`ఈటెల తప్ప ఇంకెవరూ కనిపించడం లేదా?
`అరవింద్ లాంటి నాయకులు అధ్యక్షుడుగా పనికి రారా?
`బండి సంజయ్ ను మరో సారి అధ్యక్షుడిని చేయలేరా?
`రఘునందన్ రావుకు అవకాశం ఇచ్చి చూడలేరా?
`బిజేపి పగ్గాలపై పారని పాచికలు!
`రాష్ట్ర బిజేపిలో లుకలుకలు
`అధిష్టానానికి తప్పని తలనొప్పులు
`బిజేపిలో కొనసాగుతున్న తెర వెనుక దోబూచులాట!
`అదిగో, ఇదిగో అధ్యక్షుడొచ్చే అనేవి ఊహలేనా
`ఈటెల అధ్యక్షుడు అనేది సొంత ప్రచారమేనా?
`ఏ వార్త నిజమో! ఏ వార్త అబద్ధమో గందరగోళం
`అందరూ ఆశావహులే..ఎవరికిచ్చినా సహాకారాలు అంతంత మాత్రమే!
`ఈటెల రాజేందర్ ప్రచారం ఎంత వరకు నిజమౌతుంది?
`బిసి నినాదం అంటే రాజేందర్‌కే పరిమితం కాదు
`అరవింద్ కూడా ముందు వరుసలో నిలబడే అవకాశం
`ఇప్పుడు ఎవరు అధ్యక్షుడైనా మూడేళ్లే పదవీ కాలం!
`ఎన్నికల నాటికి అధ్యక్షుడుగా ఎవరున్నా మార్పు ఖాయం!
`ఇప్పుడు ఎవరికిచ్చినా అభ్యంతరం ఎవరికీ వుండకపోచ్చు!
`ఇప్పుడు అధ్యక్షుడయ్యే వారికి వెంటనే రెండో సారి అవకాశం దక్కకకపోవచ్చు
హైదరాబాద్,నేటిధాత్రి:
ఇదిగో అధ్యక్షుడొచ్చె..అదిగో కొత్త అధ్యక్షుడు వచ్చే అంటూ ఏడాది కాలంగా బిజేపిలో వార్తలు వాస్తవాలు రూపుదాల్చడం లేదు. కొత్త బిజేపి అధ్యక్షుడు రావడం లేదు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర బిజేపి పగ్గాలు చేపట్టి రెండు సంవత్సరాలౌతోంది. మరో ఏడాదిపాటు అలాగే కిషన్ రెడ్డిని కొనసాగిస్తారా? లేక కొత్త వారిని నియమిస్తారా? అన్న ప్రశ్నలే వినిపిస్తున్నాయి. కాని సమాధానాలు మాత్రం ఎవరూ చెప్పడం లేదు. నాయకులకు కూడా ఈ వివరాలు తెలియడం లేదు. కాని ఓవైపు బిజేపి పుంజుకుంటున్న తరుణంలో కూడా బిజేపి అదిష్టానం ఇంకా రాష్ట్ర బిజేపి పగ్గాలు కొత్తవారికి అప్పగించక పోవడం కూడా శ్రేణుల్లో నైరాశ్యం ఆవహిస్తోంది. కొత్త అధ్యక్షుడు వస్తే పార్టీలో ఊపు వస్తుందని చూస్తున్నారు. జిల్లాల అధ్యక్షులను ప్రకటించినప్పటి నుంచి రాష్ట్ర అద్యక్ష ప్రకటన వస్తుందని ఎదురుచూస్తున్నారు. కాని కేంద్రం నుంచి ఎలాంటి సంకేతాలు వెలువడడం లేదు. కాని అదిగో..ఇదిగో అన్న మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే వచ్చేది ఎవరో గాని, నేనంటే నేనే అనుకునే వారు మాత్రం చాలా మందే వున్నారు. ఒక రకంగా చెప్పాంటే ఎంపిలంతా క్యూలో వున్నారు. అందరూ నాకే వస్తుందన్న ఆశాభావంతో వున్నారు. కాని ఎవరిని పదవి ఎవరిని వరిస్తుందో అర్దం కాక అందరూ తలలు పట్టుకుంటున్నారు. పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాదించాలని అదికారంలోకి తేవాలని కార్యకర్తలు ఉవ్విల్లూరుతున్నారు. పార్టీ బలోపేతం కోసం ఆలోచిస్తున్నారు. కాని రాష్ట్ర స్దాయి నాయకత్వంలో ఆ ఊపు మాత్రం కనిపించడం లేదు. ఇటీవల రెండు ఎమ్మెల్సీలు గెల్చుకొని బిజేపి మరింత ఊపుతో వుంది. ఇలాంటి సమయంలో కొత్త అధ్యక్ష పదవిని ఎవరికో ఒకరికి అప్పగిస్తారని అనుకుంటున్నారు. ఆ సంకేతాలు వెలుడుతున్నాయి. అయినా నాయకుల్లో డైలామా ఇంకెంత కాలం అంటున్నారు. ఎవరి గోల వారిదే! పారని పాచికలు..పగ్గాల కోసం పరుగులు! బిజేపి అధ్యక్ష ఎన్నిక కోసం నేతల ఉరుకులు పరుగులు. రాష్ట్ర బిజేపిలో లుకలుకలు. అదిష్టానం ముందు నేతలంతా హజరు. ఎవరి ప్రయత్నాలు వారివే..ఎవరి దారి వారిదే. బిజేపిలో కొనసాగుతున్న తెరవెనుక దోబూచులాట. ఈటెల వైపు అధిష్టానం మొగ్గు ప్రచారం మాత్రమే. గట్టిగానే ప్రయత్నిస్తున్న రామచంద్రరావు. నన్ను కూడా పరిగణలోకి తీసుకోమంటున్న డికే. అరుణ. ఏ వార్త నిజమో! ఏ వార్త అబద్దమో అంతా గందరగోళం.బిఆర్‌ఎస్‌లో వున్నప్పుడు ఈటెల అందరికీ అజాతశత్రువే. బిజేపిలోకి వెళ్లి కొందరికి పట్టని, గిట్టని శత్రువే? పైకి అంతా నటిస్తున్నారు..ఈటెల మాత్రం తన ప్రచారం తాను చేసుకుంటున్నారు. తానే కొత్త అధ్యక్షుడినంటూ చేసుకున్న ప్రచారం బిజేపిలో ఎవరికీ నచ్చడం లేదు. అదిగో పులి అంటే ఇదితో తోక అని ప్రచారం జరగడం ఈ రోజుల్లో పెద్ద వింత కాదు. అదే సంప్రదాయమౌతోంది. ఆ వార్తలకే ప్రాదాన్యత దక్కుతోంది. కేంద్ర బిజేపి నాయకులకు ఎప్పుడూ ఏదో ఒక తలనొప్పి వస్తూనే వుంది. వరుస ఎన్నికలతో సతమతమౌతూనే వుంది. కాకపోతే ఎక్కడ ఎన్నికలు జరిగినా బిజేపి గెలుస్తూ వస్తోంది. ఆ ఊపులోనే తెలంగాణ బిజేపి అధ్యక్షపదవి ప్రకటన వుంటుందని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈటెల రాజేందర్ పేరు ఖరారైనట్లు ఈయన వర్గం కొన్ని నెలలుగా విపరీమైన, విసృతమైన ప్రచారం సాగిస్తోంది. అంటే పోటీలో ఈటెల మాత్రమే వున్నాడని, ఆయన పేరు ఖరారైన తర్వాత చేసేదేముందని ఇతర నాయకులు చేతులెత్తేసేందుకు ఇదొక వ్యూహం అనుకోవాలి. కాని డిల్లీలో మరోరకమైన వాతావరణం కనిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నాయకుడు రామచంద్రరావుకు ఇవ్వాలని బలంగా ఇతర నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆయనకు పార్లమెంటు ఎన్నికల్లోనే టికెట్ ఇస్తారని అనుకున్నారు. అప్పుడు కూడా ఈటెల రాజేందర్ టికెట్ కోసం ప్రయత్నం చేశారు. అదిష్టానాన్ని ఒప్పించారు. మెప్పించి టికెట్ తెచ్చుకున్నారు. అప్పుడే సీనియర్లు కొంత ఇబ్బంది పడ్డారు. ఈటెలకు టికెట్ ఇవ్వడాన్ని లోలోన సీనియర్లు వ్యతిరేకించారు. అధిష్టానం నిర్ణయం కావడంతో ఆయనకు సపోర్టుగా నిలిచారు. ఇప్పుడు మళ్లీ పార్టీ పగ్గాల విషయంలోనూ ఈటెల ఇతర సీనియర్లకు పోటీ రావడాన్ని సీనియర్లు తట్టుకోవడంలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. బిజేపిలో చేరిన తర్వాత ఎన్నికల ముందు బండి సంజయ్ పార్టీ అధ్యక్ష పదవి పోవడానికి ప్రధాన కారణం ఈటెల రాజేందరే అన్న ఆరోపణలు అనేకం వచ్చాయి. అందులోనూ కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కూడా నర్మగర్భంగా అనేక సార్లు ఆ విషయం వెల్లడిరచడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్లీ అధ్యక్ష ఎంపిక తెరమీదకు వచ్చింది. ఈ నెలలోనే అధ్యక్ష ప్రకటన వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఈ విషయాన్ని మెదక్ ఎంపి. రఘునందన్ రావు వెల్లడిరచినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే తాను కూడా రేస్‌లో వున్నానని పదే పదే చెబుతున్న రఘునందన్ రావు చెప్పడం అంటే డిల్లీలో ఏదో పీట ముడి జరుగుతోందన్నది మాత్రం అర్ధమౌతుంది. అంటే తాను రేసు నుంచి తప్పించారని ఆయన అభిప్రాయమా? అన్నది కూడా అర్దం చేసుకోవచ్చు. ఇక మిగిలింది డికే. అరుణ. ఆమె కూడా తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకురాలు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా అనుభవం వుంది. అటు పార్టీ నాయకురాలిగా, ఇటు పాలనా పరమైన అనుభవం వున్న నాయకురాలు డికే. అరుణ. అంతేకాకుండా ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా మీద ఆమెకు పూర్తి పట్టువుంది. తెలంగాణ రాజకీయాలపై కూడా ఎంతో అవగాహన వుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహాబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ముఖ్యంగా అధికార పార్టీని టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేయాలంటే డికే. అరుణకు అద్యక్ష బాద్యతలు అప్పగిస్తే రాజకీయాలు రంజుగా వుంటాయన్నది కొందరి అభిప్రాయం. గతంలో డికే. అరుణ మంత్రిగా వున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడుగా రేవంత్ రెడ్డి అడుగడుగునా అడ్డుకునేవారు. ఆమెకు వ్యతిరేకంగా రాజకీయాలు నెరిపారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వున్నారు. అదే జిల్లా నుంచి పార్లమెంటు సభ్యురాలుగా వున్న డికే. అరుణకు పగ్గాలు అప్పగిస్తే రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతాయి. ఇక్కడ కొన్ని విషయాలు ప్రత్యేకంగా చర్చించుకోవాలి. రెండు జాతీయ పార్టీలు క్రియాశీలంగా వున్న రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల మనుగడ కొనసాగదు. ఇప్పుడు అదే ఫార్ములాను అనుసరించి రాజకీయాలు చేయాలనుకుంటే బిజేపి డికే. అరుణకు పార్టీ పగ్గాలు అప్పగించాలి. ఇప్పటి వరకు అధికార కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తున్న పార్టీగా టిఆర్‌ఎస్ మాత్రమే ముందు వుంది. రాష్ట్ర అధ్యక్షుడైన జి. కిషన్ రెడ్డి కేంద్ర క్యాబినేట్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన అటు పాలన, ఇటు రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశంలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో ప్రచారాలు నిర్వహిస్తూ బిజీగా వుంటున్నారు. దాంతో తెలంగాణ రాజకీయాలమీద పూర్తి దృష్టిపెట్టే అవకాశం చిక్కడం లేదు. త్వరలో తెలంగాణలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగనున్నాయి. గతంలో రామచంద్రరావు మహాబూబ్ నగర్ నుంచి గ్రాడ్యుయేట్ ఎన్నికలు గెలిచిన అనుభవం వుంది. కరీంనగర్ పార్లమెంటు నుంచి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యేలున్నారు. నిజాబాబాద్ నుంచి ఎమ్మెల్యేలున్నారు. మెదక్ నుంచి పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావు వున్నారు. వీళ్లలో ఎవరో ఒకరికి ఇవ్వడమో లేదా? మరో ఏడాదిపాటు అద్యక్ష ఎంపిక లేదని చెప్పడమో జరగడం లేదు. అయితే ఇక్కడ ఒక విషయం సూక్ష్మంగా ఆలోచిస్తే అర్దమౌతుంది. బిజేపిలో అధ్యక్ష పదవి కాలం మూడు సంవత్సరాలు. ఇప్పుడు కేంద్ర మంది బండి సంజయ్‌కు అద్యక్ష బాద్యతలు అప్పగిస్తే ఎన్నికల నాటికి మళ్లీ ఆ పదవి కాలం పూర్తవుంది. అందువల్ల ఈ సమయంలో పార్టీలో ఎవరికో ఒకరికి ఇచ్చి, పార్టీకి కొంత ఊపు తెచ్చి, సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల మందు బండి సంజయ్‌ను బిజేపి అధ్యక్షుడిని చేయాలన్న ఆలోచన బిజేపి అధిష్టానం చేస్తున్నట్లు కూడా మరో వాదన వుంది. కాకపోతే కొత్త అద్యక్షుడు ఈ మధ్య సమయంలో ఎవరో ఒకరు రాకపోతే పార్టీలో కొంత నిరాశ, నిస్రృహలు నెలకొంటాయని చెప్పడంలో సందేహం లేదు. అందువల్ల అద్యక్ష పదవి ఎవరికో ఒకరికి ఇస్తే జోష్ పెరిగే అవకాశం వుంది. బిజేపి మరింత బలోపేతమయ్యేందుకు ఆస్కారముంది.