`నా తర్వాత షర్మిల వార్తలే వుండాలి?
`నా వార్తలకే ప్రాధాన్యమివ్వాలి?
`కాంగ్రెస్ నుంచి ఎంతటి వారి వార్తలైనా పరిమితంగా వుండాలి.
`నా వార్తలే నిత్యం రావాలి?
`షర్మిల వార్తలు హైలెట్ అవుతుండాలి?
`కాంగ్రెస్ పార్టీ మొత్తం షర్మిల కోసం ఎదురుచూస్తున్నట్లుండాలి!
`షర్మిలను కాంగ్రెస్ వర్గాలు ఆహ్వానిస్తున్నట్లే వార్తలుండాలి.
`షర్మిల వస్తేనే పార్టీ పూర్వ వైభవాన్ని చూస్తుందనేలా రాయాలి!
`షర్మిలను మించిన నాయకురాలు లేదనే చర్చ జరగాలి?
`షర్మిలకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారి వార్తలు తగ్గించాలి?
`తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేతికొచ్చే కృషి జరగాలి?
`అటు మీడియా తో, ఇటు అనుచరులకు పొంగులేటి సూచన?
`పెద్ద ఎత్తున సోషల్ మీడియా వింగ్ ఏర్పాటుకు కసరత్తు!
`యూ ట్యూబ్ నిండా మన వార్తలే వుండాలి.
`మన వార్తలే ట్రెండిరగ్ కావాలి?
`నా నాయకత్వం మీద ఎక్కువ ఫోకస్ వుండాలి?
`తెలంగాణ మొత్తం పొంగులేటి వార్తలు కనిపించాలి.
`ఇది ప్రచార యుగం.. ఎంతైనా ఖర్చు చేద్దాం?
`నేనేంటో చూపిస్తా! కాంగ్రెస్ లో నా తర్వాతే ఎవరైనా అనేలా చేస్తా!!
`నా రాజకీయం అందరికీ రుచి చూపిస్తా!
హైదారబాద్,నేటిధాత్రి:
ఇకపై ప్రధాన మీడియా స్రవంతిలోనైనా, ఇతర మీడియా సంస్ధల్లోనైనా, మన ఆధ్వర్యంలో నడిచే సోషల్ మీడియాతోపాటు, కాంగ్రెస్ పార్టీ మీడియా వింగ్‌లోనూ తన వార్తలే కనిపించాలి. తాను ఎవరెవరిని కలుస్తున్నాను…తనను ఎవరు కలుస్తున్నారు? తనకెంత బలముంది? అన్నది ఎప్పటికప్పుడు ఫోకస్ చేస్తూ వుండాలి. అందుకే నిత్యం కాంగ్రెస్ పార్టీ వార్తల పేరుతో నేనే మీడియాలో కనిపించాలి. నా వార్తలు మాత్రమే పెద్దగా హైలెట్ కావాలి. మొత్తంగా నా మాటే మీడియాలో కూడా వినిపించాలి. ఇది కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన అనుచరులతో చెబుతున్న మాట? ఆ తర్వాత మన తరుపున త్వరలో కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేయనున్న వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల వార్తలకు ప్రాధాన్యత కల్పించాలి. ఇప్పటికే ఆమె పాలేరు నుంచిపోటీ చేస్తానని చెబుతూ వస్తున్నారు. తెలంగాణలో సుమారు 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. త్వరలో పాలేరులో కూడా పాదయాత్ర జరగనుంది. అక్కడే నివాసం కూడా వుంటానని చెబుతోంది. అందువల్ల ఆమె కాంగ్రెస్‌లో చేరుతున్నట్లుగా, పార్టీ నేతలు ఆమెను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వండి వార్చాలని సూచిస్తున్నారట. ముందుగా తన వార్తలకు ప్రాధాన్యత కల్పిస్తూ, తర్వాత షర్మిల వార్తలను ఎక్కువగా ఫోకస్ చేయాలని ఖచ్చితంగా సూచనలు చేసినట్లు తెలిసింది. ఇక కాంగ్రెస్ పార్టీ వార్తల విషయంలో తన వార్తలే నిత్యం రావాలని, మిగతా కాంగ్రెస్ నేతల వార్తలకు అంత ప్రాదాన్యత కల్పించొద్దని కూడా మీడియా వర్గాలను మేనేజ్ చేసుకునే పనిలో శ్రీనివాస్‌రెడ్డి వున్నాడట. ముఖ్యంగా షర్మిల వార్తలను తెలంగాణ సమాజంలోకి విసృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం వుందని తేల్చిచెప్పినట్లు తెలిసింది. అంతే కాదు షర్మిల వస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం దక్కుతుందని, ఇప్పటికీ కాంగ్రెస్‌లో షర్మిలను మించిన నాయకులు లేరన్నది జనంలోకి బాగా తీసుకెళ్లాలని కూడా సూచిస్తున్నట్లు తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో షర్మిలకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందుకునేంతగా పార్టీ నేతలు కోరుకుంటున్నారన్న సంగతిని జాతీయ కాంగ్రెస్ నేతలు తెలుసుకునేలా జాతీయ మీడియాను కూడా మేనేజ్ చేసుకుంటామని కూడా చెప్పుకుంటున్నారట. త్వరలో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వింగ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అనుచరుల సమావేశంలో పొంగులేటి వివరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వాటిలో మొత్తం పొంగులేటి వార్తలు, షర్మిల వార్తలు మాత్రమే కనిపించేలా ఇప్పనుంచే డిజైన్ చేయాలని చెబుతున్నారట. ఏ యూట్యూబ్ చానల్ చూసినా తన వార్తలు, షర్మిల వార్తలు మాత్రమే విసృతంగా అప్‌లోడ్ చేయాలన్నారట. పెద్దఎత్తున పాజిటివ్ వార్తలు ట్రెండిరగ్‌లో వుండేలా సోషల్ మీడియా వింగ్ 24 గంటలు పనిచేసేలా వుండాలని చెప్పారట. ఇది ప్రచార యుగం..దాని కోసం ఎంత ఖర్చు చేస్తే అంత లాభం అని, అందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదని కూడా పొంగులేటి స్పష్టం చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. నేనోంటో చూపిస్తా…నా రాజకీయం ఏమిటో చూపిస్తా…కాంగ్రెస్ పార్టీలో నా పాత్ర ఎలా వుంటుందో చూపిస్తా…నేను చెప్పిందే పార్టీ మొత్తం వినేలాచేస్తా…నా తర్వాతే పార్టీలో ఎవరైనా అనేలే చేస్తా…ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మాహన్‌రెడ్డి రుణం తీర్చుకుంటా? షర్మిలను తెలంగాణ ముఖ్యమంత్రి చేయడం కోసం అహర్నిషలు పనిచేస్తా..ముందు అది ఖమ్మం జిల్లా నుంచే మొదలుపెడుతా…నేను సూచించే వారికే టిక్కెట్లు ఎలా దక్కాలో స్కెచ్ వేస్తా..అంటూ తన అనుచురులలో ఉత్సాహం నింపినట్లు విశ్వసనీయ సమచారం.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో వర్గపోరులో మరో కొత్త కుంపటి రాజేసుకోనున్నది.
ఇసంత రమ్మంటే ఇళ్లంతా నాదే అన్నట్లు మాజీ ఎంపి.పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తనదంటూ, తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఇప్పటినుంచే ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా పార్టీని మొత్తం తన వైపు తిప్పుకునే ఎత్తుగడలు ఇప్పటినుంచే వేస్తున్నట్లు కూడా సమాచారం. తాను దూర సందు లేకపోయినా, మెడకో డోలు అన్నట్లు తాను కాంగ్రెస్‌లో చక్రం తిప్పడమే కాకుండా, షర్మిలను క్రియాశీలం చేయడానికి అసరమైన కసరత్తు మొదలుపెట్టినట్లు విశ్వసనీయ వర్గాలనుంచి అందుతున్న సమచారం. కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి ఆ పార్టీల త్వరలో కల్లోలం రేపే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా ఆయనను కలుస్తున్న నాయకులు, ఆయన పిలుస్తున్న నాయకులు ఖమ్మంలో ముందు పెంచుకోనున్న పట్టు అన్నదానిపై అడుగులు పడుతున్నాయి. ఆ అడుగులన్నీ షర్మిల కోసమే అన్నది కూడా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడడానికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సరికొత్త రాజకీయం మొదలుపెడుతున్నాడని వినికిడి. ఇదిలా వుంటే రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇప్పటికే వున్న అనేక గ్రూపులతో సతమతమౌతూ వుంది. తెలంగాణ వచ్చిన తర్వాత నాయకత్వ లేమితో కొట్టు మిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఫలంగా కర్నాటక ఫలితాలతో కనిపించని ఊపు వచ్చిందని నమ్ముతున్నారు. ఇదే నిజమని ఎవరికి వారు నా మాటే చెల్లాలన్న రాజకీయాలు మొదలుపెడుతున్నారు.ఇలాగే గతంలో రేవంత్‌రెడ్డి కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భువనగిరి ఎంపి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కూడా అంటుండేవారు. ఎక్కడికెళ్లినా, ఏ సభనైనా రేవంత్‌రెడ్డి సీఎం అంటూ నినాదాలు చేసే బ్యాచ్ అంతటా రెడీగా వుంటుందంటుండేవారు. పైగా అసలైన కాంగ్రెస్ నేతలు పార్టీనుంచి పారద్రోలేలా రేవంత్‌రెడ్డి సోషల్‌మీడియా సైన్యం జగ్గారెడ్డి, ఇతర నాయకుల మీద పెద్దఎత్తున ట్రోల్ చేస్తూ వారిని మానసికంగా ఇబ్బందులు పెట్టిన సందర్భం కూడా వుంది. వాటిపై పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదులు చేస్తామని కూడా జగ్గారెడ్డి, హనుమంతరావులు హెచ్చరించిన సందర్భాలున్నాయి. ఒక దశలో జగ్గారెడ్డి కూడా పార్టీని విలేస్తానని, అవసరమైతే సొంత పార్టీ ఏర్పాటు చేస్తానని, రేవంత్ సంగతి చూస్తానని కూడా హెచ్చరికలు జారీచేశారు. రేవంత్‌రెడ్డికి పోటీగా జగ్గారెడ్డి కూడా తిరంగ యాత్ర చేపట్టిన వైనం చూశాం. ఇప్పుడు సరిగ్గా అదే పనిని పొంగులేటి చేసి, రేవంత్‌రెడ్డికి చుక్కలు చూపించే పనిలో పడుతున్నాడని కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మొదట పొంగులేటి కాంగ్రెస్‌లో రావాలనుకుంటున్నట్లు వార్తలు వచ్చిన తొలి దశలో వ్యతిరేకించింది రేవంత్ రెడ్డే. షర్మిల విషయంలోనూ ముందు స్పందించింది కూడా రేవంత్ రెడ్డే. తెలంగాణలో మేం..మేం చూసుకుంటాం? నీ రాజకీయాలు, సేవలు మా తెలంగాణ ప్రజలకు అక్కర్లేదు అని ప్రకటించింది కూడా రేవంత్‌రెడ్డే. ఎక్కడైతే ప్రభుత్వ ఏర్పాటుకోసం, ఏ అన్న కోసం పనిచేశావో అక్కడే రాజకీయాలు చేసేకో అంటూ సూచనలు కూడా రేవంత్ రెడ్డి ఇచ్చారు. ఆఖరకు ఇప్పుడు షర్మిల తెలంగాణలో కాంగ్రెస్‌లో చేరేందుకు అధిష్టానం నుంచి మార్గం సుగమమం చేసుకుంటున్నారు. అదే జరిగితే ఇక రేవంత్‌రెడ్డికి చుక్కలే…కోరికోరి కుంపటి నెత్తిన పెట్టుకోవడం అంటేఇదే మరి…ఏం జరుగుతుందో చూద్దాం. అయితే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన ధనబల రాజకీయంతో షర్మిలను ముందుకు తీసుకొస్తే, సామాజిక పరంగా ములుగు ఎమ్మెల్యే సీతక్కను రేవంత్ రెడ్డి ముందుకు తెచ్చి రసవత్తరమైన రాజకీయాన్ని అడేందుకు సిద్దపడుతున్నట్లు కూడా కనిపిస్తోంది. రాజకీయాలు ఇక ముందు ముందు మరింత రసవత్తరంగా వుంటాయని చెప్పడానికి ఇది ట్రైలరే అంటున్నారు.