ఈ నెల 30న విచారణ అధికారి పదవి విరమణ
పదవి విరమణ లోపుగా విచారణ పూర్తయ్యేనా ?,
అక్రమాల పుట్ట బట్టబయలయ్యేనా ?.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, మండల పరిధిలోని పోలేపల్లి గ్రామపంచాయతీ రికార్డుల ట్యాంపరింగ్ కు సంబంధించిన విచారణ నిర్ణీత కాలంలో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రికార్డుల ట్యాంపరింగ్ కు సంబంధించి విచారణ అధికారిగా నియమితులైన జిల్లా పంచాయతీ అధికారి పండరినాథ్ ఈనెల 30వ తేదీన పదవి విరమణ చేయబోతున్నారు.ఆలోపుగా విచారణ పూర్తవుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పోలేపల్లి గ్రామపంచాయతీలో సుమారు 6 కోట్ల రూపాయల నిధుల వినియోగం వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. విచారణలో ఆ ఆరోపణలు కొంతవరకు వెలుగులోకి వచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం. అయితే విచారణ ఎంతవరకు నిష్పక్షపాతంగా జరుగుతుందనే అనుమానాలు గ్రామస్తుల్లో నెలకొన్నాయి. ఈ విషయం పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సీరియస్ గా ఉండడం వల్ల విచారణ సాఫీగా సాగుతుందని భావించినా నిర్ణీత సమయంలో విచారణ పూర్తి కాకుంటే విచారణ మరో అధికారికి బదిలీ అయ్యే అవకాశంతో పాటు ఆ అధికారి సంబంధిత అంశంపై పట్టు సాధించి విచారణ పూర్తి చేసేందుకు తీవ్ర జాప్యం నెలకొనే అవకాశం ఉందని, అందువల్ల విచారణ పక్కదారి పట్టే అవకాశాలు కూడా లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందువల్ల పండరీనాథ్
డి ఎల్ పి ఓ గా పదవీ విరమణ చేసే లోపల విచారణ పూర్తి చేయాలని, అక్రమాలకు పాల్పడిన వారికి తగిన శాస్తి జరగాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు.