కాంగ్రెస్‌ బాటలో బిజేపి!

`కొత్తగా మొదలైన కుమ్ములాటలు

`గతంలో ఇలాంటి సంస్కృతి కాంగ్రెస్‌ లో వుండేది.

`ఇప్పుడు బిజేపికి పాకింది.

`బిజేపి అధిష్టానం అంతరంగం అందరికీ అర్థమైంది.

`పోరాడితే పోయేదేమి లేదని తెలిసొచ్చింది.

https://netidhatri.com/వరదల్లో-ప్రతిపక్షాల-బురద/

`తిరుగుబాటు మొదలైంది.

`అలిగినా గుర్తింపు వస్తుందని తెలింది?

`తెలంగాణలో గెలవడం కష్టమని బిజేపి అధిష్టానానికి తెలిసిపోయింది.

`పోరు నష్టం పొందు లాభం…తెలుసుకున్నట్లైంది.

`రాష్ట్ర నాయకత్వం, శ్రేణులకు దూరం పెరిగింది?

`ప్రశ్నించే తత్వం ఇక్కడ కూడా నేర్పినట్లైంది!

`నిజామాబాదు లో అరవింద్‌ మీద తిరుగుబాటు మొదలైంది.

`మొత్తంగా బిజేపి ఉనికి ఊగిసలాటకు చేరింది!

`బండికి జరిగిన అవమానానికి రిటర్న్‌ గిఫ్ట్‌ లన్న ప్రచారం సాగుతోంది!

`బండికి జరిగిన అన్యాయంలో అరవింద్‌ పాత్రపై కూడా అనుమానం మొదలైంది?

`పర్యవసానమే నిజామాబాదు గలాటకు కారణమని ప్రచారం జరుగుతోంది!

`బిజేపి ఎక్కడ మొదలైందో అక్కడికి వెళ్లేదాకా అంతర్గత పోరు ఆగదని అర్థమౌతోంది!

హైదరబాద్‌,నేటిధాత్రి:                             

బిజేపి శ్రేణులు ఇక కాంగ్రెస్‌ బాటలో నడవాలని నిర్ణయించుకున్నట్టున్నారు. ఇంత కాలం వున్న ఒత్తిడిని ఇక భరించలేకపోతున్నట్లున్నారు. బిజేపిలో ఎలాంటి అసంతృప్తి వున్నా, ఇప్పటి వరకు భహిరంగంగా చెప్పింది లేదు. వీధులకెక్కింది లేదు. మీడియా ముఖంగా చెప్పుకున్నది లేదు. మరో నాయకుడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసింది లేదు. ఎలాంటి పరిస్ధితుల్లోనైనా ఇతర నాయకుల మీద మాట్లాడిరది లేదు. కానీ తాజాగా బిజేపి శ్రేణులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడిరచేందుకు వెనుకాడడంలేదు. నాయకుల మీద వున్న అసంతృప్తిని ఆపుకోవడం లేదు. వారి మీద విమర్శలు చేయకుండా ఊరుకోవడం లేదు. ఆఖరకు పార్టీ కార్యాలయం ముందు ధర్నాలు చేసేదాకా వచ్చింది. ఇది కాంగ్రెస్‌లో ఎప్పుడూ జరుగుతూ వుంటుంది. కాని కొత్తగా బిజేపిలో కనిపించింది. తిరుగుబాటు అన్నది ఒక అంటు వ్యాధి లాంటిది. ఒక్కసారి మొదలైందంటే ఆగదు. ఒక చోట మొదలైందంటే మరో చోటికి పాకకుండా వుండదు. బిజేపిలో బలమైన నాయకుడుగా పేరున్న నిజామాబాద్‌ ఎంపి. అరవింద్‌ మీదనే ఇలా తిరుగుబాటు మొదలైందంటే పార్టీలో చాలా మంది ఇది ఎదుర్కొవాల్సిన తరుణం ఆసన్నమైందని సంకేతాలు పంపుతున్నట్లే లెక్క. గతంలో ఎందుకు లేదు? ఇప్పుడే ఎందుకు మొదలైంది? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమౌతోంది. గతంలో బిజేపిలో గ్రూపులు వున్నా, వర్గ విభేధాలు లేవు. నాయకత్వ ఆధిప్యత్యాలు కనిపించేవి కాదు. లోలోన అసంతృప్తులు కనిపించినా, బైట పడకుండా జాగ్రత్తపడేవారు. ఆఫ్‌ ది రికార్డుల్లో మీడియాకు లీకులిచ్చేవారు. అంతే తప్ప గొడవలు సృష్టించేదాక వెళ్లలేదు. ఇలాంటి పరిస్ధితి కొత్తగా కనిపించినా, అంతర్గత ప్రజాస్వామ్యానికి సూచికగా నిలుస్తుంది. ఒక రకంగా ఇది మంచిదే..కాని శృతి మించితేనే ఏదైనా ఇబ్బందికరంగా మారుతుంది. నిజామాబాద్‌ ఘటన జరిగి రోజులు గుడుస్తున్నా, అధిష్టానుంచి స్పందన లేదు. రాష్ట్ర పార్టీ స్పందించింది లేదు. అసలు గొడవకు కారణం తెలుసుకున్నది లేదు. కానీ జరిగిందానిపై రకరకాల వార్తలు మాత్రం గుప్పుమంటున్నాయి. ఇదంతా బండి సంజయ్‌ వర్గం చేసిన గలాటా అని కొందరంటుంటే, పార్టీ భ్రష్టుపట్టడానికి కారణమైనవారిపై రివెంజ్‌ అన్నది అంటున్నారు. 

ఎవరు కాదన్నా, ఎవరు ఔనన్నా, తెలంగాణ బిజేపి అంటే బండి సంజయ్‌కు ముందు, బండి సంజయ్‌కు తర్వాత అన్నది చెప్పుకోవాల్సిందే! 

అన్నది అందరూ చెప్పే మాటే. అసలు ఏమీ లేని బిజేపికి ఊపు తెచ్చిన నాయకుడు బండి సంజయ్‌. అలాంటి నాయకుడిని పక్కన పెట్టడం అంటేనే పార్టీకి చేతులు, కాళ్లు కట్టేసినట్లే లెక్క. బండి సంజయ్‌ తెచ్చిన ఊపు ఎవరి వల్లా కాదు? ఎంత మంది కలిసినా బండి సంజయ్‌ తెచ్చిన ఊపు తేలేరు. మంత్ర బలం లేకున్నా కాని, తుప్పిళ్ల బలమైనా కావాలని అంటారు. నిజంగా బండి సంజయ్‌ నాయకత్వం సీట్లు తీసుకురాకపోవచ్చు. కాని ఊపు తేలగలదు. కొన్ని ఓట్లు కూడ తేగలదు. అదే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కనిపించింది. బండి సంజయ్‌ జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో చేసిన వాగ్ధానాలపై ప్రజలు కూడా తర్వాత ప్రశ్నించలేదు. మీడియా కూడా పట్టించుకోలేదు. మొదట్లో మీడియా కొంత దృష్టిపెట్టినా ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో మీడియా కూడా వదిలేసింది. అంటే ఆ విషయంలో బండి సంజయ్‌ సక్సెస్‌ అయినట్లే లెక్క. దక్షిణాదిన అంతో ఇంతో బిజేపి కనిపించేది మాత్రం తెలంగాణలోనే. అది ఉమ్మడి రాష్ట్రమైనా, ఇప్పుడైనా తెలంగాణలో ఆది నుంచి బిజేపికి కొంత స్ధానం వుంది. అది ఓట్ల రూపంలోకి మారకపోయినా, సీట్లు పెద్దగా సంపాదించిపెట్టకపోయినా, బిజేపి కనిపించేది. అయితే బిజేపికి ఒంటరిగా వెళ్లేంత శక్తి ఆనాడు లేదు. ఇప్పుడూ లేదు. గతంలో ఎప్పుడు సీట్లు సాధించినా తెలుగుదేశం పొత్తుతోనే కొద్దోగొప్పొ ఉనికిలో వుండేది. కాని గత పార్లమెంటు ఎన్నికల్లో కేవలం మోడీ పుణ్యమా? అని మాత్రమే నాలుగు సీట్లు సంపాదించుకోగల్గింది. అదే ఊపుతోనే బిజేపికి సీట్లు రాబట్టుకోవాల్సిన అసవరం వుండేది. కాని ఎప్పుడైతే బండి సంజయ్‌ను పక్కన పెట్టారో అప్పుడే బిజేపిలో అసంతృప్తి, అలజడి కూడా మొదలైంది. 

నిన్నటిదాకా కనీసం హిందూఇజం పేరుతోనైనా సీట్లు రాకున్నా, ఓట్లైనా వచ్చేవి. ఇప్పుడు బిజేపికి ప్రధానంగా సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురౌతోంది.

 పెరుగుతున్న ధరలు బిజేపికి ఎంతో ఇబ్బంది. ఇదిలా వుంటే నాయకుల మధ్య సఖ్యతలు లేకపోవడం పార్టీని మరింత కుంగదీసే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. బిజేపి రాష్ట్ర నాయకులే మాటలే చెల్లుతాయా? మాట మాటలు చెల్లవా? అని ద్వితీయ శ్రేణి కూడా కదులుతున్నట్లు వుంది. అందుకే బిజేపిలో కూడా ప్రశ్నించడం మొదలైంది. ఆ మధ్య డిల్లీలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్‌ రావు చేసిన వ్యాఖ్యలపై చర్యలుంటాయని అందరూ అనుకున్నారు. అందుకోసమే రఘునందన్‌ అలాంటి వ్యాఖ్యలు చేశారన్న వార్తలు కూడా వచ్చాయి. అంటే బిజేపికి ముందు నుయ్యి, వెనకు గొయ్యిలా మారి, అడకత్తెరలో పోక చెక్కను చేస్తున్నారని అంటున్నారు. అవసరమైతే బిజేపి పెద్దలను కూడా ఎదిరించి మాట్లాడగలమన్న ధైర్యం రఘునందన్‌ నేర్పినట్లైంది. డిల్లీలో కూర్చొని అమిత్‌షా ప్రచారం లేకుండా గెలిచానన్నాడు. తాను బిజేపి నాయకుడిగా కాకుండా వ్యక్తిగత ఇమేజ్‌తో గెలిచొచ్చా! అని చెప్పుకున్నాడు. అంతే కాదు పార్టీ ప్రెసిడెంటు నేనుందు కు కావొద్దని అన్నాడు. అంతలోనే బండి సంజయ్‌ దిగిపోయాడు. కిషన్‌రెడ్డి వచ్చేశాడు. ఇక పార్టీలో మార్పులు జరిగే పరిస్ధితి లేదు. కొత్తగా పదవులు వచ్చేది లేదు. దాంతో ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్న నాయకులు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, పెద్ద నాయకులు పార్టీ అధిష్టానం మీద యుద్దం ప్రకటించేదాకా వచ్చింది. 

తాము ఏమనుకుంటున్నామో! అది అధిష్టానం నెరవేర్చాలన్నంత డిమాండ్‌ పెరిగిపోతోంది.

 తెలంగాణలో బిజేపి బతికి బట్టకట్టాలంటే, బిఆర్‌ఎస్‌ మీద చర్యలు తీసుకోవాలన్నంత దాకా వెళ్తున్నారంటే..! బిజేపి ఎటు కాకుండా పోతోందని చెప్పడానికి ఇదే సంకేతమని చెప్పొచ్చు. మంత్రులుగా పనిచేసిన వాళ్లు కూడా చట్టం, న్యాయం గురించి తెలిసినా, రాజకీయాలను రాజకీయాలుగానే చూడకుండా పోతున్నారు. బిఆర్‌ఎస్‌ను అణచివేయాలని కోరుతున్నారు. ఇది తప్పన్న సంగతి తెలియక కొందరు, తెలిసి కొందరు రాజకీయాలను శాసించాలని చూస్తున్నారు. బిఆర్‌ఎస్‌ను అణిచివేయాలని కోరుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో చెల్లదు. ఇదే బిజేపికి చిక్కులు తెచ్చిపెడుతోంది. బిఆర్‌ఎస్‌ను ఎలాగైనా ఇబ్బందులకు గురి చేయాలి, ఎమ్మెల్సీ కవితను విషయంలో దూకుడు ప్రదర్శించాలని బిజేపి నేతలు కోరుకోవడం రాజకీయ దివాళాకోరుతనం. అయితే రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కొంటే తెలంగాణలో బిజేపికి అడ్రస్‌ వుండదు. కేంద్రంలో అధికారంలో వున్నందును బిఆర్‌ఎస్‌పై అణచివేత దోరణి అవలంబిస్తే తప్ప, బిజేపికి మనుగడ లేదు. కాని చట్ట పరంగా అధి సాధ్యం కాదు. ఇదిలా వుంటే అంతర్గత పోరు బిజేపిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బిజేపి నాయకుల్లో పెరుగుతున్న దూరం పార్టీకి బీటలు వారేలా చేస్తోంది. ఇక బిఆర్‌ఎస్‌, బిజేపి ఒక్కటే అంటూ కాంగ్రెస్‌ లాంటి పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని కూడా బిజేపి నేతలు నమ్మడం కూడా వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం. ప్రభుత్వంవేరు. పార్టీ వేరు. అన్నది బిజేపి శ్రేణులకు అర్ధంకానంత కాలం, పార్టీలో కుమ్ములాటలు తప్పవు. పార్టీ మీద నమ్మకం పెరగదు. ఆధిపత్య దోరణలు ఆగవు. మొత్తంగా బిజేపికి ఉన్న బలం పోయేదాకా కొట్లాటలు ఆగవు. వున్నదే వలస వాదులు. వాళ్లు చెట్టుకొకరు,పుట్టకొకరు వెళ్తే, బిజేపిలో ఎవరూ మిగలరు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!