
Pantini Nala
పంతిని నాలా ఆక్రమణ వివాదానికి ముగింపు ఎన్నడు??
కంటికి కనిపిస్తున్న కాలువను నక్షాలో లేదంటున్న అధికారులు.
భూ వివాదం ప్రయివేట్ వ్యక్తులదే కావచ్చు
కానీ, నాలా ఆక్రమణకు గురైతే ఇబ్బంది పడేది ప్రజలే..
మళ్ళీ వరదలు వస్తేనే చర్యలు చేపడుతారేమో??
జన జీవనానికి ఆటంకం కలుగుతుందంటే ఏ ప్రాపర్టీ ఐన ప్రభుత్వం స్వాదీనపర్చుకోవచ్చు కధ!!
వివాద పరిష్కారంలో సమన్వయం లేని రెవెన్యూ,ఇరిగేషన్, పోలీస్ శాఖలు
పాత ఆర్& బి రోడ్డుకు అడ్డంగా మట్టి పోసి ఇబ్బందులు పెడుతున్నారు.
ప్రశ్నిస్తే దాడులు చేసి బెదిరిస్తున్నారని బాధితుడు మేరుగు రమేష్ ఆరోపణ..
సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేసిన సి ఐ. ఎస్సై లు
నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ :-
అయినవోలు మండలం పంతిని గ్రామంలో గత కొంతకాలంగా జరుగుతున్న నాలా (వర్షం నీళ్లు పోయే కాలువ)ఆక్రమణ వివాదం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతుంది. రెండు సర్వే నెంబర్ల మధ్య ఉన్న ఈ కాలువ (వరద నీళ్లు వెళ్ళే దారి) ఆక్రమణకు గురి కావడంతో మొదలైన ఈ వివాదం ముదిరి ముదిరి దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. తన పక్కనే ఉన్న ఓ భూస్వామి తనకున్న ఎకరా భూమికి బదులుగా పక్కనే ఉన్న కాలువను కూడా ఆక్రమించి వర్షపు నీరు వెళ్లే దారిని మళ్లించి తన భూమిలోకి వరద నీరు వచ్చేలా చేస్తున్నాడని, ఇదేంటని అడిగితే దాడులు చేస్తున్నారని కాలువ పక్కన ఉన్న తన భూమిలో నూతనంగా ఫంక్షన్ హాల్ నిర్మాణం చేస్తున్న మేరుగు రమేష్ ఆరోపించారు. అంతేకాకుండా సదరు నాలా ఆక్రమించిన వ్యక్తి తన పలుకుబడితో అధికారులను తప్పుదోవ పట్టించి తన భూమిని భఫర్ జోన్ గా చూపించి అన్యాయంగా తన నిర్మాణాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సైతం ఆ వ్యక్తికే పరోక్షంగా మద్దతుగా వ్యవహారిస్తునట్లు అనుమానం వ్యక్తం చేశాడు.
కొనసా…..గుతున్న వివాదం
పంతిని గ్రామం నుంచి వచ్చే వర్షపు నీరు పంతిని గ్రామం నుండి ఖమ్మం వైపు వెళ్లే హైవేపై ఉన్న బ్రిడ్జి కింద నుంచి ఈ ఆక్రమిత కాలువ ద్వారా దిగువన ఉన్న పంట పొలాల గుండా ప్రవహిస్తుంది. అయితే ఈ కాలువను కొందరు ఆక్రమించడం ద్వారా వర్షపు నీరు రోడ్డు మీదికి ప్రవహించి వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. గత సంవత్సరం కూడా వర్షాలు పడినప్పుడు ఇదే పరిస్థితి తలెత్తింది. అప్పుడు పరిస్థితిని సమీక్షించిన రెవెన్యూ పోలీసు ఇరిగేషన్ అధికారులు కంటితుడుపు చర్యగా జెసిబి ల సహాయంతో కాలువకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించి ఆక్రమిత రైతును కూడా తన భూమి వద్ద కాలువను వెడల్పు చేపించాలని సూచించారు. కానీ సదరు రైతు గ్రామంలో పలుకుబడి ఉన్న పెద్దమనిషి కావడంతో పైపై మెరుగులు దిద్ది పూర్తిగా వెడల్పు చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
సమన్వయం లేని అధికారుల తీరు

రెండు సర్వే నెంబర్ల మధ్య ఉన్న ఈ కాల్వ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలన్న గ్రామస్తుల కోరిక మేరకు సర్వే చేసిన రెవెన్యూ అధికారులు ఎలాంటి పరిష్కారం చూపలేదు. ఏ డి స్థాయి అధికారులు సైతం వచ్చి సర్వే చేసిన ఫలితం శూన్యంగానే ఉంది. రెవెన్యూ అధికారుల సర్వే ప్రకారం రెవెన్యూ నక్షలో అసలు కాలువ ప్రవాహ తీరు పూర్తిగా స్పష్టంగా లేదని కాలువ ఉన్నది లేనిదీ ఇరిగేషన్ అధికారులు తేల్చాలని చెప్పి తప్పించుకోగా, వివాద స్థలము అంతా పట్ట భూమి కావడం వల్ల కాలువను వెడల్పు చేయడంలో లీగల్ ఇబ్బందులు వస్తాయని ఇరిగేషన్ అధికారులు జాప్యం చేస్తున్నారు. అయితే వివాదం కాస్త ముదిరి పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి వెళ్లడంతో శాంతి భద్రతలకు భంగం కలుగుతున్న… ఇరువర్గాలు సమాజంలో పలుకుబడిలో ఉన్నవారు కావడం చేత తామ చర్యలు తీసుకోవడంలో ఆలస్యం అవుతుందని పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. ఇలా ఈ మూడు శాఖల అధికారులు రాజకీయ ఆర్థిక ఒత్తిళ్లకు తలోగ్గి వివాదాన్ని ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారో వేచి చూడాలి.
దాడిపై విచారణ జరిపిన సి. ఐ ఎస్సై..
హనుమకొండ జిల్లా అయినవోలు మండలం పంతిని గ్రామంలో గతం లో ఆర్ అండ్ బి రోడ్డుగా ఉన్న బాటను ఆక్రమించి రోడ్డుకు అడ్డంగా మట్టి పోయించి పంట పొలాలు చెల్కల కాడికి పోకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పంతిని గ్రామస్తులు, పక్కన నూతనంగా ఫంక్షన్ హాల్ నిర్మాణం చేస్తున్న మెరుగు రమేష్ ఆరోపించారు. గత 20 రోజుల క్రితం ఫంక్షన్ హాల్ నూతన నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో నిర్మాణం అడ్డుకోవడానికి పంతిని గ్రామానికి చెందిన ఓ భూస్వామి అక్కడ పనిచేస్తున్న కూలీలను మేస్త్రీలను అక్కడున్న వాచ్మెన్ ను అతని భార్యను బెదిరిస్తూ అక్కడున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని మెరుగు రమేష్ ఆరోపించారు. గతంలో ఇట్టి విషయమై సమాచారం కోసం వెళ్లిన పాత్రికేయులపై దాడి చేసి, వారి వాహనాలను ధ్వంసం చేశారని తెలిపారు. ఈ విషయంపై మెరుగు రమేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ చేసిన స్థానిక పోలీసులు దౌర్జన్యం చేసిన వారిపై కేసు నమోదు చేసినట్టు అయినవోలు పోలీసులు తెలిపారు. ఇందులోభాగంగానే గురువారం పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్, ఐనవోలు ఎస్సై సంఘటన స్థలాన్ని సందర్శించి బాధితులను విచారణ చేశారు. విచారణ అనంతరం దోషులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని అన్నారు..