`నలిగిపోతున్నారు…ఇంకా నాన్చకండి.
`ఆరేళ్లు గడుస్తున్నా ఆశ తీరడం లేదు.
`అందరూ సానుకూలంగానే వున్నారు..సహకరించారు.
`లోపం ఎక్కడుదుందో ఎవరికీ అర్థం కావడం లేదు.
`కుటుంబాలు ఆగమౌతున్నాయి
`జీవితాలు చిధ్రమౌతున్నాయి
`కొలువు కోసం ఎదురు చూపులే మిగులుతున్నాయి.
`చిన్న ఉద్యోగులు
`అర్థాకలితో ఆరేళ్లుగా అవస్థలు పడుతున్నారు.
`రేపే జోవో అన్నారు
`వారంలో ఆర్డర్ల అన్నారు…
`ఏడాది గడిచింది.
`ఆరేళ్లుగా ఎదురుచూపే మిగులుతోంది.
హైదరాబాద్,నేటిధాత్రి:
వారిది కష్టమనాలో..శాపమనాలో అర్థం కాని పరిస్థితి. అంతా సవ్యంగానే వుందనిపిస్తుంది. ఎక్కడో వెలితి వెక్కిరిస్తోంది. వేదిస్తోంది. వేధనకు గురిచేస్తోంది. ఎప్పటికప్పుడు ఆశ చిగురిస్తోంది. అంతలోనే మాయమౌతోంది. రేపు మంచి జరగొచ్చన్న ఆశ ముందుకు నడుపుతోంది. ఆరేళ్ల నిరీక్షణకు రోజూ ఎదురుచూపే మిగులుతోంది. కష్టం తీరడం లేదు. ఆశ నెరవేరడం లేదు. కొలువు రావడం లేదు. జాలి మిగులుతోంది. కాలం కరిగిపోతోంది…విన్నవారి గుండె కూడా తరుక్కుపోతోంది. అందరూ చెబుతున్నది ఒకే మాట. అందరూ వేడుకుంటున్నదీ ఒక మాట…కనికరించండి… ప్లీజ్!…వారి కొలువుల కల నెరవేర్చండి. వారి జీవితాలు నిలబెట్టండి. వారి బతుకులకు ఒక దారి చూపండి!!
వాళ్లు గృహనిర్మాణ శాఖలో పని చేసిన ఒప్పంద ఉద్యోగులు.
2007లో ఉమ్మడి రాష్ట్రంలో విధుల్లో చేరారు. అప్పుడు తక్కువ జీతమైనా ప్రభుత్వ పర్యవేక్షణ కొలువు కావడంతో అర్థాకలి జీవితమైనా సర్థుకున్నారు. రాను రాను మంచి రోజులు వస్తాయన్న నమ్మకంతో బతుకుపోరాటం సాగించారు. ఎండనక, వాననక, ఏ వేళ పనైనా చేశారు. ఎంత దూరమైనా వెళ్లారు. వారి కష్టం ఫలించింది. కొంత కొంత జీతం పెరుగుతూ వచ్చింది. ఒక దశలో రూ. 15 వేల వరకు చేరింది. కొంత ఊపిరి తీసుకునే సమయం వచ్చిందని సంతోషిస్తున్న వేళ పిడుగులాంటి వార్త వారి చెవిన పడిరది. కొలువులు ఊడాయి. సుమారు పదేళ్ల పాటు చేసిన పని కాకుండా పోయింది. చేతిలో పని లేకుండా అయ్యింది. ఇంత కాలం చేసిన పనికి దిక్కు లేకుండా పోయింది. ప్రభుత్వాన్ని నమ్ముకున్న జీవితాలు ఒక్కసారిగా కుదేలయ్యాయి. జీవితాలు ఆగమయ్యాయి. చీకట్లు ఆవహించాయి. తెలంగాణ వస్తే తమ జీవితాలకు మరింత వెలుగులొస్తాయని అనుకున్నారు. ఒక్కసారిగా చీకట్లు కమ్ముకోవడంతో అంధకారంలో పడిపోయారు. దిక్కులేని పక్షులయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2016 లో గృగ నిర్మాణ శాఖలో పని చేస్తున్న ఒప్పంద ఉద్యోగులను ప్రభుత్వం తొలగించింది.
ఇంత వరకు బాగానే వుంది. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఒప్పంద ఉద్యోగులు తమ అవస్థలను, దురవస్థను మొరపెట్టుకుంటే అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. కనికరించారు. తన వంతు ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆ శాఖలో జరిగిన అవినీతిపై గుర్రుగా వుంది. ఈ తరుణంలోనే ఒప్పంద ఉద్యోగుల కొలువులు కూడా పోయాయి. అయితే ఆ శాఖలో జరిగిన అవినీతికి, ఒప్పంద ఉద్యోగులకు సంబంధం లేదు. వీళ్లు కేవలం నిమిత్రమాత్రులు. ఆ సమయంలో ఆ శాఖలో పని చేసిన ఉద్యోగుల కొలువులు భద్రంగానే వున్నాయి. ఇతర శాఖలకు మళ్లింపు బాగానే జరిగింది. వీళ్లు మాత్రం చకోరపక్షులయ్యారు. ఉద్యోగులకు న్యాయం విషయంలో అందరూ సహకరించారు. అందరూ అయ్యో! అన్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది. అక్కడికెళ్లు…ఇక్కడికెళ్లు.. అదిగో వచ్చే….ఇదిగో వచ్చే…ఈ మాటలు తప్ప ఆర్డర్లు ఇంత వరకు చేతికి రాలే. మళ్ళీ కొలువుల్లో చేరలేదు. ఎక్కే గడప, దిగే గడప అన్నట్లు, హనుమకొండ హైదరాబాదు తిరిగి, తిరిగి జీవితాలు అలసిపోతున్నాయి.
చివరికి పారిశుధ్య కార్మికులుగానైనా పనిచేస్తాం…మాకు పని చూపించండి.
దారి చూపండి. మా కొలువులు మాకియ్యండని కూడా వేడుకున్నారు. ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది. వరంగల్ మహానగర పాలక సంస్థ కొత్తగా నియమించిన కార్మికులు ఎలాంటి భరోసా లేని ఉద్యోగులు. గృహనిర్మాణ శాఖ నుంచి వచ్చిన వాళ్లు భరోసా కావాలనే ఉద్యోగులు. దాంతో ఆ ఆశ కూడా ఆవిరైంది. ఇలా ఏ అవకాశం వచ్చినా సరే కొలువు చేస్తామంటున్నా వారికి దారి దొరకడం లేదు. కొలువులలో నుంచి తొలగించిన నాటి నుంచి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులను కలుస్తున్నారు. వారిని వేడుకుంటూనే వున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా కలిసివచ్చారు. అయినా పని కావడం లేదు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఛీప్ విప్. దాస్యం వినయ్ భాస్కర్. ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజు సారయ్య కూడా వీళ్ల కోసం ప్రయత్నాలు చేశారు.
ఆఖరుకు మున్సిపల్ శాఖ మంత్రిని కలిశారు.
ఈ ఉద్యోగులకు మంత్రి కేటిఆర్ స్పష్టంగా చెప్పారు. మాట ఇచ్చారు. 51 మందిని వరంగల్ మహానగర పాలక మండలి తీసుకుంటుందని ప్రకటన కూడా చేశారు. అంతే కాదు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా తీర్మానం జరిగింది. మినట్స్ లో ఎంటర్ చేశారు. వాళ్ల ఫైలు ఇప్పటికీ హైదరాబాదు, వరంగల్ కు ఆర్టీసి బస్సు తిరినట్లు తిరుగుతుందే తప్ప, అభాగ్యులకు కొలువులు రావడం లేదు. ఆరేళ్లుగా జరిగిన ఒక్కో విషయం ప్రతి సందర్భాన్ని ఉటంకిస్తే ఒక గ్రంథమే రాయొచ్చు. అయినా బాధ తీరలేదే! మాటిచ్చారు…!! వాళ్లలో ఆశలు నింపారు. వాళ్లు వేడుకుంటున్నారు. గొడగొడ ఏడుస్తున్నారు. పెడతా అంటే దగ్గరకొస్తారు. కొడతా అంటే దూరం పోతారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ సహకరించారు. ఎక్కడ లోపం జరుగుందనేదాన్ని పసిగట్టి వారికి న్యాయం చేయలేకపోతున్నారు. ముందు మున్సిపల్ కార్పొరేషన్ లో ఇక ఉద్యోగాలు వచ్చినట్లే అనుకున్నారు. మేయర్ తో లెటర్ తెచ్చుకున్న విషయంలో తిరకాసు జరిగింది. అది కూడా పాపం వాళ్లకు శాపంగా పరిణమించింది. వాళ్ల ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. పర్మనెంట్ కాకపోయినా జీవితాంతం విధులు నిర్వర్తించొచ్చు అనుకున్న కొలువులు మధ్యలో పోయాయి. పదేళ్లు పనిచేశాక కొత్త పనులు చేయడం ఎవరికైనా కష్టమే. తర్వాత తమ కొలువులు నాయకులు ఇప్పిస్తారన్న నమ్మకం వచ్చినా, అందరూ సహకరిస్తున్నా ఉద్యోగ స్వామ్యం నుంచి సరైన సహకారం అందడం లేదు. మేం చెప్పేశాం..మీ పని అయిపోయినట్లే అని నాయకులు అంటున్నారు. అధికారులు ఫైలును అటూ, ఇటూ తిప్పుతున్నారు. విషయం తెలిసి నాయకులు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అదేదో సామెతలా రెడ్డెచ్చె మొదలాయే…అన్నట్లే వుంది. ఎప్పుడూ మొదటి పేజీయే సాగుతోంది. పేజీ తిరిగింది లేదు. పాపం వీళ్ల దశ మారింది లేదు. ఎలాగూ మాట ఇచ్చారు. వాళ్లు ఆశలతో బతుకుతున్నారు. సగం జీవితాలు గడిచిపోతున్నాయి. మిగిలిన కాలమన్నా బతకాలంటే వారి మీద జాలి చూపండి. వారికి కొలువులు ఇచ్చే మార్గం చూడండి.