ఆశ నిరాశల 2022. ఆశాజనకమౌనా 2023.

`కరోనా పీడ వదిలించిన 2022.

`ఆఖరులో ఒక భయం కూడా చూపించింది.

`దేశ రాజకీయాలలో 2022 ఒక సంచలనం.

`టిఆర్‌ఎస్‌ ….బిఆర్‌ఎస్‌ గా ఆవిర్భావం.

`2022 బిఆర్‌ఎస్‌ కు తొలి విజయం.

`దేశ చరిత్రలో బిఆర్‌ఎస్‌ సరికొత్త అధ్యాయం.

`కొంత పుంజుకున్న బిజేపి.

`అదే లుకలుకల నడుమ కాంగ్రెస్‌.

`మళ్ళీ తెలంగాణలో తెలుగు దేశం అడుగులు.

`షర్మిల పార్టీ పెట్టి పాదయాత్ర.

`వివాదాల నడుమ రాజకీయ పాత్ర.

`కొత్త ఏడాదిలో తెలంగాణలో ఎన్నికల కోలాహలం.

`అన్ని రాజకీయ పార్టీల భవితవ్యం తేలనున్న తరుణం.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

గడచిన ఏడాది మిగిల్చిన స్మృతులు…కొత్త ఏడాది దారులు. నిన్న, నేడు, భవిష్యత్తు ఇది నిత్య జీవితంలో కదిలేవే…ఎదురయ్యేవే…కానీ గత ఏడాది రాజకీయాల కాస్త రసవత్తరంగానే సాగాయి. గత ఏడాది దేశ రాజకీయాలలో కూడా సరికొత్త ఆవిష్కరణ జరిగాయి. ముందుగా 2022 ఆరంభం కొంత ఇబ్బంది కరంగానే వుంది. ప్రపంచమంతా కరోనా పరిస్థితులు ఎలా వుంటాయన్న దానిలో ఎవరికీ క్లారిటీ లేదు. అలాంటి రోజుల నుంచి తేరుకొని, మళ్లీ మామూలు జీవితాలు గడపడానికి అనువైన పరిస్థితులు మోసుకొచ్చిన ఏడాది. కాకపోతే ఏడాది చివరలో మళ్ళీ ఒక్కసారి కలకలం రేగినంత పనైంది. చైనాలో మళ్లీ కరోనా సీరియస్‌ వేవ్‌ అన్న వార్తలు ప్రపంచాన్ని ఒక్కసారి కుదిపేసినంత పనైంది. అయినా ఏడాది చివరలో ఊపిరిపీల్చుకునేలా చేసింది. గత ఏడాది ఎంత సంతోషంగా ప్రజలు ఆహ్వానం పలికారో వీడ్కోలు కూడా అంతే ఆనందంగా పలకడం అన్నది 2022 ప్రత్యేకత అని చెప్పకతప్పదు. కరోనా పీడ వదిలించిన 2022. రెండు సంవత్సరాల పాటు ఒక కుదుపు కుదిపిన కరోనా రకరకాల వేరియంట్ల రూపంలో విరుచుకుపడిరది. అతలాకుతలం చేసింది. 2022 వచ్చే సరికి శాంతించింది. డిసెంబరు నెలలో మళ్ళీ గడగడలాడిస్తుందేమో! అన్న భయాన్ని మోసుకొచ్చింది. చైనాలో ప్రజలు లాక్‌ డౌన్‌ ను తట్టుకోలేక ఒక్కసారిగా ప్రజలు ఆందోళన మొదలుపెట్టారు. దాంతో అక్కడి ప్రభుత్వం ప్రజలపై వున్న ఆంక్షలను సడలించింది. కాకపోతే అలా వదిలేయడమే మంచిదైందని చైనా తెలుసుకున్నది. సెకెండ్‌ వేవ్‌ వరకే మన దేశంలో ప్రజల్లో ఇమ్యూనిటీ లెవల్స్‌ బాగా పెరిగాయి. ప్రజలంతా సామూహికంగా గుమిగూడడం వంటి వాటి వల్ల హార్డ్‌ ఇమ్యూనిటీ పెరిగింది. చైనా మొన్నటి వరకు జీరో కోవిడ్‌ పేరుతో లాక్‌ డౌన్‌ మూలంగా అక్కడ ప్రజలకు ఇమ్యూనిటీ పెరగలేదు. ఒక్కసారిగా ఆంక్షలు సడలించడంతో చైనాలో కోవిడ్‌ తొలిరోజులు కనిపించినంత పనైంది. మన దేశంలో కూడా ఆంక్షలు పెట్టొచ్చన్నంత దాకా ప్రచారం సాగింది. ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తంగా వుండాలని సూచించాయి. అయితే చైనాలో కోవిడ్‌ బిఎఫ్‌ 7 కేసులు పెరిగాయే కాని, భయపడినంత ప్రళయం జరగలేదు. దాంతో ప్రపంచమంతా ఊపరిపీల్చుకున్నది. కొత్త సంవత్సరం వేడుకలు ప్రపంచమంతా ఆనందోత్సాహాలతో జరుపుపున్నది. 

ఇక దేశ రాజకీయాల విషయానికి వస్తే తెలంగాణ వరకే పరిమితమైన టిఆర్‌ఎస్‌, పేరు మార్చుకొని బిఆర్‌ఎస్‌ అయ్యింది. 

జాతీయ స్థాయి పార్టీగా అవతరించింది. ఇది గత ఏడాదిలో నమోదైన సంచలనమనే చెప్పాలి. ఇదిలా వుంటే డిల్లీలో కార్యాలయం ఏర్పాటు చేసి, అక్కడ బిఆర్‌ఎస్‌ ప్రకటించడం అన్నది మొత్తం 2022కే ఒక సంచలనం. ఇక రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారడం అన్నది ఒక సంచలనం. దక్షిణాదికి చెందిన ఓ నేత హస్తిన కేంద్రంగా జాతీయ రాజకీయాలను మార్చుతానని చెప్పిన మొదటి వ్యక్తి కేసిఆర్‌ అనే చెప్పాలి. రాష్ట్ర రాజకీయాలలో ఇది కీలక మలుపు అని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భవిష్యత్తు రాజకీయాలు ఎలా వుంటాయన్నది పక్కన పెడితే, దేశ రాజకీయాల దశ..దిశ మార్చేందుకు నేను రెడీ…అని అడుగులు వేసింది. 2022 బిఆర్‌ఎస్‌ కు మునుగోడు తొలి విజయం. దేశ చరిత్రలో బిఆర్‌ఎస్‌ సరికొత్త అధ్యాయం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రధాని అవుతారా! అన్నది కూడా తేలేందుకు కొత్త ఏడాది ఎలా సహకరిస్తుందనేది కూడా చూడాలి. 

దేశంలో జరిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నికలలో ముఖ్యంగా గుజరాత్‌ లో బిజేపి ఏడొసారి విజయం సాధించింది.

 గత ఎన్నికలలో అత్తెసరు సీట్లతో గెలిచిన బిజేపి, ఈ సారి మరింత పుంజుకొని గొప్ప విజయం సొంతం చేసుకున్నది. డిల్లీలో రెండు సార్లు గెలిచి, గత ఏడాది జరిగిన పంజాబ్‌ ఎన్నికలలోనూ విజయకేతనం ఎగురవేసిన ఆప్‌ పార్టీ గుజరాత్‌ లో దూకుడు ప్రదర్శించింది. ఎన్నికలలో ప్రచారంలో గెలిచేది మేమే రాసిపెట్టుకోండి అని సవాలు విసిరింది. దేశ ప్రజలందరూ ఆసక్తి కనబర్చారు. కానీ ఆప్‌ కనీసం సింగిల్‌ డిజిట్‌ కూడా దాటలేకపోయింది. బిజేపికి గట్టి పోటీ ఇచ్చినట్లు కనిపించినా అంతగా రాణించలేదు. ప్రతిపక్షాలు ఎంత సమర్థవంతంగా పని చేసినా బిజేపికి యాభై శాతం పైగా ఓటింగ్‌ నమోదు కావడం అన్నది ఒక రకంగా రికార్డే అని చెప్పాలి. ఇక తెలంగాణ లో కూడా బిజేపి కొంత పుంజుకున్నది. తెలంగాణ లో వచ్చిన రెండు ఉప ఎన్నికలలో బిజేపి గెలవడం కూడా ఆ పార్టీలో ఊపు పెంచింది. ముఖ్యంగా యువతను పెద్ద ఎత్తున బిజేపి ఆకర్షిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దుబ్బాక, హుజూరాబాద్‌ ఎన్నికలలో బిజేపి అభ్యర్థులు గెలవడం అన్నదే ఇక్కడ హైలెట్‌ గా మారింది. ఇక తెలంగాణ మేమే అన్నంత అతి విశ్వాసానికి వెళ్ళిన బిజేపి కోరి, కోరి మునుగోడు ఉప ఎన్నిక తెచ్చింది. రాజగోపాల్‌ రెడ్డి ని పార్టీలో చేర్చుకొని రాజీనామా చేయించి, ఉప ఎన్నిక తెచ్చింది. రాజగోపాల్‌ రెడ్డి మీద వున్న అతి నమ్మకం బిజేపి కొంప ముంచింది. రాష్ట్ర నాయకులు చెప్పే విషయాలను గుడ్డిగా నమ్మడానికి వీలు లేదని తెలుసుకున్నది. ఇదిలా వుంటే, బిజేపి అంతర్గత పోరు బాగానే వుంది. ఎలాగైనా వచ్చే ఎన్నికల దాకా అధ్యక్షుడుగా తానే వుండాలన్న పట్టుదలతో బండి సంజయ్‌ ప్రజల్లో వుంటున్నాడు. ప్రజా సంగ్రామ యాత్ర సాగిస్తున్నాడు. క్రెడిట్‌ మొత్తం బండి సంజయ్‌ కొట్టేస్తున్నాడు. పైగా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌ షాల చేతలు పదేపదే శభాష్‌ అనిపించుకుంటున్నాడు. కిషన్‌ రెడ్డి కేంద్ర మంత్రిగా వున్నా ప్రజలకు దగ్గర కాలేకపోతున్నాడు. పార్టీని గ్రిప్పులో పెట్డుకోలేకపోతున్నాడు. ఇక బిజేపి లో చేరి, హుజూరాబాద్‌ నుంచి గెలిచిన ఈటెల రాజేందర్‌ చేరికల కమిటీ చైర్మన్‌ ను చేసి బిజేపి చేతులు దులుపుకున్నది. బండి సంజయ్‌ కు ఫ్రీ హాండ్‌ ఇచ్చింది. 

 అదే లుకలుకల నడుమ కాంగ్రెస్‌.

 కాంగ్రెస్‌ పరిస్థితి ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. తెలంగాణ వచ్చిన నుంచి కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతూనే వుంది. 2014 నుంచి ఇప్పటి వరకు ముగ్గురు పిసిసి. అధ్యక్షులయ్యారు. ఎన్ని వివాదాలు వున్నా, కాంగ్రెస్‌ లో అల్ల కల్లోలం కాలేదు. ఎప్పుడైతే రేవంత్‌ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాడో అప్పటి నుంచి రోజూ వివాదమే. ఆయనపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేయలేని రోజంటూ లేదు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నుంచి మునుగోడు దాకా వివాదాలు మూటగట్టుకున్నాడు. ఇటీవల కొత్త పిసిసి కార్యవర్గం, జిల్లాల కమిటీ ఏర్పాటు పెద్ద దుమారం లేచింది. ఈ కొత్త ఏడాది లో రేవంత్‌ రెడ్డి భద్రాచలం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మరో వైపు పార్టీ వ్యవహారాల ఇన్‌ ఛార్జి మాణిక్యం ఠాకూర్‌ ను మార్చుతారన్న వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికలు రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోనే కాంగ్రెస్‌ పార్టీ ఎదుర్కుంటుందని తెలుస్తోంది. కాకపోతే రేవంత్‌ రెడ్డి ని మార్చితేనే మంచిది అని సీనియర్లు పట్టుబడుతున్నట్లు తెలిసిందే. 

మళ్ళీ తెలంగాణలో తెలుగు దేశం అడుగులు.

 ఇక తెలంగాణలో తెలుగు దేశం పార్టీ అనే మాట వినపడకపోవచ్చని అనుకున్నారు. తెలుగు దేశం పార్టీని తెలంగాణలో బలోపేతం చేసే సాహసం చంద్రబాబు చేస్తాడని అనుకోలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితి గా పేరు మార్పు కావడంతో తెలుగు దేశానికి మరో అవకాశం దొరికింది. తెలంగాణలో మళ్ళీ తన పునాదులు పదిలపర్చుకునే వెసులుబాటు ఏర్పడిరది. తెలంగాణలో తెలుగు దేశం పార్టీ ప్రభావం అంత కొట్టిపారేయలేం! ఇదిలా వుంటే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కూతురు షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసింది. పాదయాత్ర చేపట్టి తెలంగాణ చుట్టేస్తోంది.వివాదాల నడుమ రాజకీయ పాత్ర పోషిస్తోంది. కొత్త ఏడాదిలో తెలంగాణలో ఎన్నికల కోలాహలం.అన్ని రాజకీయ పార్టీల భవితవ్యం తేలనున్న తరుణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *