*నేటిధాత్రి హైదరాబాద్*
12-1-2022
గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, దేశ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేస్తూ, వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని కూకటివేళ్లతో పెకలించి వేయాలని, వీరిని ఎక్కడికక్కడ నిలదీయాలని దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. కేంద్రం తక్షణమే స్పందించి, పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించకపోతే.. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి కేంద్రప్రభుత్వం మెడలు వంచుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా, రైతాంగం నడ్డివిరిచేలా కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీనిపై తన నిరసన వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాయనున్నారు.
రైతుల ఆదాయాన్ని 2022 నాటికల్లా రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పిన కేంద్రప్రభుత్వం, ఎరువుల ధరలు విపరీతంగా పెంచి దేశ రైతాంగం కోలుకోలేకుండా దెబ్బతీసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి మాట తప్పిన కేంద్రం.. ఉల్టా రైతుల పెట్టుబడి ఖర్చులనే రెట్టింపు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం అని నిర్ధారణ అయిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయడం, ఎరువుల ధరలను విపరీతంగా పెంచడం, అష్టకష్టాలు పడి రైతులు పండించిన ధాన్యాన్ని కూడా కొనకపోవడం లాంటి రైతు వ్యతిరేక చర్యలతో… నేడు దేశంలో రైతులు బతికి బట్టకట్టలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల సబ్సిడీలను ఒక్కసారిగా ఎత్తివేసి, రైతులను వ్యవసాయం చేయకుండా దూరంచేస్తున్న బీజేపీ పార్టీపై, కేంద్ర ప్రభుత్వంపై దేశ రైతాంగం ఐక్యంగా తిరగబడితే తప్ప, వారికి బుద్ధి రాదన్నారు. కేంద్రం తక్షణమే స్పందించి, పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించకపోతే దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. రాష్ట్ర రైతాంగం కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని, ధరలు తగ్గించే దాకా.. పోరాడాలన్నారు.
ఎనర్జీని వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే వ్యతిరేకిస్తూ, వ్యవసాయాన్ని నెమ్మది నెమ్మదిగా కార్పొరేట్ గద్దలకు కట్టబెట్టే కుట్రలు చేస్తున్న బిజెపి చర్యలను దేశ రైతాంగం గుర్తించాలన్నారు. రైతుల పొలాల్లో.. రైతులనే కూలీలుగా మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఐక్యంగా ఎదుర్కోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.