Farmers Demand Yasangi Rice Bonus
యాసంగి వరిధాన్యం బోనస్ రైతులకు చెల్లించాలి
మొక్కజొన్నలకు మద్దతు ధర లభించక నష్టపోతున్న రైతులు
రైతుల యాసంగి బోనస్ డబ్బులకై ఈనెల 25న చలో కలెక్టరేట్
ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్
నర్సంపేట,నేటిధాత్రి:
రైతాంగం ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజొన్న వరి పంటలకు కనీస మద్దతు ధర అమలయ్యే విధంగా ముందస్తు ప్రణాళికతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉందని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకెఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.తక్షణమే యాసంగి వరిధాన్యం బోనస్ డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు.నర్సంపేట పట్టణంలోని ఓంకార్ భవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పెద్దారపు రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాది రైతు ప్రభుత్వమని రైతు రాజ్యాన్ని తెస్తామని గొప్పలు చెప్తూ ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని యాసంగి సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాకు 500 రూపాయల బోనస్ అమ్మిన వెంటనే చెల్లిస్తామని చెప్పి రాష్ట్రంలో 23 లక్షల 36 వేల టన్నుల క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా తీసుకొని రైతులకు ఇవ్వాల్సిన 1168 కోట్ల రూపాయల బోనసు ను నాలుగునెలలైనా జమ చేయకపోవడం ఎంతవరకు సమంజసం అన్నారు. అధిక వర్షాలతో యూరియా కొరతతో ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతులు మొక్కజొన్న వరి పత్తి పంటలు వేసిన దిగుబడి తగ్గి పంటలు చేతికి వస్తున్న దశలో ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం అన్యాయం అన్నారు. రాష్ట్రంలోనే మొక్కజొన్నలు ముందుగా చేతికి అందే వరంగల్ జిల్లాలో రైతులు ఇప్పటికే నూటికి 70 శాతం మంది దళారులకు వ్యాపారులకు మద్దతు ధర కన్నా క్వింటాకు ఐదు వందల నుంచి 600 రూపాయల వరకు తక్కువకు అమ్ముకొని తీవ్రంగా దోపిడికి గురయ్యారని మొక్కజొన్నలన్నీ దళారులు కొన్న తర్వాత ఇప్పుడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవడం ఎవరి కోసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు వ్యవసాయ పంటల కొనుగోలు ప్రణాళిక లేకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మద్దతు ధర లభించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే యాసంగి వరి ధాన్యం అమ్మిన రైతులకు తక్షణమే బోనస్ డబ్బులను విడుదల చేసి రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు అందుకోసం ఈనెల 25న వరంగల్ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు రైతులను ఆదుకునే విధంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి అందుకు అనుగుణమైన చర్యలు చేపట్టాలని లేకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఏఐకేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కేశెట్టి సదానందం, యూపీఎన్ఎం జిల్లా కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, కలకొట్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
