మిల్లర్ల ఆస్థులు పెరిగే! ఖజానా తరిగే!!

`ప్రభుత్వం లెక్క తేల్చిన 26 వేల కోట్లు ఎక్కడ?

`అధికారుల వద్ద పూర్తి లెక్కలున్నాయా!

`డిఫాల్టర్లను పూర్తి స్థాయిలో గుర్తించారా!

`మిల్లర్లకు ప్రభుత్వాలు భయపడుతున్నాయా!

`గత పాలకులు నడిచిన దారిలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం నడుస్తోందా?

`బకాయి దారులను వదిలేయాలని చూస్తోందా?

`ఏడాదిగా ఎందుకు వసూలు చేయడం లేదు!

`డిపాల్డర్లకే వడ్లు కట్టబెట్టి! మళ్లీ ఖజానాకు గండికొట్టి!!

`మిల్లర్ల బకాయిలు వసూలలో శషబిషలెందుకు?

`వేల కోట్ల బకాయిలు ఎందుకు వసూలు చేయడం లేదు.

`మిల్లర్ల ఆస్థులు కొండల్లా పెరిగిపోతున్నాయి!

`ఖజానా నానాటికీ ఖాళీ అవుతోంది.

`మిల్లర్ల బకాయిలు వసూలు చేస్తే రైతు భరోసాకు నిధుల కరువుండదు!

`రుణమాఫీ పూర్తికి ఇబ్బంది వుండదు.

`ఇతర ప్రభుత్వ పథకాలకు లోటు రాదు.

`బకాయిలన్నీ మిల్లర్ల దగ్గరే ఆగిపోతే అభివృద్ధి నిధులెలా?

`ఇతర సేవల ధరల పెంపకంపై వున్న దృష్టి బకాయిల వసూలులో ఎందుకు లేదు!

`సివిల్‌ సప్లయ్‌ మంత్రిత్వ శాఖ ఎందుకు దృష్టి పెట్టడం లేదు!

`సివిల్‌ సప్లయ్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వుండడంలో ఆంతర్యమేమిటి?

`సామాన్యుల అప్పుల వసూలు మీద వున్న శ్రద్ధ మిల్లర్ల మీద ఎందుకు లేదు!

రాజుల సొమ్ము రాళ్లపాలు..జనం సొమ్ము జమిందారుల పాలు అని పాత సామెత. ఇప్పుడు రాజులు లేకపోయినా, రాజ్యాలు లేకపోయినా ప్రభుత్వ సొమ్ము కొందరిపాలౌతోంది. అప్పటి రాజుల రాజ్యం కాదు. అప్పటి సొమ్ము మింగేందుకు జమిందారులు లేరు. మరి ఖజానా ఎందుకు ఖాళీ అవుతోంది. జనం చెల్లించే పైసా పైసా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజల సొమ్ము ఎవరిపాలౌతోంది. ప్రజల పాలకులైన పాలనలో సొమ్ముంతా ఎటు తరలిపోతోంది. పాలకులు చెప్పే సాకులకు, చేసే అప్పులకు, పెరుగుతున్న సమస్యలకు, అందుతున్న ఫలాలకు పొంతన లేకుండా పోతోంది. కారణం ఎవరు? లోపం ఎక్కడుంది? తెలంగాణలో మిల్లర్ల దగ్గర ప్రభుత్వం చెప్పిన లెక్కల ఆధారంగానే సుమారు 26 వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి? ఈ బకాయిలు ఉమ్మడి రాష్ట్రం నుంచి అలాగే వున్నాయా? తెలంగాణ వచ్చిన తర్వాత మొదలయ్యాయా? అన్నది కూడా తెలియాల్సింది. ఇన్ని సంవత్సరాలుగా పేరుకుపోతున్న బకాయిలు ఎందుకు వసూలు కావడం లేదు? పాలకులకు పట్టడం లేదా? అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారా? నాయకులు అడ్డుకుంటున్నారా? మిల్లర్ల నుంచి బకాయిలు వసూలుకు అడ్డేమిటి? అడ్డంకి ఏమిటి? వసూలుకు ఎదురౌతున్న అవరోధాలేమిటి? అసలు అధికారులు మిల్లర్ల బకాయిల వసూలుకు ఉపక్రమించారా? లేదా? వసూలు మొదలు పెడితే ఎంత వసూలు చేశారు? ఇలాగే పెండిరగ్‌లో పెట్టి రైతు రుణమాఫీ చేసినట్లు మిల్లర్ల బకాయిలు మాఫీ చేస్తారా! ఆఖరుకు మిల్లర్లు చేతులెత్తేసేదా తెస్తారా! అప్పులు తీసుకున్న వాళ్లు ఐపి పెట్టినట్లు, మిల్లర్లకు పాపకులే దగ్గరుండి దారులు చూపిస్తున్నారా? తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోంది. పాలకులు ఎవరైనా సరే రాజకీయాలతోనే పొద్దుబుచ్చుకుంటున్నారా? ప్రభుత్వానికి వేలాది కోట్లు ఎగనామం పెట్టిన మిల్లర్లను వదిలేయడమే మేలనుకుంటున్నారా? సామాన్యుడు ఒక్క నెల కరంటు బిల్లు చెల్లించడంలో జాప్యం చేస్తే కనీసం నోటీసు ఇవ్వకుండా కట్‌ చేస్తుంటారు. బ్రతిమిలాడినా వదిలేయరు. ఫైన్‌ వేసి మరీ వసూలు చేస్తారు. ఎలాంటి అనుమతి లేకుండా కరంటు వినియోగించుకుంటే కేసులు నమోదు చేస్తారు. జైలు పాలు చేస్తారు. ఒక్క నెల మంచినీటి బిల్లు చెల్లించకపోయినా అదే చేస్తారు. ఇంటి పన్ను కట్టకపోతే ఇంటి ముందు దండోరా వేస్తారు. తలుపు చెక్కలు తీసుకొని వెళ్తారు. సామాన్యుడు ఉపాధి అవకాశాల కోసం బ్యాంకు రుణం చెల్లించకపోతే ఎలా ఒత్తిడి చేస్తారో తెలుసు. అంతేకాదు రైతులు తీసుకున్న రుణాల వసూలు ఎలా చేస్తారో తెలియంది కాదు. ఆరుగాలం కష్టపడి రైతు పండిరచే సాగు సంపదను మిల్లర్లు దోచుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మిల్లర్లకు దగ్గరుండి ధాన్యం అప్పగించే అధికారులు ఎందుకు బకాయిలు వసూలు చేయడం లేదు. రాష్ట్ర ఖజానా నానాటికీ ఖాళీ అవుతుంటే తెలంగాణ లో మిల్లర్ల ఆస్థులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాళ్లు చెల్లించాల్సిన బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. ఒకవేళ వారి నుంచి ప్రభుత్వం వసూలు చేయాలని చూసినా కష్టతరమయ్యే పరిస్థితులే ఎదురౌతాయి. ఒక్కొక్క మిల్లర్‌ వందల కోట్లు బకాయిలు పేరుకు పోయాయి. వాళ్లు కొంచెం కొంచెంగా బకాయిలు చెల్లించినా జీవిత కాలం సరిపోదు. పైగా చెల్లించే బకాయిలకు పదుల రెట్లు మళ్ళీ వడ్లు తీసుకుంటున్నారు. దాంతో వారికి తరిగేది తక్కువ పెరిగేది ఎక్కువౌతోంది. తరతరాలు తరగని ఆస్థిని ప్రభుత్వమే దగ్గరుండి సమకూర్చినట్లౌతుంది. ఇలాంటి పరిస్థితి సృష్టించిందే అధికారులు. మిల్లర్లకు ఒక రకంగా దోచిపెట్టేలా పరిస్థితులు సృష్టించిందే అధికారులు అన్న విమర్శలున్నాయి. డిఫాల్ట్‌ మిల్లర్లకు వడ్లు సమకూర్చడంలో చూపించే శ్రద్ధ బకాయిలు వసూలు చేయడం ఒక్క శాతం కూడా చూపించడం లేదు. మొక్కై వంగనిదే మానై వంగుతుందా? అన్నట్లు వ్యవస్థను తయారు చేశారు. అందులో రాజకీయ నాయకుల పాత్ర లేదని ఎవరూ చెప్పలేరు. మిల్లర్లను ఏటిఎంలుగా మార్చుకున్న రాజకీయ పార్టీలు పొరపాటున కూడా వారి మీద మాట్లాడలేరు. సివిల్‌ సప్లయ్‌ శాఖలో ఇవన్నీ కుంభకోణాలలోకి రావా? ప్రజా సంఘాలు పట్టించుకోవా? రాజకీయ పార్టీలు ఈ సమస్యల మీద మాట్లాడలేరా? ప్రభుత్వాలను విమర్శించాలనుకున్నప్పుడు, రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు మాత్రమే నోరు తిప్పుతారు. తర్వాత అందరూ మర్చిపోతారు. మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయాలని ఎవరూ డిమాండ్‌ చేయరు. కారణం అందరికీ తెలిసిందే. అందుకే ఈ విషయంలో అందరూ గప్‌ చుప్‌గా వుంటారు. ఇంతకూ సివిల్‌ సప్లయ్‌ శాఖ తేల్చిన లెక్క సరైందేనా? ప్రభుత్వం లెక్క తేల్చిన 26 వేల కోట్లు ఎక్కడ? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం వుండదు. బకాయి దారులైన మిల్లర్లు ఎవరు? ఎంత మంది వున్నారు? పెద్ద మొత్తంలో బకాయిలు పడ్డ మిల్లర్లు ఎంత మంది? అతి తక్కువ బకాయిలు వున్న వారు ఎంతమంది? వారి వివరాలు ఎందుకు బైట పెట్టరు? వాళ్ల లెక్కలు ప్రభుత్వాలకు తెలుసా? తెలిసినా ఉపేక్షిస్తున్నారా? వారి నుంచి వసూలు చేయడానికి ఎదురౌతున్న సవాళ్లేమిటి? మిల్లర్లకు ఇచ్చింది ఇచ్చినట్లు ప్రభుత్వం ఎందుకు వసూలు చేయలేకపోతోంది? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. అసలు బకాయి దారుల లిస్ట్‌ అధికారులు ఎందుకు బైట పెట్టరు? వందల కోట్ల నుంచి వేల కోట్ల బకాయిలు పెరిగిపోతుంటే అధికారులు లెక్కలేసుకుంటు కూర్చుంటున్నారా? ఒక్కో మిల్లర్ల వందల కోట్లు బకాయిలు పడడమేమిటో ఎవరకీ అంతుచిక్కకుండా వుంది. వడ్లు తీసుకున్న మిల్లర్లు ఆ ధాన్యాన్ని ఏం చేశారు? ఎక్కడికి తరలించారు? వాటి పర్యవేక్షణ కూడా లేనంతగా అధికారులు మొద్దు నిద్రలో వున్నారా? గత ప్రభుత్వం పోయి ఏడాది కావొస్తోంది. ప్రజా ప్రభుత్వం వచ్చింది. కనీసం కొత్త ప్రభుత్వం లెక్కలు అడుగుతుందేమో? అన్న భయం అధికారులలో లేకపోయిందా? వడ్లు తీసుకోవడానికి అనేక కొర్రీలు పెడుతున్న మిల్లర్లు బకాయిలు చెల్లించేందుకు ఎందుకు ముందుకు రావడం లేదు? వారిపై ఒత్తిడి తెచ్చేందుకు అధికారులు సన్నద్ధం కాలేకపోతున్నారు? అధికారుల వద్ద పూర్తి లెక్కలున్నాయా! అవి నోటి లెక్కలా! కాకి లెక్కలా! డిఫాల్టర్లు పూర్తి స్థాయిలో గుర్తించలేక నోటికొచ్చిన అంకెలు చెబుతున్నారా? లేక డిఫాల్టర్లను గుర్తించలేక చతికిలపడుతున్నారా! వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తే తమ బండారం ఎక్కడ బైట పడుతుందో అని భయపడుతున్నారా? తిమ్మిని బమ్మిని చేయాలని చూస్తున్నారా? అన్ని వేళ్లూ అధికారుల వైపే చూపిస్తున్నా ఎందుకు కదలడం లేదు? ఎన్ని సార్లు మీడియాలో సివిల్‌ సప్లయ్‌ డిపార్ట్మెంట్‌ మీద కథనాలు వచ్చినా సరే అధికారులు కదిలింది లేదు. పాలకులు బెత్తం పట్టుకున్నది లేదు. అధికారులను తరిమింది లేదు. బకాయి దారుల నుంచి వసూలు చేయమని గట్టిగా చెప్పింది లేదు. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయకపోతే చర్యలుంటాయని హెచ్చరించింది లేదు. పాలకులకు రాజకీయాలు కావాలి. అధికారులకు వెసులుబాటు కావాలి. అది దీర్ఘ కాలం కొనసాగాలి. ఏళ్లకేళ్లు గడిచిపోవాలి. పాలకులు మర్చిపోవాలి. మళ్ళీ పంటలొచ్చే సమయానికి మీడియా గుర్తు చేయాలి. ఇదే తప్ప ఇంతకు మించి సివిల్‌ సప్లయ్‌ లో ఒక్క అడుగు ముందుకు పడిరది లేదు. పదేళ్లుగా కనీసం పడినట్లు అవకాశం కూడా కనిపించలేదు. కొత్త ప్రభుత్వం ఇటీవల ఎంతో గంభీరంగా ప్రకటించినా ఏమైంది? పైసా వసూలైందా? డిఫాల్టర్లకు వడ్లు ఇవ్వడం ఆగిందా? అక్కడో ఇక్కడో ఎవరో ఒకరు రూపాయిలో ఐదు పైసలు బకాయిలు చెల్లించినా అది గొప్పేనా? బకాయిలు కొండంత వున్నాయి. వసూలు రవ్వంత వుంది. ఆ బకాయిల కొండ తరిగేదెప్పుడు? ప్రభుత్వ ఖజానా నిండేదెప్పుడు? అసలు సివిల్‌ సప్లయ్‌ డిపార్ట్మెంట్‌ తన జీవిత కాలంలో బకాయిలు వసూలు చేసేనా? చక్రవడ్డీ నింపినట్లు మిల్లర్లకే ప్రభుత్వం రుణపడి వుండేలా చేస్తారా? గత ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ రెండు లక్షల రుణమాఫీ వేస్తామని హామీ ఇచ్చింది. సివిల్‌ సప్లయ్‌ డిపార్ట్మెంట్‌ లో బకాయిలు ఇరవై ఆరు వేల కోట్లు వుంటే అనుకున్న సమయానికి ప్రభుత్వం అవలీలగా రుణమాఫీ చేసేది. ఆరు నెలలు ప్రభుత్వం అష్టకష్టాలు పడి రుణమాఫీ తీర్చేంత ఇబ్బంది కలిగేది కాదు. రుణమాఫీ నిధులు పోగా మిగిలిన సొమ్మును రైతు భరోసా కు వాడుకునే అవకాశం వుండేది. ఇతర ప్రభుత్వ పథకాలు చకచకా అమలు చేసే అవకాశం ఏర్పడేది. ప్రభుత్వ పథకాల అమలుకు లోటే ఏర్పడేది కాదు. అయితే మిల్లర్లకు ప్రభుత్వాలు భయపడుతున్నాయా! అన్న ప్రశ్న తరుచూ వినిపిస్తూనే వుంటుంది. మిల్లర్ల ను కదిలిస్తే, బెదరిస్తే పార్టీల మనుగడ కష్టమౌతుందని ఆలోచిస్తారని కూడా అంటారు? నిజమా! కాదా రాజకీయ పార్టీలే చెప్పాలి. బకాయిలన్నీ మిల్లర్ల దగ్గరే ఆగిపోతే అభివృద్ధి నిధులెలా? అన్న సంశయం ఎందుకు రావడం లేదు. మిల్లర్ల నుంచి ముక్కు పిండి బకాయిలు వసూలు చేయాలని కచ్చితమైన ఆదేశాలు ఎందుకు రావడం లేదు. బకాయిలు వున్నాయన్న మాట తప్ప రాబట్డుతాం..ఖజానా నింపుతాం…ప్రజలకిచ్చిన సంక్షేమాలు అమలు చేస్తామని చెప్పండి. వసూలు చేసి చూపించండి. ఎన్నికల హామీలు అమలు చేయండి. తమకు తిరుగులేదని పాలకులు నిరూపించుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *