చర్లపల్లి పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవం.
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపా ధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవం పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ
పచ్చని చెట్లతో,పారే నదులతో,అందమైన పక్షులు, అలరించే జంతువులతో, ఎన్నో జీవుల్ని కలిగి వున్న గ్రహం ఈ భూమి.ఈ జీవులన్నిటి మనుగడకు కావలసినది నీరు.అటువంటి నీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని, ప్రజలకు అవగాహన కలిగించుటకు 1993వ సం॥లో ఐక్యరాజ్యసమితి మార్చి 22ని అంతర్జాతీయ జల దినోత్సవం’గా ప్రకటించిందని, భూమి ఏర్పడినప్పుడు ఎంత నీరయితే ఉందో,ఇప్పుడు కూడా అంతే నీరు ఉంది. పెరగడం కాని, తరగడం కాని లేదు.కానీ ప్రపంచ జనాభా నిత్యం పెరుగుతునే ఉంది. అందుకే కోట్లాది మంది నీటి కోసం కటకటలాడుతున్నారు. భూమి మీద ఉన్న నీటిలో 97% ఉప్పునీరు. కేవలం 3% మాత్రమే మంచినీరు. ఈ నీటిని మనం చాలా పొదుపుగా ఉపయోగించుకోవాలని, ప్రపంచంలో భారీయుద్ధాలలో చనిపోయిన వారికన్నా కలుషిత నీరు తాగడం వలన మరణించిన వారి సంఖ్య ఎక్కువని,సంవత్సరానికి 40 లక్షల మంది కలుషిత నీరు తాగి మరణిస్తున్నారని అన్నారు.
కాబట్టి,నీటిని పొదుపుగా వాడుట, కలుషితం అవకుండా కాపాడుట మన అందరి యొక్క బాధ్యత అని,సకల చరాచర జీవకోటికి ప్రాణాధారం నీరు,నీరు లేక జీవకోటి మనుగడ లేదని అన్నారు.అనంతరం జల ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కంచరాజు కుమార్,అంగన్వాడీ టీచర్స్ బీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్యా,విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.