Youth Power Shines in Panchayat Elections
పంచాయతీ’పోరుకు యువత ‘జై’
స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపు
హర్షం వ్యక్తం చేస్తున్న యువత
పరకాల,నేటిధాత్రి
తెలంగాణాలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఈసారి యువ శక్తి దూకుడుగా బరిలోకి దిగింది.ఒకప్పుడు పెద్దల ఆధిపత్యం ఉన్న గ్రామ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త తరహా ఉత్సాహం కన్పిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతల నామినేషన్లలో 70 శాతానికి పైగా 30 నుండి 44 ఏళ్ల వయస్సు గల యువతే ఉండటం ఈ మార్పుకు నిదర్శనం.సర్పంచ్ స్థానాల కోసం పోటీలో సుమారు 60 శాతం యువ అభ్యర్థులు నిలుస్తుండగా,వార్డు సభ్యుల స్థానాల్లో 75 శాతం పైగా యువకులు,యువతులు కనిపిస్తున్నారు.సర్పంచ్ బరిలో 60శాతం వార్డు సభ్యుల్లో 75 శాతానికి పైగా పోటీలో ఉన్నట్లు సమాచారం.

తమ గ్రామాలను అభివృద్ధి చేస్తామని పలు చోట్ల ఉద్యోగాలు వదిలేసి బరిలోకి దిగుతున్నారు.ఇదే కోవకు చెందిన యువత హనుమకొండ జిల్లా పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామపంచాయతీకి చెందిన యువతి యువకులు సీపతి మౌనిక-తిరుపతి,కొయ్యడ చందన,మంద శ్రీకాంత్ లు గ్రామపంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి వార్డు మెంబర్ లుగా ఎన్నికయ్యారు.కామారెడ్డి పల్లి గ్రామపంచాయతీ 3వ వార్డు మెంబర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సీపతి మౌనిక తిరుపతి విజయం సాధించారు.అనంతరం ఉప సర్పంచ్ గా అధికారులు ఎంపిక చేశారు.అదేవిధంగా 4వ వార్డు మెంబర్ స్వతంత్ర అభ్యర్థి కొయ్యడ చందన, మరియు,5వ వార్డు మెంబర్ స్వతంత్ర అభ్యర్థి మంద శ్రీకాంత్ లు గెలుపొందారు. వీరు గ్రామంలో అభివృద్ధి పట్టుకొరకు నడుం బిగించారు.అభివృద్ధిశీల గ్రామాల కలతో, కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్న ఈ తరం,తమ ప్రాంతాల పురోగతికి కృషి చేయాలని సంకల్పించారు. కొందరు ఉద్యోగాలు,వ్యాపారాలు వదిలి ప్రజా సేవ కోసం బరిలోకి దిగడం గమనార్హం.స్థానిక సమస్యల పరిష్కారం,పరిశుభ్రత,విద్య, ఆరోగ్యం,యువత ఉపాధి వంటి అంశాలపై స్పష్టమైన దృష్టితో తమ అజెండాను రూపోందిస్తున్నారు.గ్రామాలు మారాలంటే నాయకత్వం మారాలని నమ్మే ఈ యువత, ప్రజల్లో చైతన్యం నింపి కొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలుకుతున్నారు.పంచాయతీ పోరులో ఈ యువ తరంగం ఫలితాలు ఎలా మలుస్తాయనేది ఇప్పుడు అందరి చూపు సారించిన అంశంగా మారింది.ఈ యువత గెలుపొందడంతో సీనియర్ నాయకులు, స్నేహితులు బంధుమిత్రులు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
