేవ చేయడం ఇష్టం. ప్రజల్లో వుండడం ఇష్టం. వారితో కలిసి నడవడమే ఇష్టం. అలాంటప్పుడు ముందస్తు ప్రణాళిక చేసుకోవడంలో తప్పేంటి? ఏ వ్యక్తి అయినా రిటైర్డ్‌ అయ్యాక ఏం చేయాలన్నదానిని ప్లాన్‌ చేసుకుంటారు. అలాగే నేను వృత్తి పరంగా రిటైర్డ్‌ అయినా, ప్రవృతిత్తి పరంగా రిటైర్డ్‌ కాలేను. అందుకే ప్రజల్లో వుండాలనుకుంటున్నాను. ఇందులో ఎవరికీ అభ్యంతరాలుండాల్సిన అవసరంలేదు. చర్చోపచర్చలకు తావులేదు. నేను బిసిని. ఎంతో కష్టపడ్డాను. కింది స్ధాయినుంచి వచ్చాను. ప్రజాసేవలో కొనసాగుతున్నాను…ఇక ముందు కూడా కొనసాగుతాను…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *