పద్దులో తెలంగాణకు పైసా లేదు!

https://epaper.netidhatri.com/view/329/netidhathri-e-paper-25th-july-2024%09

`రూపాయిచ్చేందుకు కూడా మనసురాలేదు!!

`బడ్జెట్‌ తెలంగాణకు పేరుకు సైతం చోటు లేదు!

`తెలంగాణ ఏర్పాటుపై ఇంకా కోపమా!

`అరవై ఏళ్ల తెలంగాణ గోస బిజేపికి పట్టదా!

`8 సీట్లిచ్చినా నిధులివ్వాలనిపించలేదా!

`బిజేపికి సీట్లు ఇవ్వడమే తప్పా!

`తెలంగాణ రావడమే బిజేపికి ఇష్టం లేదా!

`బడ్జెట్‌ లో తెలంగాణ ఊసు కూడా వుండదా!

`ఎన్ని విజ్ఞాపనలు చేసినా మనసు రాలేదా!

`పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు.

`ప్రాణహిత.. చేవెళ్ళకు జాతీయ హోదా ఇవ్వలేదు.

`కనీసం పాలమూరు.. రంగారెడ్డికి పరిగణలోకి తీసుకోలేదు.

`విభజన వల్ల ఏపి నష్టపోయిందా!

`అరవై ఏళ్ల ఆకలి తెలంగాణ కనిపించలేదా!

`తెలంగాణకు రావడమే శాపమా!

`చిన్న రాష్ట్రాల ఏర్పాటే బిజేపి అభిమతమన్నారు.

`తెలంగాణ ఏర్పాటును కించపరుస్తున్నారు.

`తల్లిని చంపి బిడ్డను బతికించారన్నారు.

`తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారన్నారు.

`అయినా తెలంగాణ ప్రజలు బిజేపిని ఆదరించారు.

`తెలంగాణ బిజేపి నేతలు ఏం చేస్తున్నారు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్‌ లో తెలంగాణ ప్రస్తావన లేదు. పద్దులో తెలంగాణకు కనీసం పైసా కనిపించలేదు. ఇది తెలంగాణ వాదులు, ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. కేంద్రం లోని ఎన్డీఏ ప్రభుత్వం తమ మిత్రపక్షాల రాష్ట్రాలకు అమితమైన ప్రాదాన్యత కల్పించాయి. అందుకు ఎవరూ వ్యతిరేకం కాదు. కానీ మిగతా రాష్ట్రాల అభ్యర్థనలు కేంద్రం పరిగణలోకి తీసుకోలేదన్నదే వినిపిస్తున్న ప్రధాన వాదన. అవును. ఇది ముమ్మాటికీ నిజం అనే తీరుగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. ఆంద్రప్రదేశ్‌ కు నిధులు ఇవ్వడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. కానీ అదే సమయంలో తెలంగాణకు కూడా సముచితమైన ప్రాధాన్యత కల్పిస్తే ఎంతో బాగుండేది. ఆంద్రప్రదేశ్‌ మీద కురిపించిన ప్రేమలో కొంత చూపించినా తెలంగాణ సమాజం ఎంతో హర్షించేది. గత శాసనసభ ఎన్నికల సమయంలో బిజేపి కేంద్ర పెద్దలు తెలంగాణలో అధికారంలోకి రావాలని ఆశించారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో తెలంగాణకు బిజేపి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. కానీ చెప్పిన మాటలకు, చేతలకు ఏ మాత్రం పొంతన లేదని నిరూపించారు. ఇది సగటు తెలంగాణ వాది మనసులో భావన. ఎందుకంటే విభజన చట్టంలో అనేక అంశాలు చేర్చారు. అందుకు బిజేపి కూడా సమ్మతించింది. విభజన చట్టంలో తెలంగాణకు ఇస్తామని పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు కాలేదు. కనీసం తెలంగాణ నుంచి 8 సీట్లిస్తే కూడా బిజేపి పెద్దలు కనికరం చూపలేదన్నది వినిపిస్తున్న మాట. పార్లమెంటు ఎన్నికలకు ముందు ముసుగులో గిరిజన యూనివర్సిటీ మొదలుపెట్టారు. ఈ బడ్జెట్‌ లో దానికి నిధుల కేటాయింపులు జరగలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ప్రకటన వస్తుందని అందరూ ఆశించారు. కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీపై ఎలాంటి ముచ్చట లేదు. కానీ ఎన్నికల ముందు వరంగల్‌ లో సభ ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు. ఇప్పుడు ఆ విషయం మర్చిపోయారు. తెలంగాణలో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని గతం నుంచి కోరుతున్నారు. కేంద్రం సహకరించలేదు. దాంతో గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టింది. పూర్తి చేసింది. ఇప్పుడు పాలమూరు- రంగారెడ్డి పథకానికైనా నిధులిస్తారేమో అని ఆశించారు. ఇలా అనేక ఆశలు తెలంగాణ ప్రజలు పెట్టుకున్నారు. కానీ బిజేపి కేంద్ర పెద్దలు తెలంగాణ మీద ప్రేమను చూపించలేకపోయారు. ఆంధ్రప్రదేశ్‌ విషయంలో ప్రతిసారీ అండర్‌ ఆక్ట్‌ అంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పుకొచ్చారు. మరి అదే అండర్‌ ఆక్ట్‌ అనేది తెలంగాణకు కూడా వర్తిస్తుందనేది మాత్రం వదిలేశారు. ఇది వివక్ష కాదా! తెలంగాణ మీద నిర్లక్ష్యం కాదా! తెలంగాణ అంటే బిజేపికి ఇసుమంతైనా ఇష్టం లేదా అనే ప్రశ్నలు ముందుకు వచ్చే అవకాశం లేకపోలేదు. పార్లమెంటు ఎన్నికలలో 8 సీట్లిచ్చినా తెలంగాణ మీద ఎందుకు పట్టింపు లేదనే ప్రశ్నలు ఉత్పన్నం కాకమానవు. బడ్జెట్‌ పరంగా అన్ని రాష్ట్రాలకు వచ్చే నిధులు తప్ప, అదనంగారూపాయిచ్చేందుకు కూడా మనసురాలేదా? అని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ బిజేపి నేతలకు కేంద్ర పెద్దలు సమాధానం లేకుండా చేశారు. దాంతో తెలంగాణ ఏర్పాటుపై ఇంకా కోపముందా? అనే చర్చకు ఆస్కారమిచ్చినట్లౌతోంది. తెలంగాణ విడిపోవడం మూలంగా ఏపి ఆర్థికంగా నష్టపోయిందనే భావన వున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉమ్మడి రాష్ట్రంలో అరవై ఏళ్లు తెలంగాణ నలిగిపోయిందనే విషయం తెలియందా? అరవై ఏళ్ల తెలంగాణ గోస బిజేపి పట్టదా! అని బిఆర్‌ఎస్‌ ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్‌ పార్టీ నిలదీస్తోంది. బిజేపి అంటే ఎంతో ప్రేమతో, గౌరవంతో తెలంగాణ సమాజం 8 సీట్లు ఇవ్వడమే తప్పా! అన్న చర్చకు ఆ పార్టీయే అవకాశమిచ్చినట్లైంది. కనీసం బడ్జెట్‌ లో తెలంగాణ ఊసు కూడా వుండదా! అన్నది ఆత్మ గౌరవంతో ముడిపడిన అంశంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గత ఎనిమిది నెలల కాలంలో అనేక సార్లు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చారు. మూడోసారి ముచ్చటగా కొలువైన ప్రధాని మోడీని తర్వాత కూడా కలిశారు. అయినా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి ప్రేమ కలగలేదు. ఎన్ని విజ్ఞాపనలు చేసినా మనసు రాలేదా! అనే మాటలే సర్వత్రా వినిపిస్తున్నాయి. 2014లోనే పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు. అప్పటి నుంచి నిధులు సమకూర్చుతూనే వున్నారు. ఏపిలో నీటికి కొరత లేదు. ప్రాజెక్టులు తక్కువేం లేవు. పోలవరం నిర్మిస్తే తెలంగాణకు అభ్యంతరం లేదు. పోలవరం నిర్మాణం కోసం తెలంగాణ లోని ఏడు మండలాలలను 2014 తొలి క్యాబినెట్‌ లోనే విలీనం చేసినా అభ్యంతరం ఎవరూ చెప్పలేదు. విభజన వల్ల ఏపి నష్టపోయిందా! అదే నిజమనుకుంటే ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి కూడా అంతే అవసరం అన్నది బిజేపి పెద్దలకు కనిపించడం లేదా? ఉమ్మడి రాష్ట్రంలో కలిసి వుంటే తెలంగాణ అభివృద్ధి ఎన్ని సంవత్సరాలైనా సాధ్యం కాదనే ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అడుగడుగునా అన్యాయం జరుగుతుందనే తెలంగాణ ఉద్యమం చేశారు. ఉమ్మడి పాలకులు తెలంగాణ అభివృద్ధికి సహకరించడం లేదనే పోరాటాలు చేశారు. ఇక కలిసుంటే తెలంగాణ మరింత ఆకలితో అలమటించే రోజులొస్తాయనే తెలంగాణ సమాజం ఉద్యమం చేసింది. తెలంగాణ వస్తే తప్ప నీళ్లు రావు. నిధులు అందవు. కలిసివున్నన్ని రోజులు కొలువులు కూడా రావనే తెలంగాణ సమాజం ఏకమై పోరాటం చేసి రాష్ట్రం సాధించుకున్నది. ఈ విషయాలు బిజేపి పెద్దలకు తెలియవా? అరవై ఏళ్ల ఆకలి తెలంగాణ కనిపించలేదా! చిన్న రాష్ట్రాల ఏర్పాటే బిజేపి అభిమతమన్న సిద్ధాంతం మేరకే తెలంగాణ వచ్చింది. అది ఇప్పటి బిజేపి పెద్దలు ఆ కట్టుబాటు కప్పదాటుతున్నారా! నిజం చెప్పాలంటే కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి. కానీ రాజకీయంగా తెలంగాణలో ఎదగాలని ఓ వైపు చూస్తూనే మరో వైపు పదే పదే కించపర్చిన సందర్భం చూశాం. 2014 ఎన్నికల నుంచి అనేక మార్లు, సమయం సందర్భం లేకున్నా ప్రధాని మోడీ తెలంగాణపై తన అక్కసును వెళ్లగక్కుతూనే వున్నారు అనేది బిఆర్‌ఎస్‌ పార్టీ అనేక సార్లు చేసిన ఆరోపణ. 2014 ఎన్నికల సమయంలో మాట్లాడారంటే ఓ అర్థం వుంది. కానీ ప్రధాన మంత్రి హోదా లో కూడా నరేంద్ర మోడీ మాట్లాడడాన్ని తెలంగాణ సమాజం మెచ్చలేదు. అయినా బిజేపి మీద తెలంగాణ ప్రజలు ఎంతో విశ్వాసంగా వున్నారు. ఈ బడ్జెట్‌ తో ఆ నమ్మకాన్ని కోల్పోయే అవకాశం స్వయంగా బిజేపి యే కల్పిస్తోందని చెప్పడంలో సందేహం లేదు. బడ్జెట్‌ లో బీహార్‌, ఏపిలకు ఇచ్చిన ప్రాధాన్యత లో కనీసం పది శాతం తెలంగాణకు ఇస్తే బాగుండని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ బిజేపి నేతలు ఏం చేస్తున్నారు? అని సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ఇదే అదునుగా కాంగ్రెస్‌ పార్టీ బిజేపి వైఖరిని తప్పు పట్టింది. తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం కూడా చేసింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మీద చూపిస్తున్న వివక్షను సభ ఖండిరచింది. మరి బిజేపి ఎలా స్పందిస్తుందనేది ఆసక్తి నెలకొన్నది. కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ప్రధాని మోడీని ఒప్పించి బిజేపి ఎంపిలు నిధులు తెస్తారా! లేదా? అన్నది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *