అందరూ చేసేది అన్యాయమే?

`న్యాయం చేద్దామన్న వారే లేరే?

`ఎవరిలో చిత్తశుద్ధి కానరాదే?

`మంత్రికి పట్టదాయే?

`ప్రభుత్వం దృష్టికి పోదాయే!

`దివ్యాంలాంగులకు న్యాయం జరగదాయే?

`వాళ్ల నిధులు వారికి అందవాయే!

`ప్రభుత్వం పంపిన ఐస్‌ ముక్క ఆఖరుకు కరిగిపాయే?

`పెద్దోళ్ల కడుపు సల్లవడే?

`దివ్యాంగుల కల చెదరవట్టే?

`దివ్యాంగుల పేరు చెప్పి నిధులైతే ఖర్చుకావట్టే?

`నేను చేసిందెంత పిట్ట రెట్టంత?

`అవతలి వాళ్లు చేసేదే లెక్కలేనంత?

`అందరూ అందరే నిధుల గోల్‌ మాల్‌ జరిగే!

`ముందు దివ్యాంగులంతా ఏకం కండి?

`మీ నిధులు మీరు కాపాడుకోండి?

`మిమ్మల్ని విడదీసి పాలించి, నిధులు ఆగం చేస్తున్నారు చూడండి?

`పిప్పరమెంటు బిల్ల చేతిలో పెట్టి చాక్లెట్లు కొట్టేస్తున్నారు చూసుకోండి!

`కోట్లు మాయమౌతున్నాయని తెలిసినా, కలిసి కొట్లాడకపోతే లాభం లేదు? న్యాయం జరగదు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

నిజాన్ని వినలేనప్పుడు తప్పు చేయొద్దు. నిజాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందని తెలిసిప్పుడు అన్యాయం చేయొద్దు. నిజం జీర్ణించుకోలేనిది. నిప్పుకన్నా గొప్పది. కళ్లముందు మన సమాజంలో కళ్లు లేక, కాళ్లు లేక, చేతులు లేక చేయూత కోసం ఆత్రంగా ఎదురుచూసేవారికి చేయూతనందించాలనిపించాలి. కాని వాళ్లు సొమ్ము కూడా తినాలనిపించకూడదు. ఆ సొమ్ముకు ఆశపడాలనుకోకూడదు. అదేం పలహారం కాదు. అది ఎవరైనా సరే… దివ్యాంగుల సంక్షేమ శాఖలో నిధులు దుర్వినియోగమయ్యాయన్నది నిజం. తప్పు ఎవరు చేసినా తప్పే…నిధులు ఎవరు కాజేసినా నేరమే? అందుకు ఎవరూ మినహాయింపు కాదు. దివ్యాంగుల సొమ్ము ఎవరు తిన్నా పాపమే? నేరమే? అయినా నిధులు గోల్‌ మాల్‌ జరిగిందేనేది వాస్తవం. మరి ఎవరిని నిందిద్దాం? తప్పు చేసిన వాళ్లే దర్జా వెలగబెడుతుంటే…తప్పంతా దివ్యాంగులదే అందామా? వారిలో వారికి పుల్లలు పెట్టి, గ్రూపులుగా విడగొట్టి, సంఘాలుగా దూరం చేసిన వాళ్లను వెకకేసుకొద్దామా? దివ్యాంగులలో గ్రూపులు తయారు చేసి, నాయకత్వాలు అప్పగించి, నా మాటే వేదం అనుకునేలా చేసి, వారి ఆఫీసు మెట్లెక్కకుండా చేస్తున్నది ఎవరు? కనీసం కనికరం చూపకుండా చూస్తున్నదెవరు? అందరూ దివ్యాంగులపై జులూమే ప్రదర్శిస్తే వారిని అక్కున చేర్చుకునేదెవరు? వారికి న్యాయంగా రావాల్సిన సదుపాయాల కల్పను చేయకుండా చేస్తున్నదెవరు? నిధులు దారి మళ్లిస్తున్నదెవరు? దివ్యాంగులంటే అందరికీ ప్రేమ…వారి నిధులు పంచుకొని పలారం చేసుకుంటున్నది వాళ్లే…మరి దివ్యాంగులకు మిగులుతున్నదేమిటి? అదేదో సినిమాలో రాజు ఐసు ముక్కను చేతికిచ్చి, అందరికీ పంచమంటే ఆఖరుకు, అందాల్సిన వారికి దగ్గరకు వచ్చేసరికి మిగిలి నీటి బొట్టు కూడా ఆవిరైపోయిందన్న సంగతి అందరికీ తెలుసు. మరి దివ్యాంగులకు అందాల్సిన నిధులు కూడా చెందాల్సిన వారికి చెందకుండా, దోచుకునేవారికి చేతికి చేరుతుంటే దివ్యాంగులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి. తమ బాధ ఎవరితో పంచుకోవాలి. వారిలో లేని ఐక్యతను సొమ్ము చేసుకుంటూ దివ్యాంగుల సంక్షేమం అందరూ కలిసి విస్మరిస్తున్నారు. నిధులు దిగమింగుతున్నారు. తీరని అన్యాయానికి ఒడిగడుతున్నారు. విడివిడిగా ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. జేబులు నింపుకుంటున్నారు. ఇది ఎవరో అంటున్న మాట కాదు. వారిలో వాళ్లే చెప్పుకుంటున్న మాటలు. కమీషనర్‌ వల్ల నిధులు ఇంత దుర్వినియోగమైనట్లు కొందరు చెబుతుంటే…చైర్మన్‌ వల్ల ఇంత దుబారా అయ్యిందని అంటున్నారు. అది కూడా మళ్లీ దివ్యాంగుల నోటినుంచే చెప్పిస్తున్నారు. ఇదేమైనా న్యాయంగా వుందా? దివ్యాంగులను మోసం చేస్తున్నామన్న కించిత్‌ బాధ కూడా లేదా? ప్రధానంగా దివ్యాంగుల సంక్షేమ శాఖ పర్యవేక్షణ అనగానే గుర్తుకొచ్చేది ఇద్దరే…

ఆ ఇద్దరూ ఇద్దరే అన్నట్లు సాగుతుంటే, అన్యాయమైపోతున్నది దివ్యాంగులే…వారికి న్యాయం చేద్దామన్న ఆలోచన ఇద్దరిలో లేకపోతే నలిగిపోతున్నది దివ్యాంగులే… వారికి అందాల్సిన సౌకర్యాలు అందకుండా పోతే అడిగేది ఆ ఇద్దరినే…ఆ ఇద్దరే అన్యాయం చేస్తున్నారని తెలిసి, వారి గోడు ఎరికి చెప్పుకుంటారు? వారికి జరుగుతున్న అన్యాయం ఎలా చెప్పుకుంటారు. సంబందిత మంత్రికి దివ్యాంగులు విన్నవించుకున్నా ఫలితం లేకుండాపోయిందని బాధపడుతున్నారు. ఇక ఎవరు వారి బాధలు తీర్చాలి. న్యామjైున హక్కుల పరిరక్షణకే దిక్కులేకపోతే, ఇక వాళ్లు మరిన్ని అవకాశాల కోసం ఎవరిని ప్రశ్నించాలి. ఎవరి మీద పోరాటం చేయాలి. దివ్యాంగులే మంత్రికి పట్టడం లేదన్న మాటలు మాట్లాడుతుంటే, ప్రభుత్వం పరువు పోదా? గతంలో దివ్యాంగులకు లేని అనేక అవకాశాలను కల్పిస్తున్న ప్రభుత్వమే అబాసుపాలు కావడానికి కారణం ఎవరన్నది మంత్రికి తెలుసుకోవాల్సిన అసవరం లేదా? దివ్యాంగులకు అందాల్సినవి అందకుండా పోయిన విషయం నిజామా? కాదా? అన్నదైనా తెలుసుకోకపోతే ఎలా? అసలు మంత్రి సంబంధిత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారా? మీరంటే మీరు అనుకొని శాఖలోని పెద్దలు ఒకరి మీద ఒకరు అబాండాలు వేసుకుంటున్నట్లు మంత్రికి కనిపించడం లేదా? అసలు ఎవరికి ఎవరి మీద అసంతృప్తి వుంది? అన్నది కూడా ముందు దివ్యాంగులు తెలుసుకోవాలి.

సంఘాలున్నాయి సరే…మీరంతా ఐక్యతగా వున్నారా? లేదా? అన్నది కూడా ముఖ్యం. గాలి వాటంలాగా దారి తప్పిపోకూడదు. నిజంగా ఎక్కడ అన్యాయం జరుగుతోంది? ఎవరు అన్యాయం చేస్తున్నారన్నదానిపై కూడా దివ్యాంగులకు స్పష్టత వుండాలి. అసలు దివ్యాంగులు పోరాటం చేస్తోంది? ఎవరిపైనా? మీడియాలో వచ్చిన కథనాలు, దివ్యాంగులు మీడియా ముఖంగా చెప్పినవే…ధర్నా చేసింది నిజమే… కమీషర్‌ మూలంగానే తమకు అన్యాయం జరుగుతోందని ధర్నా చేస్తున్న దివ్యాంగులు అబద్దమా? లేక తెలంగాణ వికలాంగుల ఆర్ధిక సహాకార సంస్ధ చైర్మన్‌ అన్యాయం చేస్తున్నారనేది నిజామా అనేది కూడా దివ్యాంగులే చెప్పాల్సిన అవసరం వుంది. ఎందుకంటే ఓ వైపు భహిరంగంగా దివ్యాంగులు సంక్షేమశాఖ కార్యాలయం ముందు ధర్నా చేసింది అందరికీ కనిపిస్తోన్న అంశం. మరి అదే చైర్మన్‌పై వస్తున్న ఆరోపణలు నిజమని చెప్పగలిగే వారు కూడా కావాలి. కమీషనర్‌ అన్యాయం చేస్తుందని చెబుతున్నవాళ్లు దివ్యాంగులే…చైర్మన్‌ గురించి చెబుతున్నట్లు మీడియాలో వస్తున్న కథనాలు దివ్యాంగులు చెప్పినవే…అయితే ఏది నిజం? ఏది అబద్దం? రెండూ నిజమైతే? దివ్యాంగులు ఎందుకు ఏకం కావడం లేదు? మీ హక్కుల కోసం ఎందుకు కలిసి పోరాటం చేయడం లేదు? వారి వారికి కొమ్ముకాసే పనిలో దివ్యాంగుల యూనియన్లు వున్నాయా? ఈ లెక్కన ఇద్దరు చూసేది వెలుగులోకి తేవాలంటే దివ్యాంగులే కదలాలి. మీ కోసం మీరు ఆలోచిస్తే తప్ప, మీకోసం ఎవరూ ముందుకు రారు? ఆక్టివా వెయికిల్స్‌, బ్యాటరీ ట్రై సైకిల్స్‌ కొనుగోలులో గోల్‌ మాల్‌ జరిగిందా? లేదా? అన్నది కూడా దివ్యాంగులు చెప్పాల్సిన అవసరం వుంది. ముందు దివ్యాంగుల సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చిన ఓ జేఏసిగా ఏర్పాటై, రైండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటుచేసి, జరిగిన వ్యవహారమంతా వెలుగులోకి తేస్తే తప్ప విసయాలు ప్రపంచానికి తెలియవు. ప్రభుత్వం దృష్టికి వెళ్లవు. దివ్యాంగులు నిధులు ఎవరు కాజేశారన్నది ముందు తెలియాలి. ఎలా దుర్వినియోగం చేశారన్న లెక్కలు తేలాలి. అప్పుడు అసలు దోషులెవరు? అన్నది తెలుస్తుంది. అందరూ అందరే…అందరూ కలిసి దోచుకుంటుందే అన్నది తేలితే తప్ప ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం లేదు. కమీషనర్‌ కార్యాలయం సాక్షిగా జరిగిన ధర్నా విషయంలో ఇప్పటి వరకు కమీషనర్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు. దివ్యాంగులకు న్యాయం చేస్తామన్న మాట కూడా ఇంతవరకు చెప్పలేదు. అంటే ఆమెకు బాధ్యత లేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నం కావడం సహజం. ఒక వేళ దర్నా రోజు దివ్యాంగులు చేసిన ఆరోపణలు తప్పని చెప్పని చెప్పే అవకాశం కమీషర్‌కు వుంది. అయినా ఆమె ఏదీ చెప్పలేదు. ఎలాంటి ప్రకటన చేయలేదు. దివ్యాంగులతో ఇప్పటి వరకు చర్చ జరిపినట్లు లేదు. అలాంటప్పుడు దివ్యాంగులకు న్యాయం జరిగేదెలా? వారి సమస్యలు వారికి తెలిసేదెలా? 

నేటిధాత్రి ఎవరికీ వంతపాడదు. దివ్యాంగులకు అన్యాయం జరుగొద్దనేదే నేటిధాత్రి చెబుతోంది. అందులో శషబిషలకు తావులేదు. ఎవరైనా ఒకటే…ఎంతటి వారైనా సరే…అన్యాయం చేసిన వాళ్లను నేటిధాత్రి వదిలిపెట్టదు…అవినీతి వెలికి తీయకమానదు…అన్యాయాన్ని అన్యాయం అనడమే మీడియా కర్తవ్యం…తప్పు చేసిన వారిని ఎండగట్టడమే నేటిధాత్రి ధైర్యం… దివ్యాంగులంతా ఒక్కటైన నాడు వారి సొమ్ము మీద ఎవరి కన్నూ పడదు. వారికి అన్యాయం చేయాలన్న ఆలోచన కూడ ఎవరూ చేయరు. ముందు దివ్యాంగులు ఒక్కటి కండి…ఊరు, ప్రాంతం, ఆధిపత్యం వదిలేయండి…నాయకులు దగ్గర అన్నది మర్చిపోండి. అందరి కోసం పోరాటం చేయండి. మీ హక్కులను మీరు కాపాడుకోండి.

Leave a Reply

Your email address will not be published.