ఏజెంట్లతో నిండిన భద్రాచలం రవాణా శాఖ కార్యాలయం.
భద్రాచలం నేటి ధాత్రి
– పైసలు ఇస్తేనే పనులు..
– ఓవర్ లోడ్ అయితే నాకేంటి.
– ఇసుక మాఫియా తో మిలాఖత్..?- పట్టించుకోని ఆ శాఖ అధికారి..- ప్రతినిత్యం వేలలో వసూలు అనేక ఆరోపణలతో భద్రాచలం రవాణా శాఖ కార్యాలయం. అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి సారించండి.
భద్రాచల పట్టణంలో మోటారు వెహికల్ తనిఖీ కార్యాలయం ఉన్నది. ఆ కార్యాలయంలో ఒక మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ ,ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒక కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తుంటారు. కానీ అక్కడ సుమారు 20 మందికి పైగా ఏజెంట్లు కార్యాలయంలో ఉండి కార్యక్రమాలు చక్కబెడుతున్నారు. ప్రభుత్వం రవాణా శాఖలో ఏజెంట్ల వ్యవస్థను రద్దుచేసి ప్రతి ఒక్కరికి ఆన్ లైన్ సిస్టం ద్వారా అప్లికేషన్లు తీసుకొని నేరుగా అన్ని రకాల సేవలు అందించాలని పేర్కొంది. కానీ అక్కడ అవేమి పట్టవున్నట్లు ఏజెంట్ లే పెత్తనం చలాయిస్తూ, ఆ కార్యాలయ సిబ్బంది కమిషన్లు తీసుకుంటూ ప్రతినిత్యం వేలాది రూపాయలు రవాణా శాఖ పనిమీద వచ్చే వారి వద్ద దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క అధికారిని బట్టి ఒక్కొక్క స్థాయి డబ్బులు తీసుకోవడం పరిపాటిగా మారింది. పేరుకే తనిఖీ అధికారి. కానీ ఎక్కడ తనిఖీ చేసిన పాపాన పోలేదు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ఓవర్ లోడ్ తో వెళ్తున్న లారీలను, ట్రాక్టర్లను ఆపి తమ కర్తవ్యాన్ని నిర్వహించాల్సిన మోటార్ వెహికల్ కార్యాలయం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇసుక పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్నారని, వేబిల్లులు లేకుండా కొన్ని లారీలు యదేచ్చగా ఇసుక తోలుతున్నాయని, పరిమితికి మించి 15 టన్నులకు పైగా ఇసుక వేసుకొని తిరుగుతున్నాయని చెప్పినా, పట్టించినా ఆ అధికారి పట్టించుకోకుండా ఇసుక అక్రమ రవాణా దారులకు కొమ్ము కాస్తున్నాడని వాదనలు ఉన్నాయి. ఇంత అక్రమా రవాణా జరుగుతున్న నాకు సంబంధం లేదు అనే అధికారి చెప్పడం కొసమెరుపు.. వీరు చేయాల్సిన పని చేయకపోవడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ధనం అక్రమార్కుల చేతిలోకి వెళ్తుంది. అనేక సంవత్సరాలుగా ఈ రవాణా శాఖ అధికారి కార్యాలయం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది. పైసలు ఇవ్వనిదే పని కావట్లేదని పలువురు వాపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ కార్యాలయం పై ప్రత్యేక దృష్టి సారించి లంచగొండులపై, నియమ నిబంధనలు పాటించకుండా పనిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.