కార్మికులపై వివక్షత తగ్గదా..?
నేటి ధాత్రి/ శ్రీరాంపూర్
సంస్థ అభివృద్ధి కోసం ప్రతినిత్యం పాటుపడే కార్మికులపై, యాజమాన్యాలకు అనాదిగా ఉన్న వివక్షత తగ్గదా..? అంటే ప్రస్తుతం కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. సింగరేణిలోని ఆర్కే -7 గనిలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికుడికీ సంస్థ కేటాయించిన క్వార్టర్లో దర్వాజాలు, తలుపులు చెదలు పట్టి ఊడిపోయాయి. ఎంతోకాలంగా తను ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం కోసం యాజమాన్యానికి గత సంవత్సరం జనవరిలో దరఖాస్తు పెట్టుకున్నాడు. సదరు కార్మికుడు ఎన్నిసార్లు వెళ్లి అడిగిన కాంట్రాక్ట్ సమయం పూర్తయిందని, కొత్త కాంట్రాక్ట్ రాగానే పంపిస్తామని కాలయాపన చేస్తూ కార్మికుడితో పాటు వారి కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒకే కుటుంబం.. ఓకే గమ్యం.. ఒకే లక్ష్యం. కార్మికులందరినీ, అధికారులను ఒకే కుటుంబంగా భావించి సింగరేణిని అభివృద్ధి పథంలో నడిపించాలనే స్ఫూర్తితో ఈ నినాదాన్ని వాడుతుంటారు.ఒకవేళ అధికారులకు ఇలాంటి పరిస్థితి ఏర్పడితే కాలయాపన చేస్తారా అనే ప్రశ్న కార్మికులలో ఉత్పన్నం అవుతుంది. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి కార్మికులకు కేటాయించిన క్వార్టర్లలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయాలని కార్మికులు కోరుతున్నారు.
