`ఉద్యోగికి అవినీతి బలం!..నాయకులకు అవినీతి అధికారులే బలగం!!
`ఉద్యోగి ముదిరి అవినీతిని హక్కుగా మార్చుకున్నారు.
`ఒకప్పుడు ఉద్యోగులు వేతన జీవులు.
`ఇప్పుడు అవినీతి తిమింగలాలు.
`ఒకప్పుడు ఒకటో తారీఖు ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూసేవారు!
`ఒకటో తారీఖును ఉద్యోగులు ఎప్పుడో మర్చిపోయారు.
`ఆటబొమ్మలను చేసిందెవరు?
`తోలు బొమ్మలను చేసి ఆడిస్తున్నదెవరు?
`కీలుబొమ్మలుగా మార్చుకొని వాటాలు పంచుకుంటున్నదెవరు!
`అవినీతి అధికారులు అందలమెక్కించిందెవరు!
`అధికారులతో సూట్ కేసులు మోయించేదెవరు?
`వారితో కమీషన్లు వసూలు చేయించేదెవరు?
`లంచం ఇవ్వనిదే ఫైలు కదలకుండా అలుసు ఇచ్చిందెవరు?
`ప్రజా ప్రతినిధులుగా అధికారులతో పని చేయించకుండా, కమీషన్లకు కక్కుర్తి పడిరదెవరు?
`ప్రతీ పనికి రేట్లు ఫిక్స్ చేసేదెవరు?
`ఏసిబికి రెడ్ హాండెడ్‌గా దొరికిన దొంగలకు మళ్ళీ పోస్టింగ్ ఎలా వస్తోంది.
`ఏసిబికి పట్టుబడిన వాళ్ల ఆస్థులు జప్తు చేస్తే అవినీతి చేస్తారా?
`ఒక్కసారి పట్టుబడితే ఉద్యోగం పోతుందని భయం ఎందుకు లేదు?
`తాజాగా అవినీతి ఆరోపణలు వున్న గడలకు విఆర్‌ఎస్ ఎలా ఇచ్చారు?
`డిమోషన్ ఆర్డర్ ఎందుకు అమలు కాలేదు?
`అలాంటి అధికారిని శిక్షిస్తే ఉద్యోగుల్లో భయం ఎర్పడదా?
`అధికారులు ముదిరి నాయకులెలా అవుతున్నారు?
`ఎన్నికలలో పోటీ చేసేందుకు కోట్లకు కోట్లు ఎలా కూడుతున్నాయి!
`హైడ్రాను అడ్డం పెట్టుకొని వసూళ్ళపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పేదెవరు?
`హైడ్రా పరిధిలో పని చేస్తున్న వారిలో నిజాయితీ పరులెంతమంది?
`నిన్నటి దాకా పర్మిషన్లు ఇచ్చి, ఇప్పుడు వాళ్లే నోటీసులిస్తే బాధ్యులెవరు?
హైదరాబాద్,నేటిధాత్రి:
విత్తు ముందా..చెట్టు ముందా అన్న పంచాయితీ ఎప్పటికీ తెగదు. అవినీతి లేని సమాజం నిర్మాణం ఎప్పటికీ జరగదు. ఇది ముమ్మాటికీ నిజం. అవినీతి రహిత భారతం అన్న పదాన్ని చెప్పే నాయకులే దానికి ఆధ్యులైనంత కాలం సాధ్యం కాదు. తాజాగా హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ స్దలాల ఆక్రమణల స్వాధీనంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమ పర్మిషన్లు ఇచ్చిన అదికారులపై కేసులు నమోదు అన్న ప్రక్రియ మొదలు పెట్టింది. ఇది ఆహ్వానించ దగ్గ పరిణామమే అయినా, అసలు ఆ విషయంలో ఒక్క అధికారులనే ఎలా బాధ్యులను చేస్తారన్నదానిపై కూడా విసృతంగా చర్చ జరగాల్సిన అవసరం వుంది. సమాజంలో జరిగే తప్పులన్నింటికీ, అవినీతి కార్యకలాపాలకు అధికారులను బాద్యులను చేయడం అన్నది రాజకీయ నాయకులు తప్పించుకోవడానికి మార్గమే అవుతుంది. అసలు ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే అవినీతికి ఆద్యులు, దానికి పురుడు పోసిన వారు రాజకీయ నాయకులే. ఏ దేశంలో చూసినా అవినీతిని ప్రోత్సహించిన వారెవరైనా వున్నారా? అంటే అది రాజకీయ నాయకులే అని అన్నీ వేళ్లూ వారి వైపే చూపిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. అవినీతి అన్నది మన దేశంలో కూడా ఎప్పుడూ వున్నదే. కాని సరిగ్గా ఓ ముప్పై ఏళ్ల క్రితం అవినీతికి ఇప్పుడు కనిపిస్తున్న అవినీతికి కొన్ని వందలరెట్లు ఎందుకు పెరిగిందనేది కూడా తెలియాల్సిన అవసరం వుంది. అవినీతి అనగానే సమాజమంతా ఒక్క ఉద్యోగుల వైపే అనుమానంగా చూడడం అలవాటైపోయింది. అందుకు అసలైన కారణం రాజకీయం. దాని పుణ్యమా అని అధికారులు కూడా తప్పని పరిస్ధితుల్లో అవినీతి చేయని పరిస్ధితులు సృష్టించబడ్డాయి. దాంతో అధికారులు లంచం అనే పులి మీద స్వారీ చేయాల్సివస్తోంది. నేను నీతిగా పనిచేస్తానని అధికారులు చెప్పినా జనం నమ్మే స్ధితి లేదు. వారిని నిజాయితీ పరులుగా వుండడాన్ని నాయకులు అంగీకరించే పరిస్దితి లేదు. అందుకే ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసుకుంటున్నారు. అడ్డగోలుగా దండుకుంటున్నారు. ఒకప్పుడు కాంట్రాక్టర్లు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తల నుంచి మాత్రమే లంచాలు వసూలు చేసే అధికారులు సామాన్య ప్రజలను కూడా వేధించే పరిస్ధితి రావడానికి కారణం రాజకీయ నాయకులు. వారు చెప్పినట్లు వినలేక, వారికి కప్పాలు కట్టలేక, వారిని ఎదిరించి ఉద్యోగాలు చేయలేక సతమతమౌతూ సగటు ఉద్యోగి అవినీతి పరులుగా మారిన వారు చాలా మంది వున్నారు. అయితే ఇప్పుడు ఉద్యోగి అంటేనే అవినీతికి కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా తయారైంది. ఉద్యోగం పొందితే చాలు అడ్డగోలుగా సంపాదించొచ్చన్న అభిప్రాయం ఏర్పడిరది. ఎంతో కష్టపడితే గాని వచ్చే ఉద్యోగంలో చేరిన నాటి నుంచే వసూలు పర్వాలు నేర్చుకుంటున్నారు. నాయకుల ఒత్తిళ్లలో ఒదిగిపోతున్నారు. ప్రజలను పీడిస్తున్నారు.
ఒకప్పుడు ఉద్యోగులు అనేవారు వేతన జీవులు. నెల జీతం మీద ఆధారపడి జీవించేవారు.
నెలంతా పనిచేసిన ఒకటో తారీఖు ఎప్పుడొస్తుందా? అని ఎదరుచూసేవారు. జీతం చేతిలో పడిన నాడు ఎంతో సంతోషంగా డబ్బులు చూసుకొని మురిసిపోయేవారు. వారిని చూసి మీకేంటి ఉద్యోగస్తులు అని సమాజం అంటుంటే సంతోషించేవారు. అలా సమాజంలో గౌరవంగా వుండేవారు. పైగా అధికారులంటే సమాజంలో గుర్తింపు వుండేది. కాని ఇప్పుడు ఉద్యోగి అంటే సమాజం అనుమానంగా చూసే పరిసి ్దతి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల ముందు మేం లంచాలు తీసుకోమని బోర్డులు పెట్టుకొనే రోజు వచ్చింది. కాని అవినీతి ఆగిందా? ఒకప్పుడు ఒకటో తారీకు ఎప్పుడు వస్తుందా? చూసేవారు అసలు ఒకటో తారీఖునే ఏనాడో మర్చిపోయారు. వారికి రోజూ ఒకటో తారీఖే అవుతోంది. నెలంతా వచ్చే జీతానికి నాలుగు రెట్లు నిత్యం ఇంటికీ తీసుకెళ్లే ఉద్యోగులు చాలా మంది వున్నారు. ఉన్నత స్ధాయిలో వున్న ఉద్యోగుల ముచ్చట మాటల్లో చెప్పేలా వుండడం లేదు. నిత్యం మూటలే…వారి సంపాదన కోట్లలోనే అన్నట్లుగా సాగుతోంది. అయితే ఇలా ఉద్యోగులు అవినీతి పరులుగా మారడానికి కారణం ఎవరు? రాజకీయ నాయకుల కాదా? ఒకప్పుడు ఉద్యోగులంటే నాయకులు కూడా గౌరవించేవారు. కాని ఇప్పుడు నాయకులు వారిని చేతుల్లో బొమ్మలు చేసుకున్నారు. ఆట బొమ్మలను చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగులను తోలు బొమ్మలను చేసి నాయకులు ఆడిస్తున్నారు. వారిని కీలు బొమ్మలను చేసి, ఒత్తిళ్లతో పనులు చేయిస్తున్నారు. నాయకులు సంపాదించి పెట్టే వనరులుగా మార్చుకున్నారు. నాయకులు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ అక్కడ దస్కత్ చేసే యంత్రాలుగా మార్చుకుంటున్నారు. రాజకీయ పార్టీ అధికారంలోకి రాగానే జిల్లా స్ధాయి నాయకులంతా ఎమ్మెల్యే ఇంటి ముందు క్యూ కట్టాల్సిన పరిస్దితి ఏర్పడిరది. ఎమ్మెల్యే పిలుపు ఎప్పుడొస్తుందో అని ఎదురుచూడాల్సి వస్తుంది. కార్యాలయాలు వదిలి ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సివస్తోంది. వారు చెప్పి చేసే మరబొమ్మలు మారాల్సి వస్తోంది. దాంతో అధికారులు కూడా తమ చేతుల్లో ఏమీ లేదంటూనే తమకు కావాల్సిన పనులు చక్కదిద్దుకోవడం తయారైంది. అవినీతి విపరీతంగా పెరిగిపోయింది.
అధికారులతో పనులు ఎలాంటి లంచాలకు తావు లేకుండా పనులు చేయించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులది.
కాని నాయకులే అధికారులను నెలకెంత పంపిస్తావని రేట్ ఫిక్స్ చేస్తుండడంతో, ప్రతి పనికి రూపాయి లేకుండా అధికారులు పనిచేయలేకపోతున్నారు. ఇది కాస్తా లంచం హక్కుగా మార్చుకొని అధికారులు చెలరేగిపోతున్నారు. ఒకప్పుడు ఎక్కడో, ఎక్కడో అవినీతి అధికారి మీద ఏదైనా వార్త వస్తే అందరూ ఆసక్తిగా చదివేవారు. కాని ఇప్పుడు నిత్యం పదుల సంఖ్యలో పట్టుబడుతున్నారు. వారిలో ఏ కోశాన భయం అన్నది కనిపించడం లేదు. కారణం జీవితానానికి సరిపడ సంపాదనే కాకుండా, తరతరాలు కూర్చుని తిన్నా సరిపోనంత సంపాదిస్తున్నారు. దాంతో ఏసిబికి పట్టుబడినా పెద్దగా బాధ పడడం లేదు. జైలుకు వెళ్తామన్న దిగులు వారిలో కనిపించడం లేదు. అంతే కాదు కొలువు పోతుందన్న భయం అసలే లేదు. మళ్లీ పోయిన కొలువు రాకమానదు. అదే కుర్చీలో కూర్చొక మానను. అనే పరిస్ధితి వచ్చేసింది. ఏసిబికి రెడ్ హండెడ్‌గా పట్టుబడిన ఉద్యోగులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. కేసులు నమోదైనా వాటిని గెలుస్తున్నారు. కొలువు చేయకుండా ఇంట్లో కూర్చున్నదానికి కూడా జీతం ప్రభుత్వం నుంచి వసూలు చేసుకుంటున్నారు. కాని ఏసిబికి ఒక ఉద్యోగి పట్టుబడిన నాడే కొలువు పోతుందన్న భయం వారిలో వుంటే లంచం తీసుకోడు. ఆస్ధులు జప్తు చేస్తే లంచం అన్న పదాన్ని వింటే వణికిపోతారు. కాని అవి రెండూ జరగడం లేదు. అందుకే ఉద్యోగులు రెచ్చిపోతున్నారు. వారికి నాయకుల ఆశీస్సులు వుంటున్నాయి. అధికారుల ఆస్ధులు కళ్లముందే పెరిగిపోతున్నాయి.
తాజాగా మెడికల్ డిపార్లుమెంటులో డిరెక్టర్ ఆఫ్ హెల్త్ కొలువు వెలగబెట్టిన గడల శ్రీనివాసరావుకు ప్రభుత్వం విఆర్‌ఎస్ ఇచ్చింది. ఆయన మీద విపరీతమైన ఆరోపణలున్నాయి.
ఆయన మీద వందల కోట్లు మాయం చేశాడన్న విమర్శలున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో వున్నప్పుడు అనేక ఆరోపణలు చేశాడు. ఆయనను అరెస్టు చేసి విచారించాలని కూడా అప్పట్లో డిమాండ్ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లే ముందు గడల శ్రీనివాసరావును మహబూబాబాద్ జిల్లా అడిషినల్ మెడికల్ ఆపీసర్‌గా డిమోషన్ ఇచ్చారు. కాని ఆయన అక్కడ జాయిన్ కాలేదు. సరి కదా..సిఎం. రాష్ట్రానికి వచ్చే లోపు ఏకంగా విఆర్‌ఎస్ ఇచ్చారు. ఇదెలా సాధ్యమైంది. కరోనా సమయంలో కొన్ని వేల కోట్లు దారి మళ్లించాడన్న అపవాదు వుంది. ఆరోగ్యశాఖలో పెద్ద అవినీతి తిమింగలం అన్న పేరుంది. వైద్య ఆరోగ్య శాఖ నిధులను గ్లూకోస్ నీళ్లు తాగినట్లు తాగాడన్న ఆరోపణలున్నాయి. అలాంటి వ్యక్తికి ఎలా విఆర్‌ఎస్ ఇస్తారు. పైగా డిమోషన్ చేసినా ఆయన అక్కడ జాయినింగ్ రిపోర్టు ఇవ్వకుండానే ఎలా స్చచ్చంద ఉద్యోగ విరమణకు అవకాశం కల్పించారు. ఇలాంటివి తెలంగాణలో అనేకం వున్నాయి. ఇకపోతే హైడ్రా ద్వారా కొంత మంది అధికారులకు నోటీసులు వెళ్లాయన్ని వార్తలు వచ్చాయి. ఆ అధికారులు ఎవరి ఒత్తిళ్లకు లొంగి పనిచేశారన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? చెరువులు, నాళాలు, కుంటలు, ఇతర ప్రభుత్వ స్ధలాలో నిర్మాణాలకు అధికారుల స్వయం నిర్ణయాలే కారణమా? కేవలం లంచాలకు తెగబడే అక్రమ అనుముతులు జారీ అయ్యాయా? వారి వెనుక నాయకులు ఎవరూ లేరా? వుంటే వారి గురించి ఆధారాలు సేకరించాల్సిన అవసరం లేదా? ఆ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చే ఆస్కారం లేదా? నాయకుల ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేసే స్వేచ్చ ఉద్యోగులకు వుందా? వంటి అనేక ప్రశ్నలు వున్నాయి. వాటికి సమాదానాలు చెప్పేవారు ఎవరు? ఇక హైడ్రాలో వున్న అధికారుల్లో అవినీతి పరులు లేరా? ఐదు వేల మంది సబ్బందిలో అవినీతి అధికారులే లేరా? హైడ్రా కిందకు చేరగానే వారి అవినీతి మాఫీ అయినట్లేనా? అన్న దానికి కూడా సమాధానం వెతకాల్సివుంది. హైడ్రా పేరుతో అవినతికి కొంత మంది పాల్పడుతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిని ప్రస్తావించారు. అందువల్ల అవినీతి అనే సాకు చూపించి అధికారులను బాధ్యులను చేయడం ఒక్కటే పరిష్కారం కాదు. అందుకు కారణమైన నాయకులపై కూడా చర్యలు తీసుకునేందుకు పాలకులు సిద్దమౌతారా? సాధ్యమా??