
ఏపీలో శాంతి భద్రతలపై వైయస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి ఆందోళన
లోక్ సభలో రూల్ 377 ద్వారా కేంద్రం దృష్టికి మిదున్ రెడ్డి అక్రమ అరెస్టు అంశం
తిరుపతి(నేటి ధాత్రి)
ఆంధ్రప్రదేశ్లో క్షీణించిన శాంతి భద్రతల అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మద్దిల గురుమూర్తి మంగళవారం మేటర్ అండర్ రూల్ 377 ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయని, పరిస్థితి విషమంగా మారిందని, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రమాదకరమైన దాడి జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా ఈ సమావేశాలలో తనతో పాటు ఉండాల్సిన తన సహచరుడు, రాజంపేట ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పి.వి.మిథున్ రెడ్డిని అక్రమ కేసులో అరెస్టు చేయడం గురించి ప్రస్తావించారు. ఇదొక్క సంఘటనే కాదని, ఇవన్నీ కుట్రల శ్రేణిలో భాగమని సభ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడం, ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారిని బెదిరించడం, పోలీసు యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం, ఇవన్నీ రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలుగా భావించాలని ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరచడం మాత్రమే కాకుండా, న్యాయం, సమానత్వం, ప్రాతినిధ్య పరంగా పాలన అనే సూత్రాల ఉల్లంఘన అని ఆయన పేర్కొన్నారు. ఈ చర్యలన కేంద్ర ప్రభుత్వం పరిశీలించి, రాజ్యాంగం అమలులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. తిరుపతి ఎంపీ కోరారు.