Women Empowerment Through Zero-Interest Loans
మహిళల అభివృద్ధి – సమాజ అభివృద్ధి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
లక్షేట్టిపేట,(మంచిర్యాల)నేటి ధాత్రి:
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వడ్డీ లేని రుణాల పంపిణీ పథకంలో భాగంగా మంగళవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్,జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్,మండలాల తహసిల్దార్లు,మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలిసి లబ్ధిదారులకు వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల అభివృద్ధి లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తుందని,ఇందులో భాగంగా మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణాలను అందిస్తుందని తెలిపారు.మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉచిత బస్సు ప్రయాణం,200 యూనిట్ల ఉచిత విద్యుత్,మహిళను కుటుంబ పెద్దగా గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా కోళ్ళ పెంపకం,డైరీ ఫార్మ్, క్యాంటీన్ ఇతర వ్యాపార రంగాలలో మహిళలను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేయడం జరిగిందని, మందమర్రి మండలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుతో పాటు మిగతా ప్రాంతాలలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దండేపల్లి మండలంలో మహిళల నిర్వహణలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని,మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకెపి ఆధ్వర్యంలో మహిళలకు కేటాయించడం జరిగిందని తెలిపారు.అనంతరం మంచిర్యాల నియోజకవర్గంలోని 1 వేయి 618 స్వయం సహాయక సంఘాలకు 1 కోటి 43 లక్షల 61 వేల రూపాయల వడ్డీ లేని రుణాల పంపిణీ చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు,ప్రజా ప్రతినిధులు,మహిళా సమాఖ్య ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు,మహిళలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
