`వయస్సు పెంచమంటావా నాయనా!!

`తహసీల్దారు కార్యాలయాలే అడ్డా…!

`ఆసరా పెన్షన్ల పేరుతో దళారులతో కలిసి ఉద్యోగుల అడ్డగోలు దందా?

`తహసీల్దారుల అండ…కార్యాలయ సిబ్బందికి పండగే పండగ.

`తహసీల్దారు లాగిన్‌ ఐడి ఉద్యోగుల చేతికి, తంతు పూర్తి కాగానే పాస్‌ వర్డ్‌ కొత్తది…

`తహసీల్దారు కార్యాలయాల్లో సరి కొత్త ఆదాయమార్గం…

`ఆధార్‌ కార్డుల్లో వయస్సు పెంపులు 

`ఆధార్‌లో వయస్సు మార్పుకు మినిమమ్‌ నాలుగువేలు..

 

`అవసరాన్ని బట్టి ఎన్ని సంవత్సరాలు కలిపితే అన్ని రెండు వేలు అదనం.

`తెలంగాణ వ్యాప్తంగా తహసీల్దారు కార్యాలయాల్లో నిత్యం ఇదే పని…

`కొత్త ఆసరా లబ్ధిదారుల అప్లికేషన్లు కోసం అధికారుల అవినీతి.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

సక్రమంగా సంపాదించాలనుకునేవారికి అవకాశాలు కరువు. అడ్డగోలు సంపాదనకు మరిగిన వారికి ఊరంతా అరువు అని ఓ సామెత. ప్రజలు మభ్యపెట్టి, మాయ చేసి, ఆశచూపి, ప్రభుత్వాలను మోసం చేసి, తన పబ్బం గుడుపుకునే వాళ్లు ఎక్కువయ్యారు. అవినీతి అధికారులు వారికి తోడౌతున్నారు.ప్రజలను తోడేళ్లలా తోడేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను బురిడీ కొట్టించే పనులు చేస్తున్నారు. అందిన కాడికి దండుకుంటున్నారు. లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. అక్రమ మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రజల బలహీనతలతో ఆడుకుంటున్నారు. మోసం, నమ్మక ద్రోహమే భుక్తిగా చేసుకొని దళారీ అవతారంతో బతుకు వెళ్లదీస్తున్నారు. దర్జా వెలగబెడుతున్నారు. వారిని నమ్మిన పాపానికి అమాయకులు నేరస్ధులను చేస్తున్నారు.

నెల నెల వేలాది రూపాయలు జీతం తీసుకునే అధికారులు కూడా అలాగే తయారౌతున్నారు. అక్రమార్కులకు సహకరిస్తున్నారు. రాజకీయ ముసుగులో వున్న కొందరు దళారులకు అధికారులు కొమ్ముకాస్తున్నారు. వారికి ఆత్మీయులౌతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలనే అడ్డాలుగా చేసుకొని అడ్డగోలు సంపాదనను తెగబడి అడ్డదిడ్డంగా సంపాదించుకుంటున్నారు. మీకింత, మాకింత అనుకుంటూ వాటాలు పంచుకుంటున్నారు. పెద్దమనుషుల్లా చెలామణి అవుతున్నారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు అమాయకులను చేసి ప్రజలకు లేని పోని ఆశలు కల్పించి, వారి నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో ఇదే అదునుగా కొందరు దళారులు దందా మొదలుపెట్టారు. అందుకు తహసిల్థార్‌లు సహకరిస్తున్నారు. కార్యాలయంలోని ఉద్యోగులు , కాంపూటర్‌ ఆపరేటర్లు ఈ కార్యాలు చేసి పెడుతున్నారు. ఆధార్‌ కార్డులలో వయసు ఎక్కువ చేసి, ఆసరాకు దరఖాస్తుచేసుకునే వెసులుబాటు చేస్తున్నారు. ఇలా తెలంగాణలో ఇప్పటికే కొన్ని వేల మందికి ఆధార్‌లలో మార్పులు చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఓ పెద్దవ్వ నీకు ఫించన్‌ వస్తుందా? 57 ఏండ్లున్నొళ్లకే ఒస్తది కదా? నీ ఆధార్‌ కారట్‌లో ఎంతున్నవని వుంది? ఎమ్మె బిడ్డ…తీసుకరాపో…సూత్త…ఇగో…మూడేండ్లు తక్కువుంది…ఆ మూడేండ్లు కలిపితే అయిపాయే…నీకు పింఛన్‌ వస్తది…గట్లేట్ల చేత్తరు బిడ్డ…నేం చేపిత్త…మరి కర్సయితది పెట్టుకుంటువా? ఫించన్‌ వస్తదంటే పైసలిత్త? ఎంత? ఐదు వేలు…! గంతనా? వుత్తగనే అయితదా? ఎమ్మార్వోకియ్యాలే…ఆఫీసుల పనిజేసెటోల్లకియ్యాలే…వుట్టిగనే అయితదా పెద్దవ్వ! అయితేమాయ్‌ తియ్యి బిడ్డ…తెచ్చిత్త…! ఓ పెద్దయ్య…! పించన్‌ ఒస్తుందా? లేదే! ఇప్పియ్యాల్నా? ఇప్పిత్తవా? కర్సువెట్టుకోవాలే…మరి…ఎంతైతది బిడ్డ…ఎంతనే ఓ ఆరువేలు ఇత్తివాంటే సాలు…! ఆరు వేలెక్కడియిబిడ్డ…! తినెతందుకే కట్టం కావట్టే…! ఆడాదికి ఇరవై నాలుగు వేలత్తయి…ఆరు వేలు అనుకుంటే వస్తయా? సరే…తెత్తాగు…! ఆధార కారటు సూడ తే…! అమాయకులైన గ్రామీణ పేదలతో దళారులు చేస్తున్న మోసాలు…! ఇవి ఇప్పుడు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో జరుగుతున్న తంతు…! పింఛన్‌ వయసుకు దగ్గరున్నవారు…లేక యాభై ఏళ్లు దాటిన వారికి వల వేసే దందా సాగుతోంది. దసరాకు కొత్త పించన్లు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ దందా మొదలైంది. సహజంగా ఆధార్‌ కార్డుల్లో ఏవైనా లోపాలు వుంటే సవరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆధార్‌ సెంటర్లు ఏర్పాటు చేసింది.

కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. అక్కడ ఆధార్‌లలో మార్పులు అంటే కొంత తిరకాసు వ్యవహారమే…! మార్పులకు గెజిటెడ్‌ సంతకాలు అవసరం…లేకుంటే సంబంధిత కౌన్సిలర్ల సంతకాలు…ఇలా కొన్ని రకాల ఇబ్బందులు తప్పవు. అన్ని పూర్తి చేసుకున్నా ఆ ఆధార్‌ కార్డు రావడానికి కనీసం వారం నుంచి పది రోజులు పట్టొచ్చు. ఆదార్‌ సెంటర్‌ ఆపరేటర్‌ మళ్లీ ఏదైనా పొరసాటు చేస్తే మళ్లీ దాన్ని పునర్దురించుకోవాలంటే మరో పది రోజులు…ఇదంతా కాలయాపన. పైగా రోజుల తరబడి ఎదురుచూపు. టోకెన్‌ తీసుకోవాలి. రెండు రోజులు పెట్టొచ్చు…! ఇవన్నీ పూర్తి చేసుకునేలోపు పుణ్యకాలం పూర్తి కావొచ్చు. ప్రభుత్వ ప్రకటించిన గడవు వెళ్లిపోవచ్చు. ఇదంతా ఎందుకు అనుకుంటే చాలు. కాలు కదపకుండా వుండేలా కొందరు దళారులు, తహసిల్ధార్‌ కార్యాలయంలో సిబ్బంది కలిసి ఐదు నిమిషాల్లో ఆధార్‌కార్డులో వయసు సవరించేస్తారు. ఆసరా పెన్షన్‌ ధరఖాస్తు చేసుకోవడానికి సహకరిస్తారు…! ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న అతి పెద్ద కుంభకోణం. అమాయకులైన ప్రజల నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. వయసు సరిచేయడంలో సుమారు రూ.4 వేలు వసూలు చేస్తున్నారు. అది కూడా ఓ నాలుగైదు సంవత్సరాలు సరి చేయాలంటే మాత్రం పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. తాజాగా వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన నర్సంపేట డివిజన్‌, నెక్కొండలో ఇద్దరు వ్యక్తుల సంభాషణ వెలుగులోకి వచ్చింది. గత కొంత కాలంతా ఈ దందా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోందని తెలుస్తోంది. ఓ వ్యక్తి తహసిల్తార్‌కార్యాలయంలోని కంపూటర్‌ ఆపరేటర్‌కు ఫోన్‌ చేసి, ఆదార్‌ కార్డులో వయసు ధృవీకరణలో మార్పు చేయాలని కోరితే…ఎంత పట్టుకురావాలో కూడా స్పష్టంగా చెబుతున్నారు. ఇదంతా భహిరంగ రహస్యమే అన్నంత దర్జాగా ఈ దందా నిర్వహిస్తున్నారు.తహసిల్ధార్‌ల ప్రమేయంతో విచ్చలవిడిగా జరుగుతోంది. ఇలాంటి వ్యవహారాలు జరగాలంటే తహసిల్ధార్‌ సహాకారం ఎంతో అవసరం. అంతే కాదు ఆయన లాగిన్‌ ఐడి కూడా ఎంతో అవసరం. సంబంధిత కంప్యూటర్‌ ఆపరేటర్‌కు తహసిల్ధార్‌ లాగిన్‌ ఐడి ఇచ్చేస్తాడు. తంతు పూర్తి కాగానే మళ్లీ ఆ తహసిల్ధార్‌ తన పాస్‌ వర్డ్‌ చైంజ్‌ చేసేస్తాడు..ఇలా చేసినందుకు ప్రతి కార్టు సవరణకు తహసిల్ధార్‌లకే రూ.2వేలు ఇస్తున్నట్లు కూడా ఓ ఆపరేటర్‌ వెల్లడిరచిన ఆడియో సర్కులేట్‌ అవుతోంది. అంటే ఇంత విచ్చలవిడిగా ఈ వ్యవహారం సాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆసరా పథకాన్ని ప్రకటించారు.

గతంలో రూ. వెయ్యి రూపాయలు ఇచ్చేవారు. గత ఎన్నికల ముందు ఈ ఫించన్లను రూ.2016 చేశారు. పైగా ఆసరా ఫించన్ల అర్హుత వయసు గతంలో 59 సంవత్సరాలు వుండేది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం 57 సంవత్సరాలకు తగ్గించారు. దాంతో అనేక మంది ఆసరాకు అర్హులయ్యారు. ఇదే అదునుగా కొందరు అవకాశవాదులు ఆసరా ఫించన్ల పధకాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అధికారులతో కుమ్మక్కై అసలు పథకాన్ని భ్రష్టు పట్టించే వ్యవహారం నడిపిస్తున్నారు. గతంలో వయసు మళ్లిన వారికి ఫించన్‌ రావాలంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. తర్వాత రూ. 200 వచ్చేది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసిఆర్‌ రూ. వెయ్యి ప్రకటించారు. మళ్లీ దాన్ని రూ.2వేలకు సవరించారు. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా కేవలం తెలంగాణలో మాత్రమే రూ.2వేలు ఆసరా ఫించన్లు అందుతున్నాయి. పైగా 57 ఏళ్ల వయసు వుంటే చాలు ఫించన్లు అందజేస్తున్నారు. ఇది దళారులకు అవకాశంగా మారింది. అమాయకులకు వయసు సరిచేసి, వారికి తేనిపోని ఇబ్బందులు తెచ్చే దందా సాగుతోంది. పైగా ప్రభుత్వ పథకం లక్ష్యానికి తూట్లు పొడిచేలా వున్నారు. ఆ పధకం నీరుగార్చేలా దళారులు, అధికారులు స్వార్ధం కోసం పథకాన్నే భ్రష్టు పట్టిస్తున్నారు. భవిష్యత్తులో అర్హులైన వారికి కూడా పించన్లు అందకుండా పోయే ప్రమాదాన్ని సృష్టిస్తున్నారు. ప్రభుత్వం కూడ అందుకు కేటాయించే బడ్జెట్‌ విపరీతంగా పెరిగిపోతే అసలు పధకం అమలుపైనే నీలి నీడలు కమ్ముకునే ప్రమాదం లేకపోలేదు. లేకుంటే ప్రభుత్వమే ఏదైనా ఎంక్వైరీ వేస్తే అసలుకే మోసం రావొచ్చు. అమాయకులైన ప్రజల మీద కూడ కేసులు నమోదు కావొచ్చు. ప్రజలరా తస్మాత్‌ జాగ్రత్త…దళారులు చెప్పారు కదా? అని అర్హత లేకున్నా, వయసు లేకున్నా పించన్‌ కొసం అడ్దదారులు తొక్కితే తీరని నష్టం జరగొచ్చు.

Leave a Reply

Your email address will not be published.