`మంత్రి గారు దివ్యాంగుల సంక్షేమ శాఖలో అక్రమాలు జర చూడండి!
`సిఎస్ గారు దివ్యాంగులు దీక్షలు చేస్తున్నారు…కనికరించండి!
`కమీషనర్ తారుమారు చేస్తున్న లెక్కలు వెలికితీయండి!
`ట్రైసైకిల్ తయారీ యూనిట్ వుండగా ప్రైవేటు వ్యక్తికి టెండరెందుకు?
`ఇష్టానుసారం ధర చెల్లింపులెందుకు?
`బ్యాటరీ ట్రైసైకిళ్లలో జరిగిన గోల్ మాల్ లెక్కలు తీయండి?
`ఏళ్ల తరబడి ఒకే వ్యక్తికి టెండర్లెలా వెళ్తున్నాయో బైటపెట్టండి?
`ఆక్టివా వెహికిల్ కొనుగోలు ధరలు చూడండి!
`అడ్డగోలు ధరలెందుకు చెల్లించారో విచారించండి!
`కొన్న వెహికిల్స్ ఎన్ని…దివ్యాంగులకు ఇచ్చినవి ఎన్ని?
`లెక్కలు తేలని వెహికిల్స్ ఎన్ని?
`విద్యా, ఉపాధి అవకాశాలు రాకుండా, లేకుండా చేస్తున్న కమీషనర్ వ్యవహార శైలిపై దివ్యాంగులతో చర్చలు జరపండి?
`కోట్లాది రూపాయల మాయం కథలు వెలికితీయండి?
హైదరాబాద్,నేటిధాత్రి:
సబ్బుబిల్ల, కుక్కపిల్ల, అగ్గిపుల్ల కాదేది కవితకనర్భం అని శ్రీశ్రీ అన్నాడు. కాదేదీ అవినీతికనర్హం…ఏ శాఖైతేనేమీ…అని కొందరు అవినీతి అధికారులు నిరూపిస్తున్నారు. దివ్యాంగుల కోసం కేటాయించిన సొమ్మును కూడా మింగేయడానికి వెనుకాడడం లేదని సమాచారం. ఏళ్ల తరబడి తిష్ట వేసుకొని కూర్చొని, శాఖలో లొసుగులన్నీ ఆసరా చేసుకొని, ప్రశ్నించడానికి వీలులేని స్ధితిని కల్పించుకుంటున్నారు. స్ధాన చలనం లేకుండా, స్ధాన బలం పెంచుకొని, శాఖలో అవినీతికి పాల్పడుతున్నారని తెలుస్తోంది. వినడానికే విడ్డూరంగా వుంది. అంతకన్నా దౌర్భాగ్యముంటుందా? దుర్మార్గం మరొకటి వుంటుందా? గతంలో దివ్యాంగులకు నెలకు రూ.500 పెన్షన్ అమలయ్యేది. అది అప్పుడు ఎంతో గొప్ప. కాని తెలంగా ణ వచ్చాక వారి జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు తెచ్చే ప్రయత్నం చేసింది. తెలంగాణ కోసం దివ్యాంగులు కూడా చేసిన పోరాటం మరువలేనిది. తెలంగాణ సాధనలో వారి పాత్ర తక్కువేం కాదు. ఎంతో మంది దివ్యాంగులు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వాళ్లున్నారు. అలాంటి వారు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పెన్షన్ రూ.3500 వస్తోంది. దివ్యాంగులు ఎవరి మీద ఆధారపడి, ఎవరి దయాక్షిణ్యాల మీద బతకాల్సిన పనిలేకుండా వారి ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ ఫించన్ పెంచారు. ఇదిలా వుంటే తెలంగాణలో దివ్యాంగులైన విద్యార్ధులు, స్వయం ఉపాధి కల్పన చేసుకునేవారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయంలో ఆ శాఖ కమీషనర్ కోతలు విధించడమే కాదు, అమలులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె దివ్యాంగులకు అందిస్తున్న ట్రైకిల్స్, ఆక్టివాలలో చెప్పే లెక్కలకు, అందిస్తున్న వాటికి తేడా వుంటుందని విమర్శిస్తున్నారు. కమీషనర్ శైలజ వ్యవహార శైలితో విసిగి వేసారిన దివ్యాంగులు దీక్షలు చేస్తున్నారు. నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది. మంత్రి స్పందించని పక్షంలో దీక్షలు చేస్తున్న దివ్యాంగులదే తప్పని స్వయంగా మంత్రే నిరూపించినట్లౌవుంది. ఆ అపవాదు మంత్రి భరిస్తారా? లేక కమీషనర్ చేస్తున్న ఆగడాలను అడ్డుకుంటారా? ఆమెను తప్పిస్తారాలేదా? అన్నది తేలాల్సివుంది. కొన్ని లక్షల మంది జీవితాలతో ముడిపడిన అంశమిది. రాజకీయ పరంగా కొన్ని వేల కుటుంబాలను ప్రభావితం చేసే అవకాశం వుంది. ఎవరి స్వార్ధం వాళ్లు చూసుకుందామనుకుంటే, టిఆర్ఎస్ పార్టీకి మొదటికే మోసం తెచ్చిపెట్టినట్లౌంది. అందుకే మంత్రి స్పందన కోసం కూడా దివ్యాంగులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి దివ్యాంగుల కోసం ఎంత చేస్తున్నా, మంత్రి, కమీషనర్ పట్టించుకోవడం లేదన్న అపవాదును మోయాల్సివుంటుంది. ఇక ప్రభుత్వ కార్యనిర్వాహక వ్యవస్ధకు హెడ్ అయిన చీఫ్ సెక్రెటరీ కూడా దివ్యాంగుల ఆందోళన వైపు ఓసారి చూడాల్సిన అవసరం వుంది. కమీషనర్ చేతి వాటం మూలం అవినీతి తారా స్ధాయికి చేరుకుంటోందని అంటున్నారు. పైగా కమీషనర్ కార్యాలయంలో సిసి కమెరాలు ఏడాది కాలం పనిచేయకుండా పోవడం వంటివి వాటి వెనుక అనేక రహస్యాలు దాగి వున్నాయని దివ్యాంగులు అంటున్నారు. కమీషనర్‌కు ఎదురైన దివ్యాంగులు నిలదీసే అనేక వ్యవహారాలు సిసి కెమెరాల్లో రికార్డు కాకుండా ఏడాది కిందటే వాటిని తొలగించారని విమర్శలున్నాయి. వందలాది వెయికిల్స్ కొనుగోలు చేసినట్లు లెక్కలున్నా, దివ్యాంగులకు అందిన వాటికి, సరఫరా అయిన వాటికి లెక్కల్లో పొంతన లేదని తెలుస్తోంది. వాటిపై కూడా దృష్టిపెట్టాల్సిన అవసరం వుంది. 2016 నుంచి ఇంతవరకు ఎలాంటి ఆడిటింగ్ కూడ జరగలేదని తెలుస్తోంది. ప్రొడక్షన్ సెంటర్ ఎందుకు మూసేయాల్సివచ్చింది? ఇలాంటి అనేక విషయాలు వెలుగులోకి రావాల్సిన అవసరం వుంది. అందుకే సంబంధిత మంత్రితోపాటు, చీఫ్ సెక్రెటరీ కూడా జోక్యం చేసుకోకపోతే, దివ్యాంగులకు న్యాయం చేసేవారే వుండరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమీషనర్ శైలజ నెలకు కనీసం నాలుగు రోజులు కూడా విధులకు హజరు కారు. దివ్యాంగులకు అందుబాటులో ఉండరు.
ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి జిల్లాలనుంచి అనేక సార్లు రావడం వారికి ఎంతో కష్టమైన పని. సుమారు ఓ పదిసంవత్సరాల నుంచి కమీషనర్ ఏ ఒక్క హాస్టల్ సందర్శించిన దాఖలాలు లేవు. దివ్యాంగుల హస్టల్ విద్యార్ధులు కోరుకునేది రెండే అంశాలు. ఒకటి వారికి రవాణ వసతి, భోజన వసతి. ఇంతకు మించి వాళ్లు కోరుకునేది ఏమీ వుండదు. వాటిని కూడా పట్టించుకోకపోతే ఎలా? వారికి వాహనాలు అందించడంలో అలసత్వం ఏల? పైగా దివ్యాంగులకు అందజేయాల్సిన ట్రై సైకిల్ విత్ బ్యాటరీ కమీషనర్ రూ. 40వేలుతో కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. కాని అవే ట్రైసైకిల్స్ శాఖకు చెందిన ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్లో తయారు చేస్తే కేవలం రూ.29వేలే ఖర్చవుతుందట. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో రెండు సెంటర్లున్నాయి. వికాలంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రొడక్షన్ సెంటర్ నిర్వహణ జరగాలి. కాని అందులో పనిచేసే ఉద్యోగులను డిప్యూటేషన్ మీద ఇతర శాఖలకు పంపించారని సమాచారం. ఇలా ఉద్యోగులను ఇతర శాఖలకు పంపించి, ట్రైసైకిళ్లను టెండర్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అలా టెండర్ ద్వారా కొనుగోలు చేస్తే ఇంతా తక్కువ ధరకు ట్రైసైకిల్ రావాలి. కాని రూ.40వేలు చెల్లిస్తున్నారు. ఇదిలా వుంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒక ట్రైసైకిల్ అదే విద్యార్ధులకు అందజేయాలి. కాని అందజేసిన సందర్భాలే కనిపించడం లేదు. కాని రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయంటున్నారు. ఇక కాలేజీ విద్యార్ధులకు ట్రైవీల్ ఆక్టివా అందజేయాలి. కాని ఏడాదికి వంద మాత్రమే అందజేస్తూ మిగతా వారికి ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని చెబుతున్నారు. వికలాంగుల చైర్మన్ వాసుదేవరెడ్డి వచ్చాక మొదటిసారి ఒకే ఏడాదిలో 900 ఆక్టివాలు అందజేయడం జరిగింది. కాలేజీ విద్యార్థులందరికీ ఆక్టివాలు ఇవ్వాల్సిన అసవరం వుంది. కాని అది అమలు చేయడంలేదు. 2014 నుంచి ట్రైసైకిల్ సెంటర్‌ను పూర్తిగా మూసేయడం జరిగింది. గ్రామీణ విద్యార్ధులకు బ్యాటరీ ట్రైసైకిల్ కావాలని కోరుకుంటారు. వాళ్లు కమీషనర్ కార్యాలయం చుట్టూ తిరిగీ, తిరిగి విసిగిపోతున్నారు. శాఖకుచెందిన ప్రొడక్షన్ సెంటర్ మూసేసిన తర్వాత ఏటా ఓ 500 వందల ట్రైసైకిల్స్ అర్డర్ పెడితే, ఎన్ని ట్రైసైకిల్స్ వచ్చాయన్నదానిపై ఎక్కడా లెక్కలుండవు.
వాటిపై ఆడిటింగ్ అన్నది ఎప్పుడో మర్చిపోయారు. పైగా ట్రైసైకిల్ ట్రాన్స్‌పోర్టుకు కూడా కమీషనర్ రూ.500 అదనంగా చార్జిలు వేసినట్లు కూడా లెక్కలున్నాయి. ఆక్టివా కొనుగోలు గోల్ మాల్ అంతా ఇంతా కాదు. మార్కెట్లో ఆక్టివా ధర రూ.69వేలు వున్నట్లు తెలుస్తోంది. కాని కమీషనర్ ఒక్కొ ఆక్టివాకు రూ.89వేలు చెల్లించినట్లు రసీదులున్నాయి. పైగా వీటి ట్రాన్స్‌పోర్టు చార్జీల పేరుతో రూ.10వేలు అదనంగా లెక్కలు చూపిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇంకా విచిత్రమేమిటంటే దివ్యాంగులకు అందించే ఆక్టివాలకు రోడ్ ట్యాక్స్ వుండదు. జిఎస్టీ లేదు. కాని ఈ రెండు ట్యాక్స్‌లు కూడా కమీషనర్ లెక్కల్లో చూపుతోంది. గత ఏడెనమిది సంవత్సరాలుగా ఒకే వ్యక్తికి టెండర్ ఇవ్వడం జరుగుతోంది. సుశీల్ అనే కంపనీకే ప్రతిసారి ఇస్తూ వస్తోంది. ఇంకా చెప్పాలంటే 500 ఆక్టివాలు కొనుగోలు చేసినట్లు లెక్కలు వున్నా, అసలు పంపిణీ చేసేది 350 మించి వుండవని తెలుస్తోంది. ఇలా వికలాంగుల సంక్షేమ శాఖను కమీషనర్ లూటీ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దివ్యాంగుల దినోత్సవం పేరుతో పెద్దఎత్తున సమావేశాలు నిర్వహించి, హంగూ ఆర్భాటం చేయడంతో ఆమె దివ్యాంగుల శాఖకు కోసం ఎంతో శ్రమిస్తోందన్న సంకేతాలు పంపుతుందటున్నారు. అంతే కాదు ఇలాంటి ఫంక్షన్లు మళ్లీ కాంట్రాక్టర్ల చేతనే నిర్వహించి, ఆ ఖర్చు కూడా తన ఖాతలో వేసుకుంటుంటుందని సమాచారం. ఇలా ఏడాదిలో వృద్దుల దినోత్సవం, దివ్యాంగుల దినోత్సవం, ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమాల పేరుతో జరిగే కార్యక్రమాలకు కూడా పెద్దఎత్తున ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తుందని అంటున్నారు. ఇక ఎన్నికల సమయంలో దివ్యాంగులు, వయసు మళ్లీన వారు పోలింగ్ కేంద్రానికి చేరవేసే వీల్ చైర్ల కుంభకోణం కూడా వెలుగుచూసింది. ఒక్కొ వీల్ చైర్ రూ.3500 వుంటుంది. కాని ఆ వీల్ చైర్‌ను రూ.4800కు కొనుగోలు చేసినట్లు లెక్కలున్నాయి. ఈ కేసు ఇప్పటికీ లోకాయుక్తలో కొనసాగుతోంది. 2016 నుంచి ఇప్పటి వరకు ఆడిటింగ్ జరక్కుండా కమీషనర్ అడ్డుకుంటోందని తెలుస్తోంది. ఆడిటింగ్ విభాగంతో లోపాయి కారి ఒప్పందంతో ఆడిటింగ్ జరగడం లేదని సమాచారం. ఇలా ఆడిట్ జరకపోవడం మూలంగా ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతున్నాయి. తన స్వార్ధం కోసం, తాను చేసిన గోల్ మాల్ అంతా బైటపడుతుందని, దివ్యాంగులకు నిధులు రాకుండా కమీషనర్ చేస్తోందని విమర్శలున్నాయి. 2016 నుంచి కొత్తగా సర్టిఫికెట్లు జారీ చేయకపోవడంతో ఎంతో మంది విద్యార్దులు అడ్మిషన్లు కోల్పోయారు. 2016 చట్టం ప్రకారం 21 రకాల దివ్యాంగులు గుర్తింపు పూర్తి చేయాలి. వారికి సర్టిఫికెట్లు జారీ చేయాలి. కాని ఆ పని కూడా పూర్తి కాలేదు. నిధులు గోల్ మాల్ మాత్రం జరుగుతున్నాయి. పనులు మాత్రం కావడంలేదు. దివ్యాంగులకు న్యాయం జరగడం లేదు. ఇక శాఖలో రిటైర్డ్ అయిన వారిని తిప్పించుకుంటూ వారి ఉసురు కూడా కమీషనర్ పోసుకుంటున్నట్లు విమర్శలున్నాయి. 20 మంది పెన్షన్ దారులను కూడా ఇబ్బందులకు గురి చేయడంతో వారు ప్రాణాలు కోల్పోయినట్లు కూడా ఆరోపణలున్నాయి. ఇలా ఒక్కటి కాదు, రెండు కాదు కమీషనర్ మూలంగా అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభుత్వం దివ్యాంగులు సంక్షేమ శాఖపై దృష్టిపెట్టకపోతే పెద్దఎత్తున వ్యతిరేకత ఎదరుయ్యే ప్రమాదం లేకపోలేదు.