సిఎం. రేవంత్ స్ట్రాంగ్ స్ట్రాటజీ!
`కరడుగట్టిన కాంగ్రెస్ కుటుంబాలను రంగంలోకి పంపుతారా?

`ఖైరతాబాద్ లో విజయారెడ్డిని దింపుతారా?
`స్టేషను ఘన్ పూర్ లో ఇందిరకు టికెట్ ఇస్తారా?

`దానం, కడియంలను మంత్రి వర్గంలోకి తీసుకుంటారా?
`కాంగ్రెస్ నుంచి విజయారెడ్డి, బిఆర్ఎస్ నుంచి మన్నె గోవర్ధన్ రెడ్డి!

`ఒకవేళ మన్నె గోవర్ధన్ రెడ్డికి ఇవ్వకపోతే బిఆర్ఎస్ కు వెంటనే రాం రాం!
`కాంగ్రెస్ నుంచి ఇందిర, బీఆర్ఎస్ నుంచి రాజయ్య!
`రాజయ్యకిస్తే దళితబంధు వసూళ్లు ముందేసి ప్రచారం చేస్తారా!
`ఖైరతాబాద్ బాధ్యతలు దానంకు, నవీన్ యాదవ్‌కు ,రోహిణ్ రెడ్డి కి అప్పగిస్తారు!
`స్టేషను ఘన్పూర్ కడియం, ఇతర ఎమ్మెల్యేలకు బాధ్యతలు!
`రోహిణ్ రెడ్డి నాయకత్వంలో, దానం ,నవీన్ సహకారంతో ఖైరతాబాద్ గెలిచే అవకాశం!
`కడియం చాణక్యంతో స్టేషను ఘన్పూర్ సొంతం చేసుకోవడంలో విజయం!
`ఇప్పటికైనా కాంగ్రెస్ అడుగులు బీఆర్ఎస్ అంచనా వేయకపోతే కష్టమే?
`ఆ రెండు స్థానాలు కూడా చే జేతులా చేతికి అప్పగించడమే!
`ఇప్పటి నుంచి లోతైన, పదునైన వ్యూహాలు లేకపోతే మొదటికే మోసమే!
`నాయకుల అభిప్రాయాలకు విలువివ్వకపోతే మరో సారి మునుగుడు ఖాయమే!
`సూచనలిచ్చే వాళ్లను కాదని, గొప్పులు చెప్పే వారి మాటలు వింటే మిగిలేవి ఓటములే?
హైదరాబాద్, నేటిధాత్రి: రాజకీయపార్టీలకు ఎన్నికలు ఎప్పుడూ తలనొప్పే. ఎప్పుడూ పరీక్షే. ఎన్నికలంటే చాలు రాజకీయ పార్టీలకు మోయలేనంత బారమే? కాని పార్టీలు సాగాలంటే , పదవులు పొందాలంటే , పాలన సాగించాలంటే రాజకీయాలు తప్పవు. అందుకు ఎన్నికలంటే ఎంత కష్టమైనా సరే సై అనకపోతే ఆ పార్టీలకు తిప్పలే. తెలంగాణలో ఇటీవలే ఓ ఉప ఎన్నిక ఘట్టం ముగిసింది. ఫలితం తేలింది. అది అనూహ్యమైంది. ఎవరూ ఊహించనిది. గెలుపు కూడా అంతే విచిత్రమైంది. ఉరికి ఉరికి బోల్తా పడిరది బిఆర్ఎస్. అసలు గెలుస్తామా లేదా? అనే సందిగ్ధంలో కొట్టు మిట్టాడిన కాంగ్రెస్ గెలిచింది. ప్రజా తీర్పు ఈ విధంగా వుంటుందని ఎవరూ ఊహించలేదు. బోల్తాపడతామని బిఆర్ఎస్ కల గనలేదు. కాని ఫలితం తారు మారైంది. బిఆర్ఎస్ కొత్త కష్టం తెచ్చిపెట్టింది. కాంగ్రెస్‌లో మాత్రం జోష్ నింపింది. ఇక ఎన్నికలు ఏవైనా సరే సై అనే పరిస్దితికి వచ్చేసింది. ఎందుకంటే బిఆర్ఎస్ చేసిన ప్రచారం వల్ల ఎక్కడో కంగ్రెస్‌కు కూడా కొన్ని అనుమానాలు తీవ్రంగా వుండేవి. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా అవి పటాపంచెలైపోయినట్లే. రేవంత్ సర్కారుమీద బిఆర్ఎస్ ఊహించిన వ్యతిరేకత తేనట్లే. రాష్ట్రంలో తర్వలో మరి కొన్ని ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అవి రెండా..పదా అనేది త్వరలోనే తేలుతుంది. కాని సిఎం. రేవంత్ రెడ్డి మాత్రం ఒక్కసారిగా పది ఉప ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దంగా లేరు. సుప్రింకోర్టు తీర్పు ఎలా వుంటుందో ఇప్పుడే ఊహించలేం. కాని ఉప ఎన్నికలు అనేవి తధ్యమని తెలుస్తోంది. సుప్రింకోర్టు తెలంగాణ స్పీకర్‌కు మరో నాలుగు వారాల గడువు మంజూరు చేశారు. ఆ పై తాము జోక్యం చేసుకుంటామని చెప్పారు. అయితే ఈ లోపు ఓ ఇద్దరు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి, ఇతర ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరలేదు? అని స్పీకర్ కోర్టుకు సమాదానం ఇచ్చే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరి చేత ప్రభుత్వమే రాజీనామా చేయించింది. దాంతో వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అసవరం లేదు. మిగతా ఎనమిది మంది తాము పార్టీ మారలేదని స్పష్టం చేస్తున్నారని చెప్పొచ్చు. ఏది ఏమైనా రెండు ఉప ఎన్నికలు మాత్రం ముందు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. మిగతా ఎనమిది మంది విషయంలో ఒక వేళ కాలయాపన జరిగే అవకాశం వుంది. ఈలోగా కొత్త ఛీప్ జస్టిస్ వస్తే కేసు మళ్లీ మొదటికి రావొచ్చు? అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ తరుపున సికింద్రాబాద్ ఎంపిగా పోటీ చేశారు. ఓడిపోయారు. ఇప్పుడు సమస్యల్లో చిక్కుకున్నారు. ఇక మరో ఎమ్మెల్యే స్టేషన్ ఘన్పూర్ కడియం శ్రీహరి. ఆయన చేత కూడా కాంగ్రెస్ రాజీనామా చేయించే అవకాశాలులేకపోలేదు. దాంతో రెండు ఉప ఎన్నికలు మాత్రం పక్కా అనే సంకేతాలు వెలువడుతున్నాయి. ముందు రెండు ఉప ఎన్నికలకు వెళ్లి ప్రజా తీర్పును అంచనా వేసుకొని, మిగతా ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలా? వద్దా? అనేది కూడా తేల్చుకునే అవకాశం వుంది. ఈ ఇద్దరి చేత రాజీనామా చేయించినా వారికి టిక్కెట్లు ఇవ్వకుండా ఇతరులకు టికెట్లు ఇవ్వాలని అనుకుంటున్నారట. ఆ స్దానాలను గెలిపించే బాధ్యత ఇద్దరు ఎమ్మెల్యేలకు అప్పగించాలని సిఎం. రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారట. ఆ రెండు సీట్లు కాంగ్రెస్ గెలిస్తే దానం నాగేందర్, కడియం శ్రీహరిలను మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఈ ఇద్దరి చేత రాజీనామా చేయించి కొత్త వారిని రంగంలోకి దింపాలని సిఎం చూస్తున్నారు. అందుకు సిఎం. రేవంత్ లెక్కలు మరోలా వున్నాయి. ఖైరతాబాద్ నుంచి పిజేఆర్కూతరు విజయారెడ్డిని రంగంలోకి దింపుతారని తెలుస్తోంది. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఆమె పాత్ర చాలా పనిచేసింది. పైగా ఆ నియోజకవర్గంలో విజయారెడ్డికి మంచి పట్టు వుంది. ఖైరతాబాద్ నియోజకవర్గం అనేది పిజేఆర్కంచు కోట. ఆ కంచుకోటలో గెలుపు సాదించాలంటే విజయారెడ్డికి టికెట్ ఇస్తే గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని సిఎం. నమ్మకం. పైగా దానం నాగేందర్ దగ్గరుండి గెలిపించే బాద్యతలు తీసుకుంటారు. ఇక కడియం స్దానంలో ఇందిరకు టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఆమెకు టికెట్ ఇస్తే ఈసారి స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ విజయం ఖాయం. ఇప్పటికే ఆమె మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయిన సందర్భం వుంది. ఈసారి పోటీ చేస్తే ఖచ్చితంగా సానుభూతి వుంటుంది. ఈసారి గెలిపించాలని జనం కూడా అనుకుంటారు. ఆమె కూడా ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగేందుకు కూడా వీలౌతుంది. అంతే కాకుండా రాజకీయాల్లోనే కాదు, గెలుపోటముల మీద పక్కా లెక్కలు, అంచనాలు వేయగల సమర్ధుడు కడియం శ్రీహరి. జనం నాడిని పట్టుకోవడం ఆయన దిట్ట. గత పార్లమెంటు ఎన్నికల ముందు బిఆర్ఎస్ పార్టీ పరిస్దితి ఆయన అంచనా వేసినంతగా ఎవరూ వేయలేదు. పైగా బిఆర్ఎస్ టికెట్ తీసుకొని వెంటనే కాంగ్రెస్‌లో చేరి టికెట్ తెచ్చుకోవడం అనేది సామాన్యమైన ఎత్తుగడ కాదు. అలాంటి వ్యూహాలు పన్నడం అందరికీ సాద్యం కాదు. అలాంటి ఎత్తుగడల్లో కడియంను కొట్టే వారు లేరు. అందుకే గెలుస్తూ వస్తున్నారు. వరంగల్ జిల్లా రాజకీయాలు మూడుదశాబ్దాలుగా శాసిస్తున్నారు. ఈ ఒక్కసారి ఇందిరకు టికెట్ ఇప్పించి గెలిపిస్తే వచ్చే సారి కడియం శ్రీహరి కూతురుకే ఆ టికెట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ ఎన్నికల సమయంలో మంత్రిగా కడియం వుంటారు. తన కూతురుకు టికెట్ ఇప్పించుకొని గెలిపించుకుంటారు. ఆయన ఎమ్మెల్సీగా వుంటారు. అలా కడియం కుటుంబమంతా రాజకీయాల్లో వున్నట్లుంటుంది. ఇక బిఆర్ఎస్ నుంచి రాజయ్యకు టికెట్ ఇచ్చినా కడియం రాజకీయం ముందు ఎందుకూ పనికి రాదని అనేకసార్లు రుజువైంది. గాలిలో గెలవడం తప్ప, కడియం మీద పక్కా ప్రణాళితో రాజయ్య గెలిచింది ఏనాడు లేదు. రాజయ్య చిలిపి రాజకీయాలను విసృతంగా ప్రచారం సాగిస్తారు. పైగా రాజయ్య మీద మరోపెద్ద అపవాదు కూడా వుంది. బిఆర్ఎస్ ప్రభుత్వం వున్నప్పుడు అమలు చేసిన దళిత బంధు విషయంలో సమారు 3వేల మంది వద్ద డబ్బులు తీసుకున్నాడనే ఆరోపణలున్నాయి. బాధితులే స్వయంగా చెప్పిన సందర్బాలున్నాయి. నేరుగా రాజయ్య తీసుకోకపోయినా ఆయన తమ్ముడి చేత వసూలు చేయించారని అంటుంటారు. సరిగ్గా ఎన్నికల ముందు ఈ విషయాన్ని మళ్లీ తెరమీదకు తెస్తారు. రాజయ్య రాజకీయానికి చరమగీతం పాడే ప్రయత్నం కడియం చేస్తారు. పైగా ఉమ్మడి వరంగల్‌లో బిఆర్ఎస్కు ఎమ్మెల్యేలే లేరు. వున్న వాళ్లంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే వున్నారు. వాళ్లంతా రంగంలోకి దిగుతారు. అంతే కాకుండా ఖమ్మం నుంచి కారును వెళ్లకుండా చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎలాగూ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా వున్నారు. ఆయన అక్కడే మకాం వేశారంటే ఇక బిఆర్ఎస్కు చుక్కలే అంటున్నారు. ఇలా స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ పాగా వేస్తుందని అంచనాలున్నాయి. ఇక ఖైరతాబాద్‌లో బిఆర్ఎస్ నుంచి మెన్నె గోవర్ధన్ రెడ్డికి టికెట్ ఇస్తారని అనుకుంటున్నారు. గతంలో కూడా బిఆర్ఎస్ ప్రతీసారి మన్నె గోవర్ధన్‌రెడ్డికే టికెట్ అంటూ చెప్పడం ఆఖరు నిమిషంలో జెల్లకొట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఇస్తారా? ఇవ్వరా? అన్నది మీమాంసగానే వుంది. ఒక వేళ పొరపాటున బిఆర్ఎస్ పార్టీ మన్నె గోవర్ధన్‌రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే మాత్రం ఖైరతాబాద్‌లో ఆ పార్టీకి చోటు కూడా వుండదు. అంతటి నాయకుడు మరొకరు లేరు. ఒక వేళ ఇంకా ఎవరికైనా ఇవ్వాలని బిఆర్ఎస్ చూసినా మన్నె గోవర్ధన్ రెడ్డి ఈసారి ఎవరు చెప్పినా వినరు. బిఆర్ఎస్లో కొనసాగరు. కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీకి సహకరిస్తే ఖైరతాబాద్ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తుంది. అటు విజయారెడ్డి, ఇటు దానం, మన్నె కలిస్తే ఖైరతాబాద్‌లో బిఆర్ఎస్కు డిపాజిట్ కూడా రాదు. మన్నె గోవర్ధన్‌రెడ్డికి టికెట్ ఇస్తే మాత్రమే బిఆర్ఎస్ అక్కడ మళ్లీ ఎంతో కొంత ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ అడుగులు, రేవంత్ వ్యూహాలు అర్ధం చేసుకోకుండా అతివిశ్వాసంతో బిఆర్ఎస్ వెళ్తే మాత్రం మరోసారి బొక్కా బోర్లా పడడం ఖాయం. ఇప్పటి నుంచే పదునైన వ్యూహాలు అమలు చేయాలి. క్షేత్ర స్ధాయిలో నాయకులు వుండాలి.
