Vemulawada Development Review Meeting
సమన్వయంతో పని చేసి పనులు పూర్తి చేయాలి
అభివృద్ధి పనులకు స్థలాలు గుర్తించాలి
నిర్ణీత గడువులోగా అందుబాటులోకి తీసుకురావాలి
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల పురోగతి, ఇతర అంశాలపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష
హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
వేములవాడ(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు.
వేములవాడ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్, రహదారులు & భవనాలు, పంచాయితీ రాజ్, గృహనిర్మాణ, మిషన్ భగీరథ, తదితర శాఖల అధికారులతో వేములవాడ మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం సమీక్ష నిర్వహించారు.
లో ఓల్టేజ్ సమస్య పరిష్కారానికి, సరఫరాలో ఇబ్బందులు దూరం చేసేందుకు వేములవాడ నియోజకవర్గానికి 220/11, 133/11 ఒక్కొకటి 33/11 (11) సబ్ స్టేషన్లు మంజూరు అయ్యాయని విప్ వెల్లడించారు. ఆయా సబ్ స్టేషన్ల పురోగతి పై ఆరా తీశారు.
రైతు విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి 50 ఎకరాల భూమి గుర్తించాలని, తాత్కాలిక భవనం కేటాయించాలని సూచించారు. ఈ భవనాలను సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని తెలిపారు.
పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ

ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద మంజూరైన పనుల నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు.
10 కోట్ల రూపాయలు ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేయడం జరిగిందని, సామాజిక భవనాలు, తదితర వాటికి ఈ నిధులను కేటాయించడం జరిగిందని వివరించారు.
15 కోట్ల రూపాయలను పంచాయితీ రాజ్ శాఖ ద్వారా మంజూరు చేయించి, పనుల జాతర కార్యక్రమం చేపట్టడం జరిగింది. పనుల జాతరలో భాగంగా గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, మొదలైన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన పనుల పురోగతిపై ఆరా తీశారు.
బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణాల పనులు ప్రారంభం కాకుండా ఉన్న వాటిని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని
రహదారి నిర్మించే ప్రదేశాల్లో వేసిన విద్యుత్ స్తంభాలను తొలగించి, రహదారులు నిర్మించాలని ఆదేశించారు.
సమస్యలు ఉంటే సంబంధిత శాఖల అధికారులు జాప్యం చేయకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలించి, సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
రహదారులు, భవనాల శాఖ
మూలవాగు వంతెనకు 2015 లో శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించకుండా ఉంచారని, ఈ మధ్య తిరిగి శంకుస్థాపన చేసుకున్నామని వివరించారు.
వంతెన నిర్మాణం కోసం 6 కోట్ల 90 లక్షల రూపాయలు భూసేకరణ కోసం కేటాయించడం జరిగిందని, అవసరమైన భూసేకరణ చేసి, పనులు ప్రారంభించి, పనులు వేగవంతం చేయాలని, వచ్చే వర్షాకాలంలో లోగా వంతెన నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో దెబ్బతిన్న కల్వర్టులు, రహదారుల మరమ్మతు పనులపై ఆరా తీశారు. దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులు, వంతెనలకు భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
మోత్కురావుపేట- చందుర్తి రోడ్డుకు అటవీ శాఖ నుంచి అనుమతి వచ్చిందని, రూ.24 కోట్లతో రోడ్డు పనులు పూర్తి చేయనున్నామని వివరించారు. మూలవాగు, పెంటి వాగు పై బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
నీటి పారుదల శాఖ..
ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో మొత్తం 10 చెరువుల పనులు మొదలు కాగా, 7 పూర్తి అయ్యాయని, మర్రిపెల్లి, లచ్చపేట, కలికోట సూరమ్మ ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయని ఈఈ తెలిపారు. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ ఎకరాల భూమి సాగులోకి
తీసుకు వచ్చేందుకు రూ. 325 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని, పనులు పూర్తి చేస్తే 45 వేల ఎకరాల భూములకు సాగులోకి వస్తాయని విప్ వెల్లడించారు. జిల్లాలో ఆయా ప్రాజెక్టులు పూర్తి చేస్తే దాదాపు లక్ష 50 వేల ఎకరాల భూమి సాగులోకి వస్తుందని వివరించారు.
మల్కపేట ప్రాజెక్ట్ కోసం కుడి, ఎడమ కాలువల నిర్మాణానికి మొత్తం 700 ఎకరాల భూమి అవసరమని జిల్లా నీటి పారుదల శాఖ అధికారి కిశోర్ కుమార్ తెలిపారు. వాటి కోసం పూర్తి ప్రతిపాదనలు పంపాలని విప్ సూచించారు. వీటిని పూర్తి చేస్తే వేలాది ఎకరాల భూములు సాగులోకి వస్తాయని విప్ తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లు..
వేములవాడ నియోజకవర్గ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, 1957 ఇండ్ల నిర్మాణాలకు మార్కింగ్ చేయడం జరిగిందని, 1482 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయని, 12 ఇండ్ల నిర్మాణం ఇప్పటివరకు పూర్తయిందని గృహ నిర్మాణ శాఖ అధికారులు వివరించారు. మండలాల వారీగా ఇండ్ల నిర్మాణాల పురోగతిపై ఆరా తీశారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి ఏమైనా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉంటే జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించాలని, ఇసుక సమస్యలు ఉంటే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను విప్ ఆదేశించారు.
వీటీఏడీఏ ..
వేములవాడ రాజన్న ఆలయం ద్వారా ప్రతి ఏడాది రూ. 186 కోట్ల ఆదాయం వస్తుందని, అదే స్థాయిలో భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు గత ఏడాది సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఇదేరోజు నవంబర్ 20 వ తేదీ 2024న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. 150 కోట్ల ఆలయ విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
భీమేశ్వర ఆలయంలో రూ.3.50 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు. రాజన్న ఆలయ వద్ద భక్తులకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.
మిషన్ భగీరథ..
మిషన్ భగీరథలో భాగంగా త్రాగునీరు సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, అగ్రహారంలో ఉన్న మిషన్ భగీరథ గ్రిడ్ ప్లాంట్ నిర్వహణపై ఆరా తీశారు. వాస్తవాలు యంత్రాంగానికి తెలియజేయాలని సూచించారు. 9 మోటార్లు అందుబాటులో ఉన్నాయని, స్టాండ్ బై మోటార్లు కూడా ఉంచాలని, వేసవికాలంలో ఇబ్బందులు తలెత్తకుండా ముం జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పూర్తి స్థాయిలో మిడ్ మానేరు ప్రాజెక్ట్ నింపడంతో భూములు మునిగి పోతున్నాయో 318 అడుగుల వరకు నీటిని నింపామ్. ప్రాజెక్ట్ కు హద్దులు నిర్ణయించి, అధికారికంగా పూర్తి చేయాలని విప్ పేర్కొన్నారు. రైతులు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. మరోసారి సర్వే చేసి స్పష్టం చేయాలని సూచించారు. హద్దులకు రాళ్లు, చెట్లు పెట్టాలని ఆదేశించారు.
మధ్య మానేరు నిర్వాసితులకు పట్టాలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని, ఆలయాలు, కుల సంఘాల భవనాలకు పరిహారం ఇవ్వాలని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సూచించారు.
వట్టిమల్ల, నిమ్మపల్లి వద్ద ఇసుక రీచ్ లు ఏర్పాటు చేయాలని విప్ కోరారు. రుద్రంగికి 42 కోట్లతో ఏటీసీ మంజూరు అయిందని, నియోజకవర్గానికి 20 వేల మెట్రిక్ టన్నుల గోదాములు మంజూరు అయ్యాయని తెలిపారు. 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ప్రజాప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభావవంతంగా అమలు చేసి, ప్రజలకు క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, సమష్టి విజయం కోసం కృషి చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు, తరలింపులో ఇబ్బందులు తొలగించాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు మరింత అంకిత భావంతో పనిచేయాలని పిలుపు ఇచ్చారు.
పనులను వేగంగా పూర్తి చేయాలి
నియోజకవర్గంలో ఆయా అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వివిధ అభివృద్ధి పనులకు స్థలాలు వెంటనే గుర్తించాలని సూచించారు. సమన్వయంతో పని చేస్తూ ముందుకు వెళ్ళాలని, గడువులోగా పనులు పూర్తి చేయాలని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఆయా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
సమావేశంలో వేములవాడ ఆర్డీఓ రాధాభాయ్, డీఆర్డీఓ శేషాద్రి, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
