— ఏడాదిన్నర 12 కోట్లు మంజూరు.
— ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా ?- కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా..
— కొత్త ప్రభుత్వంలోనైన సమస్య తొలగేనా..
నిజాంపేట, నేటిధాత్రి
తలాపున సముద్రం ఉన్న దప్పిక తీరదన్న చందంగా మారింది ఆ రహదారి దుస్థితి. రెండున్నర దశాబ్దాల క్రితం మారుమూల పల్లెలను కలుపుతూ మండల పరిధిలో చల్మెడ నస్కల్ వరకు బీటీ రహదారి నిర్మించారు. అయితే కొన్నాళ్లుగా కిలోమీటర్ల మేర రోడ్డు ద్వంసమైంది. దీంతో వాహన చోదకులకు రహదారి నరకాన్ని తలపిస్తోంది. దీంతో నాలుగు గ్రామాల ప్రజలు పలుమార్లు గత ప్రభుత్వానికి విజ్ఞప్తులు, నిరసనలు తెలియజేశారు. అప్పటి భారాసా ప్రభుత్వంలో రోడ్డు మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయాలంటూ పాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో గత ఏడాదిన్నర క్రితం రోడ్డు పునర్నిర్మాణానికి 12 కోట్లు విడుదలయ్యాయి.అయితే సదరు కాంట్రాక్టర్ నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డును తవ్వి కంకర వేసి వదిలేశాడు. ప్రభుత్వం నుంచి బిల్లులు రానందున రహదారి పనుల పరిస్థితి ఆదిలోనే హంసపాదులా తయారైంది.
అయితే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ తీసుకుంటే గానీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించటం లేదు. కనీసం ఇప్పటి కాంగ్రేసు ప్రభుత్వంలో నైనా ఈ రోడ్డు పనులకు మోక్షం కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.