ఉత్తపుణ్యానికి ఎందుకియ్యాలిరా!? మహానగర పాలికలో మాయాజాలం!

`మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో ఉద్యోగాలిస్తామని ఆశ పెట్టి, తిట్టిందెవరు?

`సాయం చేస్తున్నట్లే నటించి, నిండా ముంచిందెవరు?

` 51 మంది ఆశలపై నీళ్లు చల్లిందెవరు?

`మంత్రి కేటిఆర్‌ ఆదేశాలను బేఖాతరు చేసిందెవరు?

` కౌన్సిల్‌ తీర్మానం పక్కన పెట్టి ఇచ్చిన 450 కొత్త కొలువుల మతలబు ఏమిటి?

`పంపకాలను తీవ్రంగా తప్పు పట్టిన ఆ సీనియర్‌ నాయకుడు ఎవరు?

`అలాంటి పనులు చేయొద్దని హెచ్చరించిందెవరు?

`అయినా పెడచెవిన పెట్టిందెవరు?

` 51 మందిని పక్కన పెట్టి, కొత్త వాళ్లకు కొలువులివ్వడంపై కమీషనర్‌ ఏమన్నారు?

`51 మంది చిట్స్‌ వేయాలని ఆదేశించింది ఎవరు?

` వీళ్లు అన్యాయం కావడానికి సూత్రదారి ఎవరు? పాత్రదారి ఎవరు?

` ఎంత కాలం వీళ్లను తిప్పుకుంటారు?

` నాయకులకు ప్రజల్లో చులకనౌతామన్న సోయి లేకుండా పోయిందా?

`నాయకులు చేస్తున్న పనిని ఇప్పటికైనా అధికారులు గుర్తించండి!

`గృహ నిర్మాణ శాఖ నుంచి వచ్చిన బాధిత ఉద్యోగుల పట్ల జాలి చూపండి!

హైదరాబాద్‌,నేటిధాత్ర:

 దేవుడు వరమిచ్చినా, పూజారి కనికరించడం లేదన్నట్లుంది వాళ్ల పరిస్థితి. అవ్వా…బువ్యెయ్యవా… అని అడుక్కుంటే నీకేస్తే నాకేమొస్తది…అనే వాళ్లు కూడా వుంటారేమో? అని కొందరు నాయకులను చూస్తే అర్థమౌతుంది. వాళ్లు అభాగ్యులు…నిర్భాగ్యులు. వాళ్లకయ దిక్కులేక, సక్కిలేక నాయకుల కాళ్లా వేళ్లా పడుతున్నారు. ఆరేళ్లుగా ఎక్కేగడప, దిగే గడప అన్నట్లు కాళ్లరిగేలా, నాయకుల మనసు కరిగేలా తిరుగుతున్నారు. ప్రాదేయ పడుతున్నారు. కానీ కనికరించే వారేరీ…పైకి అందరూ చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నాయి. వాళ్ల కథ వింటూ అయ్యో అంటున్నారు. అన్యాయం జరిగిందంటున్నారు. మరి న్యాయం మాత్రం చేయడం లేదు. 

ఉత్తపుణ్యానికి ఎందుకియ్యాలిరా!?

 మీకు ఉద్యోగాలు ఇస్తే నాకేమొస్తుంది. మీరే కదా! సార్‌ ఉద్యోగాలు ఇస్తామని మంత్రి కేటిఆర్‌ ముందు మాట ఇచ్చింది.. మీ ఆశీస్సుల కోసం కొలువుల కోసం ఎదురుచూస్తున్నాం…వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో కొత్తగా 450 ఉద్యోగాలు ఇచ్చారు…మాకు మొండి చేయి చూపారు. మేమెన్నో ఆశలు పెట్టుకున్నాం…అని ఆ బాధితులు అన్నారు….అయతే నన్నేం చేయమంటారు. ఆ కాంట్రాక్టు ఉద్యోగాలకు ఒక్కొక్కరు ఎంత ఇచ్చారో తెలుసా? మీ వల్ల అవుతుందా? ఇవ్వగలరా? ఇదీ ఆ జిల్లాకు చెందిన ఆ నాయకుడు చెప్పిన మాట. కొలువులు కోల్పోయిన గృహ నిర్మాణ శాఖలో పని చేసిన బాధితులు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో ఓ పెద్ద మనిషి మధ్య జరిగిన సంభాషణ. అంటే అందరి ముందు పేరు కోసం, గొప్ప కోసం చెప్పి, నాలుగు గోడల మధ్య ఆ పెద్ద మనిషి తన మనసులో ఏముందో చెప్పిన విషయం… కాదు..కాదు…తేల్చేసిన విషయం. ఎంతో అశతో మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో ఉద్యోగాలిస్తామని ఆశ పెట్టి, తిట్టినా పడుతున్నారు. ఎప్పుడో అప్పుడు కనికరించకపోతారా! అని ఆశగా ఎదురుచూస్తున్నారు. సాయం చేస్తున్నట్లే నటించి, నిండా ముంచారని తెలిసినా ఏమీ అనలేని నిస్సహాయకులు. అందుకే 51 మంది ఆశలపై ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతూనే వున్నారు. ఆశలు సజీవంగా వుంచుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. 

తమ పార్టీ నాయకులపై మంత్రి కేటిఆర్‌ ఎంతో నమ్మకం.

 తాను చెప్పిన తర్వాత కూడా పని చేయకుండా వుంటారా? అనే విశ్వాసం. కానీ జరుగుతున్నది వేరు. మంచి పనులు చేసి, పార్టీకి మంచి పేరు తెచ్చిపెట్టాల్సిన వాళ్లు చేస్తున్న పనికిమాలిన పని కేటిఆర్‌ కు తెలియదు. నిజానికి ఈ 51 మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారనే కేటిఆర్‌ అనుకుంటున్నారేమో! ఒకసారి ఖమ్మంలో పాలేరు ఎన్నికల సమయంలో కేటిఆర్‌ మాటిచ్చారు. అది కొంత కాలం వాయిదా పడిరది. తర్వాత వరంగల్‌ వచ్చినప్పుడు జిల్లాకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారుల సాక్షిగా మంత్రి కేటిఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు అప్పటి మున్సిపల్‌ కమీషనర్‌ కాదన లేదు. జిల్లాకు చెందిన నాయకులు అభ్యంతరం చెప్పలేదు. ప్రజా ప్రతినిధులు అందరూ సరే అని తలూపారు. మళ్ళీ చెబుతున్నా…నాకు మాట రావొద్దని కూడా కేటిఆర్‌ మరీ, మరీ చెప్పాడు. కానీ అందరూ కలిసి మంత్రి కేటిఆర్‌ మాట బేఖాతరు చేశారు? ఎలాంటి టెక్నికల్‌ ఇబ్బందులు లేవు. పైగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఒకసారి కాదు, రెండు సార్లు చేసింది. అయినా చేతులెత్తేసింది. కారణం ఎవరు? అధికారులు మారుతున్నారు. నాయకులు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్లే కదా! వున్నారు. 

వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో కొత్తగా ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా 450 ఉద్యోగాలు ఇచ్చారు. 

అందులో సదరు 51 మంది గృహ నిర్మాణ శాఖ నుంచి తొలగింపబడిన వాళ్లు వుంటారని అందరూ అనుకున్నారు. కానీ వాళ్లు అక్కడ వుండగానే కొత్త వాళ్లకు ఇచ్చారు. వీళ్లను ఎందుకు పక్కకు పెట్టారనేది ఎవరూ చెప్పరు? కౌన్సిల్‌ తీర్మానం పక్కన పెట్టి మరీ కొత్త వారికి 450 కొత్త కొలువుల కట్టబెట్టారు. ఇందులో వున్న మతలబు ఏమిటి? అన్నది తెలిస్తే విస్తుపోవాల్సిందే! ఆ 450 కొలువుల విషయంలో జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడికి, ఓ నేత ఫోన్‌ చేసి మీ వంతు ఇది? అని చెప్పారట. అంతే ఆ సీనియర్‌ నాయకుడు ఫోన్‌ చేసిన నేతపై ఆగ్రహం వ్యక్తం చేశారట! అసలు ఏమనుకుంటున్నారు? ఇలా చేయొచ్చా? తప్పు …అలాంటి పనులు చేయకండి. మంచిది కాదు. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరొస్తుందని సీనియర్‌ నాయకుడు తీవ్రంగానే మందలించారట. తాను ఇలాంటి వాటిని సహించను. అని కూడా చెప్పారట. అయినా జిల్లాకు చెందిన నేతలు ఎవరూ ఆ సీనియర్‌ నాయకుడి మాట కూడా వినలేదు. ఆయనకు తెలియకుండానే చేయాల్సింది చేశారు. తిలా పాపం తలా పంచుకున్నారు. 

నగర పాలక సంస్థ లో 51 మందిని రిక్రూట్‌ చేసుకుంటామని చెప్పి, పక్కన పెట్టడాన్ని ఓ కమీషనర్‌ కూడా అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది.

 వాళ్లను కాదని ఇతరులకు ఉద్యోగాలివ్వడం నైతికత కాదు. ఒక వేళ వీళ్లు ట్రిబ్యునల్‌ ను ఆశ్రయిస్తే ఉద్యోగులకు నష్టం జరుగుందని కూడా కమీషనర్‌ హెచ్చరించారట. అయినా నాయకులు వినలేదు. వీళ్లకు కొలువులియ్యలేదు. ఇదిలా వుంటే ఆలూ లేదు, చూలు లేదు కానీ కొడుకు పేరు ఏదో చెప్పినట్లు, ఉద్యోగాలు ఇస్తాం…కానీ మీరు చిట్టీలు మాత్రం మా చిట్‌ కంపెనీలోనే వేయాలని కూడా, ఉద్యోగాలకు అడ్డుపడ్డ నాయకుడే అన్నాడట. 51 మంది అభాగ్యులు అన్యాయం కావడశనికి ఇద్దరు కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. నగరపాలికలో వీళ్ళిద్దరూ క్రియాశీలక పాత్ర పోషించారు. ఎంత కాలం వీళ్లను తిప్పుకున్నారు. రేపు, మాపు అంటూ ఏళ్ల తరబడి వారిని తిప్పుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా వాళ్లకు దారి చూపలేదు. నాయకులకు ప్రజల్లో చులకనౌతామన్న సోయి లేకుండా పోయింది. అధికారులు ఇప్పటికైనా నాయకులు చేస్తున్న పనిని గుర్తించండి! గృహ నిర్మాణ శాఖ నుంచి వచ్చిన బాధిత ఉద్యోగుల పట్ల జాలి చూపండి! వారికి మీరైనా దారి చూపండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *