మీరివ్వరు..మాది మిగలనివ్వరు?

అపకారమే తప్ప, ఉపకారం చేసిందేమీ లేదు?

ఎనమిదేళ్లలో కేంద్రమిచ్చిందేమీ లేదు?

ఊరించుడు తప్ప ఉపయోగమే లేదు?

అబద్ధాలు ప్రచారం అభివృద్ధి చేయలేదు?

అన్నీ మావేనని ఏమార్చుడే తప్ప ఏమీ లేదు?

వున్నవి ఊడ్చుకుపోవడం తప్ప, రుణం తీర్చుకున్నది లేదు?

ఇచ్చే ఉద్దేశం మీకు లేదు…ఇస్తారన్న నమ్మకం ప్రజలకు లేదు?

ఓట్ల కోసం ఎన్ని వేషాలేసినా, చూసే ఓపిక జనానికి లేదు?

కళ్లబొల్లి మాటలు, వినిపించుకునే వాళ్లెవరూ లేరు?

బిజెపి సభలు వృధా ప్రయాస, ఉడుకుయాతన?

తెలంగాణ గడ్డ మీద అడ్డావెట్డిండ్రు…బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలంటూ దండు కదిలిండ్రు…దేశంలోని బిజెపి పెద్దలంతా హైదరాబాద్ చేరుతున్నరు…ఇచ్చేదేమీ లేకపోయినా, చెప్పేదేమీ లేకపోయినా, అంతంత ఎత్తు చెప్పుకునుడు బిజెపికి అలవాటే…ఆడేం లేకపోయినా అన్నీ వున్నాయంటారు? ఏమీ ఇయ్యకపోయినా అరచేతిలో వైకుంఠం చూపిస్తారు…అభివృద్ధి గురించి అడిగితే హైందవ ధర్మం అంటారు…ఎనమిదేండ్ల సంది ఏం చేసిన్రంటే అంతా దేశం కోసమే అంటారు…? మీరు చెప్పేదాంట్లో దేశం కోసం ఏముందని అడిగితే, ఈ పాపమంతా కాంగ్రెస్ దే అంటారు..?అందుకే కొత్త రాజకీయం నేర్చుకున్నారు… చెప్పడం చేత కానప్పుడు అరవాలి. వినడం ఇష్టం లేనప్పుడు అల్లరి చేయాలి. పని చేయలేనప్పుడు పగటి కలలుగనాలి…చెప్పిందిడా అబద్దాలాడడం నేర్చుకోవాలి. ఇంతకు మించి ఏమీ చేయలేనప్పుడు…ఇతరుల మీద పడి ఏడవాలి….సరిగ్గా బిజెపి చేస్తున్నది ఇదే…తన మాట తనదే గాని ఇతరుల మాట వినిపించుకోదు.దానికి తోడు మీ ఇంటికొస్తే ఏమిస్తారు? మా ఇంటికొస్తే ఏం తెస్తారు? అన్న సూత్రాన్ని పాటిస్తున్నట్లు చేస్తున్నారు. రాష్ట్రాల నుంచి చేయాల్సినంత వసూలు చేస్తున్నారు. జిఎస్టీ అని తెచ్చి, ఇతర పన్నులు అలాగే వుంచారు. ఆఖరుకు అప్పడాలు, మజ్జిగ ప్యాకెట్ల మీద కూడా జిఎస్టీ వసూలు చేస్తామంటున్నారు. ఆఖరుకు గడ్డం గీసుకునే బ్లేడును కూడా వదలడం…అయినా మమ్మల్ని మాత్రం ఏమీ అడగొద్దు…మాకిది కావాలి, అది కావాలని అడగొద్దు…ఇవ్వడానికేమీ లేదిక్కడ…ఇవ్వాలంటే మనసొప్పక…అయినా ఓట్లు మాకే ఎయ్యాలే…మమ్మల్నే గద్దెనెక్కించాలే! ఏమివ్వనూ…ఇంకేమివ్వనూ…నా మనసే నీదైతే ఏమివ్వను…నిన్నేమడగనూ, ఇంకేమడగనూ, నువ్వే నాదైతే ఏమడగను… పాట పాడుకుంటూ బిజెపి భజన చేయాలన్నట్లుంది. బిజెపి రాష్ట్ర నాయకులు తెలంగాణకు ఇది కావాలి. ఈ ప్రాజెక్టు ఇవ్వాలని అడగరు…కేంద్ర పెద్దలు పెట్టరు…అడిగే వాళ్లను అడగనీయరు…ఎక్కవ తక్కువ అడిగితే ఉన్నయ్ గుంజుకపోతరు…ఇది రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతున్న చర్చలో భాగమైన మాట. అంటే బిజెపి గురించి చెప్పాలంటే ఇంకా చాలా వుందన్న మాట.  

మీరివ్వరు..మాది మాకు మిగలనివ్వరు. కేంద్ర ప్రభుత్వం అన్నాక దేశమంతా ఒకే రకమైన ప్రేమను కనబర్చాలి. ఒకే రకమైన అభివృద్ధిని అందించాలి. అందులో ఎలాంటి భేదాభిప్రాయాలకు చోటు లేకుండా చూసుకోవాలి. అన్ని ప్రాంతాలను సమానంగా చూసుకోవాలి. అంతే కాని ఉత్తరాదికో రూలు, దక్షిణాదికో రూలు అన్నట్లు వుండకూడదు. వివక్ష మాత్రం ఎక్కడా చూపించకూడదు. కానీ తెలంగాణ ధనిక రాష్ట్రం, కేంద్రాన్నే సాదుతున్న రాష్ట్రానికి ఏం అవసరమని రాష్ట్ర బిజెపి నాయకులే నైతికత మరిచి మాట్లాడుతున్నారు. ఒక రకంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులే అవసరం లేదన్నట్లు వాదిస్తున్నారు. ఇలాంటి నాయకులు రేపటి రోజున తెలంగాణకు మేలు చేస్తారా? తెలంగాణకు కొత్తగా ఏమీ ఇవ్వకపోవడం అటుంచితే, గతంలో యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను సైతం తరలించుకుపోయారు…వాటి పైనా బిజెపి రాష్ట్ర నాయకులు స్పందించరు. కనీసం తరలించుకుపోకుండా ఆపిన సందర్భం లేదు. కేంద్రం కాజీపేట లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్థలం అడిగితే ఇవ్వలేదని బుకాయిస్తున్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి హోదాలో వుండి వరంగల్ లో ఈ మాట చెప్పారు. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అన్నది చిరకాల కల. దానిని కూడా తరలించుకుపోయారు…? మరి అప్పుడు కిషన్ రెడ్డి ఎందుకు ఆపలేదు? పోతే పోనీ అనుకున్నారా? ఉమ్మడి రాష్ట్రంలో వున్నంత కాలం ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీని విజయవాడకు తరలించుకు పోవడానికి శత విధాలా? ఆనాడు ప్రయత్నించారు. కానీ కుదలేదు…ఆఖరుకు గుజరాత్ కు తరలిస్తే బిజెపి నేతలు చూస్తూ ఊరుకున్నారు? ఇంకేమిస్తారు? అవ్వ పెట్టాపెట్టదు…అడుక్కోనివ్వదని కేంద్రం ఇవ్వాల్సిన గ్రాంట్స్ ఇవ్వదు…అప్పుకు అవకాశం లేదు. వ్యవసాయానికి మీటర్లు పెడితే తప్ప అప్పు లేమంటూ తిరకాసు తెలిసిందే…? ఇలా తెలంగాణను అడుగడుగునా వంచిస్తూ వస్తూ, తెలంగాణ మాదే… తెలంగాణలో పెత్తనం మాదే…అని పగటి కలలు నిజాలౌతాయన్న భ్రమల్లో బిజెపి శ్రేణులున్నారు.

తెలంగాణకు అపకారమే తప్ప, ఉపకారం చేసిందేమీ లేదు. తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి ప్రత్యేకంగా ఇచ్చింది లేదు…విభజన హమీలలో పొందుపర్చిన వాటికే దిక్కు లేదు. సాగునీటి రంగంలో అద్భుతమైన ప్రగతిని కనబర్చినా కేంద్రం నుంచి సానుకూలత లేదు. ప్రశంస అంతకన్నా లేదు. కాళేశ్వరానికి పైసా సాయం చేసింది లేదు. మిషన్ కాకతీయకు నిధులిచ్చింది లేదు. ఇంటింటికీ మంచినీళ్లిచ్చే మిషన్ భగీరథ కు నిధులివ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా, కనికరించింది లేదు. ఇదంతా అపకారం కాక మరేమిటి? తెలంగాణకు కేంద్రం ఉపకారమని చెప్పుకోవడానికి ఏముందని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు.

ఎనమిదేళ్లలో కేంద్రమిచ్చిందేమీ లేదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బిజెపి తెలంగాణకు ఈ ఎనమిదేళ్లలో మాటలు తప్ప చేసిందేమీ లేదు. పైగా తెలంగాణ ఇవ్వడాన్ని సాక్ష్యాత్తు ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేకించాడు…వ్యంగ్యాస్రాలు విసిరాడు. తల్లిని చంపి బిడ్డను బతికించారని అన్నాడు. పార్లమెంటు తలుపులు మూసి, అప్రజాస్వామ్యంగా వ్యవహరించారని అన్నాడు. మరి మహారాష్ట్ర ను విడదీసి, గుజరాత్ ను కూడా అలాగే ఇచ్చారా? అన్న దానిని మోడీ ఎందుకు చెప్పరు. ఒక నాడు గుజరాత్ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎలా కొట్లాడిందో అలాగే తెలంగాణ కూడా కొట్లాడి సాధించుకున్నది. గుజరాత్ కోసం మోడీ కొట్లాడింది లేదు…కానీ తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఉద్యమ కారుడు కేసిఆరే తెలంగాణ పాలిస్తున్నాడు.ఊరించుడు తప్ప ఉపయోగమే లేదు. అదిగో పసుపు బోర్డు ఇదిగో పసుపు బోర్డు అన్నారు. వచ్చిందా? ఇచ్చారా? మోసం చేశారా? అన్నది తెలంగాణ ప్రజలకు తెలియదా? గెలిచిన వారం రోజుల్లో పసుబు బోర్డు తెప్పిస్తా? లేకుంటే రాజీనామా చేస్తానని చెప్పిన ఎంపి అరవింద్ అంతకన్నా ఎక్కువ చేసిన? అంటాడే గాని చేసిందేమిటో చెప్పింది లేదు. కేంద్రాన్ని అడిగి తెచ్చింది లేదు. పార్లమెంటులో ప్రశ్నించింది లేదు. ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు తేవాలన్న చిత్తశుద్ధి లేదు. అడిగిన వాళ్లను ఎదురు ప్రశ్నించడం తప్ప తెచ్చి చూపిస్తా అన్న మాట రాదు.

అబద్ధాలు ప్రచారం అభివృద్ధి చేయలేదు? అన్నీ మావేనని ఏమార్చుడే తప్ప ఏమీ లేదు. ఇంటి పెరట్లో కట్టుకున్న మరుగుదొడ్డి మాదే, వీధిలో వెలుగుతున్న లైటు మాదే, ఊరూరికి కట్డిమ రైతు వేధిక పైసల్ మాయే…ఆఖరుకు వడ్లు కొనేది మేమే…ఆ పైసల్ మాయే….ఇవన్నీ నిజాలా కాదా? అని తెలంగాణ ప్రజలకు తెలియదా? దేశంలో ఏ రాష్ట్రంలో రైతు వేధికలు నిర్మాణం చేశారో చెప్పమంటే నోరెళ్లబెడతారు? తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఫించన్ల పైసల్ మాయే…అంటారు…గుజరాత్ లో ఐదువందలే కదా ఇచ్చేది అంటే సమాధానం దాట వేస్తారు. ఇరవై నాలుగు గంటల కరంటు పుణ్యం మాదే అంటరు…కర్ణాటక రైతులు కరంటు వస్తలేదని బండి సంజయ్ ముఖం మీద చెప్పంగనే జారుకున్నాడు. మహిళలతో కలిసి సమావేశం పెట్టి, అన్నీ కేంద్రమే ఇస్తుందంటే, గ్యాస్ ధరలేంది, నూనెల ధరలేంది? మేం తినేదెట్లా? బతికేదెట్లా? అనంగనే జారుకున్న బండి సంజయ్ అబద్దాలు చెప్పడం మానడు.ఇచ్చే ఉద్దేశం మీకు లేదు…ఇస్తారన్న నమ్మకం ప్రజలకు లేదు?. తెలంగాణకు ప్రత్యేకంగా పైది పైసల సొమ్ము ఇచ్చే ఉద్దేశ్యం బిజెపి పెద్దలకు లేదని తెలుసు. కేంద్రం ఏం ఖర్చు చేయాలన్నా ముందు ఉత్తరాధి వైపే తప్ప, దక్షిణాదివైపు చూడడం మర్చిపోయిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతూనేవుంది. ఓట్ల కోసం బిజెపి ఎన్ని వేషాలేసినా, చూసే ఓపిక జనానికి లేదు? ఆకలౌతున్నప్పుడు బువ్వ పెట్టని వాళ్లు, బిర్యానీ వండుతున్నామంటే నమ్ముతారా? బిజెపి కళ్లబొల్లి మాటలు, వినిపించుకునే వాళ్లెవరూ లేరు? అందుకే తెలంగాణ గడ్డ మీద బిజెపి సభలు వృధా ప్రయాస, ఉడుకుయాతన? అంటున్నారు ఇతర రాజకీయ పార్టీలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!