Vande Mataram at 150: A Song that United India
150 వసంతాల వందేమాతరం దేశ ఐక్యత గేయం -పార్లమెంట్లో చర్చ
భారతదేశాన్ని విభజించడానికి, విచ్ఛిన్నం చేయడానికి బ్రిటిషు వారు విభజించు పాలించు సూత్రాన్ని అమలుపరిచే సమయంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా భారతవనినీ ఏకం చేసిన ఉద్యమ ఘాట్టాలలో బెంగాల్ నుండి బంకించంద్ర చటర్జీ రచించిన గేయం ఆనాడు భారతీయులను ఉర్రు తలూగించి ఏకం చేసి యువతి, యువకులను ఏకతాటిపై తీసుకువచ్చి దేశ పై విదేశీ దురాక్రమణ, దోపిడీకి వ్యతిరేకంగా యూరోపియన్స్ అలాగే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చైతన్యపరిచిన చైతన్య గేయం “వందేమాతరం”. పార్లమెంటు శీతాకాల సమావేశంలో వందేమాతర గేయం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని లోకసభలో 10 గంటల సమయం పాటు చర్చించడం మరోసారి భారత స్వతంత్ర ఉద్యమ ఘట్టాలలో వందేమాతరం, జనగణమన గేయం, గీతాల పాత్ర గురించి భారత యువత మరో సారి నెమరు వేసుకునే అవకాశరావడం సంతోషకరం.
2012లో వందేమాతర గేయం పై పార్లమెంట్లో జరిగిన చర్చలో తీసుకున్న నిర్ణయం చాలా ఆశ్చర్యకరమైనది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యసభలో అభ్యంతర వాక్యాల జాబితాలో వందేమాతరం గేయాన్ని చేర్చి రాజ్యసభలో వందేమాతరం ఆలపించడానికి వీలు లేకుండా పోయినది.
బంకించంద్ర చటోపాధ్యాయ తన రచనలతో కేవలం బెంగాలి సమాజాన్ని కాదు మొత్తం భారతవనినే ప్రభావితం చేశారు. తన మొదటి నవల ఆంగ్లములో “రాజ్ మోహన్స్ వైఫ్” తరువాత బెంగాలీలో “దుర్గేష్ నందిని” 1865 సంవత్సరంలో ప్రచురీతమైనది. 1866 “కపాల కుండల” నవల చాలా పేరు తెచ్చుకుంది. అనంతరం “బంగ దర్శన్” పేరుతో పత్రికను కూడా ప్రారంభించి విమర్శనాత్మకమైన సాహిత్య, సాంఘిక, సంస్కృతిక అంశాలను ప్రచురించారు. “ఆనంద్ మఠ్” నవల రచించారు. అందులో వందేమాతర గీతాన్ని జత చేశారు. అనంతరం జాతీయ వాదానికి దేశ స్వతంత్ర ఉద్యమములో కీలకముగా మారిపోయినది. బిపిన్ చంద్రపాల్ తన పత్రికకు అలాగే, లాలా లజపతిరాయ్ కూడా తన జాతీయ వాద పత్రికకు “వందేమాతరం” అని నామకరణం చేశారు. భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ 1950 జనవరి 24న వందేమాతరం గీతానికి జాతీయ గేయం హోదాను ప్రకటించారు. ఈ విషయంలో తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ వందేమాతరం గీతాన్ని స్వతంత్ర భారతదేశ జాతీయ గేయంగా స్వీకరించడానికి వెనుకాడారు. ఈ విషయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా నెహ్రూను కలిసి వందేమాతరం గీతాన్ని స్వాసంత్రోద్యమం మంత్రంగా చేయడానికి అభిప్రాయం కోరినారు.
వందేమాతరం తొలి చరణం అర్థం: భారతమాతకు వందనం, తీయ్యని నీటితో, కమ్మని పండ్లతో, చల్లని గాలులతో, పచ్చని పైరుతో విలసిల్లే భారతమాతకు వందనం, రాత్రులు తెల్లని వెన్నెలలతో, మధురమైన మాటలతో మాకు సుఖాలు కలిగిస్తూ వరాలిచ్చే భారతమాతకు వందనం. ప్రకృతిని అంతటితో భారత మాతకు నమస్కరించి భావం కలదు.
1938వ సంవత్సరములో హైదరాబాదు రాజ్యంలో నిజాం పాలనకు వ్యతిరేకముగా వందేమాతరం విద్యార్థి ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ లో మొదలవడంతో నిజాంను వ్యతిరేకించడంతో విద్యార్థులను బహిష్కరించడంలో ఆనాడు పీ.వీ నరసింహారావు, హయగ్రీవచారి, నూకల రామచంద్రారెడ్డి, అచ్యుతారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, డి.వెంకటేశ్వరరావు, బొమ్మగాని ధర్మబిక్షం వంటి వారితో పాటు 1200 మంది విద్యార్థులను ఈ వందేమాతర ఉద్యమంలో పాల్గొన్నాందు యూనివర్సిటీ నుంచి తొలగించ బడ్డారు.
పార్లమెంటు చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోకసభలో మన అసంఖ్యాక స్వతంత్ర సమరయోధులు వందేమాతరం అని నినాదించి ఉరిశిక్షను స్వీకరించారు. అలాగే అందరి నోట ఒకటే మాట వందేమాతరం. రాజ్యసభలో యం.పీ సుధా మూర్తి ప్రసంగిస్తూ ప్రాథమిక ఉన్నత, పాఠశాలల పాఠ్యాంశాలలో వందేమాతరం తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే దేశభక్తిని పెంపొందించడానికి, సాంస్కృతిక స్ఫూర్తిని కాపాడడానికి ఇది అవసరమైన నొక్కి చెప్పారు “భారతదేశ విభిన్న రంగులతో కూడిన దుప్పటి వంటిది దాన్ని కలిపి ఉంచే దారం, సూది వందేమాతరం” అని అభివర్ణించారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ మోడీపై ఎదురు దాడిలో మహాత్మా గాంధీ 1937లో నిర్ణయం విభజన చర్య కాదని నెహ్రూ, వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, రాజేంద్రప్రసాద్, అబ్దుల్ కలాం ఆజాద్, సరోజినీ నాయుడు మొదలైన నాయకులతో కూడిన వర్కింగ్ కమిటీ సిఫార్సు చేసిన సున్నితమైన సర్దుబాటు అని పార్టీ వాదించింది. అలాగే ఎం.ఐ.ఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ బంకించంద్ర చటర్జీ కనీసం డిగ్రీ చేయలేదు అని చదువుకోలేదని చెప్పడం విడ్డూరంగా అనిపించింది తాను డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి బంకించంద్ర అలా అయితే తెలంగాణ వ్యక్తి అందేశ్రీ నిరక్షరాస్యుడు మరియు తెలంగాణ రాష్ట్ర గీతం రచించిన వ్యక్తి కాదా సాహిత్యానికి చదువుకు సంబందం లేదు.
వందేమాతరం భారత జాతీయ స్వతంత్ర ఉద్యమంలో ఈ నినాదం ఒక ఆయుధం స్వతంత్ర ఉద్యమకారులను ఏకం చేసిన పదం. నేడు పాఠశాలలలో ప్రార్థన సమయాల్లో ఆలపించడం, సైనికులకు ఈ నినాదం ఒక ప్రేరణ, వివిధ సమావేశాలు సభలలో నేటికీ ఆలపించడం గొప్ప విషయం. వివిధ తెలుగు సినిమాలు వందేమాతరం పేర్లతో తీయడం జరిగినది వాటిలో వందేమాతరం-1939, వందేమాతరం-1982, వందేమాతరం-1985 సంవత్సరంలో ఈ సినిమాలో టైటిల్ సాంగ్ పాడినందుకు శ్రీనివాస్ ‘వందేమాతరం శ్రీనివాస్’ గా మారిపోయినారు.
ఇంతటి చారిత్రాత్మకమైన వందేమాతరం గేయం, జనగణమన గీతాల గొప్పతనం భావితరాలకు తెలియజేయవలెనంటే పుస్తకాలలో ఏ సబ్జెక్టులో చదువుకోవలెను! అది ఒక్క చరిత్రలో మాత్రమే అదే కాకుండా స్వతంత్ర ఉద్యమ చరిత్ర, ఉద్యమ ఘట్టాలు, స్వాతంత్ర సమరయోధుల చరిత్ర వంటివి చరిత్రలోనే చదవాలి. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చరిత్ర సబ్జెక్టును ప్రతి ప్రొఫెషనల్ కోర్సులలో ఒక కామన్ సబ్జెక్టుగా చేర్చితే భావితరాలకు చరిత్ర సంపూర్ణ సమాచారం అందుతుంది.
వ్యాస రచయిత:
డా.తూము విజయ్ కుమార్, చరవాణి-9492700653
