జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి :
మైనర్ బాలుడికి వాహనం ఇచ్చిన అతని తండ్రికి ఇటీవల హనుమకొండలో రెండు రోజుల జైలు శిక్ష కోర్టు విధించిన సంగతి విధితమే… అయినా మైనర్లకు వారి తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వడంలో వెనకడుగు వేయడం లేదు. మైనర్లు వాహనాలు నడిపితే ఉపేక్షించే ప్రసక్తే లేదని. వాహనాలను నడిపే మైనర్లను గుర్తించి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని. ప్రమాదాలు చోటు చేసుకుంటే తల్లిదండ్రుల పై కేసులు నమోదు చేస్తామని కరీంనగర్ సిపి సుబ్బారాయుడు పలుమార్లు హెచ్చరించినప్పటికీ.. మైనర్ల తల్లిదండ్రులలో మార్పు రావడం లేదు. విద్యార్థుల తల్లిదండ్రుల అతిగారాభమో, పోలీస్ అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ…. జమ్మికుంట పట్టణంలో పలువురు మైనర్ బాలురులు యదేచ్చగా ద్విచక్ర వాహనాలు నడుపుతున్నారు. వారు ద్విచక్ర వాహనం నడుపుకుంటూ వెళ్లేది ప్రధాన రహదారుల గుండా అయినప్పటికీ… పోలీసు అధికారులు చూచి చూడనట్లు వ్యవహరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పోలీసులు అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహించడం తప్ప కఠిన చర్యలు తీసుకోవడం లేదు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తే మైనర్లు ద్విచక్ర వాహనాలు నడిపేందుకు కొంత వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది. ఆ దిశగా పోలీసు అధికారులు దృష్టి సారించకపోవడంతో తమను అడిగే వారే లేరని ధైర్యంతో మైనర్లే ద్విచక్ర వాహనాలను నడుపుకుంటూ పట్టణంలో తిరుగుతున్నారు. అనుకొని ప్రమాదాలు సంభవించినప్పుడు పరిస్థితి ఏంటో అది వారి తల్లిదండ్రులకు తెలియాల్సిన అవసరం ఉంది. రహదారి ప్రమాదాలను నివారించాలంటే అతివేగంగా వాహనాలను నడిపే వారితో పాటు ద్విచక్ర వాహనాలను నడిపే మైనర్లను గుర్తించి. వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తే కొంతలో కొంతైనా మార్పు వచ్చేందుకు అవకాశం ఉంటుందని పట్టణ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.