‘‘జూబ్లీ’’పై ఎగిరేది ఎవరి జెండా!

-బరి గీసి గెలిచేదెవరు!

-పాలక పక్షం కావడం కాంగ్రెస్‌ కు అనుకూలమా?

-మూడేళ్ల కాలానికి ప్రజలు కాంగ్రెస్‌కు జై కొడతారా?

-అభివృద్ధి ఓటు వేసి కాంగ్రెస్‌ కు మద్దతు పలుకుతారా?

-హైడ్రా ప్రభావం కాంగ్రెస్‌ కు అనుకూలమా? వ్యతిరేకమా?

-జూబ్లీ హిల్స్‌ గెలవడం కాంగ్రెస్‌ కు ప్రతిష్టాత్మకమే.

-ఈ ఎన్నిక గెలిస్తే కాంగ్రెస్‌ తిరుగుండదు.

-కాంగ్రెస్‌ కు వలసలు వరదలా వస్తాయి.

-సిఎం. రేవంత్‌ రెడ్డి నాయకత్వం మరింత బలపడుతుంది.

-మరో పదేళ్ల దాక కాంగ్రెస్‌ కు బలం చేకూరుతుంది.

-బిఆర్‌ఎస్‌ చేసే ప్రచారం అసత్యమని తేలుతుంది.

-అధికారమంతా కేంద్రీకృతం చేసుకునే అవకాశం కూడా వుంది.
…………………………..

-బిఆర్‌ఎస్‌కు సానుభూతి కలిసొస్తుందా?

-ప్రభుత్వం మీద చేస్తున్న దుష్ప్రచారం పని చేస్తుందా?

-ప్రజల్లో బిఆర్‌ఎస్‌ కు ఆదరణ వుందా?

-పార్లమెంటు ఎన్నికల ఫలితమే పునరావృతమౌతుందా?

-బిఆర్‌ఎస్‌కు ఈ గెలుపు జీవన్మరణ సమస్య

-జూబ్లీ హిల్స్‌ గెలవకపోతే గులాబీ మనుగడ చాలా కష్టం.

-ఫోన్‌ ట్యాపింగ్‌, ఇతర కేసులన్నీ నిజమని బలపడుతుంది జనం నమ్మకం

-ఇప్పటికీ కంటోన్మెంట్‌ కోల్పోయారు.

-అక్కడ సానుభూతి ఏ మాత్రం పని చేయలేదు.

-జూబ్లీ హిల్స్‌ లో కూడా పని చేస్తుందన్న నమ్మకం బిఆర్‌ఎస్‌లోనే కనిపించడం లేదు.

……………………

-జూబ్లీ హిల్స్‌ కమలం వికసించాలని చూస్తోంది.

-బిజేపి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం వుంది.

-జాతీయ రాజకీయ నాయకులను రంగంలోకి దింపే ఆస్కారం వుంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రంగంలోకి దిగితే గాని గండామా, సుడిగుండమా తెలుస్తుందనేది ఓ సామెత. ఇప్పుడు జూబ్లిహిల్స్‌ ఎన్నిక విషయంలోనూ అన్ని పార్టీలదీ అదే పరిస్ధితి కనిపిస్తోంది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఏ పార్టీ జెండా ఎగుతుందనేది ఉత్కంఠగామారింది. అన్ని పార్టీలు ఉప ఎన్నిక విషయంలో సై అంటే సై అన్నట్లే వున్నాయి. కాని లోలోప మాత్రం ఎంతో కొంత భయం కూడా పార్టీలకు వున్నట్లు కనిపిస్తోంది. సుమారు ఏడాది తర్వాత వస్తున్న ఎన్నిక కావడం కూడా గమనార్హం. ఈ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా ఇంత ఉత్కంఠ నెలకొనలేదు. కాని జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై మాత్రం అందరికీ అంచచనాలున్నాయి. అందరికీ భయాలున్నాయి. అయితే పాలకపక్షం కాంగ్రెస్‌ గెలిచేందుకు కొంత సులువుగా వాతావతరణం కనిపిస్తోంది. ఎందుకంటే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ ప్రాంతం రాజకీయ, సామాజిక, ఆర్ధికపరమైన సమస్యలు పెద్దగా చూసే నియోజకవర్గం కాదు. అక్కడి ప్రజలకు, ఇతర ప్రాంతాల ప్రజల జీవన విధానానికి కూడా కొంత తేడా వుంటుంది. సుమారు సగం మంది ప్రజలకు అసలు ఈ ప్రపంచంతోనే సంబంధం లేన్నట్లు జీవితం వుంటుంది. రాజకీయాలతో సంబంధం లేని జీవితాలు గడిపే కుటుంబాలుకూడా చాల వుంటాయి. అందువల్ల ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపుతారని చెప్పడం కొంత కష్టం. అందుకే అదికారంలో వున్న కాంగ్రెస్‌ పార్టీకి లాభం జరుగుతుందన్న అంచనాలు కూడ వున్నాయి. పైగా సార్వత్రిక ఎన్నికలు మూడేళ్లకుపైగా సమయం వుంది. అప్పటి వరకైనా నియోజకవర్గం అభివృద్ది కోరుకునే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఇలాంటి సమయాల్లో సహజంగా ప్రజలు అభివృద్ది కావాలనే కోరుకుంటారు. ఒక వేళ ప్రతిపక్షానికి ఓటు వేసినా, ఏ చిన్న సమస్య పరిష్కారానికైనా మళ్లీ అధికారంలో వున్న కాంగ్రెస్‌పార్టీ నాయకుల వద్దకే వెళ్లాల్సివుంటుంది. అప్పుడు ఓటెందుకు వేయలేదన్న ప్రశ్నలు కూడా వారి నుంచి ఎదురౌతాయి. అందుకే సహజంగా ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అధికార పార్టీలే ఎక్కువ మేలు జరిగిన సందర్భాలే అదికంగా వుంటాయి. జూబ్లీ హిల్స్‌లో హైడ్రా ప్రభావం ఏమైనా వుంటుందా? సందేహం మాత్రం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే మాత్రం ప్రజలు పూర్తిగా నూటికి నూరుశాతం హైడ్రాకు మద్దతు తెలిపినట్లే అనుకోవాల్సి వుంటుంది. అది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనకు, ఆయన దూకుడుకు మరింత ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ నాయకుడికైనా సరే ప్రజల మద్దతు మాత్రమే కొండంత బలమౌతుంది. ఇక్కడ కూడా అదే జరిగితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వానికి మరో పదేళ్ల వరకు తిరుగుండని చెప్పడంలో సందేహం లేదు. అందువల్ల ఈ ఎన్నిక గెలుపు అనేది అటు పార్టీకే కాదు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా ఎంతో ప్రతిష్టాత్మకమే అనిచెప్పాలి. ఈ ఉప ఎన్నిక గెలిస్తే ఇక కాంగ్రెస్‌కు ఎదురుండదు. కాంగ్రెస్‌ నాయకుల జోష్‌కు తిరుగుండదు. వచ్చే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయడం ఖాయమౌతుంది. నాయకులకు మరింత నమ్మకం ఏర్పడుతుంది. ఊ అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే అంటూ బిఆర్‌ఎస్‌ చెప్పే లేనిపోని సర్వేలన్నింటికి చరమగీతం పాడినట్లౌవుంది. మూడేళ్ల దాకా ఇక బిఆర్‌ఎస్‌ నోరు తెరవకుండా అవుతుంది. 2005 జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కనీసం పోటీ చేయని పరిస్తితి బిఆర్‌ఎస్‌కు మరోసారి వస్తుంది. ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ నుంచి వలసలు వరదల్లా వస్తాయి. జూబ్లీ హిల్స్‌ ఉప ఎన్నిక అనేది పార్టీ అభ్యర్ధికే కాకుండా ప్రభుత్వానికి పరీక్ష అనుకొని పనిచేయాల్సి వుంటుంది. జూబ్లీహిల్స్‌ సీటు గెల్చుకోకపోతే కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే నష్టమేమీ లేకపోయినా, ఎంతో కొంత ఇబ్బందికరమే అవుతుంది. ముఖ్యంగా సిఎం. రేవంత్‌ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న వారికి ఒక దారి దొరికినట్లౌవుతుంది. ఆ అవకాశం స్వపక్షానికి గాని, ప్రతిపక్షానికి గాని ఇవ్వకూడదంటే ఖచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ జూబ్లీహిల్స్‌ కైవసం చేసుకోవాలి. రేవంత్‌రెడ్డి నాయకత్వం మరింత బలపడాలంటే ఆయన బలం కొండంత పెరగాలంటే పార్టీ నాయకులందరూ శ్రమించాల్సిన అవసరం వుంటుంది. అధికార యంత్రాంగమంతా చేతుల్లో వుంటుంది. ఎమ్మెల్యేలు, మంత్రులంతా అక్కడే వుంటారు. జిల్లాల నాయకత్వాలను కూడా ఈ ఎన్నికల ప్రచారానికి వినియోగించుకొని గెలవాల్సిన అవసరమైతే వుంది. అంతే కాకుండా బిఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలన్నీ అసత్య ప్రచారాలని కూడా తిప్పి కొట్టేందుకు వీలు కల్పించినట్లౌవుంది. కాలు దువ్వే గులాబీకి రేకులన్నీ రాలిపోయాతాయన్న భయం ఏర్పడుతుంది. ఇక బిఆర్‌ఎస్‌ విషయానికి వస్తే ఆ పార్టీకి ముందుగా కలిసి వచ్చే ప్రధానమైన అంశం కేవలం సానుభూతి. ఆ సానుభూతి ఎంత వరకు ఉపయోగపడుతుందన్నది ఇప్పటికిప్పుడు ఎవరూ చెప్పలేం. సానుభూతి రాజకీయాలు కూడా కొన్ని సార్లు పనిచేయవని గతంలో దుబ్బాక ఉప ఎన్నిక నిరూపించింది. ఎందుకంటే బిఆర్‌ఎస్‌ తిరుగులేని మెజార్టీతో గెలిచిన సమయంలో బిఆర్‌ఎస్‌ ఉప ఎన్నికలో సీటు కోల్పోతుందని ఎవరూ ఊహించలేదు. దుబ్బాక ఉప ఎన్నికలో బిఆర్‌ఎస్‌ సునాయాసంగా గెలుస్తుందని అంచనా వేసుకున్నారు. కాని ఓడిపోయారు. ఎందుకంటే సాదారణ మరణాలు పెద్దగా సానుభూతిని కల్పించలేవు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగి కంటోన్‌మెంటు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ గెలిచింది. అంటే సానుభూతి అన్ని సమయాల్లో ఉపయోగపడకపోవచ్చని రెండు ఉప ఎన్నికలు రుజువుచేశాయి. ఇప్పుడు కూడా అదే వర్కవుట్‌ అయితేమాత్రం బిఆర్‌ఎస్‌ సీటు కోల్పోవడం ఖాయం. అయితే ప్రభుత్వం మీద నిత్యం బిఆర్‌ఎస్‌ సాగిస్తున్న ప్రచారం జనం నిజమే అని నమ్మితే మాత్రం బిఆర్‌ఎస్‌ గెలుస్తుందేమో? కాని గతంలో మెజార్టీ రాకపోవచ్చు. అధికార కాంగ్రెస్‌ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుంది. జూబ్లీహిల్స్‌లో బిఆర్‌ఎస్‌ గెలిస్తే ప్రజల్లో బిఆర్‌ఎస్‌కు ఆదరణ తగ్గలేదనేది రుజువౌతుంది. ఆదరణ చెక్కుచెదరలేదన్న నమ్మకం క్యాడర్‌లో కలుగుతుంది. ఇక ఏ ఎన్నికలైనా మళ్లీ గులాబీ తోటకే అన్న విశ్వాసం నాయకుల్లోనూ పెరుగుతుంది. అధికార కాంగ్రెస్‌ వైపు చూడాలనుకునే నాయకులు తమ నిర్ణయాలను వాయిదా వేసుకుంటారు. గోడ దూకాలనుకునేవారు తొందరపడందే మంచిదైందనుకుంటారు. ఒక వేళ పార్టీ మారిన వారు పునరాలోచనలో పడతారు. ఒక వేళ పార్లమెంటు ఎన్నికల ఫలితమే గులాబీకి దక్కితే మాత్రం బిఆర్‌ఎస్‌ రాజకీయ మనుగడ చాల కష్టమౌతుందని చెప్పడంలో సందేహంలేదు. అందుకే ఈ ఉప ఎన్నిక గెలవడం అనేది బిఆర్‌ఎస్‌కు జీవన్మరణ సమస్య అని చెప్పక తప్పదు. ఈ గెలుపు కూడా పోన్‌ ట్యాపింగ్‌, ఈ కార్‌రేస్‌, కాళేశ్వరం వంటి అనేక చిక్కుముడులకు సమాదానం దొరికనట్లౌవుంది. బిఆర్‌ఎస్‌ ఓడితే ఇవన్నీ ప్రజల మనసుల్లో వున్నాయన్నది తేలిపోతుంది. ఒక వేళ బిఆర్‌ఎస్‌ గెలిస్తే ప్రభుత్వం మోపుతున్న ఆరోపణలు ఏవీ ప్రజలు నమ్మడం లేదన్నది తేలిపోతుంది. ఎందుకంటే ప్రజా స్వామ్యంలో ప్రజా భిప్రాయమే అంతిమం. అందువల్ల ఈ ఉప ఎన్నిక రావడం కూడా మూలుగుతున్న నక్క మీద తాటి పండు పడ్డట్టు బిఆర్‌ఎస్‌కు తీరని కష్టమే తెచ్చిపెట్టిందని చెప్పాలి. ఈ ఉప ఎన్నికలో గెలిస్తే తప్ప నిలబడలేని సమస్య. ఎలాగైనా గెలవాలన్న కసితో బిఆర్‌ఎస్‌ నాయకులు వున్నారా? లేదా? అన్నది కూడా తేలిపోతుంది. కేసిఆర్‌ మీద ప్రజల అభిప్రాయం బలంగానే వుందా? మారిందా? అన్నది కూడా తెలిసిపోతుంది. ఈ ఎన్నిక బిఆర్‌ఎస్‌ మనుగడకు గీటు రాయి అని చెప్పకతప్పదు. ఇక జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక బిజేపికి కూడా ప్రతిష్టాత్మకమే. తెలంగాణలో ఇక మేమే ప్రత్యామ్నాయం అంటూ చెబుతున్నారు. బిఆర్‌ఎస్‌కు రెండు సార్లు అధికారమిచ్చారు. కాంగ్రెస్‌కు ఇచ్చారు. నాలుగోసారి ముచ్చట బిజేపికి అవకాశమివ్వండి అని వచ్చే ఎన్నికల్లో ప్రాదేయపడేందుకు వీలు కలుగుతుంది. ఈ ఉప ఎన్నికలో బిజేపి గెలిస్తే తెలంగాణలో బిజేపి బలం చాలా పెరిగినట్లే లెక్క. ఈ నియోజకవర్గం లో ముస్లింమైనార్టీల ఓట్ల ప్రభావం తీవ్రంగా వుంటుంది. లక్షా ఇరవై వేల వరకు ముస్లిం ఓట్లు వుంటాయని అంటున్నారు. ఇలాంటి నియోజకవర్గంలో బిజేపి గెలిస్తే మాత్రం ఇక వచ్చే కాలం బిజేపితే అవతుందని చెప్పడం కూడా సబబుగానే వుంటుంది. చూద్దాం…మూడు ముక్కలాటైనా, రెండు ముక్కలాలైనా గెలిచే ఒక్కరే..ఆ ఒక్కరే వచ్చే ఎన్నికలకు బాద్‌షా అవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!