
Lalit Modi Defends Sreesanth-Harbhajan Video
ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ
హర్భజన్ సింగ్, శ్రీశాంత్ వివాదానికి సంబంధించి కాంట్రవర్షియల్ వీడియో విడుదల చేయడాన్ని ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. నిజం చెప్పిన తనపై అంత కోపం ఎందుకని శ్రీశాంత్ భార్యను ప్రశ్నించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్2008 సీజన్లో కలకలం రేపిన శ్రీశాంత్-హర్భజన్ సింగ్ వివాదానికి సంబంధించి ఎవ్వరూ ఇప్పటివరకూ చూడని వీడియోను ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ ఇటీవల విడుదల చేయడం కలకలానికి దారి తీసింది. అయితే, లలిత్ మోదీ తన చర్యను సమర్థించుకున్నారు. శ్రీశాంత్ భార్య భువనేశ్వరి తనపై చేసిన విమర్శలు సబబు కాదని చెప్పే ప్రయత్నం చేశాడు. తాను నిజం మాత్రమే చెప్పానని అన్నారు. హర్భజన్ సింగ్ శ్రీశాంత్‌పై చేయి చేసుకున్న ఈ వీడియోను ఇటీవల మైఖేల్ క్లార్క్ నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్‌లో లలిత్ మోదీ బయటపెట్టారు. దీనిపై మండిపడ్డ శ్రీశాంత్ భార్య భువనేశ్వరి.. పాత గాయాలను ఎందుకు రేపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఆమెకు ఎందుకంత కోపమో నాకు అర్థం కావట్లేదు. నాకు ఆ పాడ్‌కాస్ట్‌లో ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా నిజమే చెప్పాను. గతంలో ఇలాంటి ప్రశ్న నన్నెవరూ అడగలేదు. క్లార్క్ ఈ విషయమై ప్రశ్న అడగగానే నేను సమాధానం ఇచ్చాను’ అని లలిత్ మోదీ జాతీయ మీడియాకు తెలిపారు. ఆ వీడియో తన వ్యక్తిగత సెక్యూరిటీ కెమెరా ఫుటేజీ అని లలిత్ మోదీ క్లార్క్‌తో అన్నారు. ఆ సమయంలో బ్రాడ్ కాస్ట్ కెమెరాలు ఆఫ్ చేసి ఉన్నాయని చెప్పారు. 18 ఏళ్లుగా ఈ ఫుటేజీ తన వద్దే ఉందని అన్నారు. ఈ ఘటన తరువాత హర్భజన్ సింగ్‌పై మిగిలిన మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించినట్టు తెలిపారు.
ఇక లలిత్ మోదీపై మండిపడ్డ భువనేశ్వరి.. మైఖేల్ క్లార్క్‌పై కూడా ఫైరైపోయారు. ఇలాంటి పని చేసినందుకు ఆ ఇద్దరు సిగ్గుపడాలని అన్నారు. 17 ఏళ్ల నాటి గాయాన్ని మళ్లీ ఎందుకు రేపుతున్నారని ప్రశ్నించారు. శ్రీశాంత్, హర్భజన్ సింగ్‌కు స్కూలుకెళ్లే వయసులోని పిల్లలు ఉన్నారని, ఈ వీడియో ఇరు కుటుంబాలకు వేదన మిగిల్చిందని చెప్పారు. ఇలాంటి వాళ్ల మీద కేసు పెట్టాలంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కాగా, ఆ వీడియోను చాలా కొద్ది మంది మాత్రమే చూశారని క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే అన్నారు. అది ఐపీఎల్ తొలి సీజన్ కావడంతో వీడియోను బహిర్గతం చేయొద్దని అప్పట్లో నిర్ణయించినట్టు తెలిపారు.