`రోజురోజుకు ఏమిటి కిరికిరి?
`జనమంతా ఉక్కిరి బిక్కిరి?

`అన్ని వర్గాల ప్రజల జీవితాలు తల కిందులు?
`ఒక ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు మరో పాలకులు రద్దు?

`ఒక ప్రభుత్వం లో పొందిన అనుమతులు మరో ప్రభుత్వంలో తప్పు?
`అన్ని రకాల అనుమతులిచ్చినప్పుడు తెలియదా?
`అప్పుడు లంచాలకు కక్కుర్తి పడి ఇచ్చారు?
`అనుమతులు ఇచ్చిన అధికారులు మారిపోయారు?
`కొన్న ప్రజలు ఆగమౌతున్నారు?
`పాలకులు కనికరం లేకుండా వ్యవహారిస్తున్నారు?
`ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతులు వల్లి స్తారు?
`పేదల మీద ప్రేమలు కురిపిస్తారు?
`నమ్మకాలూ పెంచుతారు! అధికారం లోకి వచ్చి నట్టేట ముంచుతారు?
`అక్రమార్కులకు అండగా నిలుస్తారు?
`అక్రమ వెంచర్లకు అనుమతులిస్తారు?
`ప్రభుత్వ భూములే ఏకంగా రిజిస్ట్రేషన్ చేసిస్తారు?
`రియల్ వ్యాపారి ప్రజలను మోసం చేసి అంట గట్టేస్తాడు?
`కొనుకున్న అమాయకులు బలై పోతున్నారు?
`దశాబ్దాలు దాటిన ఇండ్లు అక్రమ కట్టడాలంటారు?
`కొత్తగా ఇల్లు కొనాలనుకునే వారు ఆగమౌతున్నారు?
`సొంత ఇంటి కల నెరవేర్చు కోలేక పోతున్నారు?
`భూమి కొనాలంటే బయపడి పోతున్నారు?
`అపార్ట్మెంట్ కొనాలంటే హడలి పోతున్నారు?
`ఏ రియల్ కంపెనీ మంచిదో తెల్చుకో లేకపోతున్నారు?
`అన్ని కంపెనీల మీద ఆరోపణలే ఉంటే అనుమతులు ఇంకా ఎలా ఇస్తున్నారు?
`జనం జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు?
హైదరాబాద్, నేటిధాత్రి: సామాన్యుడు ఇంత జాగ కొనుక్కొలేడు. అది మంచిదో కాదో తెలుసుకోలేడు. అది రిజిస్ట్రేషన్ చేయించుకోలేడు. అందుకు లంచాలు ఇచ్చుకోలేడు. ఇంటి పర్మిషన్ తెచ్చుకోలేడు. అన్ని రకాల పర్మిషన్లకు లంచాలు ముట్టజెప్పుకోలేడు. అయినా అప్పో సొప్పో చేసి, అన్ని కష్టాలు పడి ఇల్లు కట్టుకుంటే అది వుంటుందో లేదో తెలియదు. ఎప్పుడు అధికారులువచ్చి కూలగొడతారో తెలియదు. భూమి కొన్న నాటి నుంచి ఇచ్చిన పర్మిషన్లు ఎలా ఇచ్చారో ఎవరూ చెప్పరు? ఎందుకిచ్చారో సమాదానం చెప్పే వారు కరువు. కాని ఆఖరుకు వచ్చి ఈ స్ధలం ప్రభుత్వానిదనో, చెరువులో వుందనో కూల గొడుతుంటే గుండెలు బాదుకుంటున్న వారు ఎంతో మంది వున్నారు. ఇప్పుడు భూమి కొనుగోలు చేసుకోవాలంటే భయం. ఇప్పటికే లక్షలు, కోట్లు పెట్టి కొనుక్కున వారిలో మొదలైన ఆందోళన. కొనుక్కున్న ఇల్లైనా,కట్టుకున్న ఇళ్లయినా ఎంత కాలం తమ సొంతం అనేది ఎవరూ చెప్పలేని పరిస్దితుల్లో బతుకుతున్నాం. ఎందుకంటే తెలంగాణలో ఏది ప్రభుత్వ భూమి అనేది ఎవరికీ తెలియదు. తెలిసిన వాళ్లు పర్మిషన్లు ఇచ్చారు. తెలియకుండా కట్టుకున్న వాళ్లు కట్టు బట్టలతో మళ్లీ రోడ్డు మీద పడుతున్నారు. దీనికి పరిష్కారం లేదు. ఇండ్లు కట్టుకోవడం, కొనుక్కొవడం జనం ఖర్మ. అవి కూలిపోతుంటే చూస్తూ వుండిపోవడం మన ప్రాప్తం. గుండెలాగి పోయి ప్రాణాలు పోతే జీవితం సమాప్తం. ఇదేనా సగటు జీవి ఆశిస్తున్నది. ఇందుకేనా రూపాయి రూపాయి పోగేసి కొనుక్కున్నది. ఇందుకేనా అప్పులు చేసి ఇండ్లు కొనుక్కున్నది అనే మాట ఇప్పుడు చాల మంది నోటి వెంట వినిపిస్తోంది. నిజంగా ఎవరైనా తెలిసి చేస్తే తప్పు. ఎలాంటి పర్మిషన్లు లేకుండా ప్రభుత్వ భూమిలో ఇండ్లు కట్టుకుంటే తప్పు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటే తప్పు. కాని దర్జాగా ప్రభుత్వ భూములను ఆక్రమించి బిల్డింగుల మీద బిల్డింగులు కట్టి, అమ్ముకుంటున్న వాడు బాగానే వుంటున్నాడు. ఎకరాల కొద్ది ఆక్రమించి ప్లాట్లు అమ్ముకున్న వాడు బాగానే వుంటున్నాడు. కాని కొనుక్కున్న వాడు ఆగమైపోతున్నాడు. ఇల్లు కట్టుకుంటే కూలిపోతుందేమో? అని భయం. ఒక వేళ కాలయాపన చేస్తే ఎవడు వచ్చి కబ్జా చేస్తాడో అని భయం. ఇలా సగటు వ్యక్తి ఎందుకు భయం, భయంగా బతుకుతున్నాడు. బతుకంతా భయంతోనే ఎందుకు బతకాలనుకుంటున్నాడు. అండగా ప్రభుత్వం లేదు. తోడుగా సమాజం లేదు. ఎందుకు ఈ పరిస్దితి దాపురిస్తోంది. ఇల్లుకట్టుకున్నా, కొనుక్కున్నా గ్యారెంటీ లేదా? దానికి వారెంటీ అసలే లేదా? గతంలో ఇచ్చిన అనుమతులు ఇప్పుడు చెల్లవా? గతంలో ఇచ్చిన అన్ని రకాల అనుమతులు ఇప్పుడు తప్పేనా? ఎందుకిలా? రోజురోజుకూ ఎందుకు ఈ కిరికిరి? సొంత ఇల్లు కల నిజమైనా ఎందుకు ఉక్కిరి బిక్కిరి. కొనుగోలు దారులకు ఎందుకు ఈ తలనొప్పి? ఇల్లు కొనాలంటే కలలో కూడా భయపడాల్సిన పరిస్దితి ఎందుకు వస్తోంది. వ్యవస్ధ ఎందుకు ఇంత దిజగారిపోయింది? అవినీతి ఊడలు పెరిగి, జనం గుండెలను చీల్చుతున్నాయి. బతికుండగానే జనాన్ని జీవచ్చవాలను చేస్తున్నాయి. ఎందుకంటే కళ్లముందు కట్టుకున్న ఇండ్లు బుల్డోజర్ల కింది తుక్కుతుక్కవుతుంటే కలల సౌదం కూలిపోతుంటే మనిషి బతికే అవకాశం వుంటుందా? సగటు వ్యక్తి ఇల్లు కొనుగోలు చేయడం కోరి కోరి కష్టాలు తెచ్చుకోవడమేనా? గత ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులు ఇప్పుడు ఎందుకు తప్పవౌతున్నాయి. అప్పుడు అదికారులు చేసిన తప్పులకు ఇప్పుడు జనం ఎందుకు బలవ్వాలి. ప్రజలు ఎందుకు శిక్షిను అనుభవించాలి. పెద్ద పెద్ద వాళ్లు ఆక్రమించి స్ధలాల జోలికి ఎవ్వరూ వెళ్లరు. కాని సామాన్యులు కొనుక్కున్న స్దలాలలోకి బుల్డోజర్లు వేసుకొని వస్తారు. ఏళ్ల తరబడి కట్టుకున్న ఇండ్లను క్షణాల్లో కూల్చి వేస్తున్నారు. అన్ని రకాల అనుమతులున్నా, ఇప్పటికీ లంచం లేకుండా ఏ పని ప్రభుత్వ కార్యాలయాల్లో జరగదు. ఇప్పుడు లంచాలు లక్షలు దాటిపోయింది. చిన్న చిన్న పనులకు కూడా లక్షలు ముట్ట జెప్పందే సంతకాలు పెట్టడం లేదు. లంచం ఇస్తే తప్ప పని కాదు. లంచం ఇవ్వకపోతే పని ఎప్పటికీ కాదు. ఇలాంటి వ్యవస్దను మార్చలేని పాలకులు, ప్రజలు పీడిరచుకుతినే వారిని కాపాడుతున్నారు. ప్రజలకు అండగా నిలవాల్సిన పాలకులు, అవినీతి అదికారులను వదిలేస్తున్నారు. ఒక వ్యక్తి స్ధలం కొన్నప్పుడు దాని రిజిస్ట్రేషన్‌కు రూపాయి లంచం తీసుకోకుండా సంతకం పెడుతున్న అదికారులు ఒక్కరైనా వున్నారా? ఇంటి పర్మిషన్ కోసం లంచం ఇవ్వకుండా కాళ్లరిగిలా ఏళ్ల తరబడి తిరిగినా అదికారులు కనికరిస్తారా? చివరకు జనమే విసిగిపోయి వందల సార్లు తిరడం కన్నా అడిగింది ఇవ్వడం తప్ప చేసేదేమీ లేదనుకొని ఇస్తున్నారు. ఇలా ప్రతి అనుమతికి లంచమే? మరి జనం గోడు వినేవారు ఎవరు? ప్రతిపక్షంలోవున్నప్పుడు రాజకీయ పార్టీలు నీతులు చెబుతాయి. సమజానికి అన్యాయం జరుగుతోందని గగ్గోలు పెడతాయి? సామాన్యులకు అండగా వుంటామని భరోసా ఇస్తాయి? గత ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నప్పుడు అడ్డుపడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది. సామాన్యుడు ఒక వేళ అక్రమ నిర్మాణం చేసుకుంటే దానిని సవరించడానికి అనేక మార్గాలున్నాయని గతంలో చెప్పిన వాళ్లే , అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతుంటే ఎవరు దిక్కు? ఆ పాలకులు కాకపోతే, ఈ పాలకులు, ఈ పాలకులు కాకపోతే ఆ పాలకులు..ఏ పాలకులు వచ్చినా సామాన్యుడికి భరోసా లేదు. ఇల్లు కట్టుకోవాలంటే ధైర్యం చాలడం లేదు. రియల్ వ్యాపారానికి అనుమతులు ఇస్తారు. రియల్ వ్యాపారి స్ధలాలన్నీ అమ్ముకున్న తర్వాత ఆ వెంచర్ అక్రమమంటారు? జనం ఎవరి వద్దకు వెళ్లాలి? జరిగిన నష్టం ఎవరు తీర్చాలి.. రియల్ వ్యాపారంలో చాల మంది చేరిపోయారు. ఎవరు నమ్మకమైన వ్యాపారం చేస్తున్నారో..ఎవరు అక్రమ వ్యాపారం చేస్తున్నారో ప్రభుత్వం గుర్తించాలి. అంతే కాని జనం మోసపోకూడదని చెబితే ఎలా తెలుస్తుంది. మోసపోయిన తర్వాతే అందరి రంగు బైట పడుతుంది. అనుమతులు ఇచ్చేప్పుడే ఆపితే అక్రమ భూ వ్యాపారాలు సాగవు. కాని పాలక పెద్దల ఆశీస్సులు, అదికారుల సంతకాలతో వందలాది ఎకరాల్లో వెంచర్లు వేసిన వారున్నారు. అమ్ముకొని కోట్లు సంపాదించుకున్న వారున్నారు. ఏకంగా ప్రభుత్వ భూములే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్న అదికారులున్నారు. వారికి నాయకులు ఆశీస్సులందిస్తున్నారు. కొందరు నాయకులు నేరుగా రియల్ వ్యాపారం చేస్తున్నవారు కూడా వున్నారు. అలా కొనుక్కున్న అమాయకులు బలైపోతున్నారు. ఇక్కడ కొందరు రియల్ వ్యాపారులు కూడా బాగానే మోసపోతున్నారు. పాలకులను నమ్ముకొని సమస్యలన్నీ తీర్చుకొని, అన్ని అనుమతులు తెచ్చుకొని ఆకాశాన్ని తాకేంతటి హైరేజ్ అప్పార్టుమెంట్లు కట్టి అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నవాళ్లు కూడా వున్నారు. కొన్ని లక్షల ఇండ్లు అమ్ముడుపోక ఆగమౌతున్న రియల్ వ్యాపారులు కూడా వున్నారు. ఆ రియల్ వ్యాపారులు కూడా పెట్టిన సొమ్ము జనాలదే. బ్యాంకుల ద్వారా రియల్ వ్యాపారం పేరుతో కోట్లు అప్పు చేసి, లేక జనం నుంచి ప్రీ లాంచ్ ఆఫర్లతో డబ్బులు వసూలు చేసి నిర్మాణం చేశారు. ప్రభత్వం అడ్డుపడడంతో, అక్రమ నిర్మాణాలంటూ ఆపేయడంతో అటు వ్యాపారులు, ఇటు జనం ఇద్దరూ నష్టపోతున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. కొందరు తెలివిగా అమ్మేసుకొని పక్కకు తప్పుకున్నవారున్నారు. అదే వ్యాపారాన్ని నమ్ముకొని ముందుకు వెళ్లి వేలాది ఇండ్లు కట్టి , అమ్మకాలు లేక అప్పులపాలౌతున్న రియల్ వ్యాపారులు వున్నారు. ఇప్పుడు వాళ్లు మావి నిజమైన ఇండ్లు అని చెప్పినా జనం కొనేందుకు నమ్మడం లేదు. ఏది సక్రమ నిర్మాణమో? ఏదో అక్రమ నిర్మాణమో తెలియక జనం తికమక పడుతున్నారు. తొందరపడి పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడంలేదు. ఎందుకంటే కళ్లముందే నష్టపోయిన వారు కనిపిస్తున్నారు. కొనుక్కున్న ఇండ్లు అక్రమమని అధికారులు కూల్చేస్తుంటే చూస్తున్నవారున్నారు. అందుకే సగటు సామాన్యులు ఇల్లు కొనుగోలు చేయాలంటేనే వణికిపోతున్నారు. ఏ ఇంటికి గ్యారెంటీ వుందో?? ఏ ఇంటికి వారెంటీ వుంటుందో తెలియక కొనుగోలు ముచ్చటే మర్చిపోతున్నారు???
