నర్సంపేట,నేటిధాత్రి :
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సంపేట డివిజన్ ఖానాపూర్ మండల పరిధిలోని గల పాఖాల అభయారణ్యంలో అటవీశాఖ,స్వచ్చంధ సంస్థల సమాఖ్యల ఆధ్వర్యంలో మొక్కలు నాటీ ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి కిరణ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు సమాజం లోని ప్రతీ ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపు నిచ్చారు. భూతాపంతోనే పర్యావరణానికి ముప్పు అని తెలియజేశారు.జీవరాశి మనుగడ పర్యావరణ పరిరక్షణతోనే సాధ్యం అని తెలిపారు.ప్రజలకు పర్యావరణం పట్ల అవగాహన పెంచాలని ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1972 లో జూన్,5వ తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ప్రకటించిందన్నారు., ఏఎస్ఆర్ సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్,స్వచ్చంధ సంస్థల సంస్థల సమాఖ్య అధ్యక్షులు గిరగాని సుదర్శన్ గౌడ్,స్వయంకృషి సంస్థ నిర్వాహకులు బెజ్జంకి ప్రభాకర్ మాట్లాడుతూ మానవళి కోసం భూమిని పునరుద్దరణ చేయడం, ఏడారీకరణను నిరోధించడం, కరువును తట్టుకునే శక్తిని పెంపొందించడం అనే లక్ష్యాలతో పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్య రాజ్య సమితి నిర్ణయం తీసుకుందని తెలియజేశారు. అడవులు, జల వనరులు తగ్గిపోతున్నాయని, ప్రకృతి కాలుష్యాల బారిన పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా అరికట్టి, ప్రజలు మొక్కలు పెంచడం ఒక వ్యాపకంగా అలవర్చుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో కన్స్యూమర్ ఫోరమ్ విజిలెన్స్ మెంబెర్ నాగేల్లి సారంగం గౌడ్, ఫారెస్ట్ సిబ్బంది, విజ్ డమ్ పాఠశాల ఎన్ సి సి విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.