https://epaper.netidhatri.com/
బలంగా వున్న పార్టీని బలహీనం చేస్తున్నదెవరు?
ఆదిపత్యపోరుకు ఆజ్యం పోస్తుందెవరు?
అసలైన నాయకులను కాదని ఇతరులను అందలమెక్కిస్తున్నదెవరు?
క్రమశిక్షణకు తూట్లు పొడుస్తున్నదెవరు?
బిజేపిలో టికెట్ల బేరానికి తెరలేపిందెవరు?
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు!
పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్నా పట్టింపులేనిదెందుకు?
పార్టీ ఆంతరంగిక సమావేశాలకు బైటి వ్యక్తుల ఎలా వచ్చారు?
మల్కాజిగిరి నియోజకవర్గ స్థాయి సమావేశంలో క్యాడర్ ఆగ్రహానికి కారకులెవరు?
మేం వేరు..మా పార్టీ వేరు. మాకు క్రమశిక్షణ ఎక్కువ. దేశం కోసం..ధర్మం కోసం పనిచేసే ఏకైక పార్టీ బిజేపి. అని పదే పదే చెప్పుకునే బిజేపి కూడా అన్ని సంప్రదాయ రాజకీయ పార్టీల లాగానే మారుతోందా? ప్రత్యేక సుగుణాలు మాయమౌతున్నాయా? ఎంత కాలమైనా పార్టీ కోసమే పనిచేస్తామన్న భావన నాయకుల్లో మాయమౌతోందా? కొత్తగా వచ్చిన వారిని అందలమెక్కించి, ఇంత కాలం పార్టీకి సేవ చేసిన వారిని పక్కన పెడుతోందా? అందులో ఎవరి పాత్ర ఎంత? ఎవరెవరి లెక్కెంత? వారి లక్కెంత? అన్నవి కూడా చూసుకునేదాకా వచ్చిందా? అంటే అవుననే అంటున్నారు. బిజేపిలో కూడా సంప్రదాయ రాజకీయాలు వచ్చి చేరినట్లు చాలా మంది కరడుగట్టిన బిజేపి వాదులు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు పార్టీ కోసం పది మంది పనిచేసినా వంద మందితో సమానమైన రాజకీయం పనిచేసేవాళ్లు. పది మంది బిజేపి నాయకులు ఉద్యమం చేసినా రాజకీయ ప్రకంపనాలు కనిపించేవి. దేశమంతా బిజేపి బలపడుతోంది. తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. అనేక రాష్ట్రాలలో అధికారంలో వుంది. గుజరాత్ లాంటి రాష్ట్రంలో వరుసగా ఏడు సార్లు అధికారంలో వుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఉత్తరాధిన తిరుగులేని శక్తిగా అవరతరించింది. కాని దక్షిణాధిన ఎందుకు ఎదగలేకపోతోంది. ఎందుకు బిజేపి జెండా రెపరెలపాడకుండాపోతోంది. ఎదిగినట్లే ఎదిగి ఎందుకు చతికిలపడుతోంది. దేశంలోనే బిజేపి అంత బలంగా లేని కాలంలో హైదరాబాద్, తెలంగాణలో ఎంతో బలంగా వుండేది. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం కొట్లాట హైరాబాద్, తెలంగాణ నుంచే మొదలైందని ఎంత మందికి తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో బలంగా వున్న బిజేపి తెలంగాణ ఏర్పాటు తర్వాత మరింత బలపడకుండా ఎందుకు అక్కడే వుంది. గతం కన్నా ప్రజలు ఎంతో గొప్పగా బిజేపిని ఆదరిస్తున్నారు. ఊరూర స్వచ్ఛందంగా బిజేపిలో చేరుతున్నారు. బిజేపి కోసం పనిచేస్తున్నారు. కాని నాయకుల్లో మాత్రం సఖ్యత లేదు. పార్టీ ఎదగాలన్న కసి వారిలో లేదు. ప్రశ్నించే తనం లేదు. ఎదిరించే తత్వం లేదు. కేవలం కూర్చున్న దగ్గర గుర్రాలు మలపడం అందరూ నేర్చుకున్నారు. ఇదే సగటు బిజేపి కార్యకర్త పడుతున్న మనోవేధనకు నిదర్శనం.
తెలంగాణ బిజేపిలో పెద్దలే గద్దలా? అన్న చర్చ బలంగా సాగుతోంది. పార్టీలో పెత్తనం చేస్తున్నవాళ్లు ఎంత మంది వున్నారో అందరికీ తెలుసు. పార్టీ కోసం పనిచేస్తున్నవారిని ఎవరు పక్కన పెడుతున్నారో తెలుసు. ఎవరు పార్టీలోనే కుయుక్తులు పన్నుతున్నారో ప్రజలు బాగానే గమనిస్తున్నారు. అందుకే గత శాసన సభ ఎన్నికల్లో పార్టీ కోసం పని చేస్తారని నమ్మిన వారిని గెలిపించారు. పార్టీ కోసం పని చేస్తున్నట్లు నటిస్తున్న వారిని పక్కన పెట్టారు. అందులో బలమైన నాయకులుగా తమకు తాము గొప్పలు చెప్పుకున్న వాళ్లు కూడా వున్నారు. అందుకే వాళ్లంతా ఓడిపోయారు. కొత్త అభ్యర్ధులు గెలిచారు. ప్రజల్లో వున్న వా ళ్లు గెలిచారు. మీడియా పులులను మాత్రం ప్రజలు వద్దనుకున్నారు. బిజేపి కార్యకర్తలు కూడా కాదనుకున్నారు. అందుకే వాళ్లు ఓడిపోయారు. అయినా వారిలో మార్పు రావడం లేదు. వారికి ఇంకా ఎదరులేకుండా చేసుకోవాలనుకుంటున్నారే గాని, పార్టీ తిరుగులేని శక్తిగా ఎదగాలనుకోవడం లేదు. వాళ్లు బలపడితే పార్టీ బలపడినట్లే అని భ్రమ పడుతున్నారు. వారి కుర్చీలు కాపాడుకునే ప్రయత్నమే చేస్తున్నారు. మిగతావారిని బలహీనులను చేస్తున్నారు. అంతే కాదు చాలా మంది బలమైన బిజేపి నాయకులను పార్టీ కార్యాలయం మెట్లు కూడా ఎక్కకుండా చేస్తున్నారు. ఇది అంటున్నవారు సాక్ష్యాత్తు పార్టీ కోసం అహర్నిషలు పనిచేస్తున్న నిస్వార్ధపరులైన కార్యకర్తలు. ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ నిలదీయడం బిజేపి క్యాడర్‌కు బాగా తెలుసు. అందుకే బిజేపి క్యాడర్, పెద్ద నాయకులు తప్పులను కూడా ప్రశ్నిస్తుంది. ఇదే బిజేపికి పెద్ద బలం. అయితే అలా ప్రశ్నించేవారిని పక్కనపెట్టి, పెద్ద నాయకులుగా చెలామణి అవుతున్నవారి అనుచరులకు, అనుయాయులకు మాత్రమే పార్టీలో ప్రాధాన్యత లభించేలా చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పెద్దలే ఎంతో బలంగా వున్న పార్టీని బలహీన పరుస్తున్నారు.
గల్లీ స్దాయి నుంచి పార్టీ కోసం పని చేస్తున్నవారిని డిల్లీ స్దాయి నాయకులు గుర్తిస్తున్నారే గాని, రాష్ట్ర స్ధాయి నాయకులు మాత్రం అలాంటి వారిని వద్దనుకుంటోంది. అలాంటి నాయకులు వస్తే, రాష్ట్ర స్ధాయిలో వారి పరపతికి గండి పడుతుందని భయపడుతున్నారు.. ఆదిపత్య పోరుకు ఆజ్యం పోస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌లో వున్న పరిస్దితులు ఇప్పుడు బిజేపిలో కనిపిస్తున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కనీసం ఏడాదిన్న పాటు కూడా పనిచేయని పి.వి. నర్సింహారావు దేశానికి ప్రధాన మంత్రిగా ఐదేళ్లపాటు పనిచేశారు. దేశాన్ని పాలించేంత శక్తియుక్తులున్న నాయకుడిని ఆనాడు రాష్ట్రంలో రాజకీయాలు చేయనీయలేదు. సరిగ్గా ఇంత కాలానికి తెలంగాణ బిజేపిలో అలాంటి పరిస్ధితులే కనిపిస్తున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్ల పంపకాలను చూస్తేనే బిజేపిలో ఏం జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో బిజేపి,జనసేన పొత్తు సాగింది. అసలు తెలంగాణలో జనసేనకు నాయకులెక్కడిది. అసలు ఆపార్టీకి క్యాడరేది. పార్టీ నిర్మాణమేది. ఆంధ్రప్రదేశ్‌లోనే దానికి నీడ లేదు. కాని తెలంగాణలో జనసేత పొత్తుతో సాగారు. అంత వరకు బాగానే వుంది..గాని టిక్కెట్ల విషయంలో బిజేపి నేతలను, జనసేనలోకి పింపించి టిక్కెట్లు ఇవ్వడం ఏమిటో? ఎవరికీ అంతు పట్టలేదు. అంటే ఏం జరిగింది? సంప్రదాయ రాజకీయ పార్టీల బాటలో బిజేపి నడుస్తుందన్న సంకేతాలు పింపినట్లు కాదా? ఆయా స్దానాలలో బిజేపికి కోసం ఎంతో కాలంగా పనిచేస్తున్న వారిని కాదని టిక్కెట్లు ఎవరికి ఇచ్చారో తెలియందా? ఎంత చేతులు మారాయో? అన్న చర్చ నిజం కాదా? అసలైన నాయకులను కాదని ఇతరులను అందలం ఎక్కించడం లేదా? కేవలం పెద్దలుగా చెలామణి అవుతున్న వారి అనుచరులకు మాత్రమే పదవులు వస్తున్నాయి. వారికే ప్రాదాన్యతనిస్తున్నారు. దాంతో బిజేపిలో క్రమశిక్షణకు తూట్లు పడుతున్నాయన్న ఆందోళన వ్యక్తమౌతోంది. బిజేపిలో కూడా టిక్కెట్ల బేరాలా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. బిజేపిలో టిక్కెట్ల బేరం పై ముక్కున వేలేసుకుంటున్నారు? పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్నా ఎవరికీ పట్టింపు లేదు.
కాని తమకు సంబంధించిన వాళ్లను మాత్రం ఎన్నికల్లో నిలిపేందుకు, వారికి టిక్కెట్లు ఇప్పిందుకు, ప్రజల్లో మరోసారి పార్టీని పలుచన చేసేందుకు, వారి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటిదే ఇటీవల జరిగిన మల్కాజిగిరి పార్లమెంటరీ స్ధాయి క్యాడర్ సమావేశం. ఆ సమావేశానికి ఎవరు హజరయ్యారు? పార్టీకి సంబంధించిన వాళ్లు కాకుండా బైటి వక్తులు ఎలా హజరయ్యారు. వేదిక మీద ఎలా కూర్చున్నారు. వారిని తీసుకొచ్చిందెవరు? అసలు బిజేపి సభ్యత్వం లేని వాళ్లతో ఆంతరంగిక సమావేశాలు జరగడం ఎంత వరకు సమంజసం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీకి సంబంధం లేని వ్యక్తులు హటాత్తుగా సమావేశంలోకి రావడం, వేదిక మీద కూర్చోవడాన్ని బిజేపి క్యాడర్‌కు నచ్చలేదు. వెంటనే ప్రశ్నించారు. అందుకు సహకరించిన నాయకులను నిలదీశారు. వారి నిర్ణయాలను అక్కడే ఎండగట్టారు. దాంతో వారు వేదిక దిగి వెళ్లిపోయారు. ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు ఎన్నో త్యాగాలు చేస్తే నాయకులైన వారు తమకు వ్యతిరేక గళం వినిపించగానే సభా వేదిక వదిలేసి వెళ్తారా? ఇదేనా వాళ్లు నేర్చుకున్న సంస్కారం. పార్టీ అంటే ఒక కుటుంబం. తప్పు చేసిన వారిని నిలదీస్తారు. ఒకనాడు అలా నిలదీసే తత్వంతోనే వాళ్లు నాయకులయ్యారు. ఇప్పుడు నిలదీతను జీర్ణించుకోలేకపోతున్నారు. అంతే కాకుండా తమను ప్రశ్నిస్తే మేం వుండమని వెళ్లిపోయేంత క్రమశిక్షణా రాహిత్యం కూడా అక్కడ కనిపించింది. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది…క్యాడర్ ఆగ్రహానికి కారణమేమిటి? అన్నదానిపై డిల్లీ పెద్దలు దృష్టిపెడితే రాష్ట్ర పార్టీ నాయకుల బాగోతాలు అన్నీ బైటకొస్తాయి.