-విశ్వనీయత కోల్పోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం.
-సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినా మారదా!

-ఈవిఎంల మీద ఆరోపణలు.
-ఎన్నికల నిర్వహణలో లోపాలు.

-కౌంటింగ్‌లో అస్తవ్యస్త ప్రకటనలు
-వివి ప్యాట్స్‌పై అనేక అభ్యంతరాలు.
-ఎన్నికల సంఘం పని తీరు పార్టీల బరితెగింపుకు చెక్ పెట్టాలి.
-బీహార్ లో ఎందుకంత వావాదాస్పమౌతోంది.
-శేషన్‌లా గుర్తింపు పొందేలా పని తీరు వుండాలి.
-నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించిన పేరు సంపాదించుకోవాలి.
-ప్రపంచమంతా ఇండియన్ ఎన్నికల నిర్వహణ గురించి గొప్పగా చెప్పుకోవాలి.
-ప్రజాస్వామ్యంపై మరింత నమ్మకం పెంచాలి.
హైదరాబాద్,నేటిధాత్రి:
ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ అనేది ఒక క్రియాశీలకమైన ప్రక్రియ. ప్రజల నిర్ణయాన్ని నిక్షిప్తం చేసే వ్యవస్ధ. ప్రజలు కోరుకునే పార్టీని గెలిపించుకొని, పాలించమని కోరుకునేందుకు ఎన్నికల సంఘం ఒక వేదిక. ఆ ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్దమైనది. ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినది. అలాంటి ఎన్నికల సంఘం ఇటీవల అనేక వివాదాల్లో చిక్కుకుంటోంది. ఆ వ్యవస్ధ వున్నదే ఎన్నికలను సకాలంలో, సక్రమంగా నిర్వహించి, ప్రజా నిర్ణయాన్ని ప్రతిబింబించేలా వుండాలి. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించాలి. అంతే కాని పదే పదే వివాదాలకు ఎన్నికల సంఘం కేంద్రం కాకూడదు. ఈ మధ్య ఎన్నికల సంఘం ఎదుర్కొంటున్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. రాజకీయ పార్టీలు అనేక విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల సంఘం ఓ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందన్న ఆరోపణలు రాజకీయపార్టీలు నేరుగానే చేస్తున్నాయి. అయినా ఎన్నికల సంఘంలో ఎలాంటి కదలిక లేదు. అంటే ఎన్నికల నిర్వహనలో పొరపాట్లు జరుగుతున్నాయని ఒప్పుకున్నట్లేనా? అవి దిద్దుకోలేనంత స్దాయిలో జరుగుతున్నాయని అంగీకరించినట్లేనా? అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఏ రాష్ట్ర ఎన్నికల నిర్వహణలోనూ కూడా పాదర్శకత కనిపించడం లేదని రాజకీయ పార్టీలు పదే పదే వెలెత్తి చూపుతున్నాయి. అలా ఆరోపణలు చేసి, చేసి విసిగిపోయిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఏకంగా సుప్రింకోర్టును కూడా ఆశ్రయించాయి. గతంలో సుప్రింకోర్టు కూడా పెద్దగా ఈ విషయాలను సీరియస్‌గా తీసుకోలేదు. కాని ఇటీవల దేశ వ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటిపై విచారణకు సీకరించిన సుప్రింకోర్డు అడుగుతున్న ప్రశ్నలలో ఎన్నికల కమీషన్ వద్ద సరైన సమాధానాలు వుండడం లేదు. దాంతో అనుమానాలు అందిరిలోనూ మరింత బలపడుతున్నాయి. ఎన్నికల సంఘం షరతులు, అనుసరిస్తున్న విధానాలు కూడా అలాగే వున్నాయి. సహజంగా ఎన్నికలు పూర్తయిన తర్వాత 45 రోజుల వరకు ఆ ఫలితాలకు సంబందించిన లెక్కలు చెరిపేయకూడదు. కాని ఇటీవల జరిగిన కొన్ని రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన వివరాలు పది రోజుల్లోనే మాయం చేశారని తెలుస్తోంది. ఎందుకు అలా ఎన్నికల సంఘం చేయాల్సి వచ్చిందన్నదానిపై సమాదానాలు లేవు. ఇది ఎన్నికల సంఘం నిర్లక్ష్యాన్ని చూపిస్తోంది. నిజం చెప్పాలంటే ఎన్నికల సంఘం అంటే రాజకీయ పార్టీలు భయపడేలా వుండాలి. ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా ఎన్నికలకు అర్హులు కాకుండాపోతామన్న భయం నాయకుల్లో వుండాలి. పార్టీల గుర్తింపు రద్దు జరుగుతుందనే భయం పార్టీల్లో కూడా వుండాలి. కాని ఎన్నికల సంఘం గత కొంత కాలంగా ఒక పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు దురదృష్టకరం. ఆ ఆరోపణలు నిజం కానప్పుడు, ఆయా రాజకీయ పార్టీల మీద చర్యలకు కూడా ఎన్నికల సంఘం సిఫారసు చేయొచ్చు. కాని చేయడం లేదు. రాజకీయ పార్టీలకు వివరణలు ఇచ్చింది లేదు. ఎన్నికల సంఘానికి వున్న హక్కులను వినియోగించింది లేదు. ఇలా కూడా ఎన్నికల సంఘం వివాదాల్లో చిక్కుకున్నది. ఆ మధ్య జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెళ్లువెత్తాయి. మహారాష్ట్రలో జరిగిన ఓ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి విజయం సాధించారు. అదే పార్లమెంటు నియోజకవర్గ పరిదిలో వున్న అసెంబ్లీ నియోజకవర్గాలలో బిజేపి పార్టీ గెలిచింది. ఏకకాలంలో జరిగిన ఎన్నికల్లో ఇలాంటి తేడాలు సహజంగా దొర్లవు. ఎన్నికల జరిగిన తర్వాత ఎన్నికల సంఘం విడుదల చేసిన లెక్కలకు, తర్వాత లెక్కలకు ఎక్కడా పొంతనలేదు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం చాలా వేగంగా ఎన్నికల పోలింగ్ వివరాలు అందించే వెసులుబాటు వుంది. గతంతaలో బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించినప్పటికంటే ఇప్పుడు ఎందుఉకు కాలాతీతమౌతోందన్నది అర్దం కాని ప్రశ్నగా మిగిలిపోతోంది. బ్యాలెట్ తో ఎన్నికల జరిగిన సమయంలో కూడా మరునాటి వరకైనా లెక్కలు పక్కాగా ప్రకటించేవారు. ఏ సమయానికి ఎంత పోలింగ్ అయ్యింది. పోలింగ్ మొదలైన తొలి గంట నుంచి ఆఖరు ఓటు వరకు లెక్కల్లో ఎలాంటి తేడాలు వుండేవి కాదు. ఇంత టెక్నాలజీ పెరిగిన సందర్భంలో పోలింగ్ లెక్కలు చెప్పడానికి మూడు రోజులు సమయం ఎందుకు పడుతుందన్న ప్రశ్నలకు ఎన్నికల సంఘం నుంచి సరైన సమాధానం లేదు. అది కూడా పారదర్శకంగా వుండడం లేదు. పైగా పెద్దఎత్తున ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగినట్లు ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి. లక్షల్లో ఓట్లు రాత్రికి రాత్రి ఎలా పెరిగాయని ప్రశ్నిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఓట్లు వేస్తున్న వారి ఓట్లు లేకపోవడం, లక్షల్లో ఓట్లు పెరిగిపోవడం అనేది అనుమానాలకు తావిస్తోంది. ఇక హర్యానా ఎన్నికల విషయంలోనూ ఎన్నికల సంఘం ఇలాంటి వివాదాన్నే ఎదుర్కొన్నది. తొలుత పోస్టల్ బ్యాలెట్‌తోపాటు, కొన్ని రౌండ్ల లెక్కింపు వరకు కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోయింది. కాని అనూహ్యంగా కొన్ని రౌండ్లు పూర్తయ్యే సరికి బిజేపి పుల్ స్వింగ్‌లోకి వచ్చింది. కాంగ్రెస్ చాలా వెనుకబడిపోయింది. ఇది కూడా పెద్ద వివాదమైంది. ఇదంతా ఎన్నికల సంఘానికి తెలియకుండా జరిగి వుంటుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నతమౌతున్నాయి. ఇక ఏపిలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో సుమారు 54లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయని చెబుతున్నారు. ఒక రాష్ట్రంలో ఏకంగా 53లక్షల ఓట్ల తేడా వచ్చినట్లు గుర్తించారు. అసలు ఇన్ని లక్షల ఓట్లు ఎలా వచ్చాయి. పోలింగ్‌కు, ఎన్నికల ఫలితాలకు మధ్య ఇంత తేడా ఎలా వచ్చిందన్న దానిపై సర్వత్రా ఎన్నికల ఫలితాల నాటి నుంచే ఆందోళన వ్యక్తమౌతోంది. ఇప్పుడు ఆ ఆందోళన మరింత ఊపందుకున్నది. ఏకంగా ఏపి ఎన్నికలు రద్దు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఏపి ఎన్నికల విషయం కూడా ఇంత పెద్ద ఎత్తున ఊపందుకోవడానికి బిహార్‌లో ఎన్నికల కమీషన్ తీరుతో మరింత బలం చేకూరింది. సరిగ్గా ఏపిలో అనుసరించిన విదానమే బిహార్‌లో అనుసరించేలా వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. అక్కడ కూడా 33 లక్షల ఓట్లు ఏకంగా ఎన్నికల జాబితాలోనే కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా ఎందుకు అవుతోంది. సహజంగా పోలింగ్ రోజున ఉదయం నుంచి మద్నాహ్నం వరకు ఒక్కొసారి కనీసం పదిహేను శాతం కూడా పోలింగ్ కాదు. సాయంత్రం ఐదు గంటల వరకు అరవై, నుంచి డెబ్బై శాతం పోలింగ్ జరగుతుంది. ఒక గంట ఎక్కువ సమయం కేటాచించినా ఓ రెండు నుంచి ఐదు శాతం ఓటింగ్ పెరగొచ్చు. ఆరు గంటలలోపు వచ్చి లైన్లో నిలుచున్న వారందరికీ ఓటు వేసుకునే అవకాశం కల్పించినా, సరే మరో రెండు శాతం పెరగొచ్చు. ఏకంగా పదిహేను శాతం ఓటింగ్ పెరగడం అనేది సాద్యమయ్యే పని కాదు. ఎన్నికల పలితాల తర్వాత సుమారు 45 రోజుల వరకు వివిప్యాట్స్ లెక్కబెట్టేందుకు అందుబాటులో వుంచుకోవాలి. కాని ఎన్నికల కమీషన్ పదిరోజుల్లోనే వాటిని చిత్తు చేసినట్లు సుప్రింకోర్టుకు వెల్లడిరచింది. అసలు అంత త్వరగా వివిప్యాట్స్‌ను, ఈవింఎంలలో వుండే డాటాను ఎందుకు తొలగించినట్లు అనేదానిపై ఎన్నికల కమీషన్ వద్ద సమాదానం లేదు. సుప్రింకోర్టు ఒత్తిడిని తట్టుకునేందుకు భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామన్నారు. మరి ఎన్నికలు జరిగిన రాష్ట్రాల పరిస్దితి ఏమిటన్నది ప్రశ్నగా మిగిలిపోతోంది. ఏపిలో వైసిపికి కేవలం 11 సీట్లు రావడంతో ఈ అనుమానం మరింత బలపడిరది. కొన్ని పోలింగ్ స్టేషన్లలో రాత్రి ఒంటి గంట వరకు పోలింగ్ జరిగినట్లు కూడా చెబుతుండడంతో అంత మంది పోలింగ్ స్టేషన్లోకి ఎలా వచ్చారు. ఆరు తర్వాత వచ్చిన వారిని ఎలా అనుమతించారు. ఎలా ఓట్లు వేయించారు. ప్రకటించిన పోలింగ్ శాతానికి కన్నా అదనంగా ఫలితాలలో వచ్చిన ఓట్లు, మెజార్టీల లెక్కల్లో చాలా తేడా వుందని నిపుణులు అంటున్నారు. బిహార్‌లో కూడా ఇదే జరగొచ్చన్న అనుమానాలు ఎక్కువగా వ్యక్తమౌతున్నాయి. డిల్లీలో కూడా ఇలాగే జరిగిందని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఎన్నికల కమీషన్ పారదర్శకంగా వుండాలి. నిస్పక్షపాతంగా వ్యహరించాలి. ప్రజలకు అనుమానాలను నివృత్తి చేయాలి. ప్రజాస్వామ్య గొప్పదనాన్ని ఎన్నికల కమీషన్ కాపాడాలి. ప్రజల నిర్ణయానికి భిన్నంగా ఫలితాలు వస్తే, ఎన్నికల సంఘం మీద విశ్వసనీయత పోతుంది. అది ఎన్నికల నిర్వహణకే శాపంగా మారుతుంది.
