`రిజిస్ట్రేషన్ శాఖ అవినీతి అధికారుల మాయజాలం?
`పెద్దల అందదండలతో కోట్ల విలువైన భూమి సంతర్పణం?

`రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి అక్రమాలు సర్వసాధారణం?
`పైనుంచి ఆశీస్సులు, కిందనుండి సహకారాలు?

`పదేళ్ల నుంచి ప్రయత్నం.. ఇంత కాలానికి సమాప్తం?
`సరూర్ నగర్ లో వందల కోట్ల ప్రభుత్వ భూమి మాయం?
`‘‘సరూర్ నగర్’’ లో ‘‘వందల కోట్ల’’విలువగల ప్రభుత్వ భూమి ‘‘అక్రమ రిజిస్ట్రేషన్’’?
`ఆ ‘‘అవినీతి ‘‘డిఆర్’’, ‘‘ఎస్ఆర్’’ లు ఎవరు?
`‘‘మంత్రిగారు’’ తక్షణమే ‘‘స్పెషల్ ఆడిట్’’ చేపించండి!
`ఆ అవినీతి ‘‘డిఆర్’’ పై చర్యలు తీసుకోండి.
`గతంలో కూడ ఆ ‘‘డిఆర్’’ పై అవినీతి ఆరోపణలు?
`‘‘సీఎం పేషీ’’లోని పెద్దలే ఆ ‘‘డిఆర్’’కు అండ దండలని విమర్శలు?
`గతంలో కూడా ‘‘600 కోట్ల’’ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ పై కూడా ‘‘సీఎం పేషీ’’ పెద్దలే కాపాడారట?
`ఆ అక్రమ రిజిస్ట్రేషన్ లో కటకటాల పాలైన ఉద్యోగులు?
`10 సంవత్సరాలకు పైబడి పెండిరగ్లో ఉన్న ‘‘ప్రభుత్వ భూమి’’ ని ‘‘సబ్ రిజిస్టార్’’ తో బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించారా?
`ప్రభుత్వ భూమి’’ని రిజిస్ట్రేషన్ చేయించిన ఆ ‘‘డిఆర్’’ఎవరు?
`డాక్యుమెంట్’’ ని కనుమరుగు చేసిందెవరు?
`కులం’’ ముసుగులో శాఖను ‘‘మంత్రి’’ పేరు బ్రష్టు పట్టిస్తున్నదెవరు?
హైదరాబాద్, నేటిధాత్రి: ప్రభుత్వ భూములంటే అధికారులకు పప్పుబెల్లాలకంటే అద్వాహ్నమైపోయాయి. ఏ అధికారి ఏ భూమిని ఎవరికి అప్పగిస్తున్నారన్నదికూడా తెలియకుండాపోతోంది. టెక్నాలజీలోవచ్చిన మార్పులను అనువుగా మార్చుకుంటున్నారు. ప్రభుత్వం జీవోలు దాచిపెట్టినట్లే..అధికారులు రిజిస్ట్రేషన్ చేసిన భూముల వివరాలను కూడా మూడో కంటికి తెలియకుండా దాచేస్తున్నారు. ప్రభుత్వ భూములు కాపాడాల్సిన అధికారులే ఇలా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా మార్చేస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన భూములను కోట్ల రూపాయల లంచాలు తీసుకొని అప్పగిస్తున్నారన్న వార్తలు అనేకం వున్నాయి. అయినా పట్టించుకుంటున్న వారు లేరు. చర్యలు తీసుకుంటున్నవారు లేదు. రిజిస్రేషన్శాఖ అధికారుల విచ్చలవిడి తనానికి ఇది ఒక పరాకాష్టగా మారింది. ముఖ్యంగా తెలంగాణ రాక ముందు భూముల ధరలు ఇంతలా వుండేవి కాదు. భూముల మీద పెద్దగా పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనల చాలా మంది చేయలేదు. నగరం ఇంతగా విస్తరించలేదు. ఒకప్పుడు రంగారెడ్డి జిల్లా పరిధిలోని భూములు కొనుగోలు చేయాలంటే కూడా ఎవరూ ముందుకు వచ్చేవారుకాదు. కాని ఇప్పుడు ప్రైవేటు, ప్రభుత్వ స్ధలాలు ఏదీ వదలడం లేదు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకుంటున్నట్లు కొంత మంది అవినీతిపరులైన అదికారులు, రియల్ వ్యాపారులు కలసి ప్రభుత్వ భూములన్నింటికీ చెరపడుతున్నారు. సహజంగా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ వున్నాయన్న సంగతి కేవలం అధికారులకు మాత్రమే తెలుసు. అలాంటి అదికారుల వల్ల రియల్ వ్యాపారులు ఆ భూముల వివరాలు తెలుసుకొని వాటిని ఆక్రమించుకుంటున్నారు. అధికారుల చేత రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. రాత్రికి రాత్రే అప్పార్టుమెంట్లు నిర్మాణాలు చేస్తున్నారు. వెంచర్లు చేసి అమ్మేసుకుంటున్నారు. కొనుక్కున్న వారు తర్వాత లబోదబో మంటున్నారు. ఒకప్పుడు చాలా మంది నగరం మధ్యలో వుండాలని అనుకునేవారు. ఇప్పుడు నగరానికి కొంత దూరంలో వుండాలని జనం భావిస్తున్నారు. పొల్యూషన్ ప్రీ ప్రాంతాలను ఎంచుకోవాలనుకుంటున్నారు. ఇది రియల్ వ్యాపారులకు వరమైపోయింది. అదికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్దితుల్లో రైతులు భూములు అమ్ముకోవడానికి సిద్దంగా లేరు. దాంతో వ్యాపారం చేయాలనుకుంటున్న రియల్ వ్యాపారులకు ప్రభుత్వ భూములే దిక్కు. వాటిని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాలంటే చాలా డబ్బు కావాలి. అందులోనూ ప్రభుత్వం అమ్మాలనుకుంటున్న భూములనే కొనుగోలు చేయాలి. అయినా ఆ భూములు కొనుగోలు చేయాలంటే చిన్నా, చితకా వ్యాపారులకు సాద్యం కాదు. కాని తక్కువలో ఎక్కువ విలువ కలిగిన భూములను కొట్టేయాలంటే అదికారులకు ప్రసన్నం చేసుకుంటే చాలు. ఆ భూములు వారి పరమైపోతాయి. లంచాలకు బాగా అలవాటు పడిన రిజిస్ట్రేషన్ శాఖ అదికారులకు రంగారెడ్డి జిల్లా అంటే బంగారు బాతు గుడ్డుకన్నా ఎక్కువ. అందుకే రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉద్యోగం అంటే చాలు ఏడు తరాలకు సరిపడ సంపాదించుకోవచ్చు. అనే మాటలు వినిపిస్తున్నాయి. అలా రంగారెడ్డి జిల్లా పరిధిలో వున్నరిజిస్ట్రేషన్ శాఖలో అదికారులు కొంత మంది వందల, వేల కోట్ల రూపాయల విలువగలిగిన భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. అలాంటిదే ఇప్పుడు చెప్పబోయే రియల్ కథ. సరూర్ నగర్ పరిధిలో వున్న తలాబ్ కట్ట ప్రాంతంలో పెద్దఎత్తున ప్రభుత్వ భూమి చేతులు మారినట్లు విస్వసనీయ సమాచారం. అది అలాంటి ఇలాంటి భూమి కాదు. కొన్ని వందల కోట్ల విలువ చేసే భూమిని అధికారులు రిజిస్ట్రేషన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విశేషమేమిటంటే ఆ భూమి ఏమిటో అన్నది తెలియకుండా, చాలా తెలివిగా టెక్నాలజీని అడ్డం పెట్టుకొని పని కానిచ్చారు? సహజంగా నగర పరిదిలో కోటి నుంచి ఐదారు కోట్ల విలువ కలిగిన ఎలాంటి భూములు రిజిస్ట్రేషన్ కావాలన్నా సరే పై అధికారులు అనుమతి, సమ్మతి తప్పనిసరి. అలాంటిది వందల కోట్ల రూపాయల విలువైన భూములు ఎలా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయన్నది పెద్ద ప్రశ్న. పై స్దాయి అదికారుల నుంచి ఎలాంటి సమ్మతి లేకుండా ఏ రిజిస్ట్రార్ ధైర్యం చేసి రిజిస్ట్రేషన్ చేయరు. కాని జరుగుతున్నాయి. పై నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి మరీ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. కింది స్దాయి అదికారులను ఇరికిస్తున్నారు. కోట్ల రూపాయలు దండుకున్న పై అధికారులు మాత్రం సేఫ్‌గా వుంటున్నారు. కింది స్దాయి అధికారులను బెదిరించి మరీ రిజిస్ట్రేషన్లు జరిగేలా చేస్తున్న వాళ్లు, తేడా వస్తే కింది స్దాయి అదికారులను బలి చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి అక్రమాలు సర్వసాదారణం. ఉద్యోగుల తొలగింపు నిత్య కృత్యం అనేలా సాగుతున్నాయి. అయినా కింది స్దాయి అదికారులు నోరు తెరవలేరు. పై స్దాయి వాళ్లు మాకు సంబందం లేదని చేతులు దులుపుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో పాతకుపోయిన ఓ జిల్లా స్దాయి ఉన్నతాదికారి మూలంగా అనేక అక్రమాలు, అవకతవకలు గత కొన్నేళ్లుగా పెద్దఎత్తున జరిగినట్లు అనేక వార్తలున్నాయి. పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి. అలాంటి వారిని కాపాడేందుకు అటు సిఎం. కార్యాలయం నుంచి మొదలు, సంబందిత మంత్రి కార్యాలయం, శాఖాపరంగా ఉన్నత స్దాయి అదికారులంతా ఒక చైన్‌గా పనిచేస్తున్నారని అనేక ఆరోపణలున్నాయి.అలాంటప్పుడు పట్టుకునేవారు ఎవరు? వివరాలు బైట పెట్టేవారు ఎవరు? ముఖ్యమంత్రి, మంత్రులు వాళ్ల రాజకీయాలు, ప్రజా పాలనలో బిజీగా వుంటారు. అధికారులు ఇలాంటి పనుల్లో బిజీబిజీగా వుంటున్నారు. ప్రభుత్వ పెద్దలకుతెలియకుండా ప్రభుత్వ భూములను అప్పనంగా ముంచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్ మండల పరిదిలో వున్న తలాబ్ కట్ట ప్రాంతలో వున్న ప్రభుత్వ విలువైన భూమిని కొట్టేయడానికి గత పదేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాని కుదరలేదు. ఆ మధ్య కుదిరింది. ఈ మధ్య అది వెలుగులోకి వచ్చింది. అందుకు తెగించిన జిల్లా రిజిస్ట్రార్ ఎవరు? ఆదేశాలు జారీ చేసిన ఆ డిఆర్ ఎవరన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డిఆర్ చెప్పినట్లు తలూపి రిజిస్ట్రేషన్ చేసిన ఆ సబ్ రిజిస్ట్రార్ ఎవరన్నది కూడా తేలాల్సివుంది. ఏ డిఆర్, ఏ ఎస్‌ల టైమ్‌లో జరిగిందనేది వెల్లడి కావాలంటే వెంటనే స్పెషల్ ఆడిట్ నిర్వహిస్తే గాని తెలియదు. అందరి వేళ్లు ఓ డిర్ వైపు చూపిస్తున్నాయి? ఆ డి ఆర్ ఎవరు? ఆయన గతంలో కూడా అనేక భూముల రిజిస్రేషన్ వ్యవహారాలలో తలదూర్చి, కింది స్దాయి అదికారులు జైలుకు వెళ్లడానికి కారణమయ్యారంటూ కూడా శాఖలో చెప్పుకుంటున్నారు. ఎవరు ఆ డిఆర్? అనేది తేలాల్సిన అవసరం వుంది. పక్క జిల్లాలో డిఆర్‌గా పనిచేసిన ఆ డిఆర్ సుమారు 600కోట్ల రూపాయల విలువైన లిడ్ క్యాప్ భూములను ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయించారన్న ఆరోపణలున్నాయి. పత్రికల్లో కూడా అనేక వార్త కథనాలు వచ్చాయి. శంషాబాద్ దగ్గర కూడా అదే రిజిస్ట్రార్ ప్రభుత్వ భూమిని ఇతరులకు కట్టబెట్టినట్లు వార్తలున్నాయి. ఇలా ఎన్ని రకాల అవినీతి కార్యకలాపాలు సాగిస్తూ, వందల కోట్లు సంపాదిస్తున్న డిఆర్‌ను కాపాడుతున్నది కులమే అని కొందరు అంటున్నారు. కులం పేరు చెప్పుకొని పై స్దాయి అదికారులను ప్రసన్నం చేసుకోవడం, కింది స్దాయి అధికారుల చేత పని చేయించుకోవడం ఆ డిఆర్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదని అంటున్నారు. కుల పరంగా సిఎం. కార్యాలయం నుంచి మొదలు, మంత్రి కార్యాలయం, కమీషన్ కార్యాలయం వరకు ఆ డిఆర్‌ను కాపాడుతున్న వారు ఎవరున్నది తేలితే మొత్తం విషయం బైటకు వస్తుంది. కింది నుంచి పై స్దాయి వరకు తమ కులానికి చెందిన బందువులు, కులబాందవులే వున్నారు. ఎవరూ నన్నేమీ చేయలేరని కూడా ఆ డిఆర్ అంటుంటారని ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ డిఆర్ఎవరు? జరుగుతున్న వ్యవహరాలన్నీ తెలిసినా అధికారులు ఎందుకు బైట పెట్టడం లేదు? ఆ డిఆర్‌ను చూసి ఎందుకు ఇతర అధికారులు భయపడుతున్నారు? తాము బలౌతామని తెలిసినా ఆ డిఆర్ చెప్పిన పనులు ఎందుకు చేస్తున్నారు? ఇప్పటి వరకు ఎన్ని అక్రమాలు చేశారన్నది వెలుగులోకి రావాలంటే మంత్రి పొంగులేటిశ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకొని స్పెషల్ ఆడిట్ చేస్తే ఆ డిఆర్ బాగోతాలన్నీ బైటకు వస్తాయంటున్నారు? మంత్రి పొంగులేటి స్పందిస్తే రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్న అక్రమాలన్నీ బైటకు రావడం ఖాయం.
